| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - ఉత్తరభాగము |
| క. |
సత్రాజిత్తు నిశాచర, శత్రునకుం గీడు సేసి సద్వినయముతోఁ బుత్రి స్యమంతకమణియును, మైత్రిం గొని తెచ్చి యిచ్చె మనుజాధీశా! |
45 |
| వ. | అనిన విని రా జిట్లనియె. | 46 |
| ఆ. |
శౌరి కేమి తప్పు సత్రాజితుఁడు సేసెఁ?, గూఁతు మణిని నేల కోరి యిచ్చె? నతని కెట్లు కలిగె నా స్యమంతకమణి, విప్రముఖ్య! నాకు విస్తరింపు. |
47 |
| వ. | అనిన విని శుకయోగివర్యుం డిట్లనియె. సత్రాజిత్తనువాఁడు సూర్యునకు భక్తుండై చెలిమి సేయ నతనివలన సంతసించి సూర్యుండు స్యమంతకమణి నిచ్చె, నా మణి కంఠమున ధరియించి సత్రాజిత్తు భాస్కరునిభంగి భాసమానుండై ద్వారకానగరంబునకు వచ్చిన దూరంబున నతనిం జూచి జనులు మణిప్రభాపటలతేజోహృతదృష్టు లయి సూర్యుం డని శంకించి వచ్చి హరి కిట్లనిరి. | 48 |
| క. |
నారాయణ! దామోదర!, నీరజదళనేత్ర! చక్రి! నిఖిలేశ! గదా ధారణ! గోవింద! నమ, స్కారము యదుపుత్త్ర! నిత్యకల్యాణనిధీ! |
49 |
| మ. |
దివిజాధీశ్వరు లిచ్చగింతురు గదా దేవేశ! నిన్ జూడ యా దవవంశంబున గూఢమూర్తివి జగత్త్రాణుండవై యుండఁగా భవదీయాకృతిఁ జూడ నేఁడిదె రుచిప్రచ్ఛన్న దిగ్భాగుఁడై రవియో, నీరజగర్భుఁడో యొకఁడు సేరన్ వచ్చె మార్గంబునన్. |
50 |
| వ. | అని యిట్లు పలికిన మూఢజనులఁ జూచి గోవిందుండు నగి మణిసమేతుండైన సత్రాజితుండు గాని సూర్యుండు గాఁ డని పలికె, నంత సత్రాజితుండు శ్రీయుతంబయి మంగళాచారంబైన తన గృహంబునకుం జని, మహీసురులచేత నిజదేవతామందిరంబున న మ్మణిశ్రేష్ఠంబుఁ బ్రవేశంబు సేయించె, నదియును బ్రతిదినంబు నెనిమిదిబారువుల సువర్ణంబు గలిగించుచుండు. | 51 |
| క. |
ఏ రా జేలెడు వసుమతి, నా రత్నము పూజ్యమానమగు నక్కడ రో గారిష్టసర్వమాయిక, మారీదుర్భిక్షభయము మాను నరేంద్రా! |
52 |
| క. |
అ మ్మణి యాదవవిభునకు, ని మ్మని హరి యడుగ నాతఁ డీక ధనేచ్ఛం బొమ్మని పలికెను జక్రికి, ని మ్మణి యీకున్న మీఁద నేమౌ ననుచున్. |
53 |
| వ. | అంత. | 54 |
| చ. |
అడరెడు వేడ్కఁ గంఠమున న మ్మణిఁ దాల్చి ప్రసేనుఁ డొక్కనాఁ డడవికి ఘోరవన్యమృగయారతి నేగిన వానిఁ జంపి పైఁ బడి మణిఁ గొంచు నొక్కహరి పాఱఁగ దాని వధించి డాసి యే ర్పడఁ గనె జాంబవంతుఁడు ప్రభాత్తదిగంతము నా స్యమంతమున్. |
55 |
| క. |
కని జాంబవంతుఁ డా మణిఁ, గొనిపోయి సమీపశైలగుహఁ జొచ్చి ముదం బునఁ దన కూరిమిసుతునకు, ఘనకేళీకందుకంబుగాఁ జేసె నృపా! |
56 |
| వ. | అంత సత్రాజితుండు తన సహోదరుండైన ప్రసేనునిం గానక దుఃఖించుచు. | 57 |
| మ. |
‘మణి కంఠంబునఁ దాల్చి నేఁ డడవిలో మావాఁడు వర్తింపఁగా మణికై పట్టి వధించినాఁడు హరికిన్ మరాద్య లే’ దంచు దూ షణముం జేయఁగ వానిదూషణముఁ గంసధ్వంసి యాలించి యే వ్రణమున్ నా యెడ లేదు, నింద గలిగెన్ వారించు టే రీతియో?’ |
58 |
| వ. | అని వితర్కించి. | 59 |
| మ. |
తనవారెల్లఁ బ్రసేనుజాడఁ దెలుపం దర్కించుచున్ వచ్చి త ద్వనవీథిం గనె నేలఁ గూలిన మహాశ్వంబుం బ్రసేనుం, బ్రసే నుని హింసించిన సింహమున్, మృగపతిన్ నొప్పించి ఖండించి యేఁ గిన భల్లూకము సొచ్చి యున్న గుహయుం గృష్ణుండు రోచిష్ణుఁడై. |
60 |
| వ. | కని తనవెంట వచ్చిన ప్రజల నెల్ల గుహాముఖంబున విడిచి, సాహసంబున మహానుభావుండైన హరి నిరంతరనిబిడాంధకారబంధురంబయి, భయంకరంబై, విశాలంబయిన గుహాంతరాళంబు సొచ్చి, చని యక్కడ నొక్క బాలున కెదుర దర్శనీయకేళీకందుకంబుగా వ్రేలం గట్టఁబడిన యమ్మణి శ్రేష్ఠంబుఁ గని హరింప నిశ్చయించి. | 61 |
| క. |
మెల్లన పదము లిడుచు యదు, వల్లభుఁ డా శిశువుకడకు వచ్చిన గుండెల్ జల్లనఁగఁ జూచి కంపము, మొల్లంబుగ దానిదాది మొఱపెట్టె నృపా! |
62 |
| వ. | అంత నాధ్వని విని బలవంతుండైన జాంబవంతుఁడు వచ్చి తనస్వామి యని కృష్ణు నెఱుంగక ప్రాకృతపురుషుం డని తలంచి, కృష్ణునితో రణంబుచేసె. అందు. | 63 |
| క. |
పలలమునకుఁ బోరెడు డే, గలక్రియ శస్త్రములఁ దరులఁ గరముల విజయే చ్ఛల నిరువదియెనిమిది దిన, ములు వోరిరి నగచరేంద్రముఖ్యుఁడు హరియున్. |
64 |
| క. |
అడిదములుఁ దరులు విఱిగిన, బెడిదము లగు మగతనములు బిఱుతివక వడిం బిడుగుల వడువునఁ బడియెడి, పిడికిటిపోటులను గలన బెరసి రిరువురున్. |
65 |
| శా. |
స్పష్టాహంకృతు లుల్లసిల్ల హరియున్ భల్లూకలోకేశుఁడున్ ముష్టాముష్టి నహర్నిశంబు జయసమ్మోహంబునం బోరుచోఁ బుష్టిం బాసి ముకుందముష్టిహతులం బూర్ణశ్రమోపేతుఁడై పిష్టాంగోరుశరీరుఁడై యతఁడు దా భీతాత్ముఁడై యిట్లనున్. |
66 |
| వ. | ‘దేవా! నిన్నుఁ బురాణపురుషు నధీశ్వరు విష్ణుం బ్రభవిష్ణు నెఱుంగుదు. సర్వభూతంబులకుం బ్రాణప్రతాపధైర్యబలంబులు నీవే, విశ్వంబునకు సర్గస్థితిలయంబు లెవ్వ రాచరింతురు, వారికి సర్గస్థితి లయంబులఁ జేయు నీశ్వరుండవు నీవ, యాత్మవు నీవ’యని మఱియును. | 67 |
| సీ. |
బాణాగ్ని నెవ్వఁడు పఱపి పయోరాశి, నింకించి బంధించి యేపు సూపెఁ బరఁగ నెవ్వఁడు ప్రతాపప్రభారాశిచే దానవగర్వాంధతమస మడఁచెఁ గంజాతములు ద్రెంచు కరిభంగి నెవ్వఁడు దశకంఠుకంఠబృందములు ద్రుంచె నాచంద్రసూర్యమై యమరులంకారాజ్యమునకు నెవ్వఁడు విభీషణుని నిలిపె |
|
| తే. |
నన్ను నేలిన లోకాధినాథుఁ డెవ్వఁ, డంచితోదారకరుణారసాబ్ధి యెవ్వఁ డాతఁడవు నీవ కావె, మహాత్మ! నేఁడు, మాఱుపడి యెగ్గు సేసితి మఱవవలయు. |
68 |
| వ. | అని యిట్లు పరమభక్తుండైన జాంబవంతుండు వినుతించిన నతని శరీరనిగ్రహనివారణంబుగా భక్తవత్సలుండైన హరి దన కరంబున నతని మేను నిమిరి గంభీరభాషణంబుల నిట్లనియె. | 69 |
| క. |
‘ఈ మణి మాచేఁ బడె నని, తామసు లొనరించునింద దప్పెడుకొఱకై నీ మందిర మగు బిలమున, కే మరుదెంచితిమి భల్లుకేశ్వర! వింటే!’ |
70 |
| వ. | అనిన విని సంతసించి, జాంబవంతుఁడు మణియునుం, దనకూఁతు జాంబవతి యను కన్యకామణియునుం దెచ్చి, హరికిం గానికఁగా సమర్పించె, నటమున్న హరివెంట వచ్చినవారలు బిలంబు వాకిటం బండ్రెండుదినంబులు హరిరాక కెదురు చూచి వేసరి, వగచి పురంబునకుం జని, రంత దేవకీ వసుదేవులును, రుక్మిణియును మిత్రబంధుజ్ఞాతిజనులును గుహ సొచ్చి, కృష్ణుండు రాక చిక్కెనని శోకించి. | 71 |
| క. |
దుర్గమ మగు బిలమున హరి, నిర్గతుఁడై చేరవలయు నేఁడని పౌరుల్ వర్గములై సేవించిరి, దుర్గం గృతకుశలమార్గఁ దోషితభర్గన్. |
72 |
| క. |
డోలాయితమానసులై, జాలింబడి జనులు గొలువఁ జండిక పలికెన్ బాలామణితో మణితో, హేలాగతి వచ్చు నంబుజేక్షణుఁ’ డనుచున్. |
73 |
| క. |
యత్నము సఫలం బయిన స, పత్నసమూహములు బెగడఁ బద్మాక్షుం డా రత్నముతోఁ గన్యాజన, రత్నముతోఁ బురికి వచ్చె రయమున నంతన్. |
74 |
| క. |
మృతుఁడైనవాఁడు పునరా, గతుఁడైన క్రియం దలంచి కన్యామణి సం యుతుఁడై వచ్చిన హరిఁ గని, వితతోత్సవకౌతుకముల వెలసిరి పౌరుల్. |
75 |
| వ. | ఇట్లు హరి తనపరాక్రమంబున జాంబవతీదేవిం బరిగ్రహించి, రాజసభకు సత్రాజిత్తుం బిలిపించి, తద్వృత్తాంతం బంతయు నెఱింగించి, సత్రాజిత్తునకు మణి నిచ్చె, నతండును సిగ్గువడి మణిం బుచ్చుకొని పశ్చాత్తాపంబు నొందుచు బలవద్విరోధంబునకు వెఱచుచు నింటికిం జని. | 76 |
| క. |
పాపాత్ముల పాపములం, బాపంగా నోపునట్టి పద్మాక్షునిపైఁ బాపము గల దని నొడివిన, పాపాత్ముని పాపమునకుఁ బారము గలదే? |
77 |
| మ. |
మితభాషిత్వము మాని యేల హరిపై మిథ్యాభియోగంబు సే సితిఁ? బాపాత్ముఁడ నర్థలోభుఁడను దుశ్చిత్తుండ మత్తుండ దు ర్మతి నీ దేహముఁ గాల్పనే? దురిత మే మార్గంబునం బాయు? నే గతిఁ గంసారి ప్రసన్నుఁడై మనుచు నన్ గారుణ్యభావంబునన్? |
78 |
| ఆ. |
మణిని గూఁతు నిచ్చి మాధవుపదములు, పట్టుకొంటినేని బ్రదుకు గలదు సంతసించు నతఁడు సదుపాయమగు నిది, సత్య మితరవృత్తిఁ జక్కఁబడదు. |
79 |
| మ. |
అని యిబ్భంగి బహుప్రకారముల నేకాంతస్థుఁడై యింటిలోఁ దనబుద్ధిం బరికించి నీతి గని సత్రాజిత్తు సంప్రాప్త శో భనుఁడై యిచ్చె విపత్పయోధితరికిన్ భామామనోహారికిన్ దనుజాధీశవిదారికిన్ హరికిఁ గాంతారత్నమున్ రత్నమున్. |
80 |
| ఉ. |
తామరసాక్షుఁ డచ్యుతుఁ డుదారయశోనిధి పెండ్లి యాడె నా నా మనుజేంద్రవందితగుణస్థితిలక్షణసత్యభామ ను ద్దామపతివ్రతాత్వనయధర్మవిచక్షణతాదయాయశః కామను సత్యభామను ముఖద్యుతినిర్జితసోమ నయ్యెడన్. |
81 |
| క. |
‘మణి యిచ్చినాఁడు వాసర, మణి నీకును, మాకుఁ గలవు మణులు, కుమారీ మణి చాలు’ నంచుఁ గృష్ణుఁడు, మణి సత్రాజిత్తునకును మరలఁగ నిచ్చెన్. |
82 |
| వ. | అంత నక్కడఁ గుంతీసహితు లయిన పాండవులు లాక్షాగారంబున దగ్ధులై రని విని నిఖిలార్థదర్శ నుండయ్యును, గృష్ణుండు బలభద్రసహితుండై కరినగరంబునకుం జని కృప విదుర గాంధారీ భీష్మద్రోణులం గని దుఃఖోపశమనాలాపంబు లాడుచుండె, నయ్యెడ. | 83 |