పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగము
రతీదేవి ప్రద్యుమ్నసహితయై గగనమార్గంబున ద్వారకకుఁ బోవుట
వ. ఇట్లు శంబరుని వధియించి విలసిల్లుచున్న ఇంచువిలుకానిం గొంచు నాకాశసంచారిణియైన యా రతీదేవి గగనపథంబుఁబట్టి ద్వారకానగరోపరిభాగమునకుం జనుదెంచిన. 24
ఆ. మెఱుఁగుఁదీఁగెతోడి మేఘంబుకైవడి, యువిదతోడ మింటి నుండి కదలి
యరుగుదెంచె మదనుఁ డంగనాజనములు, మెలఁగుచున్న లోని మేడకడకు.
25
మ. జలదశ్యాముఁ బ్రలంబబాహుయుగళుం జంద్రాననున్‌ నీల సం
కులవక్రాలకుఁ బీతవాసు ఘనవక్షున్‌ సింహమధ్యున్‌ మహో
త్పలపత్త్రేక్షణు మందహాసలలితుం బంచాయుధున్‌ నీరజా
క్షులు దా రేమఱుపాటఁ జూచి హరి యంచుం డాఁగి రయ్యై యెడన్‌.
26
క. కొందఱు హరి యగు నందురు, కొందఱు చిహ్నములు కొన్ని కొన్ని హరికి లే
వందురు మెల్లనె తెలియుద, మందురు మరుఁ జూచి కొంద ఱబలలు గుములై.
27
క. హరి యని వెనుచని పిదపన్‌, హరిఁ బోలెడువాఁడు గాని హరి గాఁ డనుచున్‌
హరిమధ్య లల్లనల్లన, హరినందను డాయ వచ్చి రాశ్చర్యమునన్‌.
28
ఉ. ‘అన్నులు సేర వచ్చి మరు నందఱుఁ జూడఁగఁ దాను వచ్చి సం
పన్నగుణాభిరామ హరిపట్టపుదేవి విదర్భపుత్రి క్రేఁ
గన్నుల నా కుమారకునికైవడి నేర్పడఁ జూచి బోటితోఁ
జన్నులు సేఁప నిట్లనియె సంభ్రమదైన్యము లుల్లసిల్లఁగన్‌.
29
శా. ఈ కంజేక్షణుఁ డీ కుమారతిలకుం డీ యిందుబింబాననుం
డీ కంఠీరవమధ్యుఁ డిచ్చటికి నేఁ డెందుండి యేతెంచెనో
యీ కల్యాణునిఁ గన్న భాగ్యవతి మున్నేనోములన్‌ నోఁచెనో
యే కాంతామణియందు వీనిఁ గనెనో యే కాంతుఁ డీకాంతునిన్‌.
30
శా. ఆళీ! నా తొలుచూలిపాపనికి బోర్కాడించి నే సూతికా
శాలామధ్యవిశాలతల్పగతనై చన్నిచ్చి నిద్రింప నా
బాలున్‌ నా చనుఁబాలకుం జెఱిచి యే పాపాత్ము లే త్రోవ ము
న్నే లీలం గొనిపోయిరో? శిశువుఁ దా నే తల్లి రక్షించెనో!
31
క. కొడుకఁడు నా పొదిగిఁటిలోఁ, జెడిపోయిననాఁట నుండి చెలియా! తెలియం
బడ దే వార్తయు నతఁడే, వడువున నె చ్చోట నిలిచి వర్తించెడినో!
32
క. ఇందాఁక వాఁడు బ్రదికిన, సందేహము లేదు దేహచాతుర్యవయ
స్సౌందర్యంబుల లోకులు, వందింపఁగ నితనియంతవాఁ డగుఁ జుమ్మీ!
33
మ. అతివా! సిద్ధము నాఁటి బాలకున కీయాకార మీ వర్ణ మీ
గతి యీ హాసవిలోకనస్వరము లీ గాంభీర్య మీ కాంతి వీఁ
డతఁడే కాఁదగు నున్నవారలకు నా యాత్మేశుసారూప్య సం
గతి సిద్ధింపదు, వీనియందు మిగులం గౌతూహలం బయ్యెడిన్‌.
34
క. పొదలెడి ముదమునఁ జిత్తము, గదలెడి నాయెడమమూఁపు, గన్నులవెంటం
బొదలెడి నానందాశ్రులు, మెదలెడిఁ బాలిండ్లఁ బాలు, మేలయ్యెడినో!
35
వ. అని డోలాయమాన మానసయై వితర్కించుచు 36
క. తనయుఁ డని నొడువఁ దలఁచును, దనయుఁడు గాకున్న మిగులఁ దతిగొని సవతుల్‌
దను నగియెద రని తలఁచు న, తనుసంశయ మలమికొనఁగఁ దనుమధ్య మదిన్‌.
37
వ. ఇట్లు రుక్మిణీదేవి విచారించుచుండ లోపలి నగరికావలివారివలన విని కృష్ణుండు దేవకీవసుదేవులం దోడ్కొని చనుదెంచి సర్వజ్ఞుం డయ్యు నేమియు వివరింపక యూరకుండె, నంత నారదుండు సనుదెంచి శంబరుఁడు గుమారునిం గొనిపోవుట మొదలైన వార్త లెఱింగించిన, 38
క. “చచ్చిన బాలుఁడు గ్రమ్మఱ, వచ్చినక్రియ వచ్చెఁ బెక్కువర్షములకు నీ
సచ్చరితు నేఁడు గంటిమి, చెచ్చెర మున్నెట్టి తపము సేయంబడెనో?”
39
వ. అని యంతఃపురకాంతలును, దేవకీ వసుదేవ రామకృష్ణులును యథోచిత క్రమంబున నా దంపతుల దివ్యాంబరాభరణాలంకృతుల సత్కరించి సంతోషించిరి, రుక్మిణీదేవియు నందనుం గౌఁగిలించుకొని. 40
శా. ‘అన్నా? నా చనుఁబాపి నిన్ను దనుజుం డంభోనిధిన్‌ వైచెనే
యెన్నే వర్షము లయ్యెఁ బాసి సుత! నీ వేరీతి జీవించి యే
సన్నాహంబున శత్రు గెల్చితివొ? యాశ్చర్యంబు సంధిల్లెడిన్‌
నిన్నుం గాంచితి నింతకాలమునకున్‌ నే ధన్యతం జెందితిన్‌.
41
వ. అని కొడుకుం జూచి సంతోషించి కోడలిగుణంబులు కైవారంబు సేసి, వినోదించుచుండె, నంత ద్వారకానగరంబు ప్రజలు విని హర్షించి, రందు. 42
క. సిరిపెనిమిటిపుత్త్రకుఁ డగు, మరుఁ గని హరిఁ జూచినట్ల మాతలు దమలోఁ
గరఁగుదు రఁట పరకాంతలు, మరుఁ గని మోహాంధకారమగ్నలు గారే?
43
వ. అని చెప్పి శుకుం డిట్లనియె. 44
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - uttara bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )