పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగము
ప్రద్యుమ్న కుమార చరిత్ర ప్రారంభము
ఉ. తామరసాక్షునంశమున దర్పకుఁ డీశ్వరు కంటిమంటలం
దా మును దగ్ధుఁడై పిదపఁ దత్పరమేశుని దేహలబ్ధికై
వేమఱు నిష్ఠఁజేసి హరివీర్యమునం బ్రభవించె రుక్మిణీ
కామినిగర్భమం దసురఖండనుమాఱటమూర్తియో యనన్‌.
3
వ. అంత నా డింభకుండు ప్రద్యుమ్నుండను పేర విఖ్యాతుం డయ్యె, నా శిశువు సూతికాగృహంబునఁ దల్లి పొదిఁగిట నుండం దనకు శత్రుం డని యెఱింగి శంబరుండను రాక్షసుండు దనమాయాబలంబునం గామరూపియై వచ్చి కొనిపోయి, సముద్రంబులో వైచి, తన గృహంబునకుం జనియె, నంత నా శాబకుండు జలధిజలంబునం దిగఁబడ నొడిసి యొక మహామీనంబు మ్రింగె, నందు. 4
క. జాలిఁబడి పాఱు జలచర, జాలంబులఁ బోవనీక చని రోషాగ్ని
జ్వాలలు నిగుడఁగ నూరక, జాలంబులు వైచి పట్టు జాలరు లంతన్‌
5
వ. సముద్రంబులోన నా మీనంబును దత్సహచరంబులైన మీనంబులనుం బట్టికొని తెచ్చి శంబరునకుం గానికఁగా నిచ్చిన నతండు వండి తెండని మహానసగృహంబునకుం బంచిన. 6
క. రాజునగరి యడబాలలు, రాజీవముకడుపు వ్రచ్చి రాజనిభాస్యున్‌
రాజశిశువుఁ గని చెప్పిరి, రాజీవదళాక్షియైన రతికి నరేంద్రా!
7
వ. అంత నారదుండు వచ్చి బాలకుని జన్మంబును శంబరోద్యోగంబును మీనోదరప్రవేశంబునుం జెప్పిన విని యా రతి మాయావతి యను పేర శంబరునియింటఁ బాతివ్రత్యంబు సలుపుచు దహనదగ్ధుం డయిన తన పెనిమిటి శరీరధారణంబు సేయుట కెదురు చూచుచున్న యది గావున, న య్యర్భకుండు దర్పకుం డని తెలిసి మెల్లన పుత్రార్థినియైనతెఱంగున శంబరునియనుమతి వడసి సూపకారులయొద్ద నున్న పాపనిం దెచ్చి పోషించుచుండె, నా కుమారుండును శీఘ్రకాలంబున నారూఢయౌవనుండై. 8
క. సుందర మగు తనరూపము, సుందరు లొకమాఱు దేఱి చూచినఁ జాలున్‌
సౌందర్య మేమి చెప్పను?, బొందెద మని డాయుబుద్ధిఁ బుట్టించు నృపా!
9
సీ. చక్కనివారలు చక్కఁదనంబున కుపమింప నెవ్వండు యోగ్యుఁ డయ్యె
మిక్కిలితపమున మెఱయు నంబికకునై శంకరు నెవ్వండు సగము సేసె
బ్రహ్మత్వమును బొంది పరఁగు విధాతను వాణికై యెవ్వఁడు వావి సెఱిచె
వేయిడాఁగులతోడి విబుధలోకేశునిమూర్తికి నెవ్వఁడు మూల మయ్యె
 
తే. మునులతాలిమి కెవ్వఁడు ముల్లుసూపు, మగల మగువల నెవ్వండు మరులుకొలుపుఁ
గుసుమధనువున నెవ్వండు కొను విజయము, చిగురువాలున నెవ్వండు సిక్కువఱుచు?
10
వ. అని తన్ను లోకులు వినుతించు ప్రభావంబులు గలిగి పద్మదళలోచనుండును, బ్రలంబబాహుండును, జగన్మోహనాకారుండును నైన పంచబాణునిం గని లజ్జాహాసగర్భితంబులైన చూపులం జూచుచు మాయావతి సురతభ్రాంతిఁ జేసినం జూచి ప్రద్యుమ్నుం డిట్లనియె. 11
మత్త. ‘నా తనూభవుఁ డీతఁ డంచును నాన యించుక లేక యో
మాత నీ విది యేమి? నేఁడిటు మాతృభావము మాని సం
ప్రీతిఁ గామినిభంగిఁ జేసెదు పెక్కు విభ్రమముల్‌? మహా
ఖ్యాతవృత్తికి నీకు ధర్మము గాదు మోహము సేయఁగాన్‌.’
12
వ. అనిన రతి యిట్లనియె: “నీవు నారాయణనందనుండవైన కందర్పుండవు, పూర్వకాలంబున నేను నీకు భార్యనైన రతిని. నీవు శిశువై యుండునెడ నిర్దయుండై దొంగిలి తల్లిం దొఱంగఁ జేసి శంబరుండు కొనివచ్చి నిన్ను నీరధిలో వైచిన నొక్కమీనంబు మ్రింగె; మీనోదరంబు వెడలితీవు, మీఁదటి కార్య మాకర్ణింవుము. 13
క. మాయావి వీఁడు దుర్మతి, మాయఁడు సంగరములం దమర్త్యుల గెలుచున్‌
మాయి కరణమున వీనిన్‌, మాయింపుము మోహనాదిమాయలచేతన్‌.
14
మత్త. పాపకర్ముఁడు వీఁడు ని న్నిఁటఁ బట్టి తెచ్చిన లేచి ‘నా
పాపఁ డెక్కడఁ బోయెనో? సుతుఁ బాపితే విధి ‘యంచుఁ దాఁ
గ్రేపుఁ బాసిన గోవుభంగిని ఖిన్నయై పడి గాఢ సం
తాపయై నిను నోఁచి కాంచినతల్లి కుయ్యిడ కుండునే?
15
వ. అని పలికి మాయావతి మహానుభావుండైన ప్రద్యుమ్నునికి సర్వశత్రుమాయావినాశి యయిన మహామాయావిద్య నుపదేశించె; నివ్విధంబున. 16
మ. గురుమాయారణవేదియై, కవచియై, కోదండియై, బాణియై
హరిజుం డోరి నిశాట! వైచితివి నాఁ డంభోనిధిన్‌ నన్ను ఘో
ర రణాంభోనిధి వైతు నిన్ను నిదె వే రమ్మంచుఁ జీరెన్‌ మనో
హరదివ్యాంబరు నుల్లసద్దనుజసేనాడంబరున్‌ శంబరున్‌.
17
చ. అదలిచి యిట్లు కృష్ణసుతుఁ డాడిన నిష్ఠురభాషణంబులం
బదహతమై వడిం గవియు పన్నగరాజముఁ బోలి శంబరుం
డదరుచు లేచి వచ్చి గద నచ్యుతనందను వ్రేసె నుజ్జ్వల
ద్భిదురకఠోరఘోషసమభీషణనాదము చేసి యార్చుచున్‌.
18
క. దనుజేంద్రుఁడు వ్రేసిన గదఁ, దన గదచేఁ బాయ నడచి దనుజులు బెదరన్‌
దనుజాంతకునికుమారుఁడు, దనుజేశునిమీఁద నార్చి తన గద వైచెన్‌.
19
వ. అంత నా రక్కసుండు వెక్కసంబగు రోసంబునఁ దనకు దొల్లి మయుం డెఱింగించిన దైతేయమాయ నాశ్రయించి మింటికి నెగసి పంచబాణునిపై బాణవర్షంబు గురిసిన న మ్మహారథుండు నొచ్చియు సంచలింపక మచ్చరంబున సర్వమాయావినాశిని యైన సాత్త్వికమాయం బ్రయోగించి దనుజునిబాణవృష్టి నివారించె. మఱియు వాఁడు భుజగగుహ్యకపిశాచమాయలు పన్ని నొప్పించిన నన్నియుం దప్పించి. 20
క. దండధరమూర్తిఁ గైకొని, యొండాడక చక్రిసూనుఁ డుగ్రతరాసిన్‌
ఖండించె శంబరునితలఁ, గుండలకోటీరమణులు గుంభిని రాలన్‌.
21
క. చిగురాకడిదపు ధారను, జగములఁ బరవశము సేయు చలపాదికి దొ
డ్డగు నుక్కడిదంబునఁ దన, పగతుం దెగవ్రేయు టెంతపని చింతింపన్‌?
22
క. బెగడుచు నుండఁగ శంబరుఁ, దెగడుచుఁ బూవింటిజోదు ధీరగుణంబుల్‌
వొగడుచుఁ గురిసిరి ముదమున, నెగడుచుఁ గుసుమములముసురు నిర్జరు లధిపా!
23
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - uttara bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )