| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - ఉత్తరభాగము |
| వ. | అనిన మఱియుం బరాశరపౌత్రున కర్జునపౌత్రుం డిట్లనియె. | 1034 |
| ఆ. |
దుష్టశిక్షణంబు దురితసంహరణంబు, శిష్టరక్షణంబుఁ జేయఁ దలఁచి భువిని మనుజుఁ డగుచుఁ బుట్టిన శ్రీకృష్ణు, విమలచరిత మెల్ల విస్తరింపు. |
1035 |
| వ. | అనిన శుకుం డిట్లనియె. | 1036 |
| సీ. |
ధరణీశ! బలుఁడును సరసిజోదరుఁడు నవోన్నతసుఖలీల నుండునంతఁ జటులోగ్రకల్పాంతసమయమందును బోలె దృగసహ్యమై సముద్దీప్త మగుచు రాజిల్లు సూర్యోపరాగంబు సనుదెంచు టెఱిఁగి భూజను లెల్ల వరుసఁ గదలి మును జమదగ్నిరాముఁడు పూని ముయ్యేడు మాఱులు ఘనబలోదారుఁ డగుచు |
|
| తే. |
నిజభుజాదండమండితనిబిడనిశిత, చటుల దంభోళిరుచిరభాస్వత్కుఠార మహితధారావినిర్భిన్నమనుజపాల, దేహనిర్ముక్తరుధిరప్రవాహములను. |
1037 |
| తే. |
ఏనుమడువులు గావించె నెచటనేని, నట్టి పావనసుక్షేత్రమగు శ్యమంత పంచకంబున కపుడు సంభ్రమముతోడఁ, జనిరి బలకృష్ణులును సంతసం బెలర్ప. |
1038 |
| వ. | ఇట్లు నిష్కర్ములైన రామకృష్ణులు లోకధర్మానుపాలన ప్రవర్తనులై ద్వారకానగరరక్షణంబునకుం బ్రద్యుమ్న గద సాంబ సుచంద్ర శుక సారణానిరుద్ధ కృతవర్మాది యోధవరుల నియమించి, తాము నక్రూరవసుదే వోగ్రసేనాది సకలయాదవులుం గాంతాసమేతులై స్రక్చందనాభరణవస్త్రాదులు ధరియించి, శోభనాకారంబుల తోడం బుష్పక విమానంబు లనం బొలుచు నరదంబులను, మేఘంబుల ననుకరించు గజంబులను, మనోవేగంబులైన తురగంబుల నెక్కి, వియచ్చరులం బురుడించుపురుషులు దమ్ము సేవింపం జని యప్పుణ్యతీర్థంబుల నవగాహనంబు సేసి యుపవసించి యనంతరంబ. | 1039 |
| క. |
భూసురవరులకు ననుపమ, వాసోఽలంకారధేనువసురత్నధరి త్రీ సుమహితవస్తువు లు, ల్లాసంబున దాన మిచ్చి లాలితు లగుచున్. |
1040 |
| క. |
పునరవగాహనములు పెం, పొనరం గావించి బంధుయుక్తముగా భో జన కృత్యంబులు దీర్చి స, దనురాగము లుల్లసిల్ల నచ్చోటఁ దగన్. |
1041 |
| క. |
ఘనశాఖాకీర్ణములై, యినరశ్ములు దూఱనీక యెసకం బెసఁగన్ ననిచిన పొన్నల నీడల, ననిచిన వేడుకల నందనందనముఖ్యుల్. |
1042 |
| క. |
తనరిన పల్లవ రుచిరా, సనముల నాసీను లగుచు సత్సుఖగోష్ఠిం బెనుపొందఁగ నట వసియిం, చినచోఁ దత్పుణ్యతీర్థసేవారతులై. |
1043 |
| వ. | మున్న చనుదెంచి యున్న మత్స్యౌశీనరకోసలవిదర్భకురుసృంజయకాంభోజకేకయ మద్రకుంత్యారట్టకేర లాదిభూపతులును, మఱియుం దక్కినరాజవరులును, హితులును, నందగోపాది గోపాలురును, గోపికాజనంబులును, ధర్మరాజానుగతులై వచ్చిన భీష్మద్రోణధృతరాష్ట్రగాంధారీకుంతీ పాండవతద్దారనివహ సంజయవిదురకృపకుంతిభోజవిరాటభీష్మకనగ్నజిద్ద్రుపదశైబ్యధృష్టకేతు కాశిరాజదమఘోష విశాలాక్ష మైథిల యుధామన్యు సుశర్మలును, సపుత్త్రకుండైన బాహ్లికుండును మొదలుగా ననేకులు నుగ్రసేనాదియాదవ ప్రకరంబులం బూజలం దృప్తులం జేసిన వారునుం బ్రముదితాత్ములై; రయ్యెడ. | 1044 |
| క. |
ఆ రాజులు గాంచిరి నిజ, నారీయుతు లగుచు నంగనాపరివారున్ ధీరున్ దానవకుల సం, హారున్ గోపీమనోవిహారు నుదారున్. |
1045 |
| వ. | కని య మ్మాధవబలదేవులు సేయు సముచితపూజావిధానంబులం బరితృప్తులై, య మ్ముకుందు సాన్నిధ్యంబు గలిగి, తదీయసంపద్విభవాభిరాములై విలసిల్లుచున్న యుగ్రసేనాది యదు వృష్ణి పుంగవులం జూచి, వారలతోడ నా రాజవరులు మాధవుండు విన నిట్లనిరి. | 1046 |
| మ. |
మన శాస్త్రంబులు వాక్కులున్ మనములున్ మాంగల్యముం బొంది పా వనమై యొప్పెడి నే రమా విభుని భాస్వత్పాదపంకేజ సే చన తోయంబుల నే మహాత్ముని పదాబ్జాతంబు లెందేని సోఁ కినచోటెల్లను ముక్తి హేతు వగు, నీ కృష్ణుండె పో! చూడఁగన్. |
1047 |
| చ. |
సనక సనందనాది మునిసత్తము లంచితయోగదృష్టిచేఁ బనివడి యాత్మలన్ వెదకి పట్ట నగోచరమైనమూర్తి యి ట్లనవరతంబు మాంసనయనాంచలగోచరుఁ డయ్యెనట్టె! యే మన నగు? వీరిపుణ్యమున కాదట నెట్టితపంబు సేసిరో? |
1048 |
| మ. |
నిరయస్వర్గము లాత్మఁ గైకొనక తా నిర్వాణమూర్తైన యీ హరిఁ జూడన్, హరితోడఁ బల్క, హరిమే నంటన్, హరిం బాడఁగా హరితో నేఁగ , సహాసనాస్తరణశయ్యావాసులై యుండఁగన్ హరి బంధుత్వసఖిత్వముల్ గలుగు భాగ్యం బెట్లు సిద్ధించెనో? |
1049 |
| తే. |
అనుచు యాదవ వృష్ణి భోజాంధకులును, హరిదయాలబ్ధనిఖిలార్థు లగుచు నున్న మనికిఁ దమ చిత్తములఁ బలుమాఱుఁ బొగడి, పరిణమించిరి; యంత న ప్పాండుమహిషి. |
1050 |
| వ. | అప్పుడు. | 1051 |
| క. |
తన సుతులకు గాంధారీ, తనయుల గావించు సపకృతంబుల కాత్మన్ ఘనముగ నెరియుచు నచ్చటఁ, గనుఁగొనె వసుదేవు విగతకల్మషభావున్. |
1052 |
| వ. | అట్లు గనుంగొని యతనితో నిట్లనియె. | 1053 |
| క. |
ఓ యన్న ! పాండుతనయులు, నీ యల్లుం డ్రడవులందు నెఱి మృగములతోఁ బాయని యిడుమలఁ బడఁ గరు, ణాయత్తుల రగుచు మీర లరయఁగ వలదే ? |
1054 |
| వ. | అని బహుప్రకారంబుల సంతాపించుచు మఱియు నిట్లనియె. | 1055 |
| క. |
అతిబలవంతపు విధి దాఁ, ‘బ్రతికూలం బైనఁ గలరె బంధువు?’ లనుచున్ ధృతి గలఁగ బాష్పజలపూ, రితలోచన యగు సహోదరిం జూచి యనెన్. |
1056 |
| సీ. |
తల్లి! నీ కేల సంతాపింప మనమునఁ దలపఁక విధి నేల సొలసె? దింత యఖిలనియామకుండగు నీశ్వరుఁడు మాయయవనికాంతరుఁడైన యట్టి సూత్ర ధారుని కైవడిఁ దవిలి నటింపఁగ మనుజులు కీలుబొమ్మలు దలంపఁ గావున విధిసేఁతఁ గడచి వర్తింపంగ, దేవతలకునైనఁ దీఱ; దట్లు |
|
| తే. |
క్రోధచిత్తుండు కంసుఁడు బాధపఱుప, నిలయములు దప్పి, నే నడవులఁ జరింప ఘనకృపానిధి యీ హరి గలుగఁ బట్టి, కోరి మా కిండ్లు గ్రమ్మఱఁ జేరఁ గలిగె’. |
1057 |
| వ. | అని యూరడిలం బలుకు నవసరంబున. | 1058 |
| క. |
నందయశోదలు గోపక, బృందంబులు గోపికలును బిరిగొని పరమా నందంబునఁ జనుదెంచిరి, మందరధరుఁ జూచువేడ్క మనములఁ బొడమన్. |
1059 |
| వ. | ఇట్లు సనుదెంచి. | 1060 |
| క. |
అతిచిరకాలసమాగతు, నతని నిరీక్షించి వృష్ణియాదవభోజ ప్రతతులు నెదురేఁగి సము, న్నతితో నాలింగనములు నడపిరి వరుసన్. |
1061 |
| క. |
వసుదేవుఁడు వారికి సం, తసమునఁ గావించె సముచితక్రియ లంతన్ ముసలియు హరియును మ్రొక్కిరి, వెస నందయశోదలకును వినయం బెసఁగన్. |
1062 |
| వ. | అట్లు నమస్కృతులు సేసి, యాలింగనంబులు గావించి, నయనారవిందంబుల నానందబాష్పంబులు దొరఁగ నఱ లేని స్నేహంబులు చిత్తంబుల నత్తమిల్ల నేమియుం బలుకకుండి; రంత న య్యశోదాదేవి రామకృష్ణుల నిజాంకపీఠంబుల నునిచి యక్కునం గదియం దిగిచి, చెక్కిలి ముద్దుగొని, శిరంబులు మూర్కొని, చిబుకంబులు పుడుకుచుఁ, బునఃపునరాలింగనంబులు గావించి, పరమానందంబునం బొందుచు నున్నంతఁ బదంపడి. | 1063 |
| చ. |
స్థిరమతితోడ రోహిణియు దేవకియుం దగ నందగోప సుం దరిఁ గని కౌఁగిలించికొని తత్కృతులెల్లఁ దలంచి యింతి! నీ వరుఁడును నీవు బంధుజనవత్సలతన్ మును చేయు సత్కృతుల్ మఱవఁగ వచ్చునే ? తలఁప మా కిఁక నెన్నఁటికిం దలోదరీ! |
1064 |
| క. |
జననం బందుట మొదలుగ, ఘనమోహముతోడఁ బెంచుకతమునఁ దమకున్ జననీజనకులు వీరని, మనమునఁ దలపోయలేరు మము నీ తనయుల్. |
1065 |
| క. |
అంటిన ప్రేమను వీరిం, గంటికి ఱెప్పడ్డమైన గతిఁ బెంపఁగ మా కంటెన్ నెన రౌటను మీ, యింటన్ వసియించి యుండి రిన్నిదినంబుల్. |
1066 |
| వ. | అని యిట్లు ప్రియాలాపంబులు పలుకుచుండు నవసరంబున గోపాలసుందరు లమందానంద కందళితహృదయ లయి హృదయేశ్వరుండైన గోవిందుఁడు చిరకాల సమాగతుం డగుటం జేసి, యతనిం జూచు తలంపు లుల్లంబుల వెల్లిగొనం జేరి. | 1067 |
| చ. |
నళినదళాక్షుఁ జూచి నయనంబులు మోడ్వఁగఁ జాల కాత్మలన్ వలచి తదీయమూర్తివిభవంబు దలంచుచుఁ గౌఁగిలించుచుం బులకలు మేన జాదుకొనఁ బొల్తులు సొక్కిరి బ్రహ్మమున్ మనం బునఁ గని చొక్కు యోగిజనముం బురుడింపఁగ మానవేశ్వరా! |
1068 |
| చ. |
పొలఁతుల భావ మాత్మఁ గని ఫుల్లసరోరుహలోచనుండు వా రల నపు డేకతంబునకు రమ్మని తోకొని పోయి యందు న ర్మిలిఁ బరిరంభణంబు లొనరించి లసద్దరహాసచంద్రికా కలితకపోలుఁడై పలికెఁ గాంతల భక్తినితాంతచిత్తలన్. |
1069 |
| చ. |
‘వనజదళాక్షులార! బలవద్రిపువర్గములన్ జయింపఁగాఁ జని తడ వయ్యె; దీనికి భృశంబుగ మీ మది నల్గకుండుఁడీ! యనయము దైవ మిట్లు సచరాచరజాలము నొక్కవేళఁ గూ ర్చును నొకవేళఁ బాపును మరుద్ధతతూల తృణంబులం బలెన్. |
1070 |
| సీ. |
తరలాక్షులార! మద్భక్తిచేతనులకుఁ దనరు మోక్షానందదాయకంబు జపతపోవ్రతదానసత్కర్మముల ముక్తి కలుగంగ నేరదు కానఁ దలఁప విధిశివసనకాదివిమలచిత్తంబులఁ బొడమిన భక్తి మీ బుద్ధులందు జనియించె మీ పూర్వసంచితసౌభాగ్య మెట్టిదో యది తుదముట్టె నింక |
|
| తే. |
నటమటము గాదు మీకు నెన్నఁటికి నైనఁ, గలుగనేరవు నిరయసంగతములైనఁ జన్మకర్మము లిటమీఁద మన్మనీష,సుమహితధ్యానలార! యో రమణులార! |
1071 |
| సీ. |
అఖిలభూతములకు ననయంబు నాదిమధ్యాంతరాంతర్బహిర్వ్యాప్తి నైన ఘటపటాదికభూతకార్యంబులకు నుపాదానకారణములై తనరునట్టి గగనానిలానలకక్షోణులను భూతపంచకం బైక్యత వడయుఁగాదె లోకంబులందుఁ బంచీకరణవ్యవస్థలచేత నట్టి భూతముల రీతి |
|
| తే. |
గగనముఖభూతతత్కార్యకారణములఁ, దగిలి యాధారహేతుభూతంబ నైన నాకుఁ బర మన్య మొక్కఁ డెన్నంగ లేదు, విమలమతులార! మాటలు వేయు నేల? |
1072 |
| తే. |
అనినఁ దెలివొంది వారు దేహాభిమాన, ములు సమస్తంబు విడిచి ‘యో నలిననాభ! నిఖిలజగదంతరాత్మ! మానితచరిత్ర!, భక్తజనమందిరాంగణపారిజాత! |
1073 |
| తే. |
ఘోరసంసారసాగరోత్తారణంబు, ధీయుతజ్ఞానయోగిహృద్ధ్యేయవస్తు వగుచుఁ జెలువొందు నీ చరణాంబుజాత, యుగళమును మా మనంబులఁ దగుల నీవె |
1074 |
| క. |
అని వేడినఁ గృష్ణుఁడు ముని, వినతుఁడు కరుణించి వల్లవీజనములు గో రిన యట్ల యిచ్చెఁ గరుణా, వననిధి సద్భక్తలోకవత్సలుఁ డంతన్. |
1075 |
| ఉ. |
ధర్మతనూభవుం గని పదంబులకున్ నతుఁడై సపర్యలన్ నిర్మలభక్తిమై నడపి నీవును దమ్ములు బంధుకోటి స త్కర్మ చరిత్రులై తగు సుఖంబుల నొప్పుచు నున్నవారె నా నర్మిలిఁ బాండవాగ్రజుఁడు న మ్మధుసూదనుతోడ నిట్లనున్. |
1076 |
| క. |
సరసిజనాభ! భవత్పద, సరసీరుహ మాశ్రయించు జను లతిసౌఖ్య స్ఫురణం బొలుపారుచు భువిఁ, జరియింపరె! భక్తపారిజాత! మురారీ! |
1077 |
| వ. | అదియునుం గాక | 1078 |
| సీ. |
సుమహితస్వప్నసుషుప్తిజాగరములన్ మూఁడవస్థలఁ బాసి వాఁడి మిగిలి వెలి నుందు లో నుందు; విశ్వమై యుందువు;, విశ్వంబు నీయందు వెలుఁగుచుండు; భవదీయమహిమచేఁ బాటిల్లు భువనంబు, లుదయించు నొక వేళ నుడిగి మడుఁగు; సంచితాఖండితాజ్ఞానివై యొప్పుచు నవిహతయోగమాయాత్మఁ దనరి |
|
| తే. |
దురితదూరులు నిత్యముక్తులకుఁ జెంద, నలవియై పెంపు దీపింతు వంబుజాక్ష ! ఘనకృపాకర ! నఖిలవికారదూర!, నీకు మ్రొక్కెద సర్వలోకైకనాథ ! |
1079 |
| క. |
అని వినుతించిన నచ్చటి, జనపాలకబంధుమిత్రసకలజనములున్ విని యనురాగిల్లిరి నె, మ్మనముల నానంద జలధిమగ్నులు నగుచున్. |
1080 |
| తే. |
అట్టి యొప్పగువేళ నెయ్యంబు మెఱసి, యొక్కచోటను సంతోషయుక్తు లగుచు దానవాంతకసతులును ద్రౌపదియును, గూడి తమలోన ముచ్చట లాడుచుండి. |
1081 |