| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - ఉత్తరభాగము |
| వ. | అట్టియెడఁ గృష్ణ కథావిశేషంబులు పరితోషంబున నుగ్గడించుచుఁ బ్రసంగవశంబున నా రుక్మిణీదేవి మొదలగు శ్రీకృష్ణుభార్యలం గనుంగొని పాంచాలి యిట్లనియె. ‘మిమ్ముఁ బుండరీకాక్షుండు వివాహం బయిన తెఱంగులు వినిపింపుఁ డన వారును దమ పరిణయంబుల తెఱంగులు మున్ను నే నీకుం జెప్పిన విధంబున వినిపించి; రందు సవిస్తరంబుగాఁ దెలియం బలుకని మద్రరాజకన్యకావృత్తాంతం బా మానిని పాంచాలికిం జెప్పినవిధంబు విను మని శుకుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె. | 1082 |
| సీ. |
పాంచాలితో మద్రపతిసుత యిట్లను సంగీతవిద్యావిశారదుండు నారదుచేతి వీణాస్వనకలిత మై నట్టి గోవిందకథామృతంబు దవిలి యేఁ గ్రోలి చిత్తము దన్మయత్వంబు నొంది మోదించుచు నుండునంత దుహితృవత్సలుఁడు మద్గురుఁడు దా నది విని సదుపాయ మొక్కటి మదిఁ దలంచి |
|
| తే. |
చదల నెబ్భంగి నైన గోచరము గాక, వారిమధ్యములో నభివ్యాప్తి దోఁచు మత్స్యయంత్రంబు కల్పించి మనుజు లెంత, వారి కైనను దివ్వ మోవంగరాని. |
1083 |
| తే. |
ధనువుఁ బవిచండనిష్ఠురాస్త్రంబు నచట, సంచితంబైన గంధపుష్పాక్షతలను బూజ గావించి యునిచి యే పురుషుఁడేని, నిద్ధబలమున నీ చాప మెక్కు వెట్టి. |
1084 |
| క. |
ఈ సాయకంబు నారిం, బోసి వెసన్ మత్స్యయంత్రమున్ ధరఁ గూలన్ వేసిన శౌర్యధురీణుఁడు, నాసుత వరియించు నని జనంబులు వినఁగన్. |
1085 |
| క. |
చాటించిన న వ్వార్తకుఁ, బాటించిన సంభ్రమముల బాణాసన మౌ ర్వీ టంకార మహారవ, పాటితశాత్రవులు బాహుబలసంపన్నుల్. |
1086 |
| క. |
సుందరతనులు దదుత్సవ, సందర్శనకుతుకు లమితసైన్యులు భూభృ న్నందను లేతెంచిరి జన, నందితయశు లగుచు మద్రనగరంబునకున్. |
1087 |
| క. |
చనుదెంచినవారికి మ, జ్జనకుఁడు వివిధార్చనములు సమ్మతిఁ గావిం చిన నా బాహుబలాఢ్యులు, ధనువుం జేరంగ నరిగి ధైర్యస్ఫూర్తిన్. |
1088 |
| వ. | ఇట్లు డగ్గఱి యద్ధనువుం గనుంగొని. | 1089 |
| ఉ. |
కొందఱు పూనలేక చనఁ, గొందఱు పూని కదల్పలేక పోఁ, గొంద ఱొకింత యెత్త, నొక కొందఱు మోపిడలేక దక్కఁగాఁ, గొంద ఱొకింత యెక్కిడుచుఁ, గోరి నృపాలకు లిట్లు సిగ్గునుం జెంది తలంగి పోవుచును సీ యిట కేఁగుట నీతి త ప్పనన్. |
1090 |
| వ. | అట్టియెడ. | 1091 |
| క. |
భీముఁడు రాధేయుఁడు ను, ద్దామగతి న్నెక్కు ద్రోఁచి తగ నమ్మీనం బేమఱక దిరుగుచుంటయుఁ, దా మేమియు నెఱుఁగలేక తలఁగిన పిదపన్. |
1092 |
| క. |
అమరేంద్రతనయుఁ డ మ్మ, త్స్యము నేయ నుపాయ మెఱిఁగి తగ నేసియు మీ నము ద్రుంపలేక సిగ్గున, విముఖుం డై చనియె నంత వికలుం డగుచున్. |
1093 |
| వ. | ఇట్లు సకలరాజకుమారులుం దమతమప్రయత్నంబులు విఫలంబులైన ముఖారవిందంబులు ముకుళించి దైన్యంబున విన్ననై చూచుచున్న యెడ. | 1094 |
| చ. |
సరసిజ పత్త్రలోచనుఁడు చాపము సజ్యము సేసి యుల్లస చ్ఛర మరిఁబోసి కార్ముకవిశారదుఁడై యలవోక వోలె ఖే చర మగు మీనముం దునిమె సత్వరతన్ సురసిద్ధ సాధ్య ఖే చరజయశబ్ద మొప్పఁ బెలుచం గురిసెం దివిఁ బుష్పవర్షముల్. |
1095 |
| వ. | అయ్యవసరంబున నేనుం బరితుష్టాంతరంగనై పరమానందవికచ వదనారవింద నగుచు, నిందిందిర సన్నిభంబులగు చికురబృందంబులు విలసదలికఫలకంబునం దళుకు లొలుకు ఘర్మజలకణంబులం గరంగు మృగమదతిలకంపు టసలున మసలుకొనినం గరకిసలయంబున నోసరించుచు మిసమిస మను మెఱుంగుగములు గిఱికొన నెఱిగౌను వడవడ వడంక నప్పుడు మందగమనంబున. | 1096 |
| చ. |
లలితపదాబ్జనూపురకలధ్వనితో దరహాసచంద్రికా కలితకపోలపాలికలఁ గప్పు సువర్ణవినూత్నరత్న కుం డల రుచు లొప్పఁ గంకణఝణంకృతు లింపెసలార రంగ భూ తలమున కేగుదెంచి ముఖతామరసం బపు డెత్తి చూచుచున్. |
1097 |
| చ. |
నరపతులం గనుంగొని మనంబున వారిఁ దృణీకరించి మ త్కరజలజాతదివ్యమణికాంచనమాలిక న మ్మురారి కం ధరమున లీలమై నిడి పదంపడి నవ్యమధూకదామ మా హరికబరిం దగిల్చితి నయంబునఁ గన్నుల లజ్జ దేఱఁగన్. |
1098 |
| వ. | అప్పుడు. | 1099 |
| చ. |
కొలఁదికి మీఱఁగా డమరుగోముఖడిండిమమడ్డుశంఖ కా హళ మురళీమృదంగ పణవానకదుందుభిఢక్కకాంస్య మ ర్దళ మురజారజాదివివిధధ్వను లేపున భూనభోంతరం బులఁ జెలఁగెన్ నటీనటనముల్ దనరారె మనోహరాకృతిన్. |
1100 |
| వ. | అంత. | 1101 |
| చ. |
అమరగణంబుఁ దోలి యురగారి సుధాకలశంబుఁ గొన్న చం దమున సమస్తశత్రువసుధావరకోటిఁ దృణీకరించి య క్కమల విలోచనుండు ననుఁ గౌఁగిట నొప్పుఁగ జేర్చి సింహ చం క్రమణ మెలర్పఁ గొంచుఁ జనెఁ గాంచనచారురథంబుమీఁదికిన్. |
1102 |
| వ. | అట్లు రథారోహణంబు సేసిన. | 1103 |
| చ. |
తురగచతుష్కమున్ విమతదుర్దమశూరతఁ బూన్చి దారుకుం డరదము రొప్ప శత్రునికరాంధతమః పటలప్రచండ భా స్కరరుచి నొప్పునట్టి నిజకార్ముకయుక్తగుణప్రఘోష సం భరిత దిగంతరుం డగుచుఁ బద్మదళాక్షుడు వోవుచుండఁగన్ ! |
1104 |
| వ. | అట్టియెడ సకలరాజలోకంబును గృష్ణునివిభవంబునకుం జూపోపక యసంఖ్యంబులగు మూఁకలు గట్టి య మ్మహాత్మునిమాహాత్మ్యంబు దెలియక దర్పాంధులై కడంగి | 1105 |
| ఉ. |
భావభవప్రసూనశరబాధితమానసులై సమస్త ధా త్రీవరనందనుల్ బలువుఁ దెంపును బెంపును సొంపు నేర్పడన్ దేవకిరీటరత్నరుచిదీపితపాదసరోజుఁ డైన రా జీవదళాక్షుఁ దాఁకిరి విశృంఖలవృత్తి నతిప్రయత్నులై. |
1106 |
| వ. | అంత. | 1107 |
| చ. |
సరసిజలోచనుండు నిజశారఙ్గశరాసనముక్తహేమ పుం ఖ రుచిరశాతసాయకనికాయములన్ రిపుకోటి నేసి సిం ధురరిపువిక్రమప్రకటదోర్బలుఁడై విలసిల్లి యొత్తె దు స్తర చలితాన్యసైన్యమును సజ్జనమాన్యముఁ బాంచజన్యమున్. |
1108 |
| ఉ. |
ఆ తఱి భూరిబాహుబలులైన విరోధినరేశ్వరుల్ మృగ వ్రాతము లొక్కపెట్ట మృగరాజకిశోరముపై నెదిర్చి న ట్లాతురులై చతుర్విధసమగ్రబలంబులతోడఁ గూడి ని ర్ధూత కళంకుఁడైన నవతోయజనేత్రునిఁ జుట్టు ముట్టినన్. |
1109 |
| చ. |
అలిగి మురాంతకుండు కులిశాభశరంబుల నూత్నరత్న కుం డలములతో శిరంబులు, రణన్మణినూపురరాజితోఁ బదం బులుఁ, గటకాంగుళీయకవిభూషణచాపశరాలితోడఁ జే తులు, నిలఁ గూలఁగా విజయదోహలియై తునుమాడె వెండియున్. |
1110 |
| క. |
హతశేషులు సొక్కాకుల, గతిఁ దూల నిశాతపవనకాండముల సము ద్ధతి నేసి తోలి విజయో, న్నతుఁడై నిజనగరి కేగె నగధరుఁ డంతన్. |
1111 |
| వ. | అట్లు మహితమంగళాలకృతంబును, నతిమనోహరవిభవాభిరామంబు నగు ద్వారకానగరంబున కరుగుదెంచిన మజ్జనకుండును బ్రియంబునఁ దోడన చనుదెంచి. | 1112 |
| చ. |
రణితవినూత్నరత్నరుచిరస్ఫుటనూపురహారకర్ణభూ షణకటకాంగుళీయకలసత్పరిధానకిరీటతల్ప వా రణ రథవాజిహేతినికరంబులనుం బరిచారికాతతిన్ బ్రణుతగుణోత్తరుం డయిన పద్మదళాక్షున కిచ్చె నెమ్మితోన్. |
1113 |
| వ. | ఇట్లు మహనీయతేజోనిధియైన మాధవు దయాపరిలబ్ధనిఖిలవస్తువిస్తారుం డయ్యును, నిజాధికార శుద్ధికొరకు మరలఁ గన్యారత్నంబును, వినూత్నరత్నవ్రాతంబును సమర్పించె; నని భూసురవిసరంబులు వినుతింప మా తండ్రియైన బృహత్సేనుండు నన్నును సమస్తవస్తువులను గృష్ణునకు సమర్పించి, క్రమంబున సకల యాదవులనుం బూజించి మరలి నిజపురంబునకుం జనియె నని చెప్పినఁ గుంతియు, గాంధారియుఁ, గృష్ణయు, నఖిలనృపాలకాంతాజనంబులును, గోపికలుం దమతమ మనంబుల సర్వభూతాంతర్యామియు, లీలామానుషవిగ్రహుండును నైన పుండరీకాక్షచరణారవిందస్మరణానందపరవశలై కృష్ణుం బ్రశంసించి రంత. | 1114 |