పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగము
నారదాది మహర్షులు శ్రీకృష్ణు దర్శనంబు సేసికొని వసుదేవునిచేఁ గ్రతువు సేయించుట
చ. బలవదరాతిమర్దనులఁ బాండురనీలనిభప్రభాంగులం
గలితనిజాననాంబుజవికాసజితాంచితపూర్ణచంద్ర మం
డలులఁ బరేశులన్‌ నరవిడంబనులం గరుణాపయోధులన్‌
విలసదలంకరిష్ణుల నవీనసహిష్ణుల రామకృష్ణులన్‌.
1115
వ. సందర్శించు తలంపుల నందఱుఁ దమ హృదయారవిందంబులఁ బ్రేమంబు సందడిగొన నప్పుడు. 1116
ఉ. ధీరమతిన్‌ ద్వితత్రితకదేవలసాత్యవతేయకణ్వులున్‌
నారదగౌతమచ్యవననాకుజగార్గ్యవసిష్ఠగాలవాం
గీరసకశ్యపాసితసుకీర్తిమృకండుజకుంభసంభ వాం
గీరులు యాజ్ఞవల్క్యమృగశృంగముఖాఖిలతాపసోత్తముల్‌.
1117
వ. చనుదెంచినం గృష్ణుండు వారలకుఁ బ్రత్యుత్థానంబు సేసి వందనంబు లాచరించి వివిధార్చనలు గావించి యిట్లనియె. 1118
సీ. ‘సన్మునీశ్వరులార! జన్మభాక్కులమైన మాకు నిచ్చోట సమ్మతిని దేవ
నికరదుష్ప్రాపులు నిరుపమయోగీంద్రు లైన మీ దర్శనం బబ్బెఁ గాదె
ధృతి మందభాగ్యు లింద్రియ పరతంత్రులు నైన మూఢాత్ముల కనఘులార !
భవదీయ దర్శన స్పర్శన చింతన పాదార్చనలు దుర్లభంబు లయ్యు
 
తే. నేఁడు మాకిట సులభమై నెగడెఁ గాదె !, జగతిపైఁ దీర్థభూతులు సాధుమతులు
మిమ్ము దర్శించుటయు చాలు నెమ్మితోడ, వేఱ తీర్థంబు లవనిపై వెదక నేల ?
1119
వ. అదియునుం గాక యుదక మయంబులైన తీర్థంబులును మృచ్ఛిలామయంబులైన దేవగణంబులును, దీర్థదేవతారూపంబులు గాకుండుట లే; దయిన నవి చిరకాలసేవనార్చనలం గాని పావనంబు సేయవు; సత్పురుషులు దర్శనమాత్రంబునం బావనంబుసేయుదు రని వెండియు. 1120
సీ. ఆదిత్యచంద్రాగ్నిమేదినీతారాంబుమారుతాకాశవాఙ్మనము లోలిఁ
బరికింపఁ దత్తదుపాసనంబులఁ బవిత్రములు సేయఁగ సమర్థములు గావు;
సకలార్థగోచరజ్ఞానంబు గల మహాత్మకులు దారు ముహూర్తమాత్రసేవఁ
జేసి పావనములు సేయుదు; రదియు న ట్లుండె ధాతుత్రయయుక్తమైన
 
తే. కాయమం దాత్మబుద్ధియుఁ గామినీ కు, మారులందు స్వకీయాభిమానములును
దివిరి జలమునఁ దీర్థబుద్ధియును జేయు, నట్టి మూఢుండు పశుమార్గుఁ డనఁగఁ బరఁగు.
1121
వ. అని యివ్విధంబునం గృష్ణుం డాడిన సాభిప్రాయంబులగు వాక్యంబులు విని య మ్మునీంద్రులు విభ్రాంతహృదయులై యూరకుండి, ముహూర్తమాత్రంబున కమ్మహాత్ము ననుగ్రహంబు వడసి, మందస్మితముఖులై, యప్పుండరీకాక్షున కి ట్లనిరి; దేవా! నేమును దత్త్వవిదుత్తము లయిన బ్రహ్మరుద్రాదులును, భవదీయ మాయావిమోహితులమై యుందుము; నిగూఢంబయిన నీ యిచ్ఛచేత మమ్ము ననుగ్రహించితివి. భవదీయ చరిత్రంబులు విచిత్రంబు; లి మ్మేదిని యొక్కటి యయ్యును బహురూపంబులఁ గానంబడు విధంబున నీవును మొదలఁ గారణరూపంబున నేకం బయ్యును ననేక రూపంబులు గైకొని, జగదుత్పత్తి స్థితి లయంబులకు హేతుభూతంబునా నద్భుతకర్మంబులం దగిలి, లీలావతారంబులు గైకొని, దుష్టజననిగ్రహంబును, శిష్టజనరక్షణంబును గావించుచుందు; వదియునుం గాక వర్ణాశ్రమధర్మంబు లంగీకరించి, పురుషరూపంబున వేదమార్గంబు విదితంబు సేసిన బ్రహ్మరూపివి; తపస్ప్వాధ్యాయ నియమంబులచేత నీ హృదయంబు పరిశుద్ధంబు; గావున బ్రహ్మస్వరూపంబులైన వేదంబులందు వ్యక్తావ్యక్త స్వరూపంబు లేర్పడఁగా నుందువు; కావున, బ్రాహ్మణకులంబునెల్ల బ్రహ్మకులాగ్రణివై రక్షించిన మహానుభావుండవు; మాయాజవనికాంతరితుండవైన నిన్నును నీ భూపాలవర్గంబును, నేమును దర్శింపంగంటిమి; మా జన్మ విద్యా తపోమహిమలు సఫలంబు లయ్యె; నీకు నమస్కరించెద’ మని బహువిధంబులఁ గృష్ణు నభినందించి, యమ్మురాంతకుచేత నామంత్రణంబులు వడసి తమ తమ నివాసంబులకుం బోవం దలంచు నవసరంబున. 1122
సీ. అ మ్మునీశ్వరులకు నానకదుందుభి యతిభక్తి వందనం బాచరించి
తాపసోత్తములార ! ధర్మతత్త్వజ్ఞులు మన్నించి వినుఁడు నా విన్నపంబు
సత్కర్మవితతిచే సంచితకర్మచయంబు వాపెడు నుపాయంబు నాకు
ఘనదయామతిఁ జెప్పుఁ డనిన నమ్మునివరుల్‌ భూవరుల్‌ విన వసుదేవుఁ జూచి
 
తే. యెలమిఁ బలికిరి నిఖిల యజ్ఞేశుఁడైన, కమలలోచనుఁ గూర్చి యాగములు సేయు
కర్మమునఁ బాయు నెట్టి దుష్కర్మమైన; నిదియె ధర్మంబు గాఁగ నీ మదిఁ దలంపు.
1123
వ. అదియునుం గాక. 1124
క. దేవర్షిపితృఋణంబులు, భూవర ! మఖవేదపాఠపుత్త్రులచేతన్‌
వావిరి నీఁగని పురుషుఁడు, పోవు నధోలోకమునకుఁ బుణ్యచ్యుతుఁడై.
1125
వ. అట్లగుటం జేసి నీవును. 1126
క. వరతనయాధ్యయనంబులఁ, దరియించితి ఋణయుగంబు; దడయక ధరణీ
వరదేవఋణము సవనా, చరణుఁడవై యీఁగు టొప్పు సమ్మతితోడన్‌.
1127
క. అనవుడు న వ్వసుదేవుఁడు, మునివరులకు ననియె వినయమున మీరలు సె
ప్పిన యట్లు మఖము సేసెద, దినకరనిభులార! మీరు దీర్పఁగ వలయున్‌.
1128
వ. అని యభ్యర్థించి యమ్మునీంద్రుల యాజకులం గా వరించి, యప్పుణ్యతీర్థోపాంతంబున మహేంద్రామిత వైభవంబున, నష్టాదశభార్యాసమేతుండై, దీక్షఁ గైకొని య మ్మహాధ్వరంబు వేదోపదిష్ట విధిం బరిసమాప్తించి ఋత్విఙ్నికాయంబుల బహుదక్షిణలం దనిపి, భార్యాసమేతుండై యవభృథస్నానం బాచరించి, వివిధరత్నమణి మయభూషణ విచిత్రాంబర సురభి సుమానులేపనంబులు ధరించి, నిఖిలభూదేవ మునిబంధు రాజలోకంబుల నుచిత సత్కారంబులఁ బ్రీతులం గావించిన వారును గృష్ణానుమతి నాత్మనివాసంబులకుం జని; రందు. 1129
ఉ. ఆ తఱి నుగ్రసేనవసుధాధిపపంకజనాభముష్టికా
రాతులు దమ్ము నర్థి మధురప్రియభాషల నిల్వ వేఁడినం
గౌతుక మాత్మ నివ్వటిలఁగా వసియించిరి గోపగోపికా
వ్రాతముతోడ నచ్చట ధరావర ! నందయశోద లిమ్ములన్‌.
1130
క. హరినయముల హరిప్రియముల, హరిమధురాలాపములను హరికథల మనో
హరలీలఁ దగిలి నందుఁడు, నిరుపమగతి నచట మూఁడునెల లుండె నృపా!
1131
చ. జలరుహలోచనాదియదుసత్తము లందఱు నన్నిభంగులం
గలితవిభూషణాంబరనికాయము లిచ్చి బహూకరించి వీ
డ్కొలిపిన నందముఖ్యులు ముకుందపదాబ్జమరందపాన స
ల్లలిత నిజాత్మషట్పదములన్‌ మరలించుచు నెట్టకేలకున్‌.
1132
వ. చని చని. 1133
ఆ. మరలి మరలి ‘కృష్ణ! మాధవ! గోవింద!, పద్మనాభ! భక్తపారిజాత!
దేవదేవ! యనుచుఁ దివిరి చూచుచు మధు, రాభిముఖులు నగుచు నరిగి రంత.
1134
క. క్రమమున నచ్చటఁ బ్రావృ, ట్సమయం బగుటయును బంధుజనయాదవ వ
ర్గము లోలిఁ గొలువ సురగణ, నమితులు బలకృష్ణు లాత్మనగరంబునకున్‌.
1135
వ. వచ్చి సుఖంబుండు నంత. 1136
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - uttara bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )