| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - ఉత్తరభాగము |
| సీ. |
అవనీశ ! యొక్కనాఁ డానకదుందుభిభార్య పద్మాక్షుండు బలుఁడుఁ దొల్లి శరధిలోఁ జొచ్చిన గురుతనూభవునిని మరలంగఁ దెచ్చిన మహిమ లెల్ల జనములు దమలోన సన్నుతుల్ సేయంగ విని తనసుతులు దుర్వృత్తుఁడైన కంసుచే నిహతులై కాలునిపురి నున్నవారి నందఱఁ జూడఁ గోరి కృష్ణ |
|
| తే. |
బలులకడ కేగి కన్నుల బాష్పకణము, లొలుక నో రామ! రామ! నిత్యోన్నతాత్మ! పరమపావనమూర్తి! యో మురవిభేది!, యిందిరానాథ! యోగీశ్వరేశ! కృష్ణ! |
1137 |
| క. |
ముర కంస చైద్య పౌండ్రక, నరక జరాతనయ యవన నరనాయకులన్ దురితాత్ములఁ బొరిగొని భూ, భర ముడిపిన యట్టి మేటిబలులు దలంపన్. |
1138 |
| ఆ. |
జనన వృద్ధి విలయసంగతి నిఖిలంబుఁ, బొందఁ జేయు పరమపురుషులార ! మీకు లీల లౌట మీ రని నమ్మిన, దాన నేను వినుఁ డుదారులార!’ |
1139 |
| వ. | అని యనేకవిధంబుల వినుతించుచు నిట్లనియె; మీరలు మహానుభావులరు; మీరు తొల్లి యనేకకాలంబు సనినక్రిందట మృతుండై, దండధరుమందిరంబున నున్న గురుకుమారుని మీ మహాప్రభావంబులు లోకంబులఁ బరిపూర్ణంబులై ప్రకాశింప; న క్కాలునిచెంత నుండి మగుడం దెచ్చి గురుదక్షిణగా నొసంగితి; రి వ్విధంబునం గంసునిచేత హతులైన మత్పుత్త్రుల నందఱ మరలం దెచ్చి నా మనంబున నున్న దుఃఖంబు నివారింపవలయు నని దేవకీదేవి ప్రార్థించినం దమతల్లి యాడిన మృదుమధురవాక్యంబు లత్యాదరంబున నాదరించి, యప్పుడు బలకృష్ణులు దమ యోగమాయామహత్త్వంబున సుతలంబునకుం జని; రట్టి యెడ. | 1140 |
| మ. |
కనియెన్ దానవుఁ డింద్రసేనుఁడు దళత్కంజాక్షులన్ దక్షులన్ ఘనసారాంబుదవర్ణులన్ నిఖిలలోకైకప్రభాపూర్ణులన్ దనరారన్ హలచక్రపాణులను భక్తత్రాణులన్ నిత్య శో భన వర్ధిష్ణుల రామకృష్ణుల జయభ్రాజిష్ణులన్ జిష్ణులన్. |
1141 |
| చ. |
కని హితకోటితో నెదురుగాఁ జనుదెంచి మనోఽనురాగ సం జనిత కుతూహలుం డగుచుఁ జాఁగిలి మ్రొక్కి సమగ్ర కాంచనా సనముల నుంచి తచ్చరణసారససేచన సర్వలోక పా వన సలిలంబు లౌదల ధ్రువంబుగఁ దాల్చి సుభక్తియుక్తుఁడై. |
1142 |
| సీ. |
సురభికాలాగరుహరిచందనైలాదిధూపంబు లా విశ్వరూపకులకుఁ గాంచనపాత్రసంగతరత్నకర్పూరదీపంబు లా జగద్దీపకులకుఁ బాయసాపూపాన్నపక్వఫలాదినైవేద్యంబు లా వేదవేద్యులకును దనరు వినూత్నరత్న ప్రభాభాసితాభరణంబు లా దైత్యహరణులకును |
|
| తే. |
మిలమిలని మంచుతోఁ బొలుపలరు బహు వి, ధాంబరంబులు నీలపీతాంబరులకు సలలిత కుసుమమాలికామలయజాను, లేపనంబులు భూరినిర్లేపులకును. |
1143 |
| వ. | సమర్పించి, య ప్పుండరీకాక్షుని చరణారవిందంబు లొత్తుచు నానందబాష్పపూరంబు తోరంబుగా రోమాంచకంచుకితశరీరుం డగుచుం దన గరకమలంబులు ఫాలభాగంబునం గదియించి యిట్లని స్తుతియించె. | 1144 |
| ఉ. |
ధీయుతుఁడై నమో భగవతే హరయే పరమాత్మనే ముకుం దాయ సమస్తభక్తవరదాయ నమః పురుషోత్తమాయ కృ ష్ణాయ మునీంద్రవంద్యచరణాయ సురారిహరాయ సాంఖ్యయో గాయ వినీల భాస్వదలకాయ రథాంగధరాయ వేధసే. |
1145 |
| వ. | అని యభినందించి యిట్లనియె. | 1146 |
| ఉ. |
రాజస తామసాత్ములకు రాదుగదా నినుఁ గాన నవ్య పం కేజ దళాయతాక్ష ! మునిగేయ పవిత్రచరిత్ర ! విస్ఫుర ద్రాజకళాధరాజ సురరాజ ముఖామర మౌళిరత్న వి భ్రాజితపాదపీఠ ! భవబంధ విమోచన ! పద్మలోచనా ! |
1147 |
| మ. |
మది నూహింపఁగ యోగివర్యులు భవన్మాయాలతాబద్ధులై యిద మిత్థ’ మ్మన లేరు తామసులమై యేపారు మాబోఁటి దు ర్మదు లేరీతి నెఱుంగఁజాలుదురు? సమ్యగ్‌జ్ఞానధీయుక్తి నీ పదముల్ సేరెడి త్రోవఁ జూపి భవకూపంబుం దరింపింపవే! |
1148 |
| ఉ. |
వైరముచేతఁ జేదినృపవర్గముఁ, గామముచేత గోపికల్, మీఱినభక్తి నాశ్రితులు మిమ్ము నహర్నిశమున్ మనంబులం దారఁగనీక రూపగుణతత్పరులై మిముఁ బొందు కై వడిన్ భూరివివేకసత్త్వగుణముల్ గల దేవత లంద నేర్తురే ! |
1149 |
| క. |
కాన భవత్పదపద్మ, ధ్యానంబునఁ గాని శాస్త్రతత్త్వంబులచేఁ గానరు శ్రుతిసంవేద్యం, బైన భవత్పదముఁ జిన్మయాకార ! హరీ ! |
1150 |
| వ. | దేవా ! యే నరుండైన నేమి శ్రద్ధాగరిష్ఠచిత్తుండై మిమ్ముసేవించు నట్టి మహాత్ముండు విధిచోదితంబయిన ప్రమాణంబువలన విముక్తుండై వర్తించు; నట్లు గావున యోగీశ్వరుండవైన నీ వీశితవ్యులమైన మమ్ము నిష్పాపులం జేయు మని నుతించి మఱియు నిట్లనియె. | 1151 |
| మత్తకోకిలము. |
‘కంటి, గంటి భవాబ్ధి దాఁటఁగఁ గంటి, ముక్తినిధానముం గంటి, నీ కరుణావలోకముఁ గంటి, బాపము వీడ ము క్కంటి తామరచూలియుం బొడఁ గాన నట్టి మహాత్మ! నా యింటికిం జనుదెంచి తీశ్వర! యేఁ గృతార్థతఁ బొందితిన్. |
1152 |
| వ. | దేవా ! యేను భవద్దాసుండ ! నేది పంచినం జేయుదు; నిచ్చటికి మీరలు విజయంబు చేసిన కార్యం బానతీయ వలయు నని కరంబులు మొగిచి, విన్నవించినం బుండరీకాక్షుం డతనివాక్యంబులకు సంతసిల్లి యిట్లనియె. | 1153 |
| సీ. |
‘బలిదైత్య ! విను మున్ను ప్రథమయుగంబున నా మరీచికి భార్యయైన వర్ష యను నింతివలన నందను లార్వు రుద్భవ మైరి వా రొక్కనాఁ డబ్జభవుఁడు తనపుత్త్రిపై మోహమునఁ గూడి రతికేళి యొనరింప వీరు నవ్వుటయుఁ గ్రోధ మంది యాసురయోనియందుఁ బుట్టుం డని ఘనశాప మిచ్చె న వ్వనజజుండు. |
|
| తే. |
త న్నిమిత్తమునను వారు దగిలి హేమ, కశిపునకుఁ బుట్టి రంత నాకౌకసులకు నొదవ వీరలఁ దెచ్చి య య్యోగమాయ, యడరి దేవకిగర్భమునందుఁ జొనుప. |
1154 |
| క. |
దొరఁకొని కంసుఁడు దోడ్తోఁ, బొరిగొనెఁ దత్పుత్త్రశోకమునఁ దన చిత్తం బెరియఁగ దేవకి వారల, దరిసింపఁగఁ గోరి పనుపఁ దగ నసురేంద్రా ! |
1155 |
| క. |
వచ్చితిమి వారిఁ గ్రమ్మఱఁ, దెచ్చెద మని తల్లి కోర్కిఁ దీర్పఁగ నిపు డే మిచ్చటికిని నీకడఁ బొర, పొచ్చెము లేకున్నవారె పో వీ రనఘా! |
1156 |
| క. |
వీరలఁ దోకొని యిపుడే, ధారుణికి న్నేగి జనని తాపము వాపన్ వీరలు నంతట శాపముఁ, దీఱి మదీయ ప్రసాదధీయుతు లగుచున్. |
1157 |
| క. |
పొలుపుగ సుగతిం బొందఁగఁ, గల’ రని హరి యాన తిచ్చి కరుణాన్వితుఁడై బలిచే ననుమతిఁ గొని వా, రలఁ దోకొని వచ్చె ని ద్ధరామండలికిన్. |
1158 |
| వ. | అట్లు వారలం దోడితెచ్చి తల్లి కిట్లనియె. | 1159 |
| క. |
‘కనుఁగొనుము వీరె నీ నం, దను’ లని జనయిత్రికడ ముదంబున వారి న్నునిచిన న ద్దేవకియును, ఘనపుత్త్రస్నేహమోహకలితాత్మకయై. |
1160 |
| క. |
చన్నులు దిగ్గనఁ జేపఁగఁ, గన్నుల నానందబాష్పకణములు దొరఁగఁ గ్రన్నన కౌఁగిట నిడి ననుఁ, గన్నన్నలు వచ్చి రనుచుఁ గౌతుక మొప్పన్. |
1161 |
| వ. | అట్లు కౌఁగిటం జేర్చి నిజాంకపీఠంబున నునిచి, శిరంబులు మూర్కొని, చిబుకంబులు పుణుకుచుం బ్రేమాతిశయమున మేనం బులక లొలయం జన్నిచ్చిన, వారును వైష్ణవ మాయామోహితులై స్తన్యపానంబు సేయుచు భగవంతుడయిన రథాంగపాణి యంగసంగంబున విగతకల్మషులై విధిశాపసాగరంబు హరిదయా కటాక్షంబను నావచేతం దరించి నిజస్వరూపంబులు ధరించి, కృష్ణునకుఁ దలిదండ్రులకు వందనం బాచరించి గగనపథంబున నిజస్థానంబున కరిగి రంత దేవకీదేవి తన మనంబున. | 1162 |
| క. |
చచ్చిన బాలురఁ గ్రమ్మఱఁ, దెచ్చుట గడుఁ జిత్ర మనుచు దేవకి మదిలో నచ్చెరువడి యిది యంతయు, నచ్చపు హరిమాయ గాక! యని తలఁచె నృపా! |
1163 |
| క. |
పరమాత్ముఁ డఖిలజగదీ, శ్వరుఁ డగు కృష్ణుండు సేయు సత్కృత్యంబుల్ పరికింప నెన్నఁ బెక్కులు, ధరణీవర యనిన రాజు తా ముని కనియెన్. |
1164 |