పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగము
సుభద్రా పరిణయము
సీ. మునినాథ! పార్థుండు వనజనాభునిసహోదరి సుభద్రను నే విధమునఁ బెండ్లి
యయ్యెను నా విధం బంతయు నాకును దెలియంగ నెఱిఁగింపు ధీవిశాల!
యనవుడు నా వ్యాసతనయుఁ డాతనిఁ జూచి వినవయ్య! నృప! దేవవిభునిసుతుఁడు
మును తీర్థయాత్రాసముత్సుకుండై చని రమణఁ బ్రభాసతీర్థమున నుండి
 
తే. యా తలోదరితోడినెయ్యంబు కలిమిఁ, జూడఁ గోరుచు రాముఁడు సుందరాంగిఁ
గౌరవేంద్రున కీ సమకట్టె ననుచుఁ, దనకు నెఱుఁగ రా నా పురందరసుతుండు.
1165
వ. అట్లు సుభద్రాదర్శనోత్సాహంబు దన మనంబున సందడిగొనం, ద్రిదండివేషంబు ధరియించి, ద్వారకాపురంబునకుం జనుదెంచి, య ప్పౌరజనంబులు భక్తిస్నేహంబుల ననిశంబుఁ బూజింపం దన మనోరథసిద్ధి యగు నంతకుం గనిపెట్టుకొని, వానకాలంబు సనునంతకు న ప్పట్టణంబున నుండు సమయంబున. 1166
క. రాముఁడు తత్కపటాకృతిఁ, దా మదిఁ దెలియంగలేక దగ నొకనాఁ డా
భూమీవర తాపసుఁ బో, రామిఁ గని యాత్మమందిరమునకుఁ దెచ్చెన్‌.
1167
ఆ. తెచ్చి భిక్షసేయ దేవేంద్ర తనయుండు, గుడుచుచుండి యచటఁ గోరి మెలఁగు
నసమబాణు మోహనాస్త్రంబు కైవడి, వీరమోహి నన విహారలీల.
1168
వ. అట్లు సుభద్ర విహరించుచున్న సమయంబున. 1169
చ. జలరుహపత్త్రనేత్రు ననుసంభవ చారువధూలలామ స
ల్లలితవిహారవిభ్రమవిలాసము లాత్మకు విందు సేయ న
బ్బలరిపునందనుండు గని భావజసాయకబాధ్యమాన వి
హ్వలహృదయాబ్జుఁడై నిలిపె నత్తరుణీమణియందుఁ జిత్తమున్‌.
1170
ఉ. ఆ తరుణీశిరోమణియు నర్జును నర్జునచారుకీర్తి వి
ఖ్యాతుని నింద్రనందను నకల్మషమానసుఁ గామినీ మనో
జాతునిఁ జూచి పుష్పశరసాయకజర్జరితాంతరంగయై
భీతిలి యుండె సిగ్గు మురిపెంబును మోహముఁ దేఱు చూపులన్‌.
1171
వ. అట్లా నృపసత్తమమత్తకాశిను లొండొరుల చిత్తంబులు చిత్తజాయత్తంబులై కోర్కులు దత్తరింపం దాల్ములు వీడ సిగ్గునం జిట్టు ముట్టాడుచున్నయంత నొక్కనాఁడు దేవతామహోత్సవనిమిత్తం బత్తలోదరి పురంబు వెలుపలికి నరుగుదెంచిన నర్జునుండు గృష్ణ దేవకీ వసుదేవుల యనుమతంబు వడసి తోడనం దానును చని యప్పుడు. 1172
సీ. సాంద్రశరచ్చంద్రచంద్రికాస్ఫూర్తిచే రాజిల్లు పూర్ణిమారజనివోలెఁ
బూర్ణేందుబింబావతీర్ణమై యిలమీఁద, భాసిల్లు హరిణడింభంబుఁబోలె
సులలితమేఘమండలమును నెడఁబాసి వసుధఁ గ్రుమ్మరు తటిద్వల్లివోలె
మాణిక్యరచితసన్మహితచైతన్యంబు వొందిన పుత్తడిబొమ్మవోలె
 
తే. లలితవిభ్రమరుచికళాలక్షణములఁ, బొసఁగ రూపైన శృంగారరసముఁబోలె
నర్థిఁ జరియించుచున్న పద్మాయతాక్షిఁ, బ్రకటసద్గుణభద్ర సుభద్రఁ జూచి.
1173
వ. అప్పుడు డాయం జని యరదంబుపై నిడుకొని పోవుచుండం గనుంగొని యదుబలంబులు మదంబున నంటం దాఁకిన, నప్పు డయ్యాఖండలనందనుండు ప్రచండగాండీవకోదండనిర్ముక్తకాండంబులం దూలించి, యఖండబాహుదండవిజయప్రకాండుండై ఖాండవప్రస్థపురంబున కరిగె; నట బలభద్రుం డవ్వార్త విని విలయసమయసమీరసఖునికైవడిం బటురోషభీషణాకారుండై క్రోధించినం గని కృష్ణుం డాదిగాఁ గల బంధుజనంబు లతనిచరణంబులకుం బ్రణమిల్లి మృదుమధురభాషణంబుల ననునయించి యొడంబడు నట్లుగా నాడిన నతండును సంతుష్టుం డయి మనంబునఁ గలంకదేఱి యప్పుడు. 1174
క. కరులం దేరుల నుత్తమ, హరులన్‌ మణిహేమభూషణాంబరభృత్యో
త్కర దాసికాజనంబుల, నరణంబుగ నిచ్చి పంపె ననుజకుఁ బ్రీతిన్‌.
1175
వ. ఇట్లు కృష్ణున కభిమతంబుగా నర్జున సుభద్రల కరణం బిచ్చి పంపెనని చెప్పి శుకయోగీంద్రుండు మఱియు నిట్లనియె. 1176
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - uttara bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )