పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగము
శ్రీకృష్ణుండు ఋషిసమేతుండయి మిథిలానగరమునకుఁ బోవుట
సీ. నరనాథ! విను భువనప్రసిద్ధంబుగ దీపించునట్టి విదేహదేశ
మందు భూకాంతకు నాననదర్పణం బనఁ దనర్చిన మిథి లనుపురమునఁ
గలఁడు శ్రీహరిపాదకంజాతభక్తుండు గళితరాగాదివికారుఁ డమల
చరితుఁ డక్రోధుండు శాంతుండు నిగమార్థకోవిదుం డగు శ్రుతదేవుఁ డనెడి
 
తే. భూసురోత్తముఁ డొకఁ డనిచ్ఛాసమాగ, తంబు తుషమైన హేమశైలంబు గాఁగఁ
దలఁచి పరితోష మందుచుఁ దగ గృహస్థ, ధర్మమున నుండె సముచితకర్ముఁ డగుచు.
1177
ఉ. ఆ పురి నేలువాఁడు బహుళాశ్వుఁడు నా నుతి కెక్కినట్టి ధా
త్రీపతి యా ధరామరునిరీతిని నిష్కలుషాంతరంగుఁడై
యే పనులందు ధర్మగతి నేమఱఁ కర్థిఁ జరించుచుండె ల
క్ష్మీపతి వారిపైఁ గరుణఁ జేసి ప్రసన్నముఖాంబుజాతుఁడై.
1178
వ. అట్లు కృష్ణుండు వారలం జూచువేడ్క నిజస్యందనారూఢుండై, నారదవామదేవాత్రికృష్ణరామాసి తారుణదివిజగురుకణ్వ మైత్రేయచ్యవనులును, నేనును మొదలైన మును లనుగమింపం జనుచుఁ దత్తద్దేశ నివాసులగు నానర్తక ధన్వ కురు జాంగల వంగ మత్స్య పాంచాల కుంతి మధు కేకయ కోసలాది భూవరులు, వివిధవస్తుప్రచయంబులు గానిక లిచ్చి సేవింప, గ్రహమధ్యగతుండై దీపించు సూర్యునింబోలి, య ప్పుండరీకాక్షుండు మందస్మితసుందరవదనారవిందుం డగుచు వారలం గరుణార్ద్రదృష్టిం జూచి, యోగక్షేమంబు లరసి, సాదరభాషణంబుల నాదరించుచుఁ, గతిపయప్రయాణంబులం జని చని విదేహనగరంబు డాయం జనుటయు, నా బహుళాశ్వుండు న మ్మాధవురాక విని మనంబున హర్షించుచు వివిధపదార్థంబులు గానికలుగాఁ గొని, తానును శ్రుతదేవుండును నెదురుగాఁ జనుదెంచి యప్పుడు. 1179
ఉ. ఆ మునికోటికిన్‌ వినయ మారఁగ వందన మాచరించి, యా
తామరసాభలోచనుఁ డుదారచరిత్రుఁడు పాపగోత్ర సు
త్రాముఁడు భక్తలోకశుభదాయకుఁడైన రమేశు సద్గుణ
స్తోముని పాదపద్మములు సోఁకఁగ మ్రొక్కి వినమ్రులై తగన్‌.
1180
చ. కరములు మోడ్చి యో పరమకారుణికోత్తమ! నీవు నీ మునీ
శ్వరులును మద్గృహంబునకు వచ్చి మముం గృప సేసి యిచ్చటం
గర మనురక్తిఁ బూజనలు గైకొనుఁ డంచు నుతించి వేఁడ నా
హరి మనమందు వారివినయంబుల కెంతొ ప్రమోద మందుచున్‌.
1181
చ. తిరముగ వారియిష్టములు దీర్పఁ దలంచి మురాసురారి యొం
డొరుల కెఱుంగకుండ మునియూథముఁ దానును నేఁగె వారి మం
దిరముల కేకకాలమున ధీరత నా ధరణీవరుండు వా
రిరుహదళాయతాక్షు మునిబృందములం గనకాసనంబులన్‌.
1182
సీ. కూర్చుండ నియమించి కొమరారుకాంచన కలధౌతకలశోదకములచేతఁ
బాదముల్‌ గడిగి తత్పావనజలములు దానును సతియు బాంధవజనంబుఁ
గర మర్థి నిజమస్తకంబుల ధరియించి వివిధార్చనములు సద్విధి నొనర్చి
మణిభూషణాంబరమాల్యానులేపనరాజితధూపనీరాజనములు
 
తే. భక్తిఁ గావించి పరిమృష్ట బహువిధాన్నపాయసాపూపపరిపక్వఫలములోలి
నారగింపఁగఁ జేసి కర్పూరమిళితలలితతాంబూలములు నెయ్య మలర నొసఁగె.
1183
వ. ఇట్లు సమర్పించి యనంతరంబ య మ్మిథిలేశ్వరుండైన జనకుండు పరమానందంబును బొంది. 1184
చ. హరిపదపద్మయుగ్మము నిజాంకతలంబునఁ జేర్చి యొత్తుచుం
బురుషవరేణ్య! యీ నిఖిలభూతగణావలి యాత్మలందు సు
స్థిరమతిఁ గర్మసాక్షివి సుధీవర! నీ పదభక్తకోటితో
నరయ నుమాధినాథచతురాస్యులుఁ బోల రటందు వెప్పుడున్‌.
1185
వ. అట్టి లోకవిదితం బయిన భవద్వాక్యంబు నిక్కంబుగా భవదీయపాదారవిందంబులందు నొకానొకవేళ లేశమాత్రధ్యానంబు గల నా గృహంబున కకించనుం డని చిత్తంబునం దలంపక భక్తవత్సలుండ వగుటంజేసి విజయము చేసితివి; భవత్పాదపంకేరుహ ధ్యానసేవారతిం దగిలిన మహాత్ములు త్వద్ధ్యానంబు వదలం జాలుదురే? నిరంతరంబును శాంతచిత్తులై నిష్కించనులై యోగీంద్రులై నీ వలనం గోరిక గలవారలకు నిన్నైన నిత్తువు గదా! యని వెండియు నిట్లనియె. 1186
తే. కృష్ణ! పరమాత్మ! యదుకులక్షీరవార్ధి, పూర్ణచంద్రమ! దేవకీపుత్త్ర! సుజన
వినుత! నారాయణాచ్యుత! వేదవేద్య!, భక్తజనపోషపరితోష! పరమపురుష!
1187
ఉ. శ్రీ పురుషోత్తమాఖ్య! యదుసింహకిశోరక! భక్తలోక ర
క్షా పరతంత్ర! నీవు మునిసంఘముఁ గొన్నిదినంబు లుండవే
నీ పదపద్మ రేణువులు నెమ్మి మదీయగృహంబు సోఁకినం
దాపసవంద్య! యే నిపుడ ధన్యుఁడ నయ్యెదఁ గాదె మాధవా!
1188
వ. అని యభ్యర్థించినం బ్రసన్నుండై య ప్పుండరీకాక్షుండు నిమికులప్రదీపకుండైన జనకచక్రవర్తిం గరుణించి, య మ్మిథిలా నగరంబునం బౌరజనంబులకు నున్నత శోభనంబులు గావించుచుం గొన్నిదినంబు లుండె నంత. 1189
మ. శ్రుతదేవుండును మోదియై మునిజనస్తోమంబుతో నిందిరా
పతిఁ దోకొంచు నిజాలయంబునకు నొప్ప న్నేగి యచ్చోట స
మ్మతి దర్భాస్తరణంబుల న్నునిచి సమ్యగ్‌జ్ఞానపారీణుఁడై
సతియుం దానుఁ బదాజ్జముల్‌ గడిగి చంచద్భక్తిఁ దత్తోయముల్‌.
1190
చ. శిరములఁ దాల్చి నవ్యతులసీదళదామకుశప్రసూన వి
స్ఫుర దరవిందమాలికలఁ బూజ లొనర్చి గృహాంధకూప సం
చరణుఁడ నైన నాకడకుఁ జక్రి దనంతనె వచ్చునట్టి సు
స్థిరమతి నే తపంబు మును సేసితినో? యని సంతసించుచున్‌.
1191
తే. మఱియుఁ దత్పాదతీర్థంబు మందిరమునఁ, గలయఁ జిలికించి సంప్రీతి గడలు కొనఁగఁ
బత్త్రఫలపుష్పతోయముల్‌ భక్తి నొసఁగి, హరిమురాంతకమూర్తి నిజాత్మ నిలిపి.
1192
తే. మానితంబుగ విశ్వనిదానమూర్తి, యైన కృష్ణుండు దనయింట నారగించెఁ
దన మనోరథసిద్ధియుఁ దనకు నబ్బె, ననుచుఁ బైపుట్ట మల్లార్చి యాడుచుండె.
1193
చ. తరుణియుఁ దానుఁ బుత్రులుఁ బదంపడి కృష్ణు భజించుచుండ త
చ్చరణము లంకపీఠమునఁ జాఁచిన మెల్లన యొత్తుచున్‌ రమా
వరుఁ గని వల్కె భక్తజనవత్సల! మామకభాగ్య మెట్టిదో
హరచతురాస్యులు న్నెఱుఁగ నట్టి నినుం గనుగొంటి నెమ్మితోన్‌.
1194
క. మునియోగిమానసస్ఫుట, వనజంబుల నెల్లప్రొద్దు వర్తించు భవ
ద్ఘనదివ్యమూర్తి నా లో, చనగోచర మయ్యెఁ గాదె! సర్వాత్మ! హరీ!
1195
వ. దేవా! నీ సచ్చరితంబులు గర్ణరసాయనంబులుగా నాకర్ణించుచు, నీకుం బూజ లొనర్చుచు, నీ చరణారవిందంబులకు వందనంబులు సేయుచు, నీ దివ్యనామసంకీర్తనంబులు సేయుచుం దమశరీరంబులు భవదధీనంబులుగా మెలంగు నిర్మలబోధాత్ము లగువారి చిత్తంబు లను దర్పణంబులం గానంబడుచుందువు; కర్మవిక్షిప్తచిత్తులైన వారిహృదయంబుల నుండియు, దూరగుండ వగుదు; వని మఱియు నిట్లనియె. 1196
సీ. నీకు మ్రొక్కెదఁ గృష్ణ! నిగమాంతసంవేద్య! లోకరక్షక! భక్తలోకవరద!
నీపాదసేవనానిరతుని నన్ను నే పనిఁ బంపె దాన తిమ్మనినఁ గృష్ణుఁ
డెలనవ్వు మోమునఁ జెలువొంద నా విప్రుకర మాత్మకరమునఁ గదియఁ జేర్చి
పాటించి యతనితోఁ బలికెఁ దపశ్శక్తి వఱలిన య మ్మునివర్యు లెపుడుఁ
 
తే. దమ పదాంబుజరేణు వితానములను, దవిలి లోకంబులను బవిత్రంబు సేయు
వారు ననుఁ గూడి యెప్పుడు వలయునెడల, కరుగుదెంతురు నీ భాగ్య గరిమ నిటకు.
1197
వ. చనుదెంచిరి; పుణ్యస్థలంబులును విప్రులును దేవతలును సంస్పర్శనదర్శనార్చనంబులం బ్రాణులను సమస్త కిల్బిషంబులం బాయం జేయుదు; రదియునుం గాక బ్రాహ్మణుండు జనన మాత్రంబున జీవకోటియందు ఘనుండై యుండు, జపతపోధ్యానాధ్యయనాధ్యాత్మములం జతురుండై మత్కలాశ్రయుం డయ్యెనేని నతం డుత్తముండై వెలుంగు; నతనిం జెప్ప నేల? యని వెండియు నిట్లనియె. 1198
క. నా మది విప్రులపైఁ గల, ప్రేమము నా తనువునందుఁ బెట్టని కతనన్‌
భూమీసురు లర్హులు; నీ, వీ మునులం బూజ సేయు మిద్ధచరిత్రా!
1199
క. ఇదియే నా కిష్టము ననుఁ, బదివేలవిధంబు లొలయ భజియించుటగా
మది కిం పగు నటు గావున, వదలని భక్తిన్‌ భజింపు వసుధామరులన్‌!
1200
క. అని సర్వలోకవిభుఁ డగు, వనజోదరుఁ డానతిచ్చువాక్యంబుల జా
డన భూమీసురుఁ డమ్ముని, జనులకు సద్భక్తిఁ బూజ సలిపెన్‌ వరుసన్‌.
1201
చ. ఎనయఁగఁ గృష్ణుఁ డంత మిథిలేశ్వరభూసురులం గృపావలో
కన మొలయ న్ననూనసుభగస్థితిఁ బొందఁగఁ జేసి వారి వీ
డ్కొని రథ మెక్కి దివ్యమునికోటియుఁ దానును వచ్చెఁ గ్రమ్మఱన్‌
జనవర! మోక్షదం బగు కుశస్థలికిం బ్రమదాంతరంగుఁడై
1202
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - uttara bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )