పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగము
శ్రుతిగీతలు
వ. అని చెప్పిన బాదరాయణికి నభిమన్యు నందనుం డిట్లనియె; మునీంద్రా! ఘటపటాదివస్తు జాతంబు భంగి నిర్దేశింప నర్హంబు గాక, సత్త్వాదిగుణశూన్యంబైన బ్రహ్మంబునందు సత్త్వాదిగుణగోచరంబులైన వేదంబు లేక్రమంబునం బ్రవర్తించు, నట్టి చందంబు నా కెఱిఁగింపు మనిన భూవరునకు మునివరుం డిట్లనియె; ‘సకల చేతనాచేతనాంతర్యామియైన సర్వేశ్వరుండు సర్వశబ్దవాచ్యుండు గావున సకలజంతు నివహంబులందు బుద్ధీంద్రియ మనః ప్రాణశరీరంబులను సృజియించి; చేతనవర్గంబునకు జ్ఞానప్రదుండగుం గావున సకలనిగమసమూహంబులును దత్స్వరూపగుణ వైభవప్రతిపాదకంబులు గావున ముఖ్యంబై ప్రవర్తించు; శ్రుతిస్తోత్రం బుపనిషత్తుల్యంబు; ననేకపూర్వఋషిపరంపరాయాతంబును నైన దీనిని శ్రద్ధాయుక్తుండై యెవ్వం డనుసంధించు, నతనికి మోక్షంబు సులభంబు; దీనికి నారాయణాఖ్యాతంబగు నొక్క యుపాఖ్యానంబు గలదు; వినిపింతు, వినుము; భగవత్ప్రియుండైన నారదుం డొక్కనాఁడు నారాయణాశ్రమంబునకుం జని ఋషిగణసమేతుండైన నారాయణఋషిం గనుంగొని నీవు న న్నడిగినట్ల యమ్మహాత్ముని నడిగిన నతండు ము న్నీ యర్థంబు శ్వేతద్వీపవాసులైన సనకసనందనాదిదివ్యయోగీంద్రులు ప్రశ్న సలిపిన, వారలకు సనందనుండు చెప్పినప్రకారంబు నీ కెఱింగించెద’ నని చెప్పం దొడంగె; శయానుండైన రాజశ్రేష్ఠునిఁ దత్పరాక్రమదక్షతాదిచిహ్నంబులను నుతియించు వందిజనంబులచందంబున జగదవసానసమయంబున ననేకశక్తియుతుండై యోగనిద్రావశుండైన సర్వేశ్వరుని వేదంబులు స్తోత్రంబు సేయు విధంబు నారాయణుండు నారదునకుం జెప్పిన తెఱంగు విను మని యిట్లనియె. 1203
సీ. జయ జయ హరి! దేవ! సకలజంతువులకు జ్ఞానప్రదుండవు గాన వారి
వలన దోషంబులు గలిగిన సుగుణసంతానంబుగాఁ గొని జ్ఞానశక్తి
ముఖ్యషడ్గుణపరిపూర్ణతఁ జేసి మా యాత్మవిశిష్టుండ వగుచుఁ గార్య
కారణాత్మకుఁడవై కడఁగి చరించుచు నున్న నీయందుఁ బయోరుహాక్ష!
 
తే. తివిరి యామ్నాయములు ప్రవర్తించుఁ గాన ప్రకటత్రిగుణాత్మకంబైన ప్రకృతితోడి
యోగ మింతయు మాన్పవే! యోగిమాన, సాంబుజాత మధువ్రత! యని నుతించి.
1204
వ. అదియునుం గాక 1205
సీ. పరమవిజ్ఞానసంపన్నులైనట్టి యోగీంద్రులు మహితనిస్తంద్రలీలఁ
బరిదృశ్యమానమై భాసిల్లు ని మ్మహీపర్వతముఖరప్రపంచ మెల్ల
బరఁగ బ్రహ్మస్వరూపము గాఁగఁ దెలియుదు రెలమి నీవును జగద్విలయవేళ
నవశిష్టుఁడవు గాన ననఘ! నీయందు నీ విపులవిశ్వోదయవిలయము లగు
 
తే. ఘటశరావాదు లగు మృద్వికారములు మృ, దాత్మకంబైన యట్లు పద్మాయతాక్ష!
తవిలి కారణరూపంబుఁ దాల్చి లీలఁ, గడఁగు నీయందు బుద్ధివాక్కర్మములను.
1206
క. అలవడఁ జేయుచు నుందురు, బలకొని యిలఁ బెట్టఁబడిన పదవిన్యాసం
బులు పతనకారణముగా, నలవున సేవించుచును గృతార్థులు నగుచున్‌.
1207
క. లీలం బ్రాకృతపూరుష, కాలాదికనిఖిలమగు జగంబుల కెల్లన్‌
మాలిన్యనివారక మగు, నీ లలితకథాసుధాబ్ధినిం గ్రుంకి తగన్‌.
1208
చ. భరిత నిదాఘ తప్తుఁడగు పాంథుఁడు శీతలవారిఁ గ్రుంకి దు
ష్కరమగు తాపముం దొఱఁగు కైవడి సంసరణోగ్రతాపమున్‌
వెరవునఁ బాయుచుండుదురు నిన్ను భజించు మహాత్మకుల్‌ జరా
మరణమనోగుణంబులఁ గ్రమంబునఁ బాయుట సెప్ప నేటికిన్‌?
1209
వ. అదియునుం గాక 1210
సీ. అనయంబు దేహి నిత్యానిత్యసద్విలక్షణమునఁ బంచకోశవ్యవస్థ
నభివృద్ధిఁ బొరయుచు నందులోపల నున్న ప్రాణాన్నబుద్ధివిజ్ఞానమయము
లను చతుష్కోశంబు లవ్వల వెలుఁగొందు నానందమయుఁ డీవు గాన దేవ!
సురుచిర స్వప్రకాశుండవు నీ పరిగ్రహము గల్గుటం జేసి కాదె ప్రకృతి
 
తే. మహదహంకారపంచతన్మాత్రగగన, పవన తేజోఽంబుభూభూతపంచకాది
కలితతత్త్వముల్‌ బ్రహ్మాండకార్యకరణ, మందు నెపుడు సమర్థంబు లగుటఁ జూడ.
1211
క. కోరి శరీరులు భవదను, సారంబున నిహపరైక సౌఖ్యంబులఁ బెం
పారఁగ నందుచు నుందురు, ధీరజనోత్తము లనంగ దివిజారిహరా!
1212
ఆ. నిన్ను ననుసరింప నేరని కుజనులు, పవనపూర్ణచర్మభస్త్రిసమితి
యోజఁ జేయుచుందు రుచ్ఛ్వసనంబులు, బలసి యాత్మదేహభజను లగుచు.
1213
సీ. దేవ! కొందఱు సూక్ష్మదృక్కులై నట్టి మహాత్మకు లుదరస్థుఁడైన వహ్ని
గా మదిఁ దలఁతురు కైకొని మఱికొంద, ఱారుణు లనుపేర నమరు ఋషులు
లీల సుషుమ్ననాడీ మార్గగతుఁడవై, హృత్ప్రదేశమునఁ జరించుచున్న
రుచి దహరాకాశరూపిగా భావింతు, రట్టి హృత్పద్మంబునందు వెడలి
 
తే. వితతమూర్ధన్య నాడికాగతుల నోలి, బ్రహ్మరంధ్రంబుఁ బ్రాపించి పరమపురుష!
సుమహితానందమయపరంజ్యోతిరూపి, వైన నినుఁ బొంది మఱి పుట్ట రవనియందు.
1214
వ. మఱియు వివిధకాష్ఠాంతర్గతుం డయిన వాయుసఖుండు తద్గత దోషంబునం బొరయక నిత్య శుద్ధుఁడై తరతమభావంబున వర్తించుచందంబున స్వసంకల్పకృతంబు లయిన విచిత్రశరీరంబులయందు నంతర్యామివై ప్రవేశించి, తత్తద్విచిత్రయోనిగతంబైన హేయంబులం బొరయక సకలాత్మసమంబై బ్రహ్మంబయిన నిన్ను నైహికాముష్మికఫలసంగమంబు లేక విగతరజోగుణంబులం దగిలి కొందఱు భజియించుచుండుదు; రదియునుం గాక దేవా! భవదీయసంకల్పాధీనంబు లయిన శరీరంబులం బ్రవేశించియున్న జీవసమూహంబు నీకు శేషభూతం బని తెలిసి కొందఱు భవనివారకంబయిన శ్రీమత్త్వచ్చరణారవిందంబులు సేవించి కృతార్థు లగుదురు; మఱియును. 1215
సీ. అనఘ! దుర్గమమైన యాత్మతత్త్వంబు ప్రవర్తించుకొఱకు దివ్యంబులైన
యంచిత రామకృష్ణాద్యవతారముల్‌ భజియించియున్న నీ భవ్యచరిత
మను సుధాంభోనిధి నవగాహనము సేసి విశ్రాంతచిత్తులై వెలయుచుండి
మోక్షంబు బుద్ధి నపేక్షింప నొల్లరు మఱియుఁ గొందఱు భవచ్చరణపంక
 
ఆ. జములఁ దగిలి పుణ్యతము లైన హంసల, వడువు నొంది భాగవతజనముల
నొనరువారు ప్రకటయోగిజనప్రాప్య, మైన ముక్తిఁ గోర రాత్మలందు.
1216
ఉ. కొందఱు నీ శరీరము లకుంఠితభక్తి భవద్వశంబులై
చెందఁగ నీ పదాబ్జములు సేరి భజించుచుఁ దత్సుఖాత్ములై
యుందురు కొంద ఱీ తనువు లోలి ధరించి భవత్పదాబ్జముల్‌
పొందుగఁ గొల్వలేక నిలఁ బుట్టుచుఁ జచ్చుచు నుందు రవ్యయా!
1217
చ. యమ నియమాది యోగమహితాత్మకులైన మునీంద్రులున్‌ విరో
ధమునఁ దలంచు చైద్యవసుధావర ముఖ్యనృపుల్‌ ఫణీంద్ర భో
గము లన నొప్పు బాహువులు గల్గిన నిన్ను భజించు గోపికల్‌
క్రమమున నేమునున్‌ సరియ కామె భవత్కృప కంబుజోదరా!
1218
మ. అరవిందాక్ష! భవత్స్వరూప మిలఁ బ్రత్యక్షంబునం గాన నె
వ్వరికిం బోలదు, శాస్త్రగోచరుఁడవై వర్తింతు, వీ సృష్టి ముం
దర సద్రూపుఁడవైన నీ వలననే ధాత్ర్యాద్యమర్త్యుల్‌ జనిం
చిరి, ని న్నంతకు మున్నెఱుంగఁగలమే చింతింప నే మచ్యుతా!
1219
వ. అట్టి నిన్నుం బరమాణుకారణవాదులైన కణాదగౌతమాదులును, బ్రకృతికారణవాదు లయిన సాంఖ్యులును, దేహాత్మవాదు లయిన బౌద్ధులును, వివిధంబులైన కుతర్కంబులచేతం బరస్పరావ్యాహతంబులైన మతంబులు దమ తమ కుతర్కవాదంబుల సమర్థించుచు నిన్నుం దెలియలేరు; మహాభాగ్యవంతు లయిన యోగీంద్రులకు నీవు ప్రత్యక్షంబైన నివి యన్నియు నసత్యంబు లని కానవచ్చు. వెండియుఁ గొందఱు సచరాచర వస్తుజాతంబులకు నంతర్యామివై సర్వంబు నీవ యగుటం దెలియలేక నిత్యం బనియు, ననిత్యం బనియు విపరీతబుద్ధిం దెలియుదురు; గాని భవదీయ దివ్యతత్త్వంబు నిక్కంబుగఁ దెలియనేరరు; కొందఱు జగచ్ఛరీరుండవు గాన జగద్రూపకుండవైన నిన్నుం గటక మకుట కర్ణికాది వివిధ భూషణభేదంబులం గనకంబు నిజస్వరూపంబు విడువక వర్తించుచందంబున జగద్వికారానుగతుండ వయ్యును నిఖిల హేయప్రత్యనీక కల్యాణగుణాత్మకుండవై యుందు వని యాత్మవిదులయిన వారు దెలియుదు; రదియునుం గాక. 1220
మ. వనజాతాక్ష ! భవత్పదాబ్జయుగసేవాసక్తులై నట్టి య
జ్జనముల్‌ మృత్యుశిరంబుఁ దన్ని ఘనసంసారాంబుధిన్‌ దాఁటి పా
వనులై లోకములుం బవిత్రములుగా వర్తించుచున్‌ నిత్య శో
భనమై యొప్పెడి ముక్తిఁ బొందుదురు శుంభద్వైభవోపేతులై.
1221
మ. మిము సద్భక్తి భజింప నొల్ల కిల దుర్మేధం బ్రవర్తించు నీ
చ మతివ్రాతము నేర్పునం బసులఁ బాశశ్రేణి బంధించు చం
దమునం బెక్కగు నామరూపములచేతన్‌ వారి బంధించి దు
ర్గమ సంసారపయోధిఁ ద్రోతువు దళత్కంజాతపత్త్రేక్షణా!
1222
వ. దేవా! కర్మమూలంబులయిన పాణిపాదంబులు లేనివాఁడ వయ్యును స్వతంత్రుఁడవు గావున బ్రహ్మాదులు భవత్పరతంత్రులై యుండుదురు; స్థిరచరరూపంబులు గల చేతనకోటికి నీవు సర్వవిధ నియంతవు; గావున నీ కృపావలోకనంబుగల వారికి మోక్షంబు కరస్థితం బై యుండు; భవత్కృపావలోకనంబు లేని దుష్టాత్ములు దుర్గతిం గూలుదు; రట్టి జీవులు దేవ తిర్య జ్మనుష్య స్థావరాది శరీరంబులు సొచ్చి యణురూపులై యుందు; రందును నీ వంతరాత్మ వగుచు నుందువు; మఱియును. 1223
క. మదిఁ దలపోయఁగ జల బు, ద్బుదములు ధరఁ బుట్టి పొలియు పోలిక గల యీ
త్రిదశాదిదేహములలో, వదలక వర్తించు నాత్మవర్గము నోలిన్‌.
1224
ఆ. ప్రళయవేళ నీవు భరియింతు వంతకుఁ, గారణంబ వగుటఁ గమలనాభ!
భక్తపారిజాత! భవభూరితిమిర ది, నేశ! దుష్టదైత్యనాశ! కృష్ణ!
1225
చ. అనఘ! జితేంద్రియస్ఫురణు లయ్యును జంచలమైన మానసం
బను తురగంబు బోధమహితాత్మ వివేకపు నూలిత్రాట న
ల్లనఁ గుదియంగఁ బట్టను దలంచుచు ముక్తి కుపాయలాభ మే
యనువును లేమికిన్‌ వగల నందెడు నాత్మలువో తలంపఁగన్‌.
1226
చ. గురుపదపంకజాతములు గొల్వని వారలువో మహాబ్ధి ని
స్తరణకుఁ గర్ణధారరహితంబగు నావను సంగ్రహించు బే
హరి గతి భూరి దుస్తర భవాంబుధిలోన మునుంగుచుందు రం
బురుహదళాక్ష! నీవు పరిపూర్ణుఁడవై తనరారఁగా నొగిన్‌.
1227
తే. పుత్ర దార గృహ క్షేత్ర భూరివిషయ, ఘన సుఖాసక్తుఁ డగుచు నే మనుజుఁ డేని
నర్థిఁ జరియించు వాఁడు భవాబ్ధిలోనఁ, జెంది యె న్నాళ్ళకును దరిఁ జేర లేఁడు.
1228
సీ. జగతిపై బహుతీర్థసదనంబు లనఁ గల్గి పుణ్యానువర్తనస్ఫురితు లగుచుఁ
బాటించి నీ యందు బద్ధమత్సరములు లేక భక్తామరానోకహంబ
వగు భవత్పాదాబ్జయుగళంబు సేవించి భవపాశముల నెల్లఁ బాఱఁదోలి
సమమతులై యదృచ్ఛాలాభ తుష మేరు సమముగాఁ గై కొని సాధు లగుచుఁ
 
తే. బాదతీర్థంబు గల మహాభాగవత జ, నోత్తమోత్తము లైనట్టి యోగివరుల
వార కెప్పుడు సేవించువాఁడు వొందుఁ, బ్రవిమలానందమయ మోక్షపదము మఱియు.
1229
వ. సత్తైన ప్రకృతివలన నుత్పన్నంబైన యీ జగత్తు సత్తు గావలయు; నది యెట్లనినం గనకోత్పన్నంబులైన భూషణంబులు కనకమయంబు లయి కానంబడు చందంబున నని సాంఖ్యుండు వలికిన విని యద్వైతవాది యిట్లను; నెయ్యది యుత్పన్నంబుగా దది సత్తును గా; దను వ్యతిరేకవ్యాప్తి నియమంబు నిత్యసత్యం బైన బ్రహ్మంబునందుఁ దర్కహతం బగుం గావునం బ్రపంచంబు మిథ్యయని నిరూపించిన నా ప్రపంచంబు బ్రహ్మవిశేషణంబై కార్య కారణావస్థలు గలిగియున్న యంతమాత్రంబున మిథ్య గా నేర; దా ప్రపంచంబునకుఁ గార్యకారణావస్థలు నిత్యంబులు గావున నవస్థాద్వయయుక్తంబయిన ప్రపంచంబు నిత్యం బనిన వెండియు నద్వైతి యిట్లను; బహుగ్రంథప్రతిపాదితం బయిన జగన్మిథ్యాత్వంబు లేమి యెట్లనిన నదియునుం గర్మవశులైన జడుల నవిద్యా ప్రతిపాదకంబైన కుతర్కసమేతంబైన భారతి యంధపరంపరా వ్యవహారంబునం జేసి భ్రమియింపఁ జేయుఁ; గారణావస్థలయందును బ్రహ్మ విశేషణంబైన సూక్ష్మరూపంబునం బ్రపంచంబు సత్తైయుండు; సత్యంబు బాధాయోగ్యంబు గావున నీకు శేషంబయి యుండుఁ గావున నీవు దేహగతుండైన దేహియందు నంతర్యామి వయ్యుం గర్మఫలంబులం బొరయక గర్మఫలభోక్తయైన జీవునకు సాక్షిభూతంబవై యుందు; నట్టి నిన్ను నజ్ఞులైన మానవులు నిజకంఠలగ్నంబయిన కంఠికామణి నిత్యసన్నిహితంబై వెలుంగుచుండినను గానక వర్తించుతెఱంగునఁ దమహృదయపద్మమధ్యంబున ననంతతేజో విరాజమానుండవై ప్రకాశించు నిన్నుం దెలియలేరు. సకల బ్రహ్మాండ నాయకుండవైన నీయందు శ్రుతులు ముఖ్యవృత్తిం బ్రవర్తించు నని శ్రుత్యధిదేవతలు నారాయణు నభినందించినతెఱంగున సనందనుండు మహర్షుల కెఱింగించిన ప్రకారం బని నారాయణర్షి నారదునకుం జెప్పిన న మ్మహాత్ముండు మజ్జనకుండైన వేదవ్యాస మునీంద్రునకు నుపన్యసించె; న య్యర్థంబు నతండు నాకుం జెప్పిన విధంబున నీకుం జెప్పితి. నీ యుపాఖ్యానంబు సకలవేదశాస్త్రపురాణేతిహాససారం; బుపనిషత్తుల్యంబు; దీనిం బఠించువారునువిను వారును, విగతకల్మషులై యిహపరసౌఖ్యంబుల నొంది వర్తింతు; రని చెప్పిన శుకయోగీంద్రునకు రాజేంద్రుం డిట్లనియె. 1230
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - uttara bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )