| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - ఉత్తరభాగము |
| మ. |
మునినాథోత్తమ! దేవమానవులలో ముక్కంటి సేవించు వా రనయంబున్ బహువస్తుసంపదల సౌఖ్యానందులై యుండ న వ్వనజాతాక్షు రమామనోవిభుని శశ్వద్భక్తి సేవించు స న్మునివర్యుల్ గడుఁ బేద లౌటకుఁ గతంబున్ నా కెఱింగింపవే. |
1231 |
| సీ. |
నావుడు శుకయోగి నరనాథుఁ గనుఁగొని విను మెఱింగింతుఁ దద్విధము దెలియ ఘనశ క్తిసహితుండు కాలకంధరుఁడు దా వినుతగుణత్రయాన్వితుఁడు గాన రాగాదియుక్తమై రాజిల్లుసంపద లాతనిఁ గొలుచువా రందుచుందు; రచ్యుతుఁ బరము ననంతు గుణాతీతుఁ బురుషోత్తముని నాదిపురుషు ననఘు |
|
| తే. |
నర్థి భజియించువారు రాగాది రహితు, లగుచు దీపింతు రెంతయు ననఘచరిత! ధర్మనందనుఁ డశ్వమేధంబు సేసి, పిదప సాత్త్వికకథనముల్ ప్రీతితోడ. |
1232 |
| ఉ. |
నారదసంయమీంద్రు వలనన్ వినుచుండి యనంతరంబ పం కేరుహనాభుఁ జూచి యడిగెం దగ నిప్పుడు నీవు నన్ను నిం డారిన భక్తిమై నడిగినట్ల యతండును మందహాస వి స్ఫార కపోలుఁడై పలికెఁ బాండుతనూభవుతోడఁ జెచ్చెరన్. |
1233 |
| సీ. |
వసుమతీనాథ! యెవ్వనిమీఁద నా కనుగ్రహబుద్ధి వొడము నా ఘనుని విత్త మంతయుఁ గ్రమమున నపహరించిన వాఁడు ధనహీనుఁ డగుచు సంతాప మంద విడుతురు బంధు ల వ్విధమున నొందిలి యై చేయునది లేక యఖిలకార్య భారంబు లుడిగి మద్భక్తులతో మైత్రి నెఱపుచు విజ్ఞాననిరతుఁ డగుచుఁ |
|
| తే. |
బిదప వాఁ డవ్యయానందపదము నాత్మ, నెఱిఁగి సారూప్యసంప్రాప్తి నెలమి నొందుఁ గాన మత్సేవ మిగుల దుష్కర మటంచు, వదలి భజియింతు రితరదేవతల నెపుడు. |
1234 |
| క. |
సేవింప వారు దమకుం, గావించిన శోభనములు గని నిజములుగా భావించి వారి మఱతురు, భావములఁ గృతఘ్నవృత్తిపని తమ పనిగన్. |
1235 |
| క. |
మెలఁగుచు నుందురు; దీనికిఁ, గలదొక యితిహాస మిపుడు గై కొని నీకుం దెలియఁగఁ జెప్పెద దానన, యలవడు నీ వడుగు ప్రశ్న కగు నుత్తరమున్. |
1236 |