| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - ఉత్తరభాగము |
| క. |
శకుని యను దైత్యుతనయుఁడు, వృకుఁ డనువాఁ డొకఁడు దుర్వివేకుఁడు సుజన ప్రకరముల నలఁపఁ దెరువున, నొకనాఁ డొదిగుండి దివ్యయోగిం గడఁకన్. |
1237 |
| వ. | కనుంగొని. | 1238 |
| క. |
కరములు ముకుళించి ‘మునీ, శ్వర ! నారద ! లలితధీవిశారద ! నన్నున్ గరుణించి యాన తీ శుభ, కరు లగు హరిహరహిరణ్య గర్భులలోనన్ |
1239 |
| ఆ. |
కడఁగి కొలువ శీఘ్రకాలంబులోనన, యిష్టమైన వరము లిచ్చునట్టి దైవ మెవ్వఁ డనిన దానవుఁ గనుఁగొని, మునివరుండు పలికె ముదముతోడ. |
1240 |
| వ. | వినుము; దుర్గుణసుగుణంబులలో నొక్కటి యెచ్చటం గలుగు నచ్చట నా క్షణంబ కోప ప్రసాదఫలంబులు సూపువాఁ డమ్మువ్వురయందు ఫాలలోచనుఁ డివ్విధంబుఁ దెలిసినవారై బాణాసుర దశకంధరులు సమగ్ర భక్తియుక్తులై సేవించి యసమాన సామ్రాజ్య వైభవంబుల నొంది ప్రసిద్ధులై; రట్లుగాన నీవు న మ్మహాత్ముని సేవింపు; మతనివలన నభిమతఫలంబులు వేగంబ ప్రాప్తం బయ్యెడి’నని చెప్పిన నతం డా క్షణంబ. | 1241 |
| సీ. |
దీపించు కేదారతీర్థంబునకు నేగి యతిసాహసాత్మకుం డగుచు నియతి లోకముల్ వెఱఁగంద నా కాలకంధరు వరదుని నంబికావరునిఁ గూర్చి తన మేనికండ లుద్దండుఁడై ఖండించి యగ్ని కాహుతులుగా నలర వేల్చి దర్పకారాతి ప్రత్యక్షంబు గాకున్న జడియక సప్తవాసరమునందుఁ |
|
| తే. |
బూని తత్తీర్థమునఁ గృతస్నానుఁ డగుచు, వెడలి మృత్యువుకోఱనా వెలయునట్టి గండ్రగొడ్డంటఁ దన మస్తకంబు దునుము, కొనఁగఁ బూనిన న య్యగ్నికుండమునను. |
1242 |
| క. |
అరుదుగ వెలువడి రుద్రుఁడు, గరుణ దలిర్పంగ వానికర మాత్మకరాం బురుహమునఁ బట్టి తెగువకుఁ, జొరవలవదు; మెచ్చు వచ్చె సుమహిత చరితా! |
1243 |
| క. |
నీమదిఁ బొడమిన కోరిక, లేమైనను వేఁడు మిపుడ యిచ్చెద ననినం దా మనమున సంతసపడి, యా మనుజాశనుఁడు హరుపదాంబుజములకున్. |
1244 |
| తే. |
వందనం బాచరించి ‘యో యిందుమకుట!, ఫాలలోచన! వరద! మత్పాణితలము నేను నెవ్వని తలమీఁద నిడిన వాఁడు, మస్తకము నూఱువ్రయ్యలై మడియ నీవె!’ |
1245 |
| క. |
అని వేఁడిన న మ్మాటలు, విని మదనారాతి నవ్వి విబుధాహితు కో రిన వరముఁ దడయ కిచ్చిన, దనుజుఁడు తద్వరపరీక్షఁ దాఁ జేయుటకున్. |
1246 |
| వ. | ఆ క్షణంబ వరదాన గర్వంబున నుద్వృత్తుండై కడంగి. | 1247 |
| క. |
ఆ హరుమస్తకమునఁ గడు, సాహసమునఁ జేయి వెట్ట జడియక కదియ న్నోహో! తన మెచ్చులు దన, కాహా! పై వచ్చె ననుచు నభవుఁడు భీతిన్. |
1248 |
| క. |
దనుజుఁడు దన వెనువెంటం, జనుదే ముల్లోకములను సంత్రాసముఁ గై కొని పాఱ, సురలు మనములఁ, దనికిరి దానికిని బ్రతివిధానము లేమిన్. |
1249 |
| వ. | అట్లు చని చని. | 1250 |
| సీ. |
నిరుపమానందమై నిఖిలలోకములకు నవలయై యమృతపదాఖ్యఁ దనరి దినకరచంద్రదీధితులకుఁ జొరరాక సలలితసహజతేజమున వెలుఁగు సమధికంబగు శుద్ధసత్త్వగరిష్ఠమై కరమొప్ప యోగీంద్రగమ్య మగుచు హరిపదధ్యానపరాయణులైన తద్దాసుల కలరు నివాస మగుచుఁ |
|
| తే. |
బ్రవిమలానంత తేజోవిరాజమాన, దివ్యమణిహేమకలితసందీప్తభవ్య సౌధమండపతోరణస్తంభవిపుల, గోపురాదిభాసురము వైకుంఠపురము. |
1251 |
| వ. | కనుంగొని యమ్మహాస్థానంబు డాయం జనుటయు, నప్పుండరీకాక్షుం డఖండవైభవంబునం గుండలీశ్వరభోగతల్పంబునం బరమానందకందళితహృదయారవిందుండై యిందిరానయనచకోరకంబుల నిజమందహాససాంద్రచంద్రికావితతిం దేల్చుచు, నార్తభక్తజనరక్షణంబు పనిగా మెలంగుచు, వివిధ వినోదంబులం దగిలి యుండియు, ఫాలలోచనుం డద్దనుజపాలునకుం దలంపక యిచ్చిన వరంబు దన తలమీఁద వచ్చినం గలంగి చనుదెంచుట తన దివ్యచిత్తంబున నెఱింగి, య క్కాలకంధరుని యవస్థ నివారింపం దలంచి య య్యిందిరాదేవితోడి వినోదంబు సాలించి యప్పుడు. | 1252 |
| సీ. |
తాపింఛరుచితోడఁ ద్రస్తరించెడుమేనుఁ బసిఁడిముంజియుఁ దగు పట్టుగొడుగు ధవళాంశురుచి జన్నిదంబును దిన్నని దండంబుఁ జేతఁ గమండలువును బసుపుగోఁచియుఁ జిన్ని పట్టెవర్ధనమును రాజితంబైన మృగాజినంబుఁ దూలాడు సిగయును, వ్రేలుమాఱుట గోఁచి, వేలిమి బొట్టును, వ్రేళ్ళ దర్భ, |
|
| తే. |
దనర సందీప్తహవ్యవాహనసమాన, కాంతిఁ జెలువొంది యద్భుతక్రమ మెలర్పఁ జతురగతి నప్డు వటుకవేషంబు దాల్చి, వచ్చి యా నీచదానవవరునిఁ జేరి. |
1253 |
| వ. | కైతవంబున నతనికి నమస్కరించి మృదుమధురభాషణంబుల ననునయించుచు న య్యసురవరున కిట్లను; ని వ్విధంబున మార్గపరిశ్రాంతుండవై యింత దూరంబేల చనుదెంచితి? సకల సౌఖ్యకారణంబైన యీ శరీరంబు నిరర్థకంబు సేసి వృథాయాసంబున దుఃఖపఱుపం దగునే? యి య్యెడం గొంత తడవు విశ్రమింపు; మీ ప్రయాసంబునకుఁ గతం బెయ్యది? కపటహృదయుండవు గాక నీ యధ్యవసాయం బెఱింగింపం దగునేని నెఱింగింపు’మని మృదుమధురంబుగాఁ బలికిన న మ్మహాత్మునిసుధారసతుల్యంబు లయిన వాక్యంబులు విని సంతసిల్లి, య ప్పిశితాశనుండు దన పూనినకార్యం బతని కెఱింగించిన. | 1254 |
| చ. |
హరి దరహాస మొప్పఁ బిశితాశనుఁ గన్గొని పల్కె దానవే శ్వర! మును దక్షుశాపమునఁ జాలఁ బిశాచిప తౌట సూనృత స్ఫురణము మాని సంతతము బొంకుచు నుండు పురారిమాట నీ వరయక వెంట నేఁగఁ దగ దాతనిచేఁతలు మాకు వింతలే? |
1255 |
| ఆ. |
నిజము పలికెనేని నెఱిఁ దన తలమీఁద, నీ కరంబు మోపనీక తలఁగి వచ్చునోటు నితనివలనఁ బ్రత్యయమునఁ, దగుల నేమి గలదు దనుజవర్య! |
1256 |
| ఆ. |
అశుచి యగుచు నతని నంటఁగఁ బని గాదు, కాలుఁ జేయిఁ గడిగి కడఁక వార్చి యతనివెంట వేడ్క నరుగుదువే నీవు, నవల నంటఁ దగును నసురనాథ! |
1257 |
| మ. |
అతిదుశ్శంకలు మాని పొమ్మనిన దైత్యారాతిమాయావిమో హితుఁడై విస్మృతి నొంది తామసముచే నేపారి వాఁ డాత్మ పా ణి తలంబున్ దననెత్తి మోపికొని తా నేలన్ వెసన్ గూలె వి శ్రుతదంభోళిహతిన్ వడిం బడు మహాక్షోణీధరంబో యనన్. |
1258 |
| వ. | అట్లు దన తల నూఱువ్రయ్యలై నేలం గూలిన యసురం గని యప్పుడు. | 1259 |
| క. |
సుర లసురాంతకుమీఁదన్, వరమందారప్రసూనవర్షము లోలిం గురిసిరి తుములంబై దివి, మొరసెన్ సురదుందుభిప్రముఖతూర్యంబుల్. |
1260 |
| క. |
పాడిరి గంధర్వోత్తము, లాడిరి దివి నప్సరసలు, నన్యోన్యములై కూడిరి గ్రహములు, భయముల, వీడిరి మునికోటు లంత విమలచరిత్రా! |
1261 |
| క. |
మురహరుఁ డెల నవ్వొలయఁగఁ, బురుహరుఁ దగఁ జూచి పలికె భూతేశ్వర! యీ నరభోజనుండు నీ కి, త్తఱి నెగ్గొనరింపఁ దలఁచి తానే పొలిసెన్. |
1262 |
| వ. | అది యట్టిద కాదె! యిజ్జగంబున నధికుండయినవానికి నపకారంబు గావించిన మానవునకు శుభంబు గలుగునే? యదియునుంగాక జగద్గురుండ వగు నీ కవజ్ఞ దలంచు కష్టాత్ముండు వొలియుటం జెప్పనేల? యిట్టి దుష్టచిత్తుల కిట్టి వరంబు లిచ్చుట కర్జంబు గాదని య ప్పురాంతకు వీడ్కొలిపిన, నతండు మురాంతకు ననేకవిధంబుల నభినందించి నిజమందిరంబునకుం జనియె నని చెప్పి యిట్లనియె. | 1263 |
| క. |
మానవనాయక! యీ యా, ఖ్యానముఁ జదివినను వినిన ఘనపుణ్యులు ని త్యానందసౌఖ్యములఁ బెం, పూనుదు రటమీఁద ముక్తి నొందుదు రెలమిన్! |
1264 |
| వ. | అని చెప్పి శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె. | 1265 |
| క. |
జననాయక! యింకఁ బురా, తనవృత్తం బొకటి నీకుఁ దగ నెఱిఁగింతున్. వినుము తపోమహిమలఁ జెం, దిన మునిజనములు సరస్వతీనదిపొంతన్. |
1266 |