పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగము
భృగుమహర్షి త్రిమూర్తుల ప్రాశస్త్యంబు శోధించుటకుఁ బోవుట
క. వితతక్రియ లొప్పఁగ స, త్క్రతువుల నొనరించు చచటఁ గైగొని లక్ష్మీ
పతిభవ పితామహులలో, నతులితముగ నెవ్వ రధికు లని తమలోనన్‌.
1267
వ. ఇట్లు దలపోసి తన్మహత్త్వం బంతయుం దెలిసి రమ్మని భృగుమహాముని న మ్మువ్వురు వేల్పులకడకుం బంపిన న త్తాపసోత్తముండు సని చని ముందట. 1268
క. జలరుహసంజాత సభా, స్థలమున కొగి నేఁగి యతని సత్త్వగుణంబుం
దెలియుటకై నుతివందన, ములు సేయకయున్న నజుఁడు ముసముస యనుచున్‌.
1269
క. మనమునఁ గలఁగుచు భృగుఁ దన, తనుజాతుం డనుచు బుద్ధిఁ దలఁచినవాఁడై
ఘనరోషస్ఫురితాగ్నిని, ననయము శాంతోదకముల నల్లన నార్చెన్‌.
1270
చ. మహిత తపోధనుండు మునిమండనుఁ డయ్యెడఁ బాసి వెండియు
న్నహిపతిభూషుఁ గాన రజతాద్రికి నేగిన న గ్గిరీంద్రుపైఁ
దుహినమయూఖశేఖరుఁడు దుర్గయుఁ దానును విశ్రమించుచున్‌
ద్రుహిణతనూభవుండు సనుదెంచుట కాత్మఁ బ్రమోద మందుచున్‌.
1271
క. కనుఁగొని భ్రాతృస్నేహం, బునఁ గౌఁగిటఁ జేర్చు ననుచు ముక్కంటి రయం
బున నెదురేగిన ముని రు, ద్రునియందలి సత్త్వగుణ మెఱుంగుటకొఱకై.
1272
వ. అతనిం గైకొనక యూరకుండిన. 1273
ఉ. ఆ నిటలాంబకుండు గమలాసననందనుఁ జూచి భూరి కా
లానలరోషవేషభయదాకృతిఁ దాల్చి పటుస్ఫులింగ సం
తానము లొల్క శూలమునఁ దాపసముఖ్యునురంబు వ్రేయఁగాఁ
బూనినఁ బార్వతీరమణి బోరన నడ్డము వచ్చి చెచ్చెరన్‌;
1274
క. తన విభుపాదములకు వం, దనముం గావించి సముచితప్రియముల న
య్యనలాక్షునికోపము మా, న్చిన నమ్మునినాథుఁ డచట నిలువక చనియెన్‌.
1275
సీ. పొలుపొందు వైకుంఠపురమున కర్థితోఁ జని యందు సమధికైశ్వర్య మొప్పఁ
గమలాంక పర్యంకగతుఁడై సుఖించు న క్కౌస్తుభభూషు వక్షస్స్థలంబుఁ
దన పాదమున బిట్టు దన్నెఁ దన్నినఁ బాన్పు డిగి వచ్చి మునిఁ జూచి నగధరుండు
పదముల కెఱఁగి యో పరమతపోధన! యీగతి నీ వచ్చు టెఱుఁగ లేక
 
తే. యున్న నా తప్పు మన్నించి నన్నుఁ గరుణఁ, జూచి యీ దివ్యమణిమయస్ఫూర్తిఁ దనరు
రుచిరసింహాసనమునఁ గూర్చుండు దివ్య, తాపసోత్తమ! యభయప్రదాననిపుణ!
1276
క. అలఘుపవిత్ర! భవత్పద, జలములు నను నస్మదీయ జఠరస్థ జగం
బుల లోకపాలురను బొలు, పలరఁగఁ బుణ్యులను జేయు ననఘచరిత్రా!
1277
వ. మునీంద్రా! భవదీయపాదాబ్జహతి మద్భుజాంతరంబునకు భూషణం బయ్యె; భవదాగమనంబు మాఁబోటివారికి శుభావహం బగుం గాదె; యేను ధన్యుండ నైతి నని మృదుమధురాలాపంబుల ననునయించిన న మ్మునివరుండు లక్ష్మీనాథుసంభాషణంబులకుఁ జిత్తంబునం బరమానందంబు నొంది, య మ్ముకుందు ననంతకల్యాణగుణనిధి నభినందించి యానందబాష్పధారాసిక్తకపోలుం డగుచుఁ దద్భక్తిపారవశ్యంబున నొండు పలుకనేరక యతనిచేత నామంత్రణంబు వడసి మరలి సరస్వతీతీరంబున నున్న మునుల సన్నిధికిం జనుదెంచి వారలం గనుంగొని. 1278
సీ. మునినాయకులతోడఁ దన పోయి వచ్చిన తెఱఁగును దనమది దృష్టమైన
మూఁడుమూర్తుల విధంబును నెఱింగించిన విని వారు మనముల విస్మయంబు
నంది చిత్తంబున సందేహమును బాసి చిన్మయాకారుండు శ్రీసతీశుఁ
డనుపముఁ డనవద్యుఁ డఖిల కల్యాణగుణాకరుఁ డాదిమధ్యాంతరహితుఁ
 
తే. డై తనర్చిన పుండరీకాక్షుఁ డొకఁడ, కాక గణుతింప దైవ మొక్కరుఁడు వేఱ
కలఁడె యనుబుద్ధి విజ్ఞానకలితు లగుచు, హరిపదాబ్జాతయుగళంబు నర్థిఁ గొలిచి.
1279
వ. అట్లు సేవించి యవ్యయానందం బయిన వైకుంఠధామంబు నొంది; రని చెప్పి వెండియు నిట్లనియె. 1280
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - uttara bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )