పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగము
శ్రీకృష్ణుడు మృతు లయిన విప్రసుతులఁ దెచ్చుట
సీ. నరనాథ! యొకనాఁడు నలినాయతాక్షుండు వొలుచు కుశస్థలీపురమునందు
సుఖముండ నొక్క భూసురవర్యు భార్యకుఁ బుత్త్రుండు జన్మించి పుట్టినపుడ
మృతుఁడైన ఘనశోకవితతిచేఁ గ్రాఁగుచు, నా డింభకునిఁ గొంచు నవనిసురుఁడు
సనుదెంచి పెలుచ రాజద్వారమునఁ బెట్టి కన్నుల బాష్పాంబుకణము లొలుక
 
తే. బాపురే! విధి నను దుఃఖపఱుపఁ దగునె?, యనుచు దూఱుచుఁ దనుఁ దిట్టుకొనుచు వగల
డెంద మందంద యెరియ నాక్రందనంబు, సేయుచును వచ్చి యా విప్రశేఖరుండు.
1281
సీ. అధికశోకంబున నలమటఁ బొందుచు నచ్చటి జనులతో ననియెఁ బెలుచ
బ్రాహ్మణ విద్వేషపరుఁ డయి తగ శాస్త్ర పద్ధతి నడవక పాపవర్తి
యై క్షత్రబంధువుఁ డగు వాని దురితంబు చేత మత్పుత్త్రుండు జాతమైన
యప్పుడ మృతుఁ డయ్యె నక్కట! హింసకు రోయక యెప్పు డన్యాయకారి
 
తే. యగుచు విషయానుగతచిత్తుఁడైన యట్టి, రాజు దేశంబు ప్రజలు నిరాశు లగుచు
దుఃఖములఁ జాలవనటఁ బొందుదు రటంచు, నేడ్చుచును నట నిల్వక యేగె నపుడు.
1282
వ. ఇవ్విధంబున మఱియు దన సుతులు మృతు లయినపుడెల్ల వారలం గొనివచ్చి యవ్విప్రుండు రాజు మొగసాలంబెట్టి రోదనంబు సేయుచు, నెప్పటియట్ల కొన్ని గాథలు సదివి పోవుచుండె; నివ్విధంబున నెనమండ్రు సుతులు మృతులైన పిదపం దొమ్మిదవ సుతుండును మృతుండైన వాని నెత్తికొని వచ్చి యెప్పటి విధంబునఁ బలవరించుచున్న యా బ్రాహ్మణునిం గని యర్జునుం డిట్లనియె. 1283
క. ఈ పగిది నీవు వగలన్‌, వాపోవఁగఁ జూచి యకట! వారింపంగా
నోపిన విలుకాఁ డొక్కం, డీ పురి లేఁడయ్యె నయ్య! యిది పాప మగున్‌.
1284
సీ. పుత్త్రులఁ గోల్పోయి భూరిశోకంబున వనటఁ బొందుచు విప్రవరులు సాల
నే రాజురాజ్యమందేని వసించుదు రారాజుఁ దలపోయ నవనిమీఁద
నటునిఁగా నాత్మ నెన్నం దగు; నీపుత్త్రు నే బ్రతికించెద నిపుడ పూని
యటు సేయనైతినే, ననలంబు సొచ్చెద నని భూసురుఁడు వెఱఁగందఁ బలుక
 
తే. నతఁడు విని యీ వెడఁగుమాట లాడఁ దగునె?, భూరివిక్రమశాలి రాముండు మేటి
బలుఁడు హరియును శౌర్యసంపన్ను లనఁగఁ,దనరు ప్రద్యుమ్నుఁ డతని నందనుఁడు మఱియు.
1285
తే. వినుతబలు లైన యాదవ వీరవరులుఁ, గలుగ వారలచేఁ గాని కార్యమీవు
చక్కఁబెట్టుట యెట్లు? నీచనెడు త్రోవఁ, బొమ్ము నావుడు న య్యింద్రపుత్త్రుఁ డపుడు.
1286
క. మనమున దురహంకారము, ఘనముగఁ బొడముటయు, నపుడు కవ్వడి విప్రుం
గనుఁగొని యచ్చటిజనములు, వినఁగా నిట్లనియె రోషవిహ్వలమతియై.
1287
మ. బలుఁడం గాను; మురాసురాంతకుఁడఁ గాఁ; బ్రద్యుమ్నుఁడం గాను; నేఁ
దెలియం దత్తనయుండఁగా నని విరోధివ్రాతమున్‌ భీషణో
జ్జ్వల గాండీవ ధనుర్విముక్త నిశితాస్త్ర శ్రేణిచేఁ బీన్గు పెం
టలు గావించు పరాక్రమ ప్రకటచండ స్ఫూర్తి నేఁ బార్థుఁడన్‌.
1288
వ. అదియునుంగాక. 1289
చ. బలిమిఁ బురాంతకుం దొడరి బాహువిజృంభణ మొప్ప నెక్కటిం
దలపడి పోరినట్టి రణధైర్యుని నన్ను నెఱుంగ వక్కటా!
పెలుకుఱ మృత్యుదేవతను బింక మడంచి భవత్తనూజుల
న్నలవుఁ జలంబుఁ జూపి కొనియాడఁగ నిప్పుడ తెచ్చి యిచ్చెదన్‌.
1290
వ. అని నమ్మం బలికిన యర్జును ప్రతిజ్ఞకు భూసురుండు మనంబున నూరడిల్లి యతని నభినందించుచు నిజమందిరంబునకు జని కొన్ని దినంబు లుండునంత భార్యకుం బ్రసూతివేదనా సమయం బయినం జనుదెంచి వివ్వచ్చుం గని తద్విధం బెఱింగించిన న య్యింద్రనందనుం డప్పుడు. 1291
చ. లలిత విశిష్ట సంచిత జలంబుల నాచమనంబు సేసి, సు
స్థలమున నిల్చి రుద్రునకు సమ్మతి మ్రొక్కి మహాస్త్రవేది ని
ర్మల శుభమంత్రదేవతల మానసమందుఁ దలంచి గాండివం
బలవడ నెక్కు ద్రోచి బిగియం గదియించి నిషంగ యుగ్మమున్‌.
1292
వ. ఇ వ్విధంబునఁ గట్టాయితంబై యప్పుడు. 1293
సీ. భూసురు వెంట నిమ్ముల నేగి సూతికా భవనంబు చుట్టును బాణవితతి
నరికట్టి దిక్కులు నాకాశపథము ధ రాతలం బెల్ల నీరంధ్రముగను
శరపంజరముఁ గట్టి శౌర్యంబు దీపింపఁ గడు నప్రమత్తుఁడై కాచియున్న
యెడ న మ్మహీసురు నింతికిఁ బుత్త్రుండు జనియించె; నప్పుడచ్చటి జనంబు
 
తే. పోయెఁ బోయెఁ గదే యని బొబ్బ లిడఁగ, బొంది తోడన యాకాశమునకు మాయఁ
జెందె నప్పుడు దుఃఖంబు నొంది భూమి, సురుఁడు విలపించుచును మురహరుని కడకు.
1294
వ. అప్పుడు సని. 1295
క. ముందట నిల్పి ముకుంద! స, నందన మునివినుత; నందనందన! పరమా
నంద! శరదిందు చందన, కుంద యశస్సాంద్ర! కృష్ణ! గోవింద! హరీ!
1296
వ. అవధరింపుము. దేవా! యర్జునుం డనెడి పౌరుషవిహీనుం డాడిన వృథాజల్పంబులు నమ్మి పుత్త్రుం గోలువడి బేలనైన నన్ను నేమందు? నిఖిల విశ్వోత్పత్తి స్థితి లయంబులకుఁ బ్రధాన హేతుభూతుండ వయిన నీవు సమర్థుండ వయ్యు, వారింపం జాలక చూచుచుండ, నొక్క మనుష్యమాత్రుండు దీర్పం జాలెడువాఁడు గలఁడె? యని వెండియు. 1297
క. ఎక్కడి పాండుతనూభవుఁ?, డెక్కడి విలుకాఁడు? వీని కెక్కడి సత్త్వం?
బెక్కడి గాండీవము? దన, కెక్కడి దివ్యాస్త్ర సమితి? యే మనవచ్చున్‌?
1298
క. అని తను నోడక నిందిం, చిన విని య య్యర్జునుండు చిడిముడిపడుచుం
దనవిద్యమహిమ పెంపునఁ, జనియెన్‌ వెస దండపాణి సదనంబునకున్‌.
1299
క. చని యందు ధారుణీసుర, తనయులు లేకుంటఁ దెలిసి తడయక యింద్రా
గ్ని నిరృతి వరుణ సమీరణ, ధనదేశానాలయములు దగఁ బరికించెన్‌.
1300
వ. వెండియు. 1301
చ. నర సుర యక్ష కింపురుష నాగ నిశాచర సిద్ధ సాధ్య ఖే
చర విహగేంద్ర గుహ్యక పిశాచ నివాసములందు రోసి భూ
సురసుతు లేగినట్టి గతి సొప్పడకుండుటఁ జూచి క్రమ్మఱన్‌
ధరణికి నేగుదెంచి బెడిదంబుగ నగ్ని సొరంగఁ బూనినన్‌.
1302
వ. అ వ్విధంబంతయు నెఱింగి య మ్మురాంతకుండు ‘విప్రనందనుల నీకుం జూపెద’ నని యనలంబు సొరకుండ నతని నివారించి యప్పుడు. 1303
ఉ. సుందరదివ్యరత్నరుచి శోభితమై తనరారు కాంచన
స్యందన మంబుజాప్తుఁ డుదయాచల మెక్కు విధంబు దోఁపఁ బౌ
రందరి దాను నెక్కి తనురశ్ములు దిగ్వితతిన్‌ వెలుంగ గో
విందుఁ డుదారలీలఁ జనె విప్రతనూజ గవేషణార్థియై.
1304
చ. చని పురగోష్ఠ దుర్గ వన జానపదాచల పక్కణ ప్రభూ
త నదనదీ సరోవర యుతక్షితి నంతయు దాఁటి సప్త వా
రినిధుల దీవులం గులగిరి ప్రకరంబుల నుత్తరించి మే
రు నగము నాక్రమించుచు మరుద్గతితో రథ మేగ న త్తఱిన్‌.
1305
చ. మసలక భూరిసంతమసమండలముం దరియంగఁజొచ్చి సా
హసమునఁ బోవఁ బోవఁగ భయంకరమై మది గోచరింపమిన్‌
వసమఱి మోఁకరిల్లి రథవాజులు మార్గము దప్పి నిల్చినన్‌
బిసరుహపత్త్రలోచనుఁ డభేద్యతమః పటలంబు వాపఁగన్‌.
1306
సీ. బాలభానుప్రభాభాసమానద్యుతిఁ గరమొప్ప నిజ రథాంగంబుఁ బనుప
న మ్మహాస్త్రం బేగి చిమ్మచీఁకటి నెల్ల నఱిముఱి నందంద నఱికి వైచి
యగ్రభాగంబున నతులిత గతి నేగ నా మార్గమున నిజస్యందనంబు
గడువడిఁ దోలి యా కడిఁది తమోభూమిఁ గడవ ముందఱకడఁ గాన రాక
 
తే. మిక్కుటంబుగ దృష్టి మిర్మిట్లు గొనఁగఁ, జదల వెలుఁగొందు దివ్యతేజంబుఁ జూచి
మొనసి గాండీవి కన్నులు మూసికొనుచు, నాత్మ భయమంది కొంతద వ్వరిగి యరిగి.
1307
తే. కడఁగి దుర్వారమారుతోత్కటవిధూత, చటులసర్వంకషోర్మిభీషణగభీర
వారిపూరంబు సొచ్చి తన్నీరమధ్య, భాగమునఁ గోటిసూర్యప్రభలు వెలుంగ.
1308
వ. అది మఱియును జారుదివ్యమణిసహస్రస్తంభాభిరామంబును, నాలంబితకమనీయనూత్నరత్న మాలికాలంకృతంబును, భానుశశిమయూఖాగమ్యంబును, ననంతతేజోవిరాజితంబును, బునరావృత్తి రహితమార్గంబును, నిత్యైశ్వర్యదాయకంబును, నవ్యయంబును, నత్యున్నతంబును, ననూనవిభవంబును, బరమయోగీంద్రగమ్యంబును, బరమభాగవతనివాసంబునునై యొప్పు దివ్యధామంబునందు. 1309
సీ. సాంద్రశరచ్చంద్రచంద్రికాకర్పూరనీహారహారాభదేహ మమర
నిందిందిరేందీవరేంద్రనీలద్యుతిఁ గర మొప్పు మేచకకంఠసమితి
యరుణాంశుబింబభాసురపద్మరాగవిన్యస్తసహస్రోరుమస్తకములు
వివృతాననోద్గతవిషధూమరేఖల లీలఁ జూపట్టిన నాలుకలును
 
తే. గలిత సాయంతనజ్వలజ్జ్వలనకుండ,ముల విడంబించు వేఁడిచూపులును గలిగి
భూరికలధౌతగిరినిభాకార మమరఁ, బరఁగు భోగీంద్రభోగతల్పంబునందు.
1310
వ. సుఖాసీనుండై యున్నవాని డాయం జని యప్పుడు. 1311
సీ. సజలనీలాంబుదశ్యామాయమానాంగు నాశ్రితావనముదితాంతరంగు
సనకాదియోగిహృద్వనజమదాళీంద్రు ముఖపద్మరుచిజితపూర్ణ చంద్రుఁ
గమనీయనిఖిలజగద్ధితచారిత్రుఁ బ్రత్యూషసంఫుల్లపద్మనేత్రు
నిందిరాహృదయారవిందారుణోల్లాసు శ్రీకరపీతకౌశేయవాసు
 
తే. హారకుండలకటకకేయూరమకుట, కంకణాంగదమణిముద్రికావినూత్న
రత్ననూపురకాంచీవిరాజమాను, భవమహార్ణవశోషు సద్భక్తపోషు.
1312
వ. మఱియు సునందాదిపరిజనసంతతసేవితు, నానందకందళితహృదయారవిందు, నరవిందవాసినీ వసుంధరాసుందరీసమేతు, నారదయోగీంద్రసంకీర్తనానందితు, నవ్యయు, ననఘు, ననంతు, నప్రమేయు, నజితు, నవికారు, నాదిమధ్యాంతరహితు, భవలయాతీతుఁ, గరుణాసుధాసముద్రు, నచ్యుతు, మహానుభావుఁ బరమపురుషుఁ, బురుషోత్తము, నిఖిలజగదుత్పత్తిస్థితిలయకారణుఁ, జిదచిదీశ్వరు, నష్టభుజుఁ, గౌస్తుభ శ్రీవత్సవక్షు, శంఖచక్ర గదాపద్మశార్‌ఙ్గాదిదివ్యసాధను, సర్వశక్తిసేవితుఁ బరమేష్ఠిజనకు నారాయణుం గనుంగొని దండప్రణామంబులు సేసి కరకమలంబులు మొగిచి భక్తిపూర్వకంబుగా నభినందించిన, న య్యాదిదేవుండును వారలం గరుణావలోకనంబులు నిగుడ నవలోకించి, దరహాసపూరంబు దోరంబుగా సాదరంబుగ నిట్లనియె. 1313
క. ధరణికి వ్రేఁ గగు దైత్యులఁ, బొరిబొరి వధియించి ధర్మమున్‌ నిలుపుటకై
ధర జనియించితి రిరువురు, నరనారాయణు లనంగ నా యంశమునన్‌.
1314
క. ఆరూఢనియతితోఁ బెం, పారిన మిము ని మ్మునీంద్రు లర్థిం జూడం
గోరిన మీ వచ్చుటకై, ధారుణిసురసుతుల నిటకుఁ దగఁ దేవలసెన్‌.
1315
క. అని యా డింభకులను దో, కొని పొండని యిచ్చి వీడుకొలిపిన వారల్‌
వినతు లయి పెక్కువిధముల, వినుతించుచు నచటు వాసి విప్రునిసుతులన్‌.
1316
వ. తోడ్కొని సంప్రాప్తమనోరథులయి యబ్బాలకులఁ దత్తద్వయోరూపంబులతోడఁ దెచ్చి యాబ్రాహ్మణునకు సమర్పించిన నతండు సంతుష్టాంతరంగుం డయ్యె; న య్యవసరంబున. 1317
చ. అనిమిషనాథనందనుఁ డహర్పతితేజుఁడు గృష్ణుతోడఁ దాఁ
జని యచటం గనుంగొనిన సర్వశరణ్యునిఁ బుండరీక నే
త్రుని నిజధామవైభవసమృద్ధికిఁ దన్మహనీయమూర్తికిన్‌
మనమున మోదమంది పలుమాఱును సన్నుతిఁ జేసె భూవరా!
1318
తే. వారిజాక్షుని భక్తమందారు ననఘుఁ, గృష్ణు నఖిలేశుఁ గేశవు జిష్ణుఁ బరము
వినుతి సేయుచుఁ దత్పాదవనజములకు, వందనము లాచరించి యానంద మొందె.
1319
వ. అంత. 1320
మ. హరి సర్వేశుఁ డనంతుఁ డాద్యుఁ డభవుం డామ్నాయసంవేది భూ
సురముఖ్యప్రజలన్‌ సమస్తధనవస్తుశ్రేణి నొప్పారఁగాఁ
బరిరక్షించుచు ధర్మమున్‌ నిలుపుచుం బాపాత్ములం ద్రుంచుచుం
బరమోత్సాహ మెలర్ప భూరిశుభవిభ్రాజిష్ణుఁడై ద్వారకన్‌.
1321
క. జనవినుతముగాఁ బెక్కు స, వనములు దనుఁ దాన కూర్చి వైదికయుక్తిం
బొనరించుచు ననురాగము, మనమునఁ దళుకొత్త దైత్యమర్దనుఁ డెలమిన్‌.
1322
వ. అట్లు కృష్ణుండు ద్వారకానగరంబునఁ బూజ్యంబగు రాజ్యంబు సేయుచుఁ బురందరవిభవంబున నిరవొంది కనకమణిమయవిమానమండపగోపురప్రాసాదసౌధచంద్రశాలాంగణాదివివిధభవనంబులందును రంగదుత్తుంగతరంగడోలావిలోలకలహంసచక్రవాకకారండవసారస క్రౌంచముఖజలవిహంగవిలస దుచ్చలితగరుదనిలదరదమలకమలకుముదకహ్లారసందోహనిష్యందమకరందరసపానమదవదిందిందిరకుల కల గాయకఝంకారనినదంబులును, నిరంతరవసంతసమయసముచితపల్లవితకోరకితబాలరసాలజాల లాలితకిసలయ విసర ఖాదనజాత కుతూహలాయమానకషాయకంఠకలకంఠకలరవమృదంగఘోషంబులును, నిశితనిజచంచూపుటనిర్దళితసకలజననయనానందసుందరనందితమాకందపరిపక్వఫలరంధ్రవిగళిత మధురరసాస్వాదనముదితరాజకీరశారికానికరమృదుమధురవచనరచనావశకృత్యంబులును నమరఁ, బురపురంధ్రీజనపీనపయోధరమండలవిలిప్తలలితకుంకుమపంకసంకులసౌగంధ్యానుబంధ బంధురగంధానుమోదితుండును, జందనాచలసానుదేశసంజాతమంజులమాధవీలతానికుంజ మంజుల కింజల్కరంజితనివాసవిసరవిహరమాణశబరికాకబరికాపరిపూర్ణసురభికుసుమమాలికాపరిమళ వహుండును, గళిందకన్యకాకల్లోలసందోహపరిస్పందకందళితమందగమనుండును నగు మందానిల విదూషకునిచేఁ బోషితాభ్యాసిత లాలిత లగు నేలాలతావితాననటుల నటనంబుల విరాజితంబులగు కాసారతీర భాసురోద్యానంబులందును, జారుఘనసారపటీరబాలరసాలసాలనీపతాపింఛజంబూజంబీరనింబ కదంబప్రముఖ ముఖ్యశాఖీశాఖాకీర్ణశీతలచ్ఛాయావిరచితవిమలచంద్రకాంతోపలవేదికాస్థలంబు లందును, నుదంచిత పింఛవిభాసితబాలనీలకంఠకేకారవాకులీకృతకృతకమహీధరంబులందును, లలితమణివాలుకానేక పులినతలంబులందును, గప్పురంపుం దిప్పలను, గురువేరు చప్పరంబులను, విరచితదారుయంత్రనిబద్ధ కలశనిర్యత్పయోధారాశీకరపరంపరాసంపాదితనిరంతరహేమంతసమయప్రదేశంబు లందును, నిందిరారమణుండు షోడశసహస్రవధూయుక్తుండై యందఱ కన్నిరూపులై లలితసౌదామనీలతాసమేత నీలనీరదంబుల విడంబించుచుఁ గరేణుకా కలిత దిగ్గజంబునోజ రాజిల్లుచు, సలిలకేళీవిహారంబులు మొదలుగా ననేకలీలావినోదంబులు సలుపుచు, నంతఃపురంబునఁ గొలువున్న యవసరంబున వివిధవేణువీణాదివాద్య వినోదంబులను, మంజులగానంబులను, గవిగాయకసూతవందిమాగధ జనసంకీర్తనంబులను, నటనటీజన నాట్యంబులను, విదూషకపరిహాసోక్తులను, సరససల్లాపమృదుమధురభాషణంబులను బ్రొద్దుపుచ్చుచు నానందరసాబ్ధి నోలలాడుచుండె; నంత. 1323
మ. అరవిందాక్షపదాంబుజాతయుగళధ్యానానురాగక్రియా
సరసాలాపవిలోకనానుగతచంచత్సౌఖ్యకేళీరతిం
దరుణుల్‌ నూఱుఁబదాఱువేలు మహితోత్సాహంబునం జొక్కి త
త్పరలై యొండు దలంప కుండిరి సవిభ్రాంతాత్మలై భూవరా!
1324
వ. అదియునుం గాక. 1325
మ. హరినామాంకితమైన గీత మొకమా టాలించి మూఢాత్ములున్‌
విరతిం బొందఁగఁజాలి యుందురఁట? యా విశ్వాత్ము నీక్షించుచున్‌
బరిరంభించుచు, నంటుచున్‌, నగుచు సంభాషించుచు న్నుండు సుం
దరు లానందనిమగ్న లౌట కిలఁ జోద్యం బేమి? భూవల్లభా!
1326
వ. అని చెప్పి మఱియు నిట్లనియె. 1327
ఉ. వారక కృష్ణుఁ డిప్పగిది వైదికవృత్తి గృహస్థ ధర్మ మే
పారఁగ బూని ధర్మమును నర్థముఁ గామము నందఁ జూపుచుం
గోరిక మీఱ సజ్జనులకుం గతి దాన యనంగ నొప్పి సం
సారిగతిన్‌ మెలంగె నృపసత్తమ! లోకవిడంబనార్థమై.
1328
సీ. హరి యిట్లు గృహమేధి యగుచు శతోత్తరషోడశసాహస్రసుందరులను
మును నీకు నెఱుఁగఁ జెప్పినరీతి నందఱ కన్ని రూపములు దా నర్థిఁ దాల్చి,
కైకొని యొక్కొక్క కామినీమణియందు రమణ నమోఘవీర్యమునఁ జేసి
పదురేసికొడుకులం బడసె రుక్మిణ్యాదిపట్టమహిషుల కుద్భవులు నైన
 
తే. నందనులలోన ధరణి నెన్నంగ బాహు, బలపరాక్రమవిజయసంపద్విశేష
మానితాత్ములు పదునెనమండ్రు; వారి నెఱుఁగ వినిపింతు వినుము రాజేంద్రచంద్ర!
1329
వ. అని మఱియు నిట్లను; వారలు ప్రద్యుమ్నానిరుద్ధ దీప్తిమద్భాను సాంబ మిత్ర బృహద్భాను మిత్రవింద వృకారుణ పుష్కర దేవబాహు శ్రుతదేవ సునందన చిత్రబాహు వరూధ కవి న్యగ్రోధ నామంబులం బ్రసిద్ధులైరి; వెండియుఁ ద్రివక్రయందు సంభవించిన యువశ్లోకుం డనువాఁడు దన జనకుండైన కృష్ణు పాదారవింద సేవారతుం డగుచు నారదయోగీంద్రునకు శిష్యుండై యఖండిత దివ్యజ్ఞాన బోధాత్మకుం డగుచు, స్త్రీ శూద్ర దాసజన సంస్కారకంబై స్మరణమాత్రంబున ముక్తి సంభవించునట్టి సాత్త్వత తంత్రం బను వైష్ణవస్మృతిం గల్పించె; నిట్లు మధుసూదననందనులు బహుప్రజలును, నధికాయురున్నతులును, ననల్ప వీర్యవంతులును, బ్రహ్మణ్యులునై విఖ్యాతిం బొందిరి. వారిని లెక్కవెట్టఁ బదివేల వత్సరంబులకైనం దీఱదు, మున్ను నీ కెఱింగించినట్లు తత్కుమారులకు విద్యా విశేషంబుల నియమించు గురుజనంబులు మూఁడు కోట్లు నెనుబదెనిమిది వేల నూర్గు రనం గల్గియుందు; ర క్కుమారుల లెక్కింప నెవ్వరికి శక్యం? బదియునుం గాక యొక్క విశేషంబు సెప్పెద విను మని యిట్లనియె. 1330
క. నరవర! దేవాసుర సం, గరమున మును నిహతు లైన క్రవ్యాద సము
త్కరము నరేశ్వరులై ద్వా, పరమున జనియించి ప్రజల బాధలఁ బఱుపన్‌.
1331
క. హరి తద్వధార్థమై ని, ర్జరులను యదుకులమునందు జనియింపింపం
ధర నూటొక్కకులంబై, పరఁగిరి; వారిని గణింప బ్రహ్మకు వశమే?
1332
వ. అట్టి యన్వయంబునందు మాధవునకు రుక్మిణీదేవి యందుఁ బితృసముండును, సమగ్ర భుజావిజృంభణుండునునై ప్రద్యుమ్నుండు జనియించె; నతనికి రుక్మికూఁతురగు శుభాంగి వలన ననిరుద్ధుం డుదయించె; నతనికి మౌసలావశిష్టుండైన వ్రజుండు సంభవించె; నతనికిఁ బ్రతిబాహుండు పుట్టె; వానికి సుబాహుండు జన్మించె; నతనికి నుగ్రసేనుండు ప్రభవించె; నతనికి శ్రుతసేనుండు గలిగె; నిట్లు యదువృష్ణిభోజాంధక వంశంబులు పరమ పవిత్రంబులై పుండరీకాక్షు నిరీక్షణ శయ్యాసనానుగత సరసాలాపస్నానాశన క్రీడావినోదంబుల ననిశంబునుం జెందుచు, సర్వదేవతార్థంబు సమస్తంబైన క్రతువు లొనరింపుచుఁ బరమానంద కందళిత చిత్తులై యుండి రని చెప్పి వెండియు. 1333
మ. పరమోత్సాహముతోడ మాధవుఁడు శుంభల్లీలఁ బూరించు న
మ్మురళీగానము వీనులం జిలికినన్‌ మోదించి గోపాల సుం
దరు లేతెంతు రరణ్యభూములకుఁ; దద్దాస్యంబు గావించి య
క్కరుణావార్థి భజింపకుందురె బుధుల్‌ కౌరవ్యవంశాగ్రణీ!
1334
మ. మతి నెవ్వాని యమంగళఘ్న మగు నామం బర్థిఁ జింతించినన్‌
నుతి గావించిన విన్న మానవులు ధన్యుల్‌; భూరిసంసార దు
ష్కృతులం ద్రోతురు; కాలచక్ర మహితాస్త్రుం డట్టి యా కృష్ణుఁ డీ
క్షితిభారం బుడుగంగఁ జేయు టిది యే చిత్రంబు? భూవల్లభా!
1335
వ. ఇ వ్విధంబున గోపికాజన మనోజాతుండైన కృష్ణుండు లీలామానుష విగ్రహుండై నిజరాజధాని యైన ద్వారకాపురంబున నమానుష విభవంబు లగు సౌఖ్యంబులం బొదలుచుండె నని చెప్పి మఱియు నిట్లనియె. 1336
మ. మనుజేంద్రోత్తమ! యేను నీకుఁ ద్రిజగన్మాంగల్యమై యొప్పఁ జె
ప్పిన యీ కృష్ణకథాసుధారసము సంప్రీతాత్ములై భక్తిఁ గ్రో
లిన పుణ్యాత్ములు గాంతు రిందు సుఖముల్‌; నిర్ధూతసర్వాఘులై
యనయంబుం దుదిఁ గాంతు రచ్యుతపదం బైనట్టి కైవల్యమున్‌.
1337
క. అని యిట్లు బాదరాయణి, మనమున రాగిల్ల నాభిమన్యునకుం జె
ప్పిన విధమున సూతుఁడు ముని, జనుల కెఱింగింప వారు సమ్మతితోడన్‌.
1338
క. సూతుని బహువిధముల సం, ప్రీతునిఁ గావించి మహిమఁ బెంపారుచు వి
ఖ్యాతికి నెక్కిన కృష్ణక, థాతత్పరులైరి బుద్ధిఁ దఱుఁగని భక్తిన్‌.
1339
చ. సరసిజపత్త్రనేత్ర! రఘుసత్తమ! దుష్టమదాసురేంద్ర సం
హరణ! దయాపయోధి! జనకాత్మభవానన పద్మమిత్ర! భా
స్కర కులవార్ధిచంద్ర! మిహికావసుధాధరసూతిసన్నుత
స్ఫురితచరిత్ర! భక్త జనపోషణ భూషణ! పాపశోషణా!
1340
క. మారీచభూరిమాయా, నీరంధ్రమహాంధకార నీరేజహితా!
క్ష్మారమణవినుత పాదాం, భోరుహ! మహితావతార! పుణ్యవిచారా!
1341
మాలిని. శరధి మదవిరామా! సర్వలోకాభిరామా!
సురరిపువిషభీమా! సుందరీలోకకామా!
ధరణివరలలామా! తాపసస్తోత్రసీమా!
సురుచిరగుణధామా! సూర్యవంశాబ్ధిసోమా!
1342
గద్య. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసనమంత్రి పుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీమహాభాగవతం బను మహాపురాణంబునందుఁ బ్రద్యుమ్న జన్మంబును, శంబరోద్యోగంబును, సత్రాజిత్తునకు సూర్యుండు శ్యమంతకమణి నిచ్చుటయుఁ దన్నిమిత్తంబునం బ్రసేనుని సింహంబు వధియించుటయు, దాని జాంబవంతుండు దునిమి మాణిక్యంబు గొనిపోవుటయు. గోవిందుండు బ్రసేనుని దునిమి మణిఁ గొనిపోయె నని సత్త్రాజిత్తు కృష్ణునందు నింద నారోపించుటయుఁ, గృష్ణుండు దన్నిమిత్తంబున జాంబవంతునిం దొడరి మణియుక్తంబుగా జాంబవతిం గొనివచ్చి వివాహం బగుటయు, సత్త్రాజిత్తునకు మణి నిచ్చుటయు, సత్యభామా పరిణయంబును, బాండవులు లాక్షా గృహంబున దగ్ధు లైరని విని వాసుదేవుండు బలభద్ర సహితుండయి హస్తినాపురంబున కరుగుటయు, నక్రూరకృతవర్మల యనుమతంబున శతధన్వుండు సత్త్రాజిత్తుఁ జంపి మణిఁ గొనిపోవుటయుఁ, దదర్థం బా సత్యభామ కరినగరంబున కేగి కృష్ణునకు విన్నవించిన నతండు మరలి చనుదెంచి శతధన్వుం ద్రుంచుటయు, బలభద్రుండు మిథిలానగరంబునకుం జనుటయు, నందు దుర్యోధనుండు రాముని వలన గదావిద్య నభ్యసించుటయు, గృష్ణుండు సత్రాజిత్తునకుం బరలోక క్రియలు నడపుటయు, శ్యమంతకమణిం దాఁచినవాఁడయి యక్రూరుండు భయంబున ద్వారకానగరంబు విడిచి పోయిన నతని లేమి ననావృష్టి యైనం గృష్ణుం డక్రూరుని మరల రప్పించుటయు, దామోదరుం డింద్ర ప్రస్థపురంబున కరుగుటయు, నందర్జున సమేతుండయి మృగయా వినోదార్థం బరణ్యంబునకుం జని, కాళిందిం గొనివచ్చుటయు, ఖాండవ దహనంబును, నగ్నిపురుషుం డర్జునునకు నక్షయతూణీర గాండీవ కవచరథరథ్యంబుల నిచ్చుటయు, మయుండు ధర్మరాజునకు సభ గావించి యిచ్చుటయు, నగధరుండు మరలి నిజ నగరంబున కరుగుదెంచి కాళిందిని వివాహం బగుటయు, మిత్రవిందా నాగ్నజితీ భద్రా మద్రరాజకన్యలం గ్రమంబునఁ గరగ్రహణం బగుటయు, నరకాసుర యుద్ధంబును, దద్గృహంబున నున్న రాజకన్యకలం బదాఱువేలం దెచ్చుటయు, స్వర్గ గమనంబును, నదితికిం గుండలంబు లిచ్చుటయుఁ, బారిజాతాపహరణంబును, బదాఱువేల రాజకన్యలం బరిణయం బగుటయు, రుక్మిణీదేవి విప్రలంభంబును, రుక్మిణీస్తోత్రంబును, గృష్ణకుమారోత్పత్తియుఁ, దద్గురుజనసంఖ్యయుఁ, బ్రద్యుమ్ను వివాహంబును, ననిరుద్ధు జన్మంబును, దద్వివాహార్థంబు కుండిన నగరంబునకుం జనుటయు, రుక్మిబలభద్రుల జూదంబును, రుక్మి వధయు, నుషాకన్య యనిరుద్ధుని స్వప్నంబునం గని మోహించుటయు, దన్నిమిత్తంబునఁ, జిత్రరేఖ సకలదేశ రాజులఁ బటంబున లిఖించిచూపి యనిరుద్ధునిఁ దెచ్చుటయు, బాణాసుర యుద్ధంబును, నృగోపాఖ్యానంబును, బలభద్రుని ఘోషయాత్రయుఁ, గాళింది భేదనంబును, గృష్ణుండు పౌండ్రకవాసుదేవ కాశీరాజుల వధించుటయుఁ, గాశీరాజ పుత్రుండయిన సుదక్షిణుం డభిచారహోమంబు గావించి కృత్యం బడసి కృష్ణుపాలికిం బుత్తెంచిన సుదర్శనంబుచేతఁ గృత్యను సుదక్షిణ సహితంబుగాఁ గాశీపురంబును భస్మంబు సేయుటయు, బలరాముండు రైవత నగంబునందు ద్వివిదుండను వనచరుని వధియించుటయు, సాంబుండు దుర్యోధను కూఁతురగు లక్షణ నెత్తి కొని వచ్చినఁ గౌరవు లతనిం గొనిపోయి చెఱఁబెట్టుటయుఁ, దద్వృత్తాంతం బంతయు నారదువలన విని బలభద్రుండు నాగ నగరంబునకుఁ జనుటయుఁ, గౌరవులాడిన యగౌరవ వచనంబులకు బలరాముండు కోపించి హస్తినాపురంబును గంగం బడఁద్రోయ గమకించుటయుఁ, గౌరవులు భయంబున నంగనాయుక్తంబుగా సాంబుని దెచ్చి యిచ్చుటయు, బలభద్రుండు ద్వారకానగరంబునకు వచ్చుటయు, నారదుండు హరి పదాఱువేల కన్యకల నొకముహూర్తంబున నందఱ కన్నిరూపులై వివాహం బయ్యెనని విని తత్ప్రభావంబు దెలియంగోరి యరుగుదెంచుటయుఁ, దన్మాహాత్మ్యంబు సూచి మరలి చనుటయు, జరాసంధునిచేత బద్ధులైన రాజులు కృష్ణుపాలికి దూతం బుత్తెంచుటయు, నారదాగమనంబును, బాండవుల ప్రశంసయును, నుద్ధవ కార్యబోధంబును, నింద్రప్రస్థాగమనంబును, ధర్మరాజు సేయు రాజసూయారంభంబును, దిగ్విజయంబును, జరాసంధ వధయును, రాజ బంధమోక్షణంబును, రాజసూయంబు నెఱవేర్చుటయును, శిశుపాలవధయును, నవభృథంబును, రాజసూయ వైభవదర్శనా సహమాన మానసుండయి సుయోధనుండు మయనిర్మిత సభామధ్యంబునం గట్టిన పుట్టంబులు దడియం ద్రెళ్ళుటయు, దన్నిమిత్తపరిభవంబు నొంది రారాజు నిజపురి కరుగుటయుఁ, గృష్ణుండు ధర్మరాజ ప్రార్థితుం డయి యాదవుల నిలిపి కొన్ని నెలలు ఖాండవప్రస్థంబున వసియించుటయు, సాళ్వుండు దపంబు సేసి హరుని మెప్పించి సౌంభకాఖ్యంబగు విమానంబు వడసి నిజసైన్య సమేతుండై ద్వారకానగరంబు నిరోధించుటయు, యాదవసాళ్వయుద్ధంబును, గృష్ణుండు మరలి చనుదెంచి సాల్వుం బరిమార్చుటయును, దంతవక్త్రవధయును, విదూరథ మరణంబును, గృష్ణుండు యాదవబల సమేతుండై క్రమ్మఱ నిజపురంబునకుం జనుటయును, గౌరవ పాండవులకు యుద్ధం బగునని బలదేవుండు తీర్థయాత్ర సనుటయు, నందు జాహ్నవీ ప్రముఖనదులం గృతస్నానుం డయి నైమిశారణ్యంబునకుం జనుటయు, నచ్చటి మునులు పూజింపం బూజితుండయి తత్సమీపంబున నున్నతాసనంబున నుండి సూతుండు దన్నుం గని లేవకున్న నలిగి రాముండు గుశాగ్రంబున నతని వధించుటయు, బ్రహ్మహత్యా దోషంబు గలిగెనని మునులు వలికిన సూతుం బునర్జీవితుం జేయుటయు, న మ్మునులకుం బ్రియంబుగాఁ గామపాలుం డిల్వల సుతుండగు పల్వలుం బరిమార్చుటయు, వారిచేత ననుమతుండయి హలధరుండు దత్సమీపతీర్థంబుల స్నాతుండయి గంగాసాగర సంగమంబునకుం జనుటయు, మహేంద్ర నగప్రవేశంబును, బరశురామ దర్శనంబును, సప్తగోదావరిం గ్రుంకుటయు, మఱియు మధ్యదేశంబునం గల తీర్థంబు లాడి శ్రీశైల వేంకటాచలంబులు దర్శించుటయు, వృషభాద్రి హరిక్షేత్ర సేతుబంధ రామేశ్వరములం గని తామ్రపర్ణీతీర్థంబు లాడుటయు, గోదానంబు లొనరించి మలయగిరియందు నగస్త్యునిం గనుటయు, సముద్ర కన్యా దుర్గాదేవుల నుపాసించుటయు, నందు బ్రాహ్మణజనంబు వలనం బాండవ ధార్తరాష్ట్ర భండనంబున సకల రాజలోకంబును మృతి నొందిరని వినుటయు, వాయునందన సుయోధనులు గదా యుద్ధసన్నద్ధు లగుట విని వారిని వారించుటకై, రౌహిణేయుం డందుల కరుగుటయు, నచట వారిచేతం బూజితుండయి వారి నివారింపలేక మగిడి ద్వారక కరుగుటయుఁ, గొన్ని వాసరంబులకు మరల నైమిశారణ్యంబునకుం బోయి యచట యజ్ఞంబు సేసి రేవతియుం దానును నవభృథం బాడి నిజపురంబున కేతెంచుటయుఁ, గుచేలోపాఖ్యానంబును, సూర్యోపరాగంబునం గృష్ణుఁడు రామునితోఁజేరి పురరక్షణంబునకుఁ బ్రద్యుమ్నాది కుమారుల నిలిపి షోడశ సహస్రాంగనా పరివృతుండయి యక్రూర వసుదేవోగ్ర సేనాది యాదవ వీరులు దోడరా శ్యమంతపంచక తీర్థంబున కరిగి కృతస్నానుండయి వసియించి యుండుటయుఁ, బాండవకౌరవాది సకల రాజలోకంబును దత్తీర్థంబునకు వచ్చుటయుఁ, గుంతీదేవి దుఃఖంబును, నందయశోదా సహితులైన గోపగోపికా జనంబులు చనుదెంచుటయుఁ, గుశలప్రశ్నాది సంభాషణంబులును, మద్ర కన్యా ద్రౌపదీ సంభాషణంబును, దదనంతరంబ సకల రాజలోకంబును శ్యమంతపంచకతీర్థంబున స్నాతులై రామకృష్ణాదియాదవ వీరుల నామంత్రణంబు చేసి నిజదేశంబులకుఁ బోవుటయుం, గృష్ణుని దర్శించుటకు మునీంద్రు లేతెంచుటయు, వారి యనుమతిని వసుదేవుండు యాగంబు నెరవేర్చుటయు, నందయశోదాది గోపికానివహంబుల నిజపురంబున కనిచి యుగ్రసేనాది యాదవ వీరులుం దానును మాధవుండు నిజపురప్రవేశంబు సేయుటయుఁ, దొల్లి కంసునిచేత హతులై బలిపురంబున నున్న దేవకీదేవి సుతుల రామకృష్ణులు యోగమాయా బలంబునఁ దెచ్చి యామె కిచ్చుటయు, నర్జునుండు సుభద్రను వివాహం బగుటయుఁ, గృష్ణుండు మిథిలానగరంబున కరుగుటయు, శ్రుతదేవజనకుల చరిత్రంబును, వారలతో బ్రాహ్మణప్రశంస సేయుటయు, శ్రుతిగీతలును, గృష్ణుండు మఱలి తన పురంబున కరుగుదెంచుటయు హరి హర బ్రహ్మల తారతమ్య చరిత్రంబును, గుశస్థలినుండు బ్రాహ్మణుని చరిత్రంబును, నతనితనయులు పరలోకంబునకుం బోయినఁ గృష్ణార్జునులు తమ యోగబలంబున వారిం దెచ్చి యవ్విప్రున కిచ్చుటయుఁ గృష్ణుం డర్జునుని వీడ్కొని ద్వారక కరుగుటయు, నందు మాధవుండయ్యై ప్రదేశంబుల సకల భార్యా పరివృతుండయి విహరించుటయు, యాదవ వృష్ణి భోజాంధకవంశ చరిత్రంబును నను కథలు గల దశమస్కంధంబు నందు నుత్తరభాగము. 1343
శ్రీకృష్ణార్పణమస్తు
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - uttara bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )