| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ఏకాదశస్కంధము |
| వ. | అనిన రాజునకు శుకుం డిట్లనియె ‘నట్లు వాసుదేవుం డన్యాయ ప్రవర్తకు లగు దుష్టుల సంహరించి, న్యాయప్రవర్తకులగు శిష్టులఁబరిపాలనంబు సేసి, బలరామసమేతంబుగా ద్వారకానగరంబు వెడలినం గని యాదవులు దమలోఁదాము మదిరాపానమత్తులై మత్సరంబున నుత్సాహ కలహంబునకున్ గమకించి, కరితురగరథపదాతిబలంబులతో ననర్గళంబుగా యుద్ధసన్నద్ధులై, యుద్ధంబునకుం జొచ్చి మునిశాప కారణంబున నుత్తుంగంబులయిన తుంగసమూహంబులు బడలుపడంగఁ బొడుచుచు, వ్రేయుచుం దాఁకునప్పుడు నవియును వజ్రాయుధ సమానంబులై తాఁకిన భండనంబునం బడి ఖండంబులై యొరగు కబంధంబులును, వికలంబులైన శరీరంబులును, విభ్రష్టంబులైన రథంబులును, వికటంబులైన శకటంబులును, వ్రాలెడు నశ్వంబులును, మ్రొగ్గెడి గజంబులునై, యయ్యోధనంబున నందఱుం బొలియుటకు నగి నగధరుండును రాముండునుం జని చని యంత నీలాంబరుం డొక్కత్రోవం బోయి యోగమార్గంబున ననంతునిం గలసె; న ప్పరమేశ్వరుండు మఱియొక మార్గంబునం జని యొక్క నికుంజపుంజంబు చాటున విశ్రమించుటం జేసి చరణంబు వేఱొక చరణంబుమీఁద సంఘటించి చంచలంబుగా వినోదంబు సలుపు సమయంబున నొక్క లుబ్ధకుండు మృగయార్థంబుగా వచ్చి దిక్కులు నిక్కి నిరీక్షించుచుండ, వృక్షంబు చాటున న ప్పరమపురుషుని చరణకమలంబు హరిణకర్ణంబు గాఁబోలు నని దానింగని శరంబు శరాసనంబు నందు సంధానంబు సేసి యేసిన నతండు హాహారవంబునం గదలుచుండ నప్పరమేశ్వరుని సన్నిధానంబునకు వచ్చి జగన్నాథుంగాఁ దెలిసి, భయంబున ‘మహాపరాధుండను; బాపచిత్తుండను; గుటిల ప్రచారుండ’నని యనేకవిధ దీనాలాపంబులం బలుకుచు బాష్పజల ధారాసిక్త వదనుండైన, సరోజనేత్రుండు వానిం గరుణించి యిట్లనియె. ‘నీ వేల జాలింబడెదు? పూర్వజన్మ కర్మంబు లెంత వారికైన ననుభావ్యంబులగుం గాని యూరకపోవ నేరవు; నీవు నిమిత్తమాత్రుండ; వింతియ కాని’ యని వానికిం దెలిపిన వాఁడును ‘మహాపరాధులైనవా రూరక పోవరు; దేవగురు వైష్ణవ ద్రోహులకు నిలువ నెట్లగు’ నని పవిత్రాంతఃకరణుండై ప్రాయోపవేశంబునం బ్రాణంబులు వర్జించి వైకుంఠ పదప్రాప్తుండయ్యె నప్పుడు. | 118 |
| క. |
దారుకుఁడు గనియె నంతటఁ, జారు నిరూఢావధాను సర్వజ్ఞు హరిన్ మేరునగధీరు దనుజ వి, దారుని నేకాంతపరునిఁదద్దయు నెమ్మిన్. |
119 |
| వ. | కని యత్యంతభయభక్తి తాత్పర్యంబుల ముకుళిత కరకమలుండై యిట్లనియె. | 120 |
| తే. |
‘నిన్నుఁజూడని కన్నులు నిష్ఫలములు, నిన్ను నొడువని జిహ్వ దా నీరసంబు నిన్నుఁగానని దినములు నింద్యములగుఁ, గన్నులను జూచి మమ్మును గారవింపు.’ |
121 |
| వ. | అనుచు నా దారుకుండు నిర్వేదనపరుండై యిట్లని విన్నవించె;’ యాదవసముద్రం బడంగె; బంధు గురుమిత్రజనంబు లక్కడక్కడం బోయిరి; ద్వారకకుం బోయి సుహృజ్జనంబులతోడ నేమందు?’ నని పలుకు నవసరంబున దివ్యాయుధంబులును, దివ్యరథరథ్యంబులు నంతర్ధానంబు నొందె; నారాయణుండు వానితో ‘నక్రూరవిదురులకు నీ వృత్తాంతం బంతయుఁజెప్పుము; సవ్యసాచిం గని స్త్రీబాల గురువృద్ధజనంబులఁ గరిపురంబునకుం గొని చను మనుము; పొమ్మనిన వాఁడును మరలి చని కృష్ణుని వాక్యంబులు సవిస్తరంబుగాఁ జెప్పె! నట్లు సేయు నాలోన ద్వారకానగరంబు పరిపూర్ణజలంబై మునింగె; నంత నెవ్వరికిం జనరాక యుండె; నప్పరమేశ్వరుండును శతకోటి సూర్యదివ్యతేజో విభాసితుండై వెడలి నారదాది మునిగణంబులును, బ్రహ్మరుద్రాది దేవతలును, జయజయ శబ్దంబుల తోడం గదలి రా నిజపదంబున కరిగె; నన్నారాయణ విగ్రహంబు జలధి ప్రాంతంబున జగన్నాథస్వరూపంబై యుండె’ నని శుకుండు పరీక్షిన్నరేంద్రునకుం జెప్పెనని చెప్పి. | 122 |
| క. |
ఈ కథ విన్నను వ్రాసినఁ, బ్రాకటముగ లక్ష్మి యశము భాగ్యము గలుగుం జేకొని యాయువు ఘనుఁడై, లోకములో నుండు నరుఁడు లోకులు వొగడన్. |
123 |
| చ. |
నగుమొగమున్ సుమధ్యమును నల్లని మేనును లచ్చి కాట ప ట్టగు నురమున్ మహాభుజము లంచితకుండలకర్ణముల్ మదే భ గతియు నీల వేణియుఁగృపారసదృష్టియుఁగల్గు వెన్నుఁడి మ్ముగఁబొడసూపుఁగాతఁగనుమూసిన యప్పుడు విచ్చినప్పుడున్. |
124 |
| క. |
రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులతిలకా! |
125 |
| మాలిని. |
ధరణి దుహితృరంతా! ధర్మమార్గానుగంతా! నిరుపమనయవంతా! నిర్జరారాతిహంతా! గురుబుధసుఖకర్తా! కోసలక్షోణిభర్తా! సురభయపరిహర్తా! సూరిచేతోవిహర్తా! |
126 |
| గద్య. | ఇది శ్రీపరమేశ్వరకరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రి పుత్త్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రియశిష్య వెలిగందల నారయ నామధేయప్రణీతంబైన శ్రీమహాభాగవతం బను మహాపురాణంబు నందుఁ గృష్ణుండు భూభారంబు వాపి యాదవుల కన్యోన్య వైరానుబంధంబుఁగల్పించి, వారల హతంబు గావించుటయు, విదేహర్షభ సంవాదంబును, నారాయణముని చరిత్రంబును, నాలుగు యుగంబుల హరి నాలుగు వర్ణంబులై వర్తించుటయు, బ్రహ్మాదిదేవతలు ద్వారకానగరంబునకుం జని కృష్ణుం బ్రార్థించి నిజపదంబునకుఁ రమ్మనుటయు, నవధూతయదుసంవాదంబును, నుద్ధవునకుఁగృష్ణుం డనేకవిధంబులైన యుపాఖ్యానంబు లెఱింగించుటయు, నారాయణప్రకారం బంతయు దారుకుం డెఱింగి వచ్చి ద్వారకా నివాసులకుం జెప్పుటయుఁ, గృష్ణుండు దన దివ్యతేజంబుతోఁ బరమాత్మం గూడుటయు నను కథలు గల యేకాదశ స్కంధము. | 127 |