| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ఏకాదశస్కంధము |
| ఉ. |
పంకజనాభుఁ డుద్ధవునిపైఁగల కూర్మిని జెప్పె నొప్ప నెం దంకిలి లేక యన్నిదిశలందుఁ జరించుచు నిత్యతృప్తుఁడై శంకరవేషధారి యొక సంయమి యా యదురాజుఁ జేర ‘నే వంకను నుండి వచ్చి’ తని వానికి నిట్లనె నర్థి నేర్పడన్. |
92 |
| క. |
అవధూత వల్కె నంతటఁ, ‘బ్రవిమలవిజ్ఞాననిపుణభవ్యులు గురువుల్ దవిలిన నిరువదినలువురు, నవనిన్ విజ్ఞాని నైతి’ నని పల్కుటయున్. |
93 |
| వ. | అంత యదుప్రవరుండు ‘దేహి లోభమోహాదుల వర్జించి జనార్దనుని నే విధంబునం జేరవచ్చు? నెఱింగింపు’ మనిన నతం డిట్లనియె. | 94 |
| సీ. |
పరధన పరదార పరదూషణాదులఁ బరవస్తు చింత దాఁ బరిహరించి ముదిమిచే రోగము లుదయింప కటమున్న తనువు చంచలతను దగులకుండ బుద్ధి సంచలతచేఁ బొదలక యట మున్న శ్లేష్మంబు గళమునఁ జేరకుండ శక్తియుక్తుల మది సన్నగిల్లక మున్న భక్తి భావనచేతఁ బ్రౌఢుఁడగుచు |
|
| తే. |
దైత్యభంజను దివ్యపాదారవింద, భజన నిజభక్తి భావనఁ బ్రాజ్ఞుఁ డగుచు నవ్యయానందమును బొందు ననుదినంబు, నతఁడు కర్మవిముక్తుఁడౌ ననఘచరిత! |
95 |
| ఉ. |
దారలయందు, బుత్త్రధనధాన్యములందు ననేక భంగులం గూరిమి సేయు మర్త్యుఁ డతిఘోర వియోగజ దుఃఖ మగ్నుఁడై నేరుపు దక్కి, చిక్కువడి నీతివివేకవిహీనుఁడై మనో భారముతోఁ గపోతపతిభంగి నిజంబుగఁ బోవు నష్టమై. |
96 |
| వ. | ఇందుల కొక్క యితిహాసంబు గలదు; మహారణ్యంబున నొక్కకపోతంబు దారసమేతంగా నొక్క నికేతనంబు నిర్మించి యన్యోన్యమోహాతిరేకంబునఁ గొంతకాలంబునకు సంతానసమృద్ధి గలదియై యపరిమితంబు లయిన పిల్లలు దిరుగాడుచుండఁ గొన్ని మాసంబులు భోగానుభవంబునం బొరలుచుండఁ గాలవశంబున నొక్క లుబ్ధకుం డురు లొడ్డిన నందు దారాపత్యంబులు దగులువడిన ధైర్యంబు వదలి మోహాతిరేకంబునం గపోతంబు కళత్ర పుత్త్ర స్నేహంబునం దాను నందుఁ జొచ్చి యధికచింతాభరంబునం గృశీభూతం బయ్యెఁ; గావున నతితీవ్రం బయిన మోహంబు గొఱగా దట్లుగాన నిరంతర హరిధ్యానపరుండై భూమి పవన గగన జల కృపీటభవ సోమ సూర్య కపోత తిలిప్స జలధి శలభ ద్విరేఫ గజ మధుమక్షికా హరిణ పాఠీన పింగళా కురర డింభక కుమారికా శరకృ త్సర్ప లూతా సుపేశకృత్సముదయంబులు మొదలుగాఁ గలవాని గుణగణంబు లెఱింగికొని యోగీంద్రులు మెలంగుదు; రనిన. | 97 |
| క. |
‘ఇవి తెలియవలయు నాకును, బ్రవిమలమతి వీనిఁ దెలియఁ బలుకు’ మనంగాఁ గ్రమమున వినుమని కృష్ణుఁడు, సవినయుఁడగు నుద్ధవునికిఁ జయ్యనఁ జెప్పెన్. |
98 |
| వ. | ఇ వ్విధంబున భూమివలన సైరణయు, గంధవహునివలన బంధురంబగు పరోపకారంబును, విష్ణుపదంబువలనఁగాలసృష్ట గుణసాంగత్యంబు లేమియు, నుదకంబు వలన నిత్యశుచిత్వంబును, నసిత పథునివలన నిర్మలత్వంబును, నిశాకరప్రభాకరులవలన నధికాల్పసమత్వ జీవ గ్రహణ మోక్షణంబులును, గపోతంబుల వలనఁగళత్రపుత్రస్నేహంబును, నజగరంబు వలన స్వేచ్ఛావిహార సమాగతాహారంబును, వననిధివలన నుత్సాహరోషంబులును, శలభంబువలన శక్త్యనుకూలకర్మాచరణంబును, భృంగంబువలన సారమాత్రగ్రహణవిశేషంబును, స్తంబేరమంబువలనం గాంతావైముఖ్యంబును, సరఘవలన సంగ్రహ గుణంబును, హరిణంబువలనం జింతాపరత్వంబును, జలచరంబు వలన జిహ్వాచాపల్యంబును, బింగళవలన యథాలాభసంతుష్టియుఁ, గురరంబువలన మోహపరిత్యాగంబును, డింభకువలన విచారపరిత్యాగంబును, గుమారికవలన సంగత్యాగంబును, శరకారునివలనం దదేకనిష్ఠయు, దందశూకంబువలనం బర గృహవాసంబును, నూర్ణనాభివలన సంసారపరిత్యాగంబును, గణుందురువలన లక్ష్యగత జ్ఞానంబు విడువకుండుటయు ననం గల వీనిగుణంబు లెఱింగి మఱియుఁగామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యంబులను నరిషడ్వర్గంబుల జయించి, జరామరణవిరహితంబుగా వాయువశంబు సేసి, గాత్రపవిత్రత్వంబుకొఱకు షట్కర్మనిరతుండయి, పురనగర గ్రామంబులు పరిత్యజించి పర్వతారణ్యంబుల సంచరించుచు, శరీరధారణార్థంబు నియతస్వల్పభోజనుండై, ఖేదమోదంబులు సరియకా భావించి లోభమోహంబులు వర్జించి, నిర్జితేంద్రియుండయి నన్నె కాని యొం డెఱుంగక యాత్మ నిష్ఠచేఁ బవిత్రాంతఃకరణుండైన యోగి నాయందుఁ గలయుం గావున. | 99 |
| క. |
మోహితుఁడై వసుకాంక్షా, వాహినిలోఁ జిక్కి క్రూరవశుఁడౌ మనుజుం డూహాపోహ లెఱుంగక, దేహము నలఁగంగఁ జేయు దీనత నెపుడున్. |
100 |
| వ. | ఇందులకుఁ బురాతన వృత్తాంతంబు గలదు; సావధానచిత్తుండవై వినుము. మిథిలానగరంబునఁ బింగళ యను గణికారత్నంబు గలదు. దానివలనం గొంత పరిజ్ఞానంబుఁగంటి? న దెట్లనిన న మ్మానిని ధనకాంక్షం జేసి యాత్మసఖుని మొఱంగి ధనం బిచ్చువానిం జేకొని నిజనికేతనాభ్యంతరంబునకుం గొని చని రాత్రి నిద్రలేకుండుచుఁ బుటభేదన విపణిమార్గంబులఁ బర్యటనంబు సలుపుచు నిద్రాలస్యభావంబున జడనుపడి, యర్థాపేక్షం దగిలి తిరిగి యలసి, యాత్మసుఖంబు సేయు నతండె భర్తయని చింతించి నారాయణు నిట్లు చింతింప నతనికైవల్యంబు సేరవచ్చునని విచారించి, నిజశయనస్థానాదికంబు వర్జించి వేగిరంబ వాసుదేవచరణారవిందవందనాభిలాషిణియై దేహంబు విద్యుత్ప్రకారంబని చింతించి పరమతత్త్వంబు నందుఁ జిత్తంబు గీలుకొలిపి ముక్తురాలయ్యెనని యెఱింగించి. | 101 |
| క. |
దేహము నిత్యముగా దని, మోహముఁ దెగఁగోసి సిద్ధమునివర్తనుఁడై గేహము వెలువడి నరుఁడు, త్సాహమునం జెందు ముక్తిసంపద ననఘా! |
102 |
| వ. | మఱియు నొక్కవిశేషం బయిన పురాతనపుణ్యకథ వినుము; కనకావతీపురంబున నొక్కధరామరుని కన్యకారత్నంబు గల; దవ్వధూతిలకంబు రత్నసమేతంబులగు కంకణంబులు ధరియించి బంధుజనంబులకుఁ బరమాహ్లాదంబుగా నన్నంబు గావించుటకొఱకు శాలితండులంబులు దంచునప్పుడు ముసలగ్రహణ భారంబునఁ గంకణంబు లతిరావంబుగా మ్రోయుచుండ న ప్పరమపతివ్రత యందులకు నసహ్యపడి యన్నియు డులిచి యొక్కటి నిలిపె; నట్లు గావునఁ దత్తఱపడక భగవదాయత్తంబైన యేకచిత్తంబునం బ్రసన్నచిత్తులై నరులు ముక్తు లగుదురు; గావున నవిద్యావిద్యలు నా మాయగా విచారించి, కేవలపశుమార్గులు కాక షడ్గుణైశ్వర్యసంపన్నులైన యోగీశ్వరులపగిది సుఖంబు గోరక యుండువారలు ముక్తులగుదురు; సర్వంబును విష్ణుమాయగాఁ దెలియు’ మని యుద్ధవునికిం జెప్పిన నతండు ‘దేవా! నీ రూపం బేలాగునం గానవచ్చు’ ననిన నతం డిట్లనియె. ‘భక్తిభావనపరాయణుండై కృపారసతత్పరుండై మితభాషణుండై బొంకక కర్మంబులు మదర్పణంబుగాఁ జేసినయతండు భాగవతుఁ డనం బరఁగు; మత్కథలును మజ్జన్మకర్మంబులును వినుచు మత్సేవకు లైన భాగవతులంజూచి తనగృహంబునకుం గొనిపోయి, మజ్జన పూజన భోజన శయనాసనాదికంబులఁ బరితుష్టులం జేసిన యతండైనను భాగవతుం డనఁబడు; నిట్లెంతకాలంబు జీవించు, నంతకాలంబును నడపు నతండు మద్రూపంబున వైకుంఠనిలయంబు నొందు; నదియునుంగాక గంధపుష్పధూపదీపనైవేద్యంబుల లక్ష్మీసమేతుండనై, శంఖ చక్ర గదాశార్‌ఙ్గాదియుక్తుఁడనైన నన్ను శుక సనకాది యోగీంద్రులును, నంబరీష విభీషణ రుక్మాంగదులు మొదలుగాఁగల భాగవతులును, శాస్త్రాచారచోదితులు గాక భక్తి భావనా విశేషంబున నేమఱక నిత్యంబును జింతనాయత్తులై యెఱింగిరి; మధురాపురంబునకు హలాయుధసమేతుండనై యే నరుగుచో, గోపిక లోపికలు లేక భక్తియోగంబునఁజింతించి ముక్తలై; రిది భక్తియోగప్రకారం’ బని యుద్ధవునికిం జెప్పిన. | 103 |
| క. |
‘ధ్యానం బేక్రియ నిలుచును?, ధ్యానం బే రీతిఁ దగు? నుదాత్తచరిత్రా! ధ్యానప్రకార మంత య, నూనంబుగఁ జెప్పుమయ్య యుర్వీరమణా!’ |
104 |
| వ. | అని యడిగిన న య్యాదవేంద్రుం డి ట్లని పలుకం దొడంగె; ‘దారుమధ్యభాగంబున ననలంబు సూక్ష్మరూపంబున వర్తించు చందంబున నందంబై సకలశరీరులయందు నచ్ఛేద్యుండు, నదాహ్యుండు, నశోష్యుండు నైన జీవుండు వసించి యుండు’ ననిన హరికి నుద్ధవుం డిట్లనియె; ‘సనకసనందనాది యోగీంద్రులకు యోగమార్గం బే రీతి నానతిచ్చితి, నది యే విధం? బానతీయవే’ యని యభ్యర్థించిన నతం డిట్లనియె; ‘వారలు చతుర్ముఖు నడిగిన నతండు, ‘నేనును దెలియనేర’ ననిన వారలు విస్మయం బందు చుండ నే నా సమయంబున హంసస్వరూపుండనై వారల కెఱింగించిన తెఱుంగు వినుము; పంచేంద్రియంబులకు దృష్టం బయిన పదార్థం బనిత్యంబు;నిత్యదృష్టి బ్రహ్మం బని తెలియవలయు; దేహి కర్మార్జితదేహుండై సంసారమమతలు నిరసించి, నిశ్చలజ్ఞానయుక్తుండై మత్పదప్రాప్తుండగు; స్వప్న లబ్ధపదార్థంబు నిజంబు గాని క్రియఁ గర్మానుభవపర్యంతంబు కళేబరంబు వర్తించు నని సాంఖ్యయోగంబున సనకాదుల కెఱింగించిన విని, బ్రహ్మ మొదలైన దేవత లెఱింగిరి; వారివలన భూలోకంబునఁ బ్రసిద్ధం బయ్యె; నది గావున నీవును నెఱింగికొని, పుణ్యాశ్రమంబులకుం జను; మస్మదీయభక్తి యుక్తుండును, హరిపరాయణుండు నైన యతనిచరణరజఃపుంజంబు తనశరీరంబు సోఁక జేయు నతండును, ముద్రాధారణపరులకును హరిదివ్యనామంబులు ధరియించువారలకు నన్నోదకంబుల నిడు నతండును, వాసుదేవభక్తులం గని హర్షించు నతండును, భాగవతుఁ’డని చెప్పి మఱియు ‘సర్వసంగపరిత్యాగంబు సేసి, యొండెఱుంగక నన్నే తలంచు మానవునకు భుక్తి ముక్తి ప్రదాయకుండనై యుండుదు’ నని యానతిచ్చిన నుద్ధవుండు ‘ధ్యానమార్గం బే రీతి? యానతీయ వలయు’ ననిన హరి యిట్లనియె; ఏకాంతమానసులై హస్తాబ్జంబు లూరుద్వయంబున సంధించి, నాసాగ్రంబున వీక్షణంబు నిలిపి, ప్రాణాయామంబున నన్ను హృదయగతుంగాఁ దలంచి, యష్టాదశధారణాయోగసిద్ధు లెఱింగి, యం దణిమాదులు ప్రధానసిద్ధులుగాఁ దెలిసి, యింద్రియంబుల బంధించి, మనం బాత్మయందుఁ జేర్చి, యాత్మ నాత్మతోఁ గీలించిన బ్రహ్మ పదంబుఁబొందు. భాగవతశ్రేష్ఠు లితరధర్మంబులు మాని నన్నుం గాంతురు; తొల్లి పాండునందనుఁడగు నర్జునుండు యుద్ధరంగంబున విషాదంబు నొంది యిట్ల యడిగిన నతనికి నేఁజెప్పిన తెఱం గెఱింగించెదఁ; జరాచరభూతంబయిన జగంబంతయు మదాకారంబుగా భావించి, భూతంబులందు నాధారభూతంబును, సూక్ష్మంబులందు జీవుండును, దుర్జయంబులందు మనంబును, దేవతలందుఁబద్మగర్భుండును, వసువులందు హవ్యవాహుండును, నాదిత్యులందు విష్ణువును, రుద్రులందు నీలలోహితుండును, బ్రహ్మలందు భృగువును, ఋషులందు నారదుండును, ధేనువులందుఁ గామధేనువును, సిద్ధులయందుఁ గపిలుండును, దైత్యులయందుఁ బ్రహ్లాదుండును, గ్రహంబులందుఁ గళానిధియును, గజంబులయం దైరావతంబును, హయంబులయం దుచ్చైశ్శ్రవంబును, నాగంబులందు వాసుకియును, మృగంబులందుఁ గేసరియు, నాశ్రమంబు లందు గృహస్థాశ్రమంబును, వర్ణంబులయం దోంకారంబును, నదులందు గంగయు, సాగరంబులయందు దుగ్ధసాగరంబును, నాయుధంబులందుఁ గార్ముకంబును, గిరులందు మేరువును, వృక్షంబులయం దశ్వత్థంబును, నోషధులయందు యవలును, యజ్ఞంబులయందు బ్రహ్మయజ్ఞంబును, వ్రతంబులం దహింసయు, యోగంబులం దాత్మయోగంబును, స్త్రీలయందు శతరూపయు, భాషణంబుల యందు సత్యభాషణంబును, ఋతువులందు వసంతాగమంబును, మాసంబులలో మార్గశీర్షంబును, నక్షత్రంబులలో నభిజిత్తును, యుగంబులందుఁగృతయుగంబును, భగవదాకారంబులందు వాసుదేవుండును, యక్షులలోఁ గుబేరుండును, వానరులం దాంజనేయుండును, రత్నంబులందుఁ బద్మరాగంబును, దానంబులలో నన్నదానంబును, దిథులయం దేకాదశియు, నరులయందు వైష్ణవుండై భాగవతప్రవర్తనం బ్రవర్తించువాఁడును - నివి యన్నియు మద్విభూతులుగా నెఱుంగు’మని కృష్ణుం డుద్ధవునకు నుపన్యసించిన వెండియు నతండి ట్లనియె. | 105 |
| క. |
వర్ణాశ్రమధర్మంబులు, నిర్ణయముగ నానతిమ్ము నీరజనాభా! కర్ణరసాయనముగ నవి, వర్ణింపుము, వినెద నేఁడు వనరుహనేత్రా! |
106 |
| వ. | అనినం గృష్ణుండు నాలుగువర్ణంబుల యుత్పత్తియు నాలు గాశ్రమంబుల కిట్టిట్టి వర్హంబు లన్నియును, నాలుగువేదంబులం జెప్పిన ధర్మంబులును, బ్రవృత్తినివృత్తిహేతువులగు పురాణేతిహాసశాస్త్రంబులును, వైరాగ్య విజ్ఞానంబులును నివి మొదలుగాఁగల వన్నియు నెఱింగించి, “సర్వధర్మాన్పరిత్యజ్య మా మేకం శరణం వ్రజ” యను నుపనిషత్తుల్యంబగు గీతావచనప్రకారంబున నెవ్వఁడేని నా యందు మతి గలిగి వర్తించువాఁడు నే నని పలుకంబడుఁ; బెక్కు విధంబుల వాదంబు లేల? యని యెందును దగులువడక నామీఁదఁదలంపు గలిగి వర్తింపు’ మనిన నుద్ధవుం డిట్లనియె. | 107 |
| క. |
‘తెలియనివి కొన్ని సెప్పితి; తెలియంగల వెల్ల నింకఁ దెలుపుము కృష్ణా! వల నెఱిఁగి మెలఁగవలయును, నలినాసనజనక! భక్తనతపదయుగళా!’ |
108 |
| వ. | అని యుద్ధవుం డడగినం బ్రబుద్ధమనస్కుండయిన పుండరీకాక్షుండు ‘నీ ప్రశ్నంబులు దుర్లభంబు లయినను వినుము; నియమశమదమాదులు దపంబును సుఖదుఃఖంబులు స్వర్గనరకంబులు ననం బరఁగినవి యెవ్వి, దరిద్రుం డెట్టివాఁ డీశ్వరుం డెవ్వం, డని నీవు న న్నడిగిన యర్థంబు లెల్ల వేఱు వేఱ వివరించెద; మౌనవ్రతబ్రహ్మచర్యక్షమాజపతపంబులును, నతిథిసత్కారంబును, బరహితంబును జౌర్యాది రహితత్వంబును ననునివి మొదలైనవి నియమంబు లనందగు; నింద్రియనిగ్రహంబును, శత్రుమిత్ర సమత్వంబును శమం బనంబరఁగు; మూఢజనులకు జ్ఞానోపదేశంబును, గామ్యత్యాగంబును, సమదర్శనంబును, వైష్ణవసమూహంబులతోడి భక్తియుఁ, బ్రాణాయామంబును, జిత్తశుద్ధియు ననునివి కలిమివిద్య యనంబడు; శమదమాదిగుణరహితుండును, మద్భక్తివిరహితుండును నగుట యవిద్య యనందగుఁ; జిత్తశుద్ధి గలిగి నిత్యతృప్తుండౌట దమం; బిట్టినియమాదిగుణసహితత్వంబును మద్భక్తియుక్తియు ననునదియే సుఖంబు; నన్నెఱుంగలేక తమోగుణంబునం బరఁగుటయె దుఃఖం బనంబడు; బంధుగురు జనంబులయెడ భేదబుద్ధి నొంది, శరీరంబు నిజగృహంబుగా భావించినవాఁడె దరిద్రుం; డింద్రియ నిరసనుండును, గుణసంగవిరక్తుండు నైనవాఁడె యీశ్వరుండు; నాయందుఁ దలంపు నిలిపి, కర్మయోగంబునందును, భక్తి యోగంబునందును వాత్సల్యంబు గలిగి జనకాదులు కైవల్యంబుఁ జెందిరి; భక్తియోగంబునం జేసి బలిప్రహ్లాద ముచుకుందాదులు పరమపదప్రాప్తులై; రది గావున నిది యెఱింగి నిరంతరభక్తియోగం బధికంబుగా నీ మనంబున నిలుపుము; మృణ్మయం బైన ఘటంబున జలంబులు జాలుగొను తెఱంగున దినదినంబునకు నాయువు క్షయంబై మృత్యువు సన్నిహితంబై వచ్చుఁ గావున నిది యెఱింగి నిరతరంబును న న్నేమఱక తలంచుచుండు నతండు నాకుం బ్రియుండు. | 109 |
| క. |
‘గర్భమునఁ బరిజ్ఞానము, నిర్భరమై యుండు జీవునికిఁ దుది నతఁడా విర్భూతుఁడైనఁ జెడు నం, తర్భావం బైన బోధ మంతయు ననఘా! |
110 |
| వ. | అట్లు గావున జనుండు బాల్య కైశోర కౌమార వయోవిశేషంబుల వెనుక నైననుం, బెద్దయైన వెనుకనైనను, న న్నెఱింగెనేనిఁగృతకృత్యుండగుఁ, సంపద్గర్వాంధుండైన నంధకారకూపంబునం బడు; వానిం దరిద్రునింగాఁ జేసిన జ్ఞానియై యస్మత్పాదారవింద వందనాభి లాషియై ముక్తుండగు; నట్లు గావున దేహాభిమానంబు వర్జించి యైహికాముష్మిక సుఖంబులఁగోరక మనంబు గుదియించి యే ప్రొద్దు నన్నుఁ దలంచువాఁడు వైకుంఠపదప్రాప్తుండగు; నేను నతని విడువంజాలక వెనువెంట నరుగుదు; నారదాది మునులు భక్తిభావంబునం జేసి నా రూపంబై’ రని యుద్ధవునకుం జెప్పిన నతండు మఱియు నిట్లనియె. | 111 |
| క. |
అయ్యా! దేవ! జనార్దన!, నెయ్యంబున సృష్టికర్త నేర్పరియై తా నొయ్యన నడపును నెవ్వఁడు, సయ్యన నెఱిఁగింపవయ్య! సర్వజ్ఞనిధీ!’ |
112 |
| వ. |
అనుటయు హరి యుద్ధవునకుం జెప్పె; ‘నట్లు మత్ప్రేరితంబులై మహదాది గుణంబులు గూడి యండంబై యుద్భవించె; నా యండంబువలన నే నుద్భవించితి; నంత నా నాభివివరంబున బ్రహ్మ యుదయించె; సాగరారణ్యనదీనదసంఘంబులు మొదలుగాఁగల జగన్నిర్మాణంబు లతని వలనం గల్పించితి; నంత శతానందులకు శతాబ్దంబులు పరిపూర్ణంబైన ధాత్రి గంధంబునం దడంగు; నాగంధం బుదకంబునం గలయు; నా యుదకంబు రసంబున లీనం బగు; నా రసంబు తేజోరూపం బగు; నా తేజంబు రూపంబున సంక్రమించు; నా రూపంబు వాయువందుం గలయు; వాయువు స్పర్శగుణ సంగ్రాహ్యం బైన స్పర్శగుణం బాకాశంబున లయంబగు; నా యాకాశంబు శబ్దతన్మాత్రచే గ్రసియింపఁబడిన నింద్రియంబులు మనోవైకారిక గుణంబులం గూడి యీశ్వరునిం బొంది, యీశ్వరరూపంబు దాల్చు; నేను రజస్సత్త్వ తమోగుణ సమేతుండనై త్రిమూర్తులు వహించి, జగదుత్పత్తి స్థితిలయ కారణుండనై వర్తి ల్లుదుఁ; గావున నీ రహస్యంబు నీకు నుపదేశించితిఁ, బరమ పావనుండవుఁబరమ భక్తి యుక్తుండవుగ’ మ్మని చెప్పె; నంత. |
113 |
| ఆ. |
రూపు లేని నీకు రూఢిగా యోగులు, రూపు నిల్పి నిన్ను రుచిరభక్తిఁ గొల్చి యుండ్రు; వారికోర్కుల నిచ్చెద, వేమిలాగు? నాకు నెఱుఁగఁబలుకు. |
114 |
| వ. | అని యుద్ధవుం డడిగిన నారాయణుం డిట్లనియె; ‘నేను సర్వవర్ణంబులకు సమంబైన పూజాప్రకారం బెఱింగించెద; నాచారంబునంజేసి యొకటిఁబాషాణమృణ్మయదారువులం గల్పించి, నాదరూపంబుగా నిల్పికొని కొందఱు పూజింతురు; కాంస్య త్రపు రజత కాంచన ప్రతిమావిశేషంబు లుత్తమంబు; లిట్లు నా ప్రతిమా రూపంబు లందు మద్భావంబుంచి కొల్చినవారికి నేఁబ్రసన్నుం డనగుదు; నీ లోకంబున మనుష్యులకు ధ్యానంబు నిలువనేరదు; గావునం బ్రతిమావిశేషంబు లనేకంబులు గలవు; వానియందు సౌందర్యసారంబులు మనోహరంబులు నైన రూపంబుల మనఃప్రసన్నుండనై నే నుండుదుఁ; గావున దుగ్ధార్ణవశాయిఁగా భావించి ధౌతాంబరాభరణ మాల్యానులేపనంబులను, దివ్యాన్నపానంబులను, షోడశోక్త ప్రకారంబుల రాజోపచారంబులను, బాహ్య పూజావిధానంబుల నాచరించి మత్సంకల్పితంబులైన పదార్థంబులు సమర్పించి, నిత్యంబును నాభ్యంతర పూజావిధానంబులం బరితుష్టునిం జేసి; దివ్యాంబరాభరణ మాల్యశోభితుండును, శంఖచక్ర కిరీటాద్యలంకార భూషితుండును, దివ్యమంగళ విగ్రహుండునుగాఁ దలంచి ధ్యానపరవశుండైన యతండు నాయందుఁ గలయు; నుద్ధవా! నీ వీ ప్రకారంబు గరిష్ఠనిష్ఠాతిశయంబున యోగనిష్ఠుండవై, బదరికాశ్రమంబు సేరి మత్కథితంబైన సాంఖ్యయోగం బంతరంగంబున నిల్పుకొని, కలియుగావసాన పర్యంతంబు వర్తింపు’ మని యప్పమేశ్వరుం డానతిచ్చిన నుద్ధవుండు నానందభరితాంతరంగుండై తత్పాదారవిందంబులు హృదయంబునం జేర్చుకొని, పావనంబైన బదరికాశ్రమంబునకు నరిగె’ నని శుకుండు పరీక్షిన్నరేంద్రునకుం జెప్పుటయు. | 115 |
| క. |
చెప్పిన విని రాజేంద్రుఁడు, సొప్పడ ‘శ్రీకృష్ణుకథలు చోద్యము గాఁగం జెప్పినఁదనియదు చిత్తం, బొప్పుఁగ మునిచంద్ర! నాకు యోగులు మెచ్చన్. |
116 |
| తే. |
అంతటను గృష్ణుఁడేమయ్యె? నరసిచూడ, యదువు లెట్టులు వర్తించి రేర్పడంగ ద్వారకాపట్టణం బె వ్విధమున నుండె, మునివరశ్రేష్ఠ! యానతీ ముదముతోడ.’ |
117 |