పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము
కృష్ణుం డుద్ధవునకుఁ బరమార్థోపదేశము సేయుట
వ. ఇట్లు నుతియించి ‘దేవా! నీవు యదుక్షయంబు గావించి చనిన నే మేవిధంబున నిర్వహింతుము? నీ సహచరులమై జరిపిన మజ్జన భోజన శయనాసనాది కృత్యంబులు మఱవ వచ్చునే?’ యని యుద్ధవుం డాడిన వాసుదేవుం డిట్లనియె; ‘బ్రహ్మాదిదేవతాప్రార్థనంబునం జేసి ధాత్రీభారంబు నివారించితి; నింక ద్వారకానగరంబు నేఁటికి సప్తమ దివసంబున సముద్రుండు ముంపంగలవాఁడు; యదుక్షయంబునుం గాఁగల యది; యంతటం గలియుగంబునుం బ్రాప్తంబయ్యెడి, నందు మానవులు ధర్మవిరహితులు, నాచారహీనులు, నన్యాయపరులును, నతిరోషులు, మందమతులు, నల్పతరాయువులు, బహురోగపీడితులు, నిష్ఫలారంభులు, నాస్తికులునై యొండొరుల మెచ్చక యుందురు; గావున నీవు సుహృద్బాంధవ స్నేహంబు వర్జించి, యింద్రియసౌఖ్యంబులం బొరయక క్షోణితలంబునం గల పుణ్యతీర్థంబుల నవగాహనంబు సేయుచు, మానస వాగక్షి శ్రోత్ర ఘ్రాణేంద్రియ గృహ్యమాణంబగు వస్తుజాతం బెల్ల నశ్వరంబుగా నెఱుంగుము; పురుషుండు నానార్థకామంబుల నంగీకరించి నిజగుణదోషంబుల మోహితుండై యుండుం; గావున హస్తిపకుండు గంధనాగంబుల బంధించుచందంబున నింద్రియంబులను, మనోవికారంబులను నిగ్రహించి యేషణత్రయంబును వర్జించి, మోదఖేదంబుల సముండవుగా వర్తించుచు, నీ జగం బంతయు నాత్మాధిష్ఠితంబుగా నెఱింగి, మాయాదు లాత్మతత్త్వాధీనంబులుగాఁ దెలియుచు, జ్ఞానవిజ్ఞానయుక్తుండవై యాత్మానుభవసంతుష్టుండవై, విశ్వంబును నన్నుఁగా భావించి, వర్తింప వలయు’నని వాసుదేవుం డానతిచ్చిన నుద్ధవుండు భక్తిభయవినయంబులం గరంబులు మొగిడ్చి ‘మహాత్మా! సన్న్యస్తలక్షణంబు దుష్కరంబు; పామరులగువార లాచరింపలేరు; నీ మాయచేత భ్రాంతులైన సాంసారికులు భవాబ్ధిం గడచి యెట్లు ముక్తి వడయుదురు? భృత్యుండనైన నామీఁది యనుగ్రహంబునం జేసి, యానతిమ్ము; బ్రహ్మాదిదేవతా సముదయంబును, బాహ్యవస్తువుల భ్రాంతులై పర్యటనంబు సేయుదురు; నీ భక్తులైన పరమభాగవతు లమ్మాయానిరసనంబును సేయుదురు; గృహిణీ గృహస్థుల కైన, యతులకైన నిత్యంబును నీ నామస్మరణంబు మోక్షసామ్రాజ్యపదంబు; గావునఁ బరమేశ్వరా! నీదు చరణంబుల శరణంబు నొందెదఁ; గృపారసంబు నాపై నిగిడింపు’ మని ప్రియసేవకుండైన యుద్ధవుండు పలికిన నతనికిఁ గంసమర్దనుం డిట్లనియెఁ; ‘బురుషున కాత్మకు నాత్మయె గురువని యెఱుంగుము! కుపథంబులం జనక, సన్మార్గవర్తివై పరమంబైన మన్నివాసంబునకుం జనుము. సర్వమూలశక్తిసంపన్నుండనైన నన్ను సాంఖ్యయోగపరులు నిరంతర భావంబులందుఁ బురుషభావంబు గావించి తలంచుచుందురు! మఱియు నేక ద్వి త్రి చతుష్పాదబహుపాదా పాదంబులునై యుండు జీవజాలంబులోన ద్విపాదంబులు గల మనుష్యులు మేలు; వారలలోన నిరంతరధ్యానగరిష్ఠులైన యోగీంద్రు లుత్తములు; వారలలో సందేహపరులచే నగ్రాహ్యుండగు నన్ను సత్త్వగుణ గ్రాహ్యునిఁగా నెఱింగి నిజచేతఃపంకజంబునందు జీవాత్మ పరమాత్మల నేకంబుగాఁ జేసి, శంఖచక్రగదాఖడ్గ శార్‌ఙ్గ కౌమోదకీ కౌస్తుభాభరణయుక్తుంగా నెఱుంగుచు నుండువారలు పరమయోగీంద్రు లనియు, బరమజ్ఞాను లనియునుం జెప్పి మఱియు “నవధూత యదు సంవాదం” బను పురాతనేతిహాసంబు గలదుఁ సెప్పెద నాకర్ణింపుము. 91
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - EkAdaSa skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )