పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము
కృష్ణుండు దుర్నిమిత్తములం గని యాదవుల నెల్ల ద్వారకనుండి ప్రభాస తీర్థమునకుఁ బంపుట
సీ. కాక ఘూకంబులు గనకసౌధములలోఁ బగలు వాపోయెడి బహువిధముల
నశ్వవాలములందు ననల ముద్భవ మయ్యె నన్నంబు మొలిచె మహాద్భుతముగ
శుకశారికలు రాత్రి సొగసె విస్వరముల జంతువు వేఱొక్క జంతువుఁ గనె
నొగిఁ బౌరగృహముల నుల్కలు నుదయించె బెరసెఁ గావిరి రవిబింబ మపుడు.
 
తే. గాన నుత్పాతములు సాలఁ గానఁబడియె, నరయ నిందుండ వలవదు యదువులార!
తడయ కిపుడ ప్రభాసతీర్థమున కరుగుఁ, డనుచు శ్రీకృష్ణుఁ డెంతయు నానతిచ్చె.
87
క. నారాయణువచనముల క, పారంబగు సమ్మదమున బలములతోడన్‌
దార సుత మిత్ర యుతులై, వారణ హయ సమితితోడ వడి నేఁగి రొగిన్‌.
88
వ. అంత. 89
క. జ్ఞానమున నుద్ధవుఁడు దన, మానసమున నెఱిఁగి ‘శ్రీరమాధిప! హరి! యో
దీనజనకల్పభూజ! సు, ధీనాయక! మాకు నీవె దిక్కని పొగడెన్‌.
90
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - EkAdaSa skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )