| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ద్వాదశస్కంధము |
| క. |
శ్రీ మరుదశనపతిశయన!, కామిత మునిరాజ యోగి కల్పద్రుమ! యు ద్దామ! ఘనజనకవరనృప, జామాతృవరేశ! రామచంద్రమహీశా! |
1 |
| వ. | మహనీయ గుణగరిష్ఠులగు న మ్మునిశ్రేష్ఠులకు నిఖిలపురాణవ్యాఖ్యానవైఖరీసమేతుండైన సూతుం డిట్లనియె; నట్లు పరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుండు వాసుదేవ నిర్యాణ పర్యంతంబుఁ దజ్జన్మ కర్మంబులు సెప్పిన విని సంతసం బంది య న్నరపాలపుంగవుండు ‘మహాత్మా, నారాయణ కథా ప్రపంచంబును, దద్గుణంబులును, నాచారవిధియును, జీవాత్మభేదంబును, హరిపూజా విధానంబును, జ్ఞానయోగ ప్రకారంబును మొదలైనవి యెఱింగించి విజ్ఞానవంతుంగాఁ జేసి మన్నించితి; వింక భావికార్యంబు లన్నియు నెఱింగింపు’ మనిన శుకుండు రాజున కిట్లనియె. | 2 |