| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ద్వాదశస్కంధము |
| క. |
నరవర! యీ ప్రశ్నములకు, సరి సెప్పఁగ రాదు; నేను సామర్థ్యము చేఁ బరికించి నీకుఁజెప్పెదఁ, గర మొప్పఁగ భావికాలగతులన్ వరుసన్. |
3 |
| వ. | అందు రాజులప్రకారం బెఱింగించెద; బృహద్రథునకుం బురంజయుండు పుట్టు; వానికి శునకుం డనెడివాఁడు మంత్రియై పురంజయునిం జంపి తా రాజ్యం బేలుచుండు; నంతఁగొంతకాలంబున కతనికిం గుమారుం డుదయించిన వానికిఁబ్రద్యోతననామం బిడి పట్టంబు గట్టు; నా భూభుజునకు విశాఖరూపుం డదయింపంగలం; డాతనికి నందివర్ధనుండు జన్మించు; నీ యేవురు నూటముప్పది యెనిమిది సంవత్సరములు వసుంధరా పరిపాలనంబునం బెంపు వడయుదురు! తదనందరంబ శిశునాగుండను పార్థివుండుదయించు; నా మూర్ధాభిషిక్తునకుఁగాకవర్ణుండు, జనియించు, నా రాజన్యునకు క్షేమవర్ముఁడుదయింపఁగలం; డా పృథ్వీపతికి క్షేత్రజ్ఞుం, డతనికి విధిసారుండును, విధిసారున కజాతశత్రుండు, నా భూపాలునకు దర్భకుండును, దర్భకునికి నజయుండు, నతనికి నందివర్ధనుండు, నతనికి మహానందియు ననంగల శైశునాగులు పదుండ్రు నరపాలకులుద్భవించి షష్ట్యుత్తరత్రిశతహాయనంబులు గలికాలంబున ధరాతలం బేలుదు; రంతట మహానందికి శూద్రస్త్రీ గర్భంబున నతి బలశాలి యయిన మహాపద్మపతి యను నందనుం డుదయించు; నతనితో క్షత్రియవంశం బడంగిపోఁగల; దా సమయంబున నరపతులు శూద్రప్రాయులై ధర్మ విరహితులై తిరుగుచుండ మహాపద్మునకు సుమాల్యుం డాదిగాఁగల యెనమండ్రు కుమారు లుదయించెదరు; వారు నూఱుసంవత్స రంబులు క్షోణితలం బేలెద; రంతటఁగార్ముకుండు మొదలుగా రాజనవకంబు నందాఖ్యలం జనియించు; నా నవనందుల నొక భూసురోత్తముం డున్మూలనంబు సేయు; నప్పుడు వారు లేమిని మౌర్యులు గొంతకాలం బీ జగతీ తలంబు నేలుదు; రత్తఱి నా భూదేవుండు చంద్రగుప్తుం డను వానిం దన రాజ్యంబందు నభిషిక్తుంగాఁ జేయంగలం; డంత నాచంద్ర గుప్తునకు వారిసారుండును, వానికి నశోకవర్ధనుండు, నతనికి సుయశస్సును, వానికి సంయుతు, డమ్మహనీయునకు శాలిశూకుం డతనికి సోమశర్ముండు, వానికి శతధన్వుండు, న వ్వీరునకు బృహద్రథుండు నుదయించెదరు; మౌర్యులతోఁజేరిన యీ పదుగురును సప్తత్రింశదుత్తరశతాబ్దం బులు నిష్కంటకంబుగా భూపరిపాలనంబు సేసెద; రా సమయంబున బృహద్రథుని సేనాపతియగు పుష్యమిత్రుఁడు శుంగాన్వయుఁడతని వధించి రాజ్యంబు గైకొను; నతనికి నగ్ని మిత్రుం డను నరపతి పుట్టఁగలవాఁ; డాతనికి సుజ్యేష్ఠుండు, సుజ్యేష్ఠునకు వసుమిత్రుండు, నతనికి భద్రకుండును, భద్రకునకుఁ బుళిందుండు, నా శూరునకు ఘోషుండును, వానికి వజ్రమిత్రుండును, నతనికి భాగవతుండును, వానికి దేవభూతియు నుద్భవించెద; రీ శుంగులు పదుండ్రును ద్వాదశోత్తరశతహాయనంబు లుర్వీపతు లయ్యెద; రంతమీఁదట శుంగకులసంజాతుండైన దేవభూతిని గణ్వామాత్యుండగు వసుదేవుం డనువాఁడు వధియించి, రాజ్యం బేలు; వానికి భూమిత్రుండు, న మ్మహానుభావునకు నారాయణుండును గలిగెదరు; కణ్వవంశజులైన వీరలు మున్నూట నలువదేను సంవత్సరంబులు మేదినీతలం బేలుదురు; మఱియును. | 4 |
| క. |
చతురత నీ క్షితి నేలియు, మతిమోహము విడువలేక మానవనాథుల్ సతతముఁదమ కీ కాలం, బతిచంచల మగుట నెఱుఁగరయ్య మహాత్మా! |
5 |
| క. |
నరపతులమహిమ నంతయు, నురగాధిపుఁడైన నొడువ నోపఁడు; ధాత్రిం జిరకాల మేలి యిందే, పరువడి నడఁగుదురు వారు భ్రాంతులు నగుచున్. |
6 |
| క. |
గజతురగాదిశ్రీలను, నిజమని నమ్మంగ రాదు; నిత్యమును హరిన్ గజిబిజి లేక తలంచిన, సుజనులకును నతనియందుఁజొరఁగా వచ్చున్. |
7 |
| వ. | మఱియుఁగణ్వవంశజుండగు సుశర్ముండను రా జుదయించిన వాని హింసించి తద్భృత్యుం డంధ్ర జాతీయుం డయిన వృషలుం, డధర్మమార్గవర్తియై, వసుమతీచక్రం బవక్రుండై యేలునంత వాని యనుజుండు కృష్ణుం డనువాఁడు రాజై నిలుచు; నా మహామూర్తికి శాంతకర్ణుండును, వానికిఁబౌర్ణమాసుండును, వానికి లంబోదరుండును, వానికి సిబిలకుండు, నతనికి మేఘస్వాతియు, వానికి దండమానుండును, వానికి హాలేయుం డగు నరిష్టకర్మయు, నతనికిఁదిలకుండు, నతనికిఁబురీష సేతుండును, వానికి సునందనుండును, నా రాజశేఖరునకు వృకుండును, వృకునకు జటాపుండును, జటాపునకు శివస్వాతియు, వానికి నరిందముండు, నా భూమీశునకు గోమతియును, వానికిఁబురీమంతుండు, నతనికి దేవశీర్షుండును, వానికి శివస్కందుండును, నతనికి యజ్ఞశీలుండు, నాభవ్యునకు శ్రుతస్కందుండు, వానికి యజ్ఞశత్త్రుండు, వానికి విజయుం, డవ్విజయునికిఁజంద్రబీజుం, డతనికి సులోమధియు నిట్లు పెక్కం డ్రుదయించి నన్నూట యేఁబదియారు హాయనంబులు ధాత్రిం బాలించెద; రంత నాభీరు లేడ్వురు, గర్దభులు పదుండ్రు, గంకవంశజులు పదాఱుగురు, మేదినీభరంబు దాల్చియుండెద; రటమీఁద యవనులెనమండ్రు, బర్బరులు పదునల్గురు దేశాధీశులై యేలెదరు; మఱియుం బదుమువ్వురు గురుండులును, బదునొకండ్రు మౌనులును, వేయుందొమ్మన్నూట తొమ్మిది హాయనంబులు గర్వాంధులయి యేలెద; రటమీఁద నా మౌనవంశజు లగు పదునొకండ్రు త్రిశతయుతంబైన వత్సరంబులు మత్సరంబున నేలెద; రాసమయంబున, గైలికిలు లను యవనులు భూపతు లగుదు; రంత భూతనందుండు నవభంగిరుండు శిశునందుండుఁదద్భ్రాతయగు యశోనందుండుఁబ్రవీరకుండు- వీరలు వీరులై షడుత్తరశత హాయనంబు లేలెద; రంత నా రాజులకుఁ బదుమువ్వురు కుమారు లుదయంచి యందు నార్గురు బాహ్లికదేశాధిపతు లయ్యెదరు; కడమ యేడ్వురును గోసలాధిపతు లయ్యెద; రంత వైడూర్యపతులు నిషధాధిపతులై యుండెదరు; పురంజయుండు మగధ దేశాధిపతియై పుట్టి, పుళింద యదు మద్ర దేశవాసులగు హీనజాతిజనులు బ్రహ్మజ్ఞానహీనులై హరిభక్తి విరహితులై యుండ, వారికి ధర్మోపదేశంబు సేసి, నారాయణభక్తి నిత్యంబు నుండునట్లుగాఁజేసి, బలపరాక్రమవంతులైన క్షత్త్రియవంశంబు లడంచి, పద్మావతీనగర పరిపాలకుండై యా గంగా ప్రయాగ పర్యంతం బగు భూమి నేలఁగలండు; శూద్రప్రాయులగు రాజులును, వ్రాత్యులును, బాషండులు నగు విప్రులును గలిగి సౌరాష్ట్రావంత్యాభీరార్బుద మాళవదేశాధిపతు లయ్యెదరు; సింధుతీరంబులఁజంద్రభాగా ప్రాంతంబులఁగాశ్మీర మండలంబున మేధాహీనులై మ్లేచ్ఛాకారులగు రాజులు భూభాగం బేలుచు, ధర్మసత్యదయాహీనులై, క్రోధమాత్సర్యంబుల, స్త్రీబాలగోద్విజాతుల వధియింప రోయక, పరధన పరస్త్రీ పరులై, రజస్తమోగుణరతులై, యల్పజీవులై, యల్పబలులై హరిచరణారవింద మకరంద రసాస్వాదులు గాక తమలో నన్యోన్యవైరానుబంధులై సంగ్రామరంగంబుల హతు లయ్యెద; రా సమయంబునఁబ్రజలు తచ్ఛీల వేష భాషాదుల ననుసరించి యుండెదరు; కావున. | 8 |
| క. |
దినదినమును ధర్మంబులు, ననయము ధర నడఁగిపోవు నాశ్చర్యముగా విను వర్ణ చతుష్కములో; నెనయఁగ ధనవంతుఁడైన నేలు ధరిత్రిన్. |
9 |
| క. |
బలవంతుఁడైనవాఁడే, కులహీనుండైన దొడ్డగుణవంతుఁడగుం గలిమియు బలిమియుఁగలిగిన, నిల లోపల రా జతండె; యేమన వచ్చున్? |
10 |
| వ. | అట్లుగాన జనంబులు లోభులై జారత్వ చోరత్వాదులచేత ద్రవ్యహీనులై వన్యశాక మూలఫలంబులు భుజించుచు, వన గిరి దుర్గంబులం గృశీభూతులై దుర్భిక్ష శీత వాతాతప క్షుధా తాపంబులచేత భయంపడి, ధనహీనులై యల్పాయుష్కులు, నల్పతర శరీరులునై యుండ రాజులు చోరులై సంచరించుచు, నధర్మ ప్రవర్తనులై వర్ణాశ్రమ ధర్మంబులు విడనాడి, శూద్రప్రాయులై యుండెద; రంత నోషధు లల్పఫలదంబులు, మేఘంబులు జలశూన్యంబులు, సస్యంబులు నిస్సారంబులు నగు; నిట్లు ధర్మ మార్గంబు దక్కి యున్న యెడ ముకుందుండు దుష్టనిగ్రహ శిష్టపరిపాలనంబుల కొఱకు శంబలగ్రామంబున విష్ణుయశుండను విప్రునకుఁగల్క్యవతారుండై దేవతాబృందంబులు నిరీక్షింప, దేవదత్త ఘోటకారూఢుండై దుష్టమ్లేచ్ఛ జనంబులం దన మండలాగ్రంబున ఖండీభూతులం జేయు; నప్పుడు ధాత్రీమండలంబు విగతక్రూర జనమండలంబై తేజరిల్లు; నంత నరులు విష్ణుధ్యానవందన పూజాదివిధానాసక్తులై నారాయణ పరాయణులయి వర్తిల్లెద; రిట్లు కల్క్యవతారంబున నిఖిల జనులు ధన్యు లయ్యెద; రంతటఁగృతయుగ ధర్మంబయి నడచుచుండుఁ జంద్ర భాస్కర శుక్ర గురువు లేకరాశి గతు లయినం, గృతయుగం బయి తోఁచు; రాజేంద్రా! గత వర్తమాన భావికాలంబులు భవజ్జన్మంబు మొదలు నందాభిషేక పర్యంతంబుఁబంచదశాధికశతోత్తర సహస్ర హాయనంబు లయియుండు; నంతట నారాయణుం డఖిలదుష్ట రాజధ్వంసంబు గావించి ధర్మంబు నిలిపి వైకుంఠనిలయుం డగు నని చెప్పిన. | 11 |
| క. |
‘మునినాథ! యే విధంబున, ఘనతరముగఁజంద్రసూర్య గ్రహముల జాడల్ సనుఁ? గాలవర్తనక్రమ, మొనరఁగ నెఱిఁగింపవయ్య ముదము దలిర్పన్.’ |
12 |
| వ. | అనిన నట్లకాక యని చెప్పందొడంగె; ‘వినుము; సప్తర్షి మండలాంతర్గతంబు లయిన పూర్వ ఋక్షద్వయి సమమధ్యంబునందు నిశాసమయంబున నొక్క నక్షత్రంబు గానిపించిన కాలంబు మనుష్యమానంబున శతవత్సర పరిమితం బయ్యె, నా సమయంబున జనార్దనుండు నిజపదంబునం బొదలె; నా వేళనె ధాత్రీ మండలంబు గలి సమాక్రాంతం బయ్యెఁ; గృష్ణుం డెంతకాలంబు భూమి యందుఁబ్రవర్తించె, నంతకాలంబును గలి సమాక్రాంతంబు గాదు; మఘానక్షత్రంబందు సప్తర్షులు నే ఘస్రంబునఁజరియింతు రా ఘస్రంబునఁగలి ప్రవేశించి వేయు నిన్నూఱు వర్షంబు లయి యుండు, నా ఋషిసంఘంబు పూర్వాషాఢ కరిగినం గలి ప్రవృద్ధంబు నొందు; నే దివసంబున హరి పరమపదప్రాప్తుండయ్యె; నా దివసంబునంద కలి ప్రవేశించి దివ్యాబ్దసహస్రంబులు సనిన యనంతరంబు నాలవపాదంబునఁగృతయుగధర్మంబు ప్రాప్తంబగు. | 13 |
| చ. |
నరవర! తొంటి భూపతుల నామగుణంబులు, వృత్తచిహ్నముల్, సిరియును, రూపసంపదలుఁ, జెన్నగురాజ్యము, లాత్మవిత్తముల్. వరుస నడంగెఁగాని, యట వారల కీర్తులు నిర్మలంబులై యురవడి భూమిలో నిలిచి యున్నవి నేఁడును రాజశేఖరా! |
14 |
| వ. | శంతనుని యనుజుండగు దేవాపియు, నిక్ష్వాకువంశజుండగు మరుత్తును, యోగయుక్తులై కలాపగ్రామనిలయులై కలియుగాంతంబున వాసుదేవప్రేరితులై, ప్రజల నాశ్రమాచారంబులు దప్పకుండ నడపుచు, నారాయణ స్మరణంబు నిత్యం బొనర్చి, కైవల్యపదప్రాప్తు లగుదు; రి క్కరణి నాలుగు యుగంబుల రాజులును నే నెఱింగించిన పూర్వరాజన్యులును, వీ రందఱును సమస్త వస్తుసందోహంబుల యందు మమత నొంది యుత్సాహవంతులై యుండి పిదప నీ భూతలంబు వదలి నిధనంబు నొందిరి; కావునఁ గాలంబు జాడ యెవ్వరికిం గానరాదు; మత్పూర్వులు హరిధ్యానపరవశులై దయా సత్య శౌచ శమ దమాది ప్రశస్తగుణంబులం బ్రసిద్ధులై నడచి; రట్లు గావున. | 15 |
| క. |
ధర్మము సత్యముఁగీర్తియు, నిర్మలదయ విష్ణుభక్తి నిరుపమ ఘన స త్కర్మ మహింసావ్రతమును, నర్మిలి గలవారె పుణ్యు లవనీనాథా! |
16 |
| తే. |
ఈ జగం బేలు తొల్లిటి రాజవరులు, గాలవశమున నాయువుల్ గోలుపోయి నామమాత్రావశిష్టు లైనారు; గాన, సలుపవలవదు మమత నెచ్చట నృపాల! |
17 |
| వ. | గర్వాంధులయిన నరపతులం జూచి భూదేవి హాస్యంబు సేయు; ‘శత్రుక్షయంబు సేసి యెవ్వరికి నీక తామ యేలు చుండెద’ మనియెడి మోహంబునం బితృపుత్త్రభ్రాతలకు భ్రాంతి గల్పించి, యన్యోన్య వైరానుబంధంబులం గలహంబు సేసి, రణరంగంబులఁ దృణప్రాయంబులుగా దేహాదులు వర్జించి, నిర్జరలోక ప్రాప్తులైన పృథు యయాతి గాధి నహుష భరతార్జున మాంధాతృ సగర రామ ఖట్వాంగ దుంధుమార రఘు తృణబిందు పురూరవ శ్శంతను గయ భగీరథ కువలయాశ్వ కకుత్స్థ నిషధ హిరణ్యకశిపు వృత్ర రావణ నముచి శంబర భౌమ హిరణ్యాక్ష తారకాదులైన రాజు లందు, దైత్యులును ధరణికి మమత్వంబునం జేసి కదా కాలవశంబున నాశంబు నొంది? రది యంతయు మిథ్య గాన సర్వంబునుం బరిత్యజించి ‘జనార్దన’ వైకుంఠ, వాసుదేవ, నృసింహ, ’ యని నిరంతర హరికథామృత పానంబు సేసి, జరారోగవికృతులం బాసి హరిపదంబు నొందు’ మని చెప్పి. | 18 |
| తే. |
ఉత్తమశ్లోకుఁడన నెవ్వఁడున్నవాఁడు!, సన్నుతుండగు నెవ్వఁడు సకల దిశల నట్టి పరమేశ్వరునిఁజిత్తమందు నిలిపి, తద్గుణంబులు వర్ణింపు ధరణినాథ! |
19 |