పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము ద్వాదశస్కంధము
యుగధర్మప్రాకృతాది ప్రళయచతుష్టయ వివేచనము
వ. అనిన శుకయోగీంద్రునకు రాజేంద్రుం డిట్లనియెఁ; ‘గలియుగం బతిపాప సమ్మిళితంబు; గాన దురితంబు లే లాగున రాకుండఁజేయుదురు? కాలం బే క్రమంబున నడచుఁ? గాల స్వరూపకుండైన హరిప్రభావం బేలాగునం గానఁబడు’ నీ జగజ్జాలం బెవ్విధంబున నిలుచు?’ నని యడిగిన రాజేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియెఁ; ‘గృతత్రేతాద్వాపర కలియుగంబులను యుగ చతుష్టయంబును గ్రమంబుగాఁ బ్రవర్తించు; ధర్మంబునకు సత్య దయా తపో దానంబులు నాలుగు పాదంబులై నడచు; శాంతి దాంత్యాత్మ జ్ఞాన వర్ణాశ్రమాచారంబులు మొదలగునవి గలిగి ధర్మంబు మొదటి యుగంబున నాలుగు పాదంబులం బరిపూర్ణంబై ప్రవర్తిల్లు; శాంతి దాంతికర్మాచరణాది రూపం బగు ధర్మంబు మూఁడు పాదంబుల రెండవ యుగంబునం బ్రవర్తిల్లు; విప్రార్చనాహింసా వ్రతజపానుష్ఠానాది లక్షణంబులు గలిగి ధర్మంబు రెండు పాదంబుల మూఁడవ యుగంబునం దేజరిల్లు; మఱియు జనులు గలియుగంబున ధర్మరహితులు; నన్యాయకారులు, క్రోధమాత్సర్య లోభమోహాది దుర్గుణ విశిష్టులు, వర్ణాశ్రమాచారరహితులు, దురాచారులు, దురన్నభక్షకులు, శూద్రసేవారతులు, నిర్దయులు, నిష్కారణవైరులు, దయా సత్య శౌచాది విహీనులు, ననృతవాదులు, మాయోపాయులు, ధనవిహీనులు, దోషైకదృక్కులునై పాపచరితులగు రాజుల సేవించి, జననీజనక సుతసోదర బంధు దాయాద సుహృజ్జనులం బరిత్యజించి, సురతాపేక్షులై కులంబులం జెఱుచుచుండెదరు; మఱియు క్షామ డామరంబులం బ్రజాక్షయంబగు; బ్రాహ్మణులు దుష్ప్రతిగ్రహవిహారులై యజ్ఞాదికర్మంబులు పదార్థపరులై చేయుచు హీనులై నశించెద; రట్లుగాన యీ కలియుగంబున నొక్క ముహూర్తమాత్రం బయిన నారాయణపరాయణులై మనంబున శ్రీనృసింహ వాసుదేవ సంకర్షణాది నామంబుల నచంచలభక్తిం దలంచువారలకుఁగ్రతుశత ఫలంబు గలుగు; నట్లు గావున రాజశేఖరా! నీ మది ననవరతంబు హరిం దలంపుము; కలి యనేకదురితాలయంబు గాన, యొక్క నిమిషమాత్రంబు ధ్యానంబు సేసినం బరమ పావనత్వంబు నొంది కృతార్థుండ వగుదు’ వని పలికి మఱియును. 20
క. మూఁడవయుగమున నెంతయు, వేడుక హరికీర్తనంబు వెలయఁగ ధృతిచేఁ
బాడుచుఁ ‘గృష్ణా;’ యనుచుం, గ్రీడింతురు కలిని దలఁచి కృతమతు లగుచున్‌.
21
వ. అనినఁ ‘గల్పప్రళయప్రకారం బె’ ట్లనిన నతం డిట్లనియెఁ; ‘జతుర్యుగ సహస్రంబులు సనిన నది బ్రహ్మకు నొక్క పగ లగు; నా క్రమంబున రాత్రియు వర్ధిల్లు; నంత బ్రహ్మకు నొక్కదినం బగుటవలన నది నైమిత్తికప్రళయం బనంబడు; నందు విధాత సమస్త లోకంబులం దన యాత్మయందు నిలిపి శయనింప ప్రకృతి వినష్టంబయిన నది ప్రాకృతప్రళయం బని చెప్పంబడు; నా ప్రళయ ప్రకారంబు విను; మిట్లు పవలు నైమిత్తిక ప్రళయంబును, రాత్రి ప్రాకృత ప్రళయంబు నగుట గలిగిన నది యజునకు దినప్రమాణం; బిట్టి దిన ప్రమాణంబున మున్నూట యఱువది దినంబు లయిన నలువకు నొక్క సంవత్సరంబు పరిపూర్ణం బగుఁ; దద్వత్సరంబులు శతపరిమితంబు లయిన. 22
సీ. అంత లోకేశున కవసానకాలంబు, వచ్చిన నూఱేండ్లు వసుధలోన
వర్షంబు లుడిగిన వడిఁదప్పి మానవుల్‌ దప్పి నాఁకటఁజిక్కి నొప్పి నొంది
యన్యోన్యభక్షులై యా కాలవశమున నాశ మొందెద; రంత నలినసఖుఁడు
సాముద్రదైహికక్ష్మాజాత రసములఁజాతురిఁగిరణాళిచేతఁగాల్ప
 
తే. నంతఁగాలాగ్ని సంకర్షణాఖ్య మగుచు, నఖిలదిక్కులు గలయంగ నాక్రమించు
నట్టియెడ నూఱు వర్షంబు లాదుకొనఁగ వీఁకతోడుత వాయువుల్‌ వీచు నపుడు.
23
వ. ఇట్లు వర్షశతంబు వర్షశూన్యంబగును. అంత శతవర్షంబులు ద్వాదశ భాస్కర ప్రచండ కిరణ తాండవం బగును; పిదప శతవర్షంబులు ప్రళయాగ్నిదందహ్యమానం బగును; పిమ్మట సప్తమారుత ఝంఝానిలవేగతాడితం బగును; అందు మీఁద శతహాయనంబులు నవధారాధరంబులు మహాఘోషంబుల తోడం గరికరోపమానంబు లయిన నీరధారల నిఖిలజగంబును శంబరమయంబు చేసిన బ్రహ్మాండం బెల్ల జలమయం బగుటం చేసి, భూమి హృత గంధ గుణంబయి కబంధంబున లీనంబగు; న న్నీరంబు జీర్ణరస గుణంబై తేజంబున నడంగు; నా తేజంబు వాయువందు నష్టరూపంబయి కలయు; నా పవనుండు గతస్పర్శగుణుండై నభంబున సంక్రమించు; నా యాకాశంబు విగతశబ్దంబయి భూతాదిం బ్రవేశించుఁ; దైజసం బైన మహద్రూపం బనహంకారంబై వైకారికగుణసమేతంబై, యింద్రియంబుల లయించు; నహంకారంబును సత్త్వాదిగుణంబులు గ్రసియించు; నవి కాలచోదితంబైన ప్రకృతియం దడంగు; నా ప్రకృతి యనాదియు నిత్యంబు నవ్యయంబు నవాఙ్మానస గోచరంబునై సత్త్వరజస్తమోగుణ రహితంబయి, మహదాది సన్నివేశంబు లేక స్వప్నాద్యవస్థా రహితంబయి, పృథివ్యాదిహీనంబై యప్రతర్క్యంబగు; దానిని మూలభూతంబయిన పదంబని చెప్పుచుందురు, కాలవిపర్యయంబయి, పురుషావ్యక్తులు విలీనం బగునది ప్రాకృత ప్రళయం బనంబడు’ నని చెప్పి ‘మఱియు నొక విశేషంబు వినుము; బుద్ధీంద్రియార్థ రూపంబులచే జ్ఞానంబు తదాశ్రయం బయి వెలుంగు; దృశ్యత్వావ్యతిరేకంబులచే నది యాద్యంతంబులు గలదై యుండుఁ; దేజంబునకు దీపచక్షూరూపంబులు వేఱుగానియట్లు బుద్ధీంద్రియార్థంబులు పరార్థమూర్తికి నన్యంబులు గానేరవు; బుద్ధిసంభవంబు ప్రధానంబు; జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థాభేదం బాత్మమయంబై, బుద్ధియుక్తంబైన యోగంబునం బరిణమించుఁ; బ్రాణిజాతం బీశ్వరునందు లయోదయంబులు వొందుచుండు; సర్వంబు నన్యోన్యాపాశ్రయంబై యాద్యంతవంతంబగుట నవస్తువై వర్తించు; నొక్క తేజంబు బహురంధ్రంబులం గానంబడు వడువున నొక్క పరమాత్మ పెక్కు విధంబుల భావింపంబడు; హాటకంబు పెక్కు రూపంబులు గలదైన, నేకంబయిన తెఱుంగునఁబరమాత్మ నేకంబుగా భావింపవలయు; నేత్రంబులకు మేఘావరణంబు దలంగినప్పుడు భాస్కరమండలంబు గనిపించు కరణి బంధహేతు వైన యహంకారం బాత్మ జ్ఞానంబునం దిరస్కృతం బైనయప్పుడే పరమాత్మ నిర్మలంబయి తోఁచు; నా పరమాత్మను నిరంతరంబును దలంచుచు, యోగులు తదేకాయత్తచిత్తులై యుందురు; కాలవేగంబున సర్వప్రపంచంబునకు నవస్థాంతరంబులు గల్గు చుండుఁ; బరమేశ్వరమూర్తి యైన కాలంబున నభంబునం బగల తారకంబులు గానరాని కరణిం గానంబడక, కల్పావస్థలు చరించు; నిత్యనైమిత్తిక ప్రాకృతికాత్యంతికంబులని ప్రళయంబులు చతుర్విధంబులై పరఁగు; నందులం గలుగు నారాయణుని లీలావతారంబులఁగమలభవ భవాదు లయిన వచింప నోపరు;నే నెఱింగి నంతయుం జెప్పితి; సంసారసాగరంబు దాట హరికథ యనెడు నావయ సహాయంబు గాని వేఱొకటి లే’ దని చెప్పి. 24
ఉ. ఏను మృతుండ నౌదునని యింత భయంబు మనంబులోపలన్‌
మానుము; సంభవంబు గల మానవకోట్లకుఁజావు నిత్యమౌఁ;
గాన హరిం దలంపు; మికఁగల్గదు జన్మము నీకు ధాత్రిపై;
మానవనాథ! పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్‌.
25
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - dvAdaSa skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )