| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ద్వాదశస్కంధము |
| వ. | రాజేంద్రా! జరామరణహేతుకంబయిన శరీరంబున నుండు జీవుండు ఘటంబులలోఁగనంబడు నాకాశంబు ఘటనాశంబయిన మహాకాశంబునం జేరు తెఱంగున, శరీరపతనం బగుడు నీశ్వరుం గలయుఁ, దైలనాశపర్యంతంబు వర్తి తేజంబుతోడ వర్తించు కరణి దేహకృతంబగు భవంబు రజస్సత్త్వ తమోగుణంబుల చేతం బ్రవర్తించు; నాత్మ నభంబు మాడ్కి ధ్రువంబై యనంతంబై వ్యక్తావ్యక్తంబులకుఁబరంబై యుండు; నిట్లాత్మ నాత్మస్థునిఁగా జేసి, హరి నిజాకారంబు భావించుచుండుట విశేషంబు; నిన్నుఁదక్షకుండు గఱవ సమర్థుండు గాఁడు; హరిం దలంపుము; ధన గృహ దారాపత్య క్షేత్రపశుప్రకరంబుల వర్జించి, సమస్తంబును నారాయణార్పణంబు సేసి, విగతశోకుండవై నిత్యంబును హరిధ్యానంబు సేయు’ మని వినిపించిన రాజేంద్రుండును గుశాసనాసీనుండై జనార్దనుం జింతించుచుండె; నంత శుకుండును యథేచ్ఛా విహారుండయి చనియె; నిటఁగ్రుద్ధుండైన బ్రాహ్మణోత్తమునిచేఁబ్రేరితుండైన తక్షకుండు ద్విజరూపంబుఁదాల్చి, పరీక్షిద్వధార్థంబుగా నేతెంచుచుండి మార్గమధ్యంబునఁగాశ్యపుండును సర్పవిషహరణసమర్థుండగు నొక్క విప్రునిం గని యతని నపరిమిత ధనప్రదానంబునఁదృప్తుం గావించి, పరీక్షిన్నికటంబునకు రాకుండు న ట్లొనర్చి, యంతటఁబరీక్షిన్మహారాజు చెంతనున్న వారల చేతి కొక్క ఫలంబిచ్చి చనిన, వా రా ఫలంబు రాజునకిచ్చిన నతం డాఫలంబు నాస్వాదించినం గ్రిమిరూపంబున నందుండి వెడలి మహాభయంకర రూపంబునం గాకోదరంబై రాజుం గఱచిన నతండు నా క్షణంబ విషాగ్నిచే భస్మీభూతుం డయ్యె; నట్టి యవసరంబున భూమ్యంతరిక్షంబులనుండు నిఖిలప్రాణు లాశ్చర్యకరంబగు తన్మరణంబు గని హాహారవంబులు సేసి; రంత నీ యర్థంబు నతని తనయుండైన జనమేజయుండు విని క్రోధావేశంబున సర్పప్రళయం బగు నట్లు యజ్ఞంబు సేయుచుండ సహస్ర సంఖ్యలు గల సర్పంబులు హతంబు లయ్యె. నా సమయంబునఁ దక్షకుండు రాక వాసవాలయంబున నుండుట యెఱింగి “సహేంద్ర తక్షకాయానుబ్రూహి” అను ప్రేషవాక్యంబు నొడువునంతఁ, దక్షకసహితుండయి విమానముతో నింద్రుండు స్థాన భ్రంశంబు నొంది పడుచుండ, నత్తఱి నాంగీరసుం డేతెంచి పరీక్షిత్తనయుని బహుభంగులం గీర్తించి. | 26 |
| చ. |
‘మృతియును జీవనంబు నివి మేదినిలోపల జీవకోటికిన్ సతతము సంభవించు; సహజం బిది; చోరహుతాశసర్ప సం హతులను దప్పి నాఁకటను బంచత నొందెడు నట్టి జీవుఁడున్ వెతలను బూర్వకర్మ భవవేదన లొందుచుఁగుందు నెప్పుడున్. |
27 |
| వ. | అట్లు గావున నసంఖ్యంబులైన దందశూకంబులు హతంబు లయ్యె; శాంత మానసుండవై, క్రోధంబు వర్జింపు మనిన గురూపదిష్ట ప్రకారంబున సర్పయాగంబు మానియుండె; నంత దేవతలు గుసుమవృష్టిఁ గురియించి; రా రాజన్యుండు మంత్రి సమేతుండై నగర ప్రవేశంబు సేసె; బాధ్యబాధక లక్షణంబులు గల విష్ణుమాయా చోదిత గుణవ్యాపారంబుల నాత్మ మోహపడుం గావున, నట్టి మాయావికారంబులం బరిత్యజించి, తదాశ్రయాకృత మానసుండై వర్తించుచు, పరనింద సేయక, వైరంబు వర్జించి, భగవత్పదాంభోజభక్తి సంయుక్తుండై తిరుగు నతండు హరిపదంబుఁజేరు; నని చెప్పి వెండియు సూతుండు పరమహర్ష సమేతుండై శౌనకున కిట్లనియె. | 28 |