పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము ద్వాదశస్కంధము
శ్రీవేదవ్యాసుండు వేదములను, బురాణములను లోకమందుఁ బ్రవర్తింపఁ జేయుట
క. ధారుణిఁబారాశర్యున, కార్యులు పైలుఁడు సుమంతు జైమిని మునులున్‌
ధీరుఁడు వైశంపాయనుఁ, డారయ నలువురును శిష్యులై యుండి రొగిన్‌.
29
వ. వారలు ఋగ్యజుస్సామాథర్వంబు లనియెడు నాలుగు వేదంబుల వ్యాసోపదిష్టక్రమంబున లోకంబులం బ్రవర్తింపఁజేసి రని చెప్పిన, నా క్రమం బెట్లని శౌనకుం డడిగిన సూతుండు సెప్పం దొడంగె; ‘నాదియందుఁ జతుర్ముఖుని హృదయంబున నొక నాదం బుద్భవించె; నది వృత్తి నిరోధంబువలన మూర్తీభవించి వ్యక్తంబుగాఁ గనుపట్టె; నట్టి నాదోపాసనవలన యోగిజనంబులు నిష్పాపులై ముక్తి నొందుదు; రందు నోంకారంబు జనియించె; నదియె సర్వమంత్రోపనిషన్మూలభూత యగు వేదమాత యని చెప్పంబడు; నా యోంకారంబు త్రిగుణాత్మకంబై యకారోకారమకారంబు లనెడు త్రివర్ణరూపంబై ప్రకాశించుచుండె; నంత భగవంతుండగు నజుం డాప్రణవంబువలన స్వరస్పర్శాంతస్థోష్మాది లక్షణ లక్షితంబగు నక్షరసమామ్నాయంబు గల్పించి, తత్సాహాయ్యంబునం దన వదన చతుష్టయంబువలన వేదచతుష్టయంబు గలుగంజేసె; నంత నతని పుత్త్రులగు బ్రహ్మవాదులా వేదంబులం దదుపదిష్టప్రకారంబుగా నభ్యసించి, యా క్రమంబున వారలు దమ శిష్యపరంపరకు నుపదేశించి; రిట్లు వేదంబులు సమగ్రంబుగాఁబ్రతియుగంబున మహర్షులచే నభ్యసింపం బడియె; నట్టి వేదంబులు సమగ్రంబుగఁ బఠియింప నశక్తులగువారలకు సాహాయ్యంబు సేయుటకై ద్వాపరయుగాదియందు భగవంతుండు సత్యవతీదేవియందుఁబరాశరమహర్షికి సుతుండై యవతరించి, యా వేదరాశిం గ్రమమ్మున ఋగ్యజుస్సామాథర్వంబు లన నాలుగు విధంబులుగ విభజించి, పైల వైశంపాయన జైమిని సుమంతు లనియెడు శిష్యవరులకుఁగ్రమంబుగ నా వేదంబుల నుపదేశించె; నందుఁబైలమహర్షి సేకొన్న ఋగ్వేదం బనంతంబులగు ఋక్కులతోఁజేరి యుండుటంజేసి బహ్వృచశాఖ యని చెప్పంబడు; నంత నా పైలుం డింద్రప్రమితికి బాష్కలునకు నుపదేశించె; బాష్కలుం డా సంహితం జతుర్విధంబులు గావించి శిష్యు లగు బోధ్యుండు యాజ్ఞవల్క్యుండుఁ బరాశరుండు నగ్నిమిత్రుండు ననువారికి నుపదేశించె; నింద్రప్రమితి దన సంహిత మాండూకేయున కుపదేశించె; మాండూకేయుండు దేవమిత్రుం డనువానికిం జెప్పె; నతనికి సౌభర్యాదిశిష్యు లనేకులై ప్రవర్తిల్లి; రందు సౌభరిసుతుండు శాకల్యుండు దా నభ్యసించిన శాఖ నైదు విధంబులుగ విభజించి; వాత్స్యుండు మౌద్గల్యుండు శాలీయుండు గోముఖుండు శిశిరుం డనెడు శిష్యుల కుపదేశించె; నంత జాతుకర్ణి యనువానికి వా రుపదేశింప నతండు బలాకుండు పైంగుండు వైతాళుండు విరజుం డనువారి కుపదేశించె; నదియునుం గాక మున్ను వినిపించిన బాష్కలుని కుమారుండైన బాష్కలి వాలఖిల్యాఖ్యసంహితను బాలాయని గార్గ్యుండు కాసారుం డను వారలకుం జెప్పె; ని త్తెఱంగున బహ్వృచసంహిత లనేక ప్రకారంబులం బూర్వోక్త బ్రహ్మచారులచే ధరియింపంబడె; యుజుర్వేదధరుండగు వైశంపాయనుని శిష్యసంఘంబు నిఖిలక్రతువుల నాధ్వర్యవ కృత్యంబుచేఁదేజరిల్లిరి; మఱియు నతని శిష్యుఁడగు యాజ్ఞవల్క్యుండు గుర్వపరాధంబు సేసిన, నా గురువు కుపితుండై ‘యధీతవేదంబుల మరలం దన కిచ్చి పొమ్మ’నిన నతండు దాను జదివిన యజుర్గణంబును దదుక్త క్రమంబునఁ గ్రక్క, నవి రుధిరాక్తం బగు రూపంబుఁ దాల్చిన యజుర్గణాధిష్ఠిత శాఖాధి దేవతలు తిత్తిరిపక్షులై వానిని భుజియించిరి; దానంజేసి యా శాఖలు తైత్తిరీయంబు లయ్యె; నంత నిర్వేది యగు నా యాజ్ఞవల్క్యుం డపరిమిత నిర్వేదంబు నొంది, యుగ్రతపంబున సూర్యుని సంతుష్టుం గావింప, నతండు సంతసిల్లి హయరూపంబుఁదాల్చి యజుర్గణంబు నతని కుపదేశించెఁ; గావున నది వాజసనేయశాఖ యని వాక్రువ్వంబడె; నంత నా యజుర్గణంబు కాణ్వ మాధ్యందినాదులచే నభ్యసింపబడె; నిట్లు యజుర్వేదంబు లోకంబునఁబ్రవర్తిల్లె; సామవేదాధ్యేత యగు జైమినిమహర్షి దన సుతుండగు సుమంతునికి నుపదేశించె; నతఁడు సుకర్ముండను తన సుతునకుఁ దెలిపె; నతం డావేదమును సహస్రశాఖలుగా విభజించి, కోసలుని కుమారుండైన హిరణ్యనాభునికిని, దన కుమారుండగు పౌష్పంజి యనువానికి నుపదేశించె; నంత వారిరువురు బ్రహ్మవేత్త లగు నావంత్యులు నుదీచ్యులను నేనూర్గురికి నుపదేశించి, వారిని సామవేదపారగులంగాఁజేసి; రిట్లు సామవేదంబు లోకంబున వినుతి నొందె; మఱియు నథర్వవేత్త యగు సుమంతుమహర్షి దానిం దన శిష్యున కుపదేశింప నతండు వేదదర్శుండు పథ్యుండను శిష్యుల కుపదేశించె; నందు వేద దర్శుఁడనువాఁడు శౌల్కాయని బ్రహ్మబలి నిర్దోషుండు పిప్పలాయనుం డనువారలకును, బథ్యుం డనువాఁడు కుముదుండు శునకుండు జాబాలి బభ్రు వంగిరసుండు సైంధవాయనుం డనువారలకు నుపదేశించి ప్రకాశంబు నొందించె; నిత్తెఱంగున నథర్వవేదంబు వృద్ధి నొందె; ని ట్లఖిలవేదంబుల యుత్పత్తి ప్రచారక్రమం బెఱింగించితి; నింకం బురాణక్రమం బెట్టు లనిన వినిపింతు, వినుము; లోకంబునఁబురాణప్రవర్తకు లనం బ్రసిద్ధులగు త్రయ్యారుణి కశ్యపుండు సావర్ణి యకృతవ్రణుండు వైశంపాయనుండు హారీతుం డను నార్గురు మజ్జనకుండును వ్యాస శిష్యుండునగు రోమహర్షణుని వలన గ్రహించి; రట్టి పురాణంబు సర్గాది దశలక్షణలక్షితంబుగా నుండు; మఱియుఁ గొందఱా పురాణంబు పంచలక్షణలక్షితంబనియుఁబలుకుదు; రట్టి పురాణనామానుక్రమంబుఁ బురాణవిదు లగు ఋషులు సెప్పెడు తెఱంగున నెఱింగింతు; వినుము; బ్రాహ్మంబు పాద్మంబు వైష్ణవంబు శైవంబు భాగవతంబు భవిష్యోత్తరంబు నారదీయంబు మార్కండేయం బాగ్నేయంబు బ్రహ్మకైవర్తంబు లైంగంబు వారాహంబు స్కాందంబు వామనంబు కౌర్మంబు మాత్స్యంబు బ్రహ్మాండంబు గారుడంబు నని పదునెనిమిది మహాపురాణంబులు మఱియు నుపపురాణంబులుం గలవు; వీని లిఖించినం జదివిన వినిన దురితంబు లడంగునని సూతుండు శౌనకాదులకుం జెప్పిన వారు ‘నారాయణుగుణవర్ణనంబును దత్కథలును జెప్పితి; వింక దోషకారులుఁబాపమతులు నెవ్విధంబున భవాబ్ధిం దరింతు, రాక్రమంబు వక్కాణింపవే!’ యని యడిగిన నెఱింగింపం దలంచి యిట్లనియె. 30
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - dvAdaSa skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )