| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ద్వాదశస్కంధము |
| క. |
తొల్లిటి యుగమునఁదపములఁ, బల్లిదులగు ఋషుల మహిమ భాషింపఁగ రం జిల్లెడు మార్కండేయుం, డుల్లంబున హరిని నిలిపి యుడుగక బ్రదికెన్. |
31 |
| వ. | లోకంబులు గల్పాంతసమయంబునం గబంధమయంబులయి, యంధకారబంధురంబులయి యున్నయెడ నేకాకి యయి చరించుచు బాలార్కకోటితేజుండయిన బాలుని హృదయంబునం బ్రవేశించి యనేకసహస్రవత్సరంబులు దిరిగి వటపత్త్రశాయి యయిన య బ్బాలునిఁ గ్రమ్మఱం గనియె’నని చెప్పిన శౌనకాదులు సూతునిం గనుకొని, ‘యా మునీంద్రునకు నీ ప్రభావం బెట్లు గలిగె?’ నని యడిగిన నతం డిట్లనియె. | 32 |
| క. |
‘భూవినుత, బ్రహ్మచర్యము, దా వదలక నిష్ఠచేతఁదథ్యము గాఁగన్ భావించి హరిఁదలంచుచుఁ, గోవిదనుతుఁడై మృకండు గుణముల వెలసెన్. |
33 |
| వ. | ఇట్లు దపంబు సేయ నతనికి హరిహరులు ప్రత్యక్షంబయి ‘వరంబడుగు’ మనిన గుణగణాఢ్యుం డయిన కుమారు నడిగిన ‘నట్లకాక’ యని యతండు గోరిన వరం బిచ్చి యంతర్ధానంబు నొంది; రనంతరంబ య మ్మునికి మార్కండేయుం డుదయించి నియమనిష్ఠా గరిష్ఠుడయి యుండ; మృత్యువు వానిం బాశబద్ధుంజేసిన నెదిర్చి మిత్తిని ధిక్కరించి, పదివేల హాయనంబులు తపంబు సలుప, నింద్రుండు భయంపడి య మ్మునివరుని యుగ్రతపంబు భంగపఱచుటకు దేవతాంగనలం బంప, వా రేతెంచు నెడఁబుష్పఫల భరితంబును, మత్తమధుకర శుకపికాది శకుంతారవ నిరంతర దిగంతరంబును; జాతివైర రహిత మృగపక్షికుల సంకులంబును, సారసచక్రవాక బకక్రౌంచ కారండవ కోయష్టికాది జలవిహంగమాకులిత సరోవర సహస్ర సందర్శనీయంబును నగు నా తపోవనంబున జటావల్కలధారియై హవ్యవాహనుండునుంబోలెఁదపంబు సేయు మునీంద్రునిం గని య య్యంగనలు వీణావేణు వినోదగానంబుల నలవరింప మెచ్చక ధీరోదాత్తుం డగు న మ్మునీంద్రుని గెల్వనోపక యింద్రుని కడకుం జని; రంత హరి యతని తపంబునకుఁబ్రసన్నుండై యావిర్భవించినం గనుగొని ‘దేవా, నీ దివ్యనామ స్మరణంబునంజేసి యీ శరీరంబుతోడన యనేక యుగంబులు బ్రదుకునట్లుగాఁజేయవే?’ యనినం గరుణించి యిచ్చుటయును. | 34 |
| తే. |
జగము రక్షింప జీవులఁజంప మనుపఁ, గర్తవై సర్వమయుఁడవై కానిపింతు వెచట నీ మాయఁదెలియంగ నెవ్వఁడోపు?, విశ్వసన్నుత! విశ్వేశ! వేదరూప! |
35 |
| మ. |
బలభిన్ముఖ్య దిశాధినాథవరులున్ ఫాలాక్షబ్రహ్మాదులున్ జలజాతాక్ష పురందరాది సురులుం జర్చించి నీ మాయలం దెలియన్ లేరఁట ! నా వశంబె తెలియన్? దీనార్తి నిర్మూల! యు జ్జ్వల పంకేరుహపత్త్ర లోచన! గదాచక్రాంబుజాద్యంకితా!’ |
36 |
| వ. | అని వినుతించి ‘దేవా, నీ మాయం జేసి జగంబు భ్రాంతంబై యున్న యది! యిది దెలియ నానతీ వలయు’ నని యడిగిన నతండు నెఱింగించి చనియె, మునియును శివపూజ సేయుచు హరిస్మరణంబు సేయ మఱచి శతవర్షంబులు ధారాధరంబులు ధారావర్షంబుచే ధరాతలంబు నింప, జలమయంబై యంధకార బంధురంబైన, నంత నా తిమిరంబునం గన్ను గానక భయంపడి యున్నయెడ నా జలమధ్యంబున నొక వటపత్త్రంబునం బద్మరాగకిరణపుంజంబులు రంజిల్లు పాదపద్మంబులు గల బాలునిం గని, మ్రొక్కి యతని శరీరంబు ప్రవేశించి, యనేకకాలం బనంతంబగు జఠరాంతరంబునం దిరిగి; యతని చరణారవింద సంస్మరణంబు సేసి, వెలువడి కౌఁగిలింపం బోయిన మాయఁగైకొని యంతర్ధానంబు నొంద;మునియు నెప్పటియట్ల స్వాశ్రమంబు సేరి తపంబు సేయుచున్న సమయంబున. | 37 |
| చ. |
నిలిచిన శంకరుం గనియు నిత్యసుఖంబుల నిచ్చు గౌరి యి మ్ముల ‘హర, భూతిభూషణ సముజ్జ్వలగాత్రునిఁ గంటె, యెంతయున్ వలనుగ వానితోడ నొక వాటపు మాటను బల్కఁగాఁ దగున్ సలలితమైన యీ తపసి జాడ వినం గడు వేడ్క యయ్యెడిన్. |
38 |
| వ. | అనిన శంకరుండును శాంకరీసమేతుండయి నభంబున నుండి ధరణీతలంబునకు నేతెంచి యితరంబు గానక యేకాగ్రచిత్తుండగు నమ్మునిం గని తన దివ్యయోగమాయా ప్రభావంబుచేత నతని హృదయంబునం బ్రవేశించి చతుర్బాహుండును, విభూతి రుద్రాక్ష మాలికాధరుండును, ద్రిశూల డమరుకాది దివ్య సాధన సమేతుండును, వృషభవాహనారూఢుండును, నుమాసమేతుండునై తన స్వరూపంబు గనంబఱిచిన విస్మయంబు నొంది యమ్ముని యా పరమేశ్వరు ననేక ప్రకారంబుల స్తుతియించిన నప్పు డమ్ముని తపఃప్రభావంబునకు మెచ్చి ‘మహాత్మా’ పరమశైవుండ’ వని పరమేశ్వరుం డానతిచ్చిన మార్కండేయుండును శంకరు నిరీక్షించి, దేవా హరిమాయాప్రభావంబు దుర్లభం; బయ్యది భవత్సందర్శనంబునం గంటి; నింతియ చాలు; నైన నొక్క వరంబు గోరెద; నారాయణ చరణాంబుజధ్యానంబును, మృత్యుంజయంబునుం గలుగునట్లుగాఁగృపసేయవే?” యని ప్రార్థించినఁ గృపాసముద్రుండై ‘యట్లకాక’ యని జరారోగవికృతులు లేక కల్పకోటి పర్యంతంబు నాయువుం, బురుషోత్తముని యనుగ్రహంబుఁ గలుగు’నని యానతిచ్చి య మ్మహాదేవుం డంతర్ధానంబు నొందె’ నని చెప్పి యీ మార్కండేయోపాఖ్యానంబు వ్రాసిన వినినం జదివినను మృత్యువు దొలంగు నని మఱియు నిట్లనియె; హరిపరాయణుండగు భాగవతుండు దేవతాంతర మంత్రాంతర సాధనాంతరంబులు వర్జించి, దుర్జనులం గూడక నిరంతరము నారాయణ గోవిందాది నామస్మరణంబు సేయుచు నుండెనేని నట్టి పుణ్యపురుషుండు వైకుంఠంబున వసియించు; మఱియు హరి విశ్వరూపంబును జతుర్విధ వ్యూహభేదంబును, జతుర్మూర్తులును, లీలావతారంబులును జెప్ప నగోచరంబు లనిన శౌనకుం డిట్లనియె. | 39 |
| క. |
హరికథలు హరిచరిత్రము, హరిలీలావర్తనములు నంచితరీతిం బరువడి నెఱిఁగితి మంతయుఁ, సురనుత! యనుమాన మొకటి సొప్పడెడి మదిన్. |
40 |