పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము ద్వాదశస్కంధము
చైత్రాదిమాసంబుల సంచరించెడు ద్వాదశాదిత్యుల క్రమంబును దెలుపుట
వ. అది యెయ్యది యనిన లోకచక్షువు చైత్రమాసంబు మొదలుగా నేయే మాసంబున నేయే నామంబునం బ్రవర్తించుం; జెప్పవే?” యని యడిగినఁ ‘జైత్రంబుననుండి చైత్రాది ద్వాదశమాసంబుల సౌరగణసప్తకం బీశ్వర నియుక్తంబై నానాప్రకారంబుల సంచరించు; నా క్రమంబు దొల్లి శుకుండు విష్ణురాతునికిఁదెలిపిన చందంబునం జెప్పెద’నని సూతుం డిట్లనియె. ‘శ్రీమన్నారాయణస్వరూపుండగు మార్తాండుం డేకస్వరూపుం డైన, నతనిం గాల దేశ క్రియాది గుణములంబట్టి ఋషు లనేకక్రమంబుల నభివర్ణించి భావించు చున్నవా రా ప్రకారం బెట్లనినఁ జైత్రంబున సూర్యుండు ధాత యను నామంబు దాల్చి కృతస్థలి హేతి వాసుకి రథకృత్తు పులస్త్యుండు తుంబురుండు ననెడు పరిజనులతోఁ జేరికొని సంచరించు; వైశాఖంబున నర్యముం డను పేరు వహించి పులహుం డోజుండు ప్రహేతి పుంజికస్థలి నారదుండు కంజనీరుం డను ననుచర సహితుండై కాలంబు గడుపుచుండు; జ్యేష్ఠంబున మిత్రాభిధానంబున నత్రి పౌరుషేయుండు; తక్షకుండు మేనక హాహారథ స్వనుం డను పరిజనులతోడం జేరి వర్తించుచుండు; నాషాఢంబున వరుణుం డను నాహ్వయంబు నొంది వసిష్ఠుండు రంభ సహజన్యుండు హూహువు శుక్రుండు చిత్రస్వనుండను సహచర సహితుండై కాలక్షేపణంబు సేయుచుండు; శ్రావణంబున నింద్రుండను నామంబుచే వ్యవహృతుండై విశ్వావసువు శ్రోత యేలాపుత్త్రుం డంగిరసుండు ప్రమ్లోచ చర్యుండను సభ్యులతోఁజేరి కాలంబు గడుపుచుండు; భాద్రపదంబున వివస్వంతుండను నామంబు దాల్చి యుగ్రసేనుండు వ్యాఘ్రుం డాసారణుండు భృగు వనుమ్లోచ శంఖపాలుండు లోనుగాఁగల పరిజనులతో నావృతుండై కాలయాపనంబు సేయుచునుండు. 41
క. ధరలోఁద్వష్ట్రాహ్వయమును, నిరవుగ ధరియించి ధాత్రి కింపు దలిర్పం
జరియించుచు నభమందున్‌, సరసిజహితుఁడాశ్వయుజము సయ్యనఁగడపున్‌.
42
వ. ఈ మాసంబున ఋచీకతనయుండు కంబళాశ్వుండు తిలోత్తమ బ్రహ్మోపేతుండు శతచిత్తు ధృతరాష్ట్రుం డిషంభరు లను సభ్యులతోడఁగూడి కాలంబు గడుపుచుండుఁ; గార్తికమాసంబున విష్ణువని వ్యవహరింపఁబడి యశ్వతరుండు రంభ సూర్యవర్చసుఁడు సత్యజిత్తు విశ్వామిత్త్రుండు మఘాపేతుఁడను పరిజనవర్గంబుతోఁగూడి కాలంబు నడపుచుండు; మార్గశిరంబునం దర్యమనామ వ్యవహృతుండై కశ్యపుండు తార్‌క్ష్యుండు ఋతసేనుం డూర్వశి విద్యుచ్ఛత్రుండు మహాశంఖుం డనెడు ననుచరులం గూడి చరించుచుండుఁ; బుష్యమాసంబున భగుం డను నామంబు దాల్చి స్ఫూర్జుం డరిష్టనేమి యూర్ణుం డాయువు కర్కోటకుండు పూర్వచిత్తి యనెడు సభ్యజనపరివృతుండై కాలక్షేపణంబు సేయుచునుండు; మాఘమాసంబునఁ బూషాహ్వయంబు వహించి ధనంజయుండు వాతుండు సుషేణుండు సురుచి ఘృతాచి గౌతముం డను పరిజనపరివృతుండై చరియించుచునుండు. 43
క. క్రతునామంబు ధరించియుఁ, జతురతఁబాలించుచుండుఁజాతుర్య కళా
రతుఁడై సహస్రకిరణుఁడు, మతియుతు లౌననఁదపస్యమాసము లీలన్‌.
44
వ. అందు వర్చసుండు భరద్వాజుండు పర్జన్యుండు సేనజిత్తు విశ్వుం డైరావతుం డనువారలతో నెనసి కాలయాపనంబు సేయుచుండు; నిట్లు ద్వాదశమాసంబుల నపరిమేయవిభూతులచేఁదేజరిల్లుచు నుభయసంధ్యల నుపాసించు జనుల పాపసంఘంబుల నున్మూలనంబు సేయుచుఁ, బ్రతిమాసంబును బూర్వోక్త పరిజన షట్కంబు వెంట నంట నుభయలోక నివాసులగు జనంబుల కైహికాముష్మిక ఫలంబుల నొసంగుచు ఋగ్యజుస్సామాథర్వణ మంత్రంబులఁబఠియించుచు, ఋషిసంఘంబులు స్తుతియింపఁ బురోభాగంబున నప్సరస లాడ, గంధర్వులు పాడ, బ్రహ్మవేత్తలగు నఱువది వేవురు వాలఖిల్యమహర్షు లభిముఖులై నుతించుచు నరుగ, నధికబల వేగవిరాజ మానంబులగు నాగరాజంబులు రథోన్నయనంబు సలుప, బాహాబల ప్రతిష్ఠాగరిష్ఠులగు నైరృతశ్రేష్ఠులు రథపృష్ఠభాగంబు మోచి త్రోయుచుండ ననాదినిధనుం డగు నాదిత్యుండు ప్రతికల్పంబున నిట్లు కాలయాపనంబు సేయుచుఁదేజరిల్లుచుండు; నట్లుగావున నివి యన్నియు వాసుదేవమయంబులుగాఁదెలియు’ మని పౌరాణి కోత్తముండగు సూతుండు శుకయోగీంద్రుండు ప్రాయోపవిష్టుం డగు పరీక్షిన్నరపాలున కుపదేశించిన తెఱంగున నైమిశారణ్య వాసులగు శౌనకాది ఋషిశ్రేష్ఠులకుఁదెలిపె; నిట్టి పురాణరత్నంబగు భాగవతంబు వినువారును బఠియించువారును లిఖియించు వారును నాయురారోగ్యైశ్వర్యంబులు గలిగి విష్ణుసాయుజ్యంబు నొందుదు; రదియునుం గాక. 45
తే. పుష్కరంబందు ద్వారకాపురమునందు, మథురయందును రవిదినమందు నెవఁడు
పఠన సేయును రమణతో భాగవతము, వాఁడు తరియించు సంసారవార్ధి నపుడ.
46
క. శ్రీరమణీరమణకథా, పారాయణచిత్తునకును బతికిఁ బరీక్షి
ద్భూరమణున కెఱిఁగించెను, సారమతిన్‌ శుకుఁడు ద్వాదశస్కంధములన్‌.
47
వ. మఱియు నష్టాదశపురాణంబులందలి గ్రంథసంఖ్య లెట్లనిన బ్రాహ్మపురాణంబు దశసహస్రగ్రంథంబు; పాద్మం బేఁబదియైదు వేలు; విష్ణుపురాణం బిరువదిమూఁడు సహస్రంబులు; శైవంబు చతుర్వింశతి సహస్రంబులు; శ్రీభాగవతం బష్టాదశ సహస్రంబులు; నారదంబు పంచవింశతి సహస్రంబులు; మార్కండేయంబు నవసహస్రంబు; లాగ్నేయంబు పదియేనువేల నన్నూఱు; భవిష్యోత్తరంబు పంచశతాధిక చతుర్దశ సహస్రంబులు; బ్రహ్మకైవర్తం బష్టాదశ సహస్రంబులు; లైంగం బేకాదశసహస్రంబులు; వారాహంబు చతుర్వింశతి సహస్రంబులు; స్కాందం బెనుబది యొక్క వేలనూఱు; వామనంబు దశసహస్రంబులు; కౌర్మంబు సప్తదశ సహస్రంబులు;మాత్స్యంబు చతుర్దశ సహస్రంబులు; గారుడంబు పందొమ్మిది సహస్రంబులు; బ్రహ్మాండంబు ద్వాదశసహస్రంబు లిట్లు చతుర్లక్ష గ్రంథసంఖ్యాప్రమాణంబులం బ్రవర్తిల్లు నీ పదునెనిమిది పురాణంబుల మధ్యంబున నదులయందు భాగీరథివిధంబున, దేవతల యందుఁ బద్మగర్భుమాడ్కిఁ, దారకలందుఁ గళానిధిగరిమ, సాగరంబులందు దుగ్ధార్ణవంబు చందంబున, నగంబులను హేమనగంబు భాతి, గ్రహంబుల విభావసుకరణి, దైత్యులందుఁబ్రహ్లాదునిభంగి, మణులయందుఁ బద్మరాగంబు రేఖ, వృక్షంబులందు హరిచందనతరువు రీతి, ఋషులందు నారదు మాడ్కి, ధేనువులందు గామధేనువు పోల్కి, సూక్ష్మంబులందు జీవుని తెఱంగున, దుర్జయంబులందు మనంబు చొప్పన, వసువులందు హవ్యవాహనుని పోఁడిమి, నాదిత్యులందు విష్ణువు కరణి, రుద్రుల యందు నీలలోహితుని రీతిని, బ్రహ్మలందు భృగువు సొబగున, సిద్ధులయందుఁ గపిలుని లీల, నశ్వంబులందు నుచ్చైశ్శ్రవంబులాగున, దర్వీకరంబులందు వాసుకి రూపమున, మృగములందుఁగేసరిచెలువున, నాశ్రమంబు లందు గృహస్థాశ్రమంబు క్రియ, వర్ణంబులలో నోంకారంబు నిరవున, నాయుధంబులఁగార్ముకంబు సోయగంబున, యజ్ఞంబుల జపయజ్ఞంబు చాడ్పున, వ్రతంబులం దహింస కరణి, యోగంబులం దాత్మయోగంబురమణ, నోషధులయందు యవల సొబగున, భాషణంబు లందు సత్యంబు ఠేవ, ఋతువులందు వసంతంబు ప్రౌఢి, మాసంబులందు మార్గశీర్షంబు మహిమ, యుగంబులందుఁగృతయుగంబు నోజఁ దేజరిల్లు; నిట్టి భాగవత పురాణంబు పఠియించి విష్ణుసాయుజ్యంబుఁ జెందుదు రని మఱియు నిట్లనియె. 48
క. సకలాగమార్థపారగుఁ, డకలంక గుణాభిరాముఁడంచిత బృందా
రక వంద్య పాదయుగుఁడగు, శుకయోగికి వందనంబు సొరిది నొనర్తున్‌.
49
సీ. సకలగుణాతీతు సర్వజ్ఞు సర్వేశు నఖిలలోకాధారు, నాదిదేవుఁ
బరమదయారసోద్భాసితుఁ ద్రిదశాభివందితపాదాబ్జు వనధిశయను
నాశ్రితమందారు నాద్యంతశూన్యుని వేదాంతవేద్యుని విశ్వమయునిఁ
గౌస్తుభ శ్రీవత్స కమనీయవక్షుని శంఖచక్రగదాసిశారఙ ధ్గరుని
 
తే. శోభనాకారుఁబీతాంబరాభిరాము, రత్నరాజితమకుటవిభ్రాజమానుఁ
బుండరీకాక్షు మహనీయపుణ్యదేహుఁదలఁతు నుతియింతు దేవకీతనయు నెపుడు.’
50
మ. అని యీరీతి నుతించి భాగవత మాద్యంతంబు సూతుండు సె
ప్పిన సంతుష్టమనస్కులై విని మునుల్‌ ప్రేమంబునం బద్మనా
భునిఁజిత్తంబున నిల్పి తద్గుణములన్‌ భూషించుచున్‌ ధన్యులై
చని రాత్మీయనికేతనంబులకు నుత్సాహంబు వర్ధిల్లఁగన్‌.
51
క. జనకసుతాహృచ్చోరా!, జనకవచోలబ్ధ విపినశైల విహారా!
జనకామిత మందారా!, జననాదిక నిత్యదుఃఖచయ సంహారా!
52
మాలిని. జగదవనవిహారీ, శత్రులోక ప్రహారీ!
సుగుణవనవిహారీ, సుందరీమానహారీ!
విగతకలుషపోషీ! వీరవర్యాభిలాషీ!
స్వగురుహృదయతోషీ! సర్వదా సత్యభాషీ!
53
గద్య. ఇది శ్రీ పరమేశ్వరకరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రి పుత్త్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రియశిష్య వెలిగందల నారయ నామధేయ ప్రణీతంబైన శ్రీ మహాభాగవతం బను మహాపురాణంబునందు రాజుల యుత్పత్తియు, వాసుదేవ లీలావతార ప్రకారంబును, గలియుగధర్మప్రకారంబును, బ్రహ్మప్రళయ ప్రకారంబును, బ్రళయవిశేషంబులును, దక్షకునిచే దష్టుండై పరీక్షిన్మహారాజు మృతినొందుటయు, సర్పయాగంబును, వేదవిభాగక్రమంబును, బురాణానుక్రమణికయు, మార్కండేయోపాఖ్యానంబును, సూర్యుండు ప్రతిమాసంబును వేర్వేఱు నామంబుల వేర్వేఱు పరిజనంబులతో జేరుకొని సంచరించు క్రమంబును తత్తత్పురాణ గ్రంథసంఖ్యలు నను కథలు గల ద్వాదశస్కంధము. 54
శ్రీకృష్ణార్పణమస్తు
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - dvAdaSa skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )