| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - చతుర్థాశ్వాసము |
| చ. |
‘గొనకొని వీఁడు నీకును శకుంతలకుం బ్రియనందనుండు; సే కొని భరియింపు మీతని; శకుంతల సత్యము వల్కె,సాధ్వి, స ద్వినుత, మహాపతివ్రత వివేకముతో’ నని దివ్యవాణి దా వినిచె ధరాధినాథునకు విస్మయ మందఁగఁ దత్సభాసదుల్. |
105 |
| వ. | ఇ ట్లెల్లవారలకు నతిహర్షంబుగా శకుంతల పతివ్రతాత్వంబును సత్యంబును భరతోత్పత్తియుఁ బ్రశంసించు వేలుపుల పలుకు లతివ్యక్తంబు లయి యాకాశంబువలన వీతెంచిన విని దుష్యంతుండు సభాసదులు విన ని ట్లనియె. | 106 |
| తే. |
ఏను నీ యింతియును గాని యెఱుఁగ రన్యు | లర్థిఁ గణ్వమహాముని యాశ్రమంబు నందు గాంధర్వవిధి వివాహమునఁ గరము | నెమ్మిఁ జేసిన దీని పాణిగ్రహణము. |
107 |
| తే. |
అన్యు లెఱుఁగమిఁ జేసి లోకాపవాద | భీతి నెఱిఁగియు నిత్తన్విఁ బ్రీతి దప్పి యెఱుఁగ నంటిని నిందఱ కిప్పు డెఱుఁగఁ | జెప్పె నాకాశవాణి యచ్చెరువు గాఁగ. |
108 |
| వ. | అని మహానురాగంబునం గొడుకు నెత్తికొని హర్షపులక లెసఁగ నాలింగనంబు సేసి, శకుంతలా మహాదేవి నతిప్రణయగౌరవంబునసంభావించి, యౌవరాజ్యంబునకు భరతు నభిషిక్తుంజేసి. పెద్దకాలంబు రాజ్యసుఖంబు లనుభవించి, తన రాజ్యభారం బంతయు భరతుం బూన్చి, దుష్యంతుండు తపోవనంబున కరిగిన. | 109 |
| చ. |
భరతుఁ డశేష భూభువనభార ధురంధరుఁ డై వసుంధరం బరఁగి, యనేక యాగములఁ బాయక భాస్కర జహ్నుకన్యకా సురుచిర తీరదేశముల సువ్రతుఁడై యొనరించి, భూరిభూ సురులకు నిచ్చె దక్షిణలు శుద్ధసువర్ణ గవాశ్వహస్తులన్. |
110 |