| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. | మఱియు నతీతానాగతు లైన నిజవంశంబున రాజులకెల్ల వంశకర్త యయ్యె; నట్టి భరతునకుఁ గైకేయి యైన సునందకు భుమన్యుండు పుట్టె; వానికి దాశార్హపుత్త్రి యైన విజయకు సుహోత్రుండు పుట్టె; వానికి నిక్ష్వాకు కన్యయైన సువర్ణకు హస్తి పుట్టె; నతనిపేరం గౌరవ్య రాజధాని యైన నగరంబు హస్తిపురంబునాఁ బరఁగె; నట్టి హస్తికిం ద్రిగర్తరాజపుత్త్రి యైన యశోధరకు వికుంఠనుండు పుట్టె; వానికి దాశార్హపుత్త్రి యైన వసుదేవకు నజమీఢుండు పుట్టె; నయ్యజమీఢునకుఁ గైకేయియు గాంధారియు ఋక్షయు నను మువ్వురు స్త్రీలకు. | 111 |
| క. |
బలయుతులు నూటయిరువది | నలువురు సుతు లుద్భవిల్లి నానాదేశం బులకుఁ బతు లైరి; మఱి వా | రలలో సంవరణుఁ డఖిలరాజ్యోన్నతుఁ డై. |
112 |
| క. |
అనఘుఁడు పౌరవకుల వ | ర్ధనుఁ డద్దిననాథ తనయఁ దపతి వివాహం బొనరఁగ నయ్యె; నిరువుర | కును వంశకరుండు పుట్టెఁ గురుఁ డున్నతుఁడై. |
113 |
| వ. | వానిపేరం గురుక్షేత్రంబునాఁ బరఁగె; నట్టి కురునకు దాశార్హియైన శుభాంగికిని విధూరథుండు పుట్టె; వానికి మాగధి యయిన సంప్రియకు ననశ్వుండు పుట్టె; నయ్యనశ్వునకు మాగధి యైన యమృతకుం బరీక్షితుండు పుట్టె; వానికి బహుదానసుత యైన సుయశకు భీమసేనుండు పుట్టె; వానికిం గైకేయి యైన కుమారికిఁ బ్రదీపుఁడు (బర్యశ్రవసుండు) పుట్టె; వానికిఁబ్రతీపుండు పుట్టెఁ; బ్రతీపునకు శిబిపుత్త్రియయిన సునందకు దేవాపి శంతనుబాహ్లికు లనఁగా మువ్వురు పుట్టి; రందు దేవాపి బాల్యంబునంద తపోవనంబున కరిగిన శంతనుండు రాజయ్యె; వానికి గంగాదేవికి దేవవ్రతుం డైన భీష్ముండు పుట్టె; మఱియు శంతనునకు యోజనగంధి యయిన సత్యవతికిం జిత్రాంగద విచిత్రవీర్యు లనంగా నిద్దఱుగొడుకులు పుట్టి; రందుఁ జిత్రాంగదుండు బాల్యంబున గంధర్వనిహతుండయిన, వానికింగొండుకవానివిచిత్రవీర్యురాజ్యాభిషిక్తుంజేసి భీష్ముండు కాశీరాజదుహితల నంబికాంబాలిక లనువారి నిద్దఱ విచిత్రవీర్యునకు వివాహంబు సేసిన. | 114 |
| చ. |
అతిశయరూపయౌవన గుణాధిక సుందర మైన యాసతీ ద్వితయమునందు సంతతరతిన్ వివశుం డయి రాజకృత్యముల్ మతి నొకనాఁడుఁ జేయ కహిమద్యుతితేజుఁడు రాజయక్ష్మబా ధితుఁడయి దేవలోకసుదతీప్రియుఁ డయ్యె విచిత్రవీర్యుఁడున్. |
115 |
| వ. | అంత దౌష్యంతి సంతానవిచ్ఛేదంబు గావచ్చిన సత్యవతీనియుక్తుండై సకలధర్మమూర్తి కృష్ణద్వైపాయనుండు దేవరన్యాయంబున నంబికయందు ధృతరాష్ట్రుని, నంబాలికయందుఁ బాండురాజును నంబికాపరిచారిక యందు విదురునిం బుట్టించిన; నందు ధృతరాష్ట్రునకు గాంధారికి వ్యాసవరప్రసాదంబున దుర్యోధనుండాదిగా నూర్వురు గొడుకులు పుట్టిరి. పాండురాజు నియోగంబునఁ గుంతీమాద్రులకు ధర్మానిలశక్రాశ్వినుల ప్రసాదంబున ధర్మజభీమార్జున నకులసహదేవు లనంగా నేవురుకొడుకులు పుట్టి; రయ్యేవురకుం బాంచాలి ధర్మపత్నియయ్యె;దానియందు ధర్మరాజునకుఁబ్రతివింధ్యుండును, భీమసేనునకు శుత్రసోముండును, నర్జునునకు శ్రుతకీర్తియు, నకులునకు శతానీకుండును, సహదేవునకు శ్రుతసేనుండును ననఁ బంచోపపాండవులు పుట్టిరి; మఱి ధర్మరాజునకు స్వయంవర లబ్ధ యైన దేవికయనుదానికి యౌధేయుండు పుట్టె; భీమసేనునకు జరంధరకు సర్వగుండు పుట్టె; నర్జునునకు సుభద్రకు నభిమన్యుండు పుట్టె; నకులునకుఁ జైద్యయయిన కరేణుమతికి నిరమిత్రుండు పుట్టె; సహదేవునకు స్వయంవరలబ్ధయైన విజయకు సుహోత్రుండు పుట్టె; మఱియుభీమసేనునకు హిడింబకుఘటోత్కచుండు పుట్టె; నిప్పాటంబాండవ పుత్త్రులైన పదునొక్కండ్రయందును వంశకరుం డైన యభిమన్యునకు విరాటపుత్త్రి యయిన యుత్తరకుం బరీక్షితుండు పుట్టె. | 116 |
| క. |
అతనికి ననంత పుణ్యా | న్విత యనఁదగు మాద్రవతికి నీ వఖిలజగ న్నుత! జనమేజయ! పుట్టితి | ధృతిఁ బాండవవంశమునకుఁ దేజం బెసఁగన్. |
117 |
| వ. | మఱియు నీకును వపుష్టమకును శతానీక శంకుకర్ణులుపుట్టి; రందు శతానీకునకువైదేహికి నశ్వమేధదత్తుండు పుట్టె. | 118 |
| క. |
వీ రైలులుఁ బౌరవులును | భారతులును గౌరవులును బాండవులు ననన్ వీరు లయి పరఁగి; రిది నయ | పారగ! భవదీయవంశ పరిపాటి మహిన్. |
119 |
| వ. | అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. | 120 |
| క. |
నరవరుఁ డగు శంతనున క | మరనదికిని నెట్లు సంగమం బయ్యె మహా పురుషుండు భీష్ముఁ డె ట్ల | య్యిరువురకును బుట్టె? దీని నెఱిఁగింపు మొగిన్. |
121 |