పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - తృతీయాశ్వాసము
బృహస్పతి మాంధాతకుఁ దెలిపిన గోదానవిధి ప్రకారము (సం. 13-75-4)
ఆ. పుణ్యదినమునందు భూసురానుజ్ఞతో | నుపవసించి గోవు లున్న మంద
కరిగి పరమ నియతి నయ్యహోరాత్ర మ | గ్గోష్ఠమున వసించి నిష్ఠతోడ.
007
వ. మఱుఁనాఁడు. 008
ఆ. సంగవాభిధాన సత్కాలమునఁ దన | యిచ్చుగోవుఁ బేర నెలమిఁ బిలిచి
యజుఁడు కరుణఁ జెప్పినట్టి యవ్వాక్య ర | త్నముఁ బఠించునది యుదాత్తచరిత!
009
ఆ. తల్లి గోవు, వృషము దండ్రి, గర్భప్రదే | శంబు దివము, ధరణి సంప్రతిష్ఠ
యని పఠించి యోగ్యుఁడగు విప్రు నర్చించి | పలుకవలయు నీగి కలిమి దెలియ.
010
వ. తదనంతరంబ. 011
క. సారములగు గోవులు మ | ద్ఘోర సకల కల్మషములుఁ ద్రుంచును సౌమ్య
త్వారూఢంబులు శాశ్వత | సారోదారపద మిచ్చి సౌఖ్యముఁ జేర్చున్‌.
012
క. అని పలికి గోవు నిచ్చితి | ననుచు నుదకధారఁ బ్రీతి నవ్విప్రుకరం
బునఁ బోయవలయు నర్ఘ్యం | బని చెప్పుదు రజ్జలంబు నాదిమునీంద్రుల్‌.
013
క. విను శిష్యుఁడు వ్రతశీలుం | డనఘుఁడు శాంతుండు దాంతుఁ డక్రోధనుఁ డీ
వినుత ప్రదాన విధికిని | జననాథవరేణ్య! యెఱఁగు సత్పాత్రంబుల్‌.
014
ఆ. ఇవ్విధమున గోవు నిచ్చిన యాతండు | చంద్రలోక వసన సౌఖ్య మొందు’
నని సురేంద్ర మంత్రి యమ్మహీపాలుతో | నాదరమున నిట్టు లనియె మఱియు.
015
ఉ. మానవుఁ డోపి యాశ్వయుజ మాసము రెండవు నష్టమిం దగం
బూని దినత్రయంబు పరిపూజిత గోష్ఠతలంబునన్‌ వ్రతా
ధీనతఁ బెండ యన్నమును ధేనువు మూత్రముఁ బాలుఁ బానముం
గా నియతిన్‌ వసించి బహు కామ్యఫలంబులఁ బొందు భూవరా!
016
వ. అని చెప్పె నట్లు బృహస్పతి నిర్దేశించిన తెఱంగున మాంధాతృండు మహీసురులకు గోవుల నిచ్చి యుభయ లోకంబులను వినుతుండయి వెలింగె; నవ్విధం బెఱింగి గో ప్రదానపరులైన భరత దిలీప భగీరథ దాశరథి ప్రభృతి భూపతులు పుణ్యలోకంబులు వడసిరి; పాండవాగ్రజా! నీవును దేవగురూపదిష్టంబు లయిన యివ్వాక్యం బులు భావగతంబులు సేసికొని గో విషయ విధిజ్ఞుండవై విప్రోత్తములకు నుత్తమ గో ప్రచయంబుల ని’ మ్మనిన నమ్మనుమండు తాతకుం బ్రీతిం బ్రణామంబు సేసిన, నమ్మహాత్ముండు వెండియు నవ్విభున కిట్లనియె. 017
క. రేపకడ నీరు ద్రావక | మేపు గొనక మున్న గోవు మిక్కిలి భక్తిన్‌
భూపాల యిచ్చునది ది | వ్యాపార సుఖంబుఁ బడయ నాత్మఁ దలఁచినన్‌.
018
క. మొదవులలో నెల్లఁ గపిల | మొదవు వరిష్ఠంబు రాజముఖ్య! నియతిమై
నది విప్రున కిచ్చు టరయఁ | దుది దానంబులకు; నఱకు దురితాటవులన్‌.’
019
వ. అనిన విని కౌంతేయాగ్రజుండు ‘కపిలగోవున కీ విశేషం బెట్లు గలిగె నెఱింగింపవే’ యనుటయు గాంగేయుం డతని కిట్లనియె. 020
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )