పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - తృతీయాశ్వాసము
గోవులకుఁ గపిలత్వంబు సిద్ధించిన ప్రకారము (సం. 13-76-21)
సీ. ‘దేవత లాఁకొని దేవతాజ్యేష్ఠునిఁ | గానంగఁ బోవ నా కమలజన్ముఁ
డమృత మిచ్చిన ముదమారఁగాఁ ద్రావఁ ద | త్పురభిత్వ సంపద సురభి పుట్టె;
నది సౌరభేయుల నధిప! యుత్పాదించె; నొక యప్డు హిమగిరి యుపరితల మ
లంకరించుచు నవి శంక యించుక లేక | యున్నెడ వానిలో నొకటి లేఁగ
 
ఆ. చన్ను గుడువఁ దదాస్య నిష్యంద మాన | మైన దుగ్ధ ఫేనము పవమాన నిహతిఁ
దూలి తప ముగ్రముగఁ జేయు శూలి మౌళిఁ | బడిన నద్దేవుఁ డధికకోపంబు గదుర.
021
క. చిచ్చఱకన్నదరు లెగయ | విచ్చినఁ గపిలత్వ మొందె విబుధప్రకరం
బచ్చెరు వందుచుఁ గన్గొన | నచ్చేరువ సౌరభేయు లమలచరిత్రా!
022
క. అవి బిట్టు బెదరఁ దక్కటి | యవియు నదరి బెదరె; నిట్టు లగ్గోవులు వా
ఱె వెసను సోముని పాలికి | నవనీశ్వర! దాని నెఱిఁగి యజుఁ డేతెంచెన్‌.
023
సీ. ఏతెంచి నిభృతిమై నీశ్వరు చరణాంబు | జములకు నెఱఁగి హస్తములు మొగిచి
యమృతసిక్తుఁడ వైతి వఖిలేశ! గోవుల | కెంగిలి లే; దిందుఁ డెట్టు లమృత
మొసఁగు నట్టుల గోవు లొసఁగు దుగ్ధంబులఁ | దద్వత్స పీత దుగ్ధంబు శుచియ
కాన కోపము దక్కి కరుణింపు’ మని యొక్క | కమనీయ వృషభంబుఁ గప్ప మిచ్చె;
 
ఆ. శివుఁడు ప్రియమంది దానిఁ గేతువును వాహ | నంబుగాఁ జేసి సకలజనంబు నెలమి
వృషభకేతనుఁ డనియును, వృషభవాహ | నుం డనియుఁ బేర్కొనఁగ నొప్పియుండె నధిప!
024
వ. ఇట్లు ప్రసన్నుండయి గో సంచారం బెందునుం గలుగునట్లుగా ననుగ్రహించిన నా సౌరభేయీ సముదయంబు మగుడ నన్నగంబునకు వచ్చి విచ్చలవిడి వర్తింపంజూచి, తన చూపునం గపిల లయిన గోవులకుం దక్కిన వర్ణంబుల కంటె నుత్తమత్వంబు గలుగ వరం బిచ్చి విరించిని వీడ్కొలిపె; నట్లు గావునం గపిల గోప్రదానంబు గోదాన కల్పంబున కంతకు నధికం బని చెప్పి. 025
క. ఈ కపిలాఖ్యానము సు | శ్లోకము; దీని పఠనంబు శ్రుతముఁ గలిమలో
ద్రేకంబుఁ బాచి సుతుల న | నేక ధనంబులను బెంపు నిచ్చు నరేంద్రా!’
026
వ. అనిన విని ధర్మపుత్త్రుండును దమ్ములును సమ్మోదంబు నొంది భీష్మునకుం బ్రణమిల్లి గోప్రదానంబులు విధి సంపన్నంబులుగాఁ జేయువారై మనంబులం బూని; రప్పితామహుం డప్పాండవాగ్రజు నుద్దేశించి వెండియు నిట్లనియె. 027
సీ. ‘సౌదాసుఁ డనఁగ నిక్ష్వాకు కులంబున | జనియించె; నాతఁడు మునివరేణ్యుఁ
డైన వసిష్ఠుని నాత్మపురోహితు | వినతుఁ డై యడిగెఁ బవిత్ర మెద్ది?
యని దాని కాదర మతిశయిల్లఁగ నమ్మ | హాత్ముఁ డిట్లనియెఁ ‘బుణ్యాత్మ! వినుము
గోవు పవిత్రంబు గోవు హవిర్జన్మ | భూమి గో వరయఁగా భూతములకు
 
ఆ. నెల్ల నాధారభూతమౌ నీడ్యవస్తు | వతుల లక్ష్మికి మూల; మత్యంత దురిత
జలనిధికి నోడ; నిర్జర సద్మమునకు | ననఘ! నిచ్చెన సురలకు మనికిపట్టు.’
028
వ. అని చెప్పి మఱియును. 029
క. ‘పదియును నూఱును వేయును | మొదవులు గలవారు దానములుగా నొకటిం
బదియింటి నూటి నిచ్చిన | నదియు నదియు నదియు నదృశమగు ఫలము నెడన్‌.
030
క. విను గోవులను బ్రభాతం | బునఁ దలఁచుట, తద్గుణములు వొగడుట, భక్తిం
గనుఁగొనుట యధిక పుణ్యము | లని యెఱిఁగించు జనములకు నాగమఫణితుల్‌.
031
ఆ. కిల్బిషంబు గోశకృన్మూత్రముల కేవ | పడుట సకలమాంసభక్షి కైన
ఘోరపాప మండ్రు గోమాంస భక్షణ | మబ్జసంభవాదు లైన సురలు.
032
క. జనములు దుస్స్వప్నంబులు | గని గో కీర్తనము సేయఁగాఁ దద్దురితం
బునఁ బొరయరు గోమయయుత | వినుతాంబు స్నాన మతిపవిత్రం బనఘా!
033
చ. సురభులు, సౌరభేయులును సుస్థితి నాకడ నుండుఁ గాత మేఁ
గరము వినీతి గోగణముఁ గన్గొనుచుండెద నర్థి గో సము
త్కరమును నన్ను నెప్డుఁ గనుఁ గావుత మం చెద గోవులం దలం
తురు బుధబోధితుల్‌ భయము దోఁచిన చోటులఁ దత్ప్రశాంతికై.’
034
వ. అని నిర్దేశించి వెండియు నమ్మునీంద్రుం డా నరేంద్రున కిట్లనియె. 035
క. ‘అరుణ ధవళ మేచక ధూ | సరవర్ణాకలిత గో విషయదానంబుల్‌
ఖరకర సురపాగ్ని పవన | పరలోక సుఖముల నిచ్చు వసుధాధీశా!
036
క. విను తక్కిన వర్ణంబులు | జనవర గంధర్వ సిద్ధ సాధ్యాది నివా
స నితాంత సౌఖ్యదము లగు | ననిమిష యోషి త్ప్రియత్వ మన్నియు నిచ్చున్‌.
037
క. ధేను ప్రమాణ యగు తిల | ధేనువు నిచ్చిన నరుండు దీప్తుండగుఁ బు
ణ్యానూన లోక సంవా | సానందోన్నతిఁ జరించు నప్రతిహతుఁడై.
038
క. బహురూప విశ్వరూపక | మహిత సురూపత్వ దివ్యమహిమ గలుగు గో
మహనీయమూర్తి మన్మతి | సహిత మగుం గాత మనుట సంపద లొసఁగున్‌.’
039
క. అని ముని చెప్పిన సౌదా | స నరేంద్రుఁడు గో ప్రదాన సక్తాత్ముండై
యనితర సులభావ్యయ సుఖ | జనకస్థానంబు వడసె జనసంస్తుత్యా!
040
క. అని గంగాపుత్రుఁడు గో | వినుత మహిమఁ దెలియఁ జెప్ప విని ధర్మసుతుం
‘డనఘచరిత్రా! యిట్లుం | డునె గోవుల పెంపు?’ నావుడుం దగ మఱియున్‌.
041
వ. అమ్మహాత్ముం డమ్మహీపతితో ‘గో విశేషం బింకను విను’ మని యిట్లనియె. 042
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )