పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - తృతీయాశ్వాసము
వేదవ్యాసముని శుకునకుఁ దెలిపిన గో ప్రభావ ప్రకారము (సం. 13-80-6)
సీ. ‘సర్వజ్ఞుఁ డగు పరాశరనందనుని పాద | పద్మంబులకు దృఢభక్తి నెఱఁగి
యతని నందనుఁడు సమంచిత మతియును | నవు శుకుం డెల్ల వస్తువులకంటె
నధికతమంబును యజ్ఞమూలంబును | నగు నది యెయ్యది? యతులకరుణ
నా కెఱింగింపవే’ నావుడు నమ్మహి | తాత్ముఁ డివ్విధము మహానుభావ;
 
తే. మనఘ! యెందు నెక్కాలము నన్యవస్తు | వులకు లేదరయంగ గోవులకుఁ దక్కఁ
బుణ్యతమతయు యాగవిభూతి మూల | కారణత్వంబు వానిక కాక కలవె?
043
క. అని చెప్పి మఱియు నిట్లను | ‘విను గోవులు పరమ నియతి వేధఁ గొలువ నె
మ్మన మలర నతఁడు గనుఁగొని | మును వానికి లేని శృంగములు కల్పించెన్‌.
044
వ. అట్లు కొమ్ము లొసఁగి సురముని లోకంబు నాలోకించి. 045
చ. ‘పరమ పవిత్రముల్‌ యజన భాజనముల్‌ దము విన్నఁ జూచినన్‌
దురితచయంబులం దొలఁగఁ ద్రోవఁగఁ జాలుఁ బ్రధానకర్త కు
త్తరగతి లాభవైభవము తంగెటి జున్నుగఁ జేయు గోవు లె
వ్వరు దగ వీనిఁ గొల్తు రనివారణఁ జొత్తురు వారు నాకమున్‌.’
046
వ. అనియె గోవుల పావనత్వంబు విశేషించి చెప్పెద వినుము. 047
సీ. అమలాత్మ! గోవు మూత్రముఁ బాలు నేయిని | బానార్హ మగు పెండతోన వరుస
మూఁడు దినంబులు మును ద్రావి మఱి మూఁడు | దివసంబులందు వాయువు భుజించి
యవలు నుగ్గుగ ధేనునివహంబు ద్రొక్కించి | వెలవ నత్తెఱఁగు నూకలన కాఁచి
నెలలు మూఁ డత్యంత నియతి నాహారంబు | గొన బ్రహ్మహత్యఁ బోలినవి యైనఁ
 
తే. బాయుఁ బాపముల్‌ దివిజు లీపావన క్రి | యా విధానంబునన కాదె యసురగణము
గెలిచి రావులనేయి విప్రులకు నీగి | దాని వేల్చుట ద్రావు టుదాత్తతరము.
048
క. విమలాంబువుల నుప స్ప | ర్శము నిర్వర్తించి గో ప్రచయ మధ్యమునన్‌
దమయుతముగ గోమతి చి | త్తమున జపించిన శుచిత్వ ధన మొడఁగూడున్‌.
049
తే. అగ్ని సన్నిధి గోనిచయంబు నడుమ | బ్రాహ్మణుల పాల గోమతీపఠన మాచ
రించినను విన్నఁ గోర్కి సిద్ధించు; గోవుఁ | గడచినట్టిది లేదు జగత్త్రయమున.
050
క. అని యి ట్లుపన్యసించిన | జనక వచన రచనఁ గల్గు సార మఖిలముం
గని శుకుఁడు గోసమారా | ధన తత్పరచిత్తుఁ డయ్యె ధర్మతనూజా!’
051
వ. అనిన విని పాండవాగ్రజుండు ‘బ్రహ్మ విశ్వంబునకు విభుండు తదీయస్థానంబునకు మీఁదు గోలోకంబని విందు; నట్లుగాఁ గతంబేమి?’ యని యడుగుటయు నాపగాతనయుం డతని నాదర భరితుం డగుచు నాలోకించి ‘వినుము వివరించెద; విశ్వకర్మ తపో నియతుండయి యజ్ఞార్థంబును మోక్షార్థంబునుంగా నమృతమయ మూర్తియుఁ గామరూపిణియు నగు సురభి యను కన్యకం దన మనోవృత్తి గల్పించి మహాతేజోమయుండగు నొక్క పురుషుని సృజియించిన, దేదీప్యమానుం డగు నాతం డతి మనోహరాకృతి యగు నయ్యతివం గనుంగొని కామమోహితుం డయి యార్తి నొందుటయు నఖిల లోక పావనుండైన చతురాననుండు సన్నిహితుండై ‘మార్తో భవ’ యని పలికి యతని యార్తత్వం బుడిపి తన పల్కు కారణంబుగా మార్తాండ నామం బొసంగి యన్నారీ రత్నంబు నిచ్చి, యన్నెలంతకు నీకును జనియించిన యపత్యంబులు యాగాపవర్గార్థ క్షీర జనకంబులై మదీయ లోకంబునకు నుపరిభాగంబున వర్తింప వరంబిచ్చితి’ ననియె; నట్లొందిన యయ్యిరువురకుం బ్రభవించిన సౌరభేయీకులం బా కమలాసను నిర్దేశించినట్టిదై సురాసుర ప్రముఖ నిఖిల జనంబులకు నమస్కార్యంబును సపర్యాభాజనంబును నయి రాజిల్లు నని చెప్పి వెండియు. 052
క. ‘అది కారణముగ గోవులు | తుది ముట్టిన పెంపు గలిగి దురితహరగుణా
స్పదమయి తమ్ము సభక్తిక | హృదయు లగుచుఁ గొలుచు వారి కిష్టము లొసఁగున్‌.’
053
క. అని చెప్పినఁ బాండునృపతి | తనయుఁడు మార్తాండ సురభి దాంపత్యమునన్‌
మును పుట్టిన ప్రజ యెయ్యది? | వినవలతు మహాత్మ చెప్పవే నా‘ కనుడున్‌.
054
వ. భీష్ముం డిట్లనియె. 055
తే. ‘తపము పెంపున సురభి మార్తాండు వలన | ధరణినాథ! యేకాదశాత్మజులఁ బడసె
నిగమ సంకీర్తనీయులు నిఖిలలోక | పతులు వారు బ్రాహ్మణులకుఁ బ్రకృతి సుమ్ము.
056
వ. వారల నేకాదశ రుద్రులంగా నెఱుంగుము. 057
తరువోజ అనఘాత్మ! యజపాదుఁ డన, నహిర్బుధ్న్యుఁ | డనఁ గడు విలసిల్లి, త్ర్యంబకుఁ డీతఁ
డనఁగ, వృషాకపి యన నొప్పి, శంభుఁ | డను పేరి పెంపున, నమరి కపాలి
యనఁగ, రైవతుఁ డన నతులానుభావ | మతిశయిల్లఁగ, హరుఁ డన బహురూపుఁ
డనఁ గీర్తిఁ గని, యుగ్రుఁ డన విశ్వరూపుఁ | డనఁ బేర్చి యా రుద్రు లర్చితు లైరి.
058
వ. తదనంతరంబ సౌరభేయీ ప్రచయంబు ప్రభవించె; నగ్గోకులంబు విశేషం బాకర్ణింపుము. 059
సీ. ఆననంబునను జిహ్వను శృంగముల బల | వైరి, రంధ్రంబుల మారుతుండు,
కకుదంబునందు శ్రీకంఠుండు, పదముల | యందు మరుద్గణ మనఘ! కుక్షి
వహ్ని, చన్నుల సరస్వతి, పెండఁ బంచిత | మున లక్ష్మియును, గీర్తియును గ్రమమున
రుధిరంబునందుఁ జంద్రుఁడు, హృదయంబున | భగుఁడను దేవత, పాల వేధ
 
తే. వెండ్రుకలయం దనుష్ఠాన వితతి, దోఁక | ధర్ముఁ, డక్షుల సూర్యుండు, చర్మమునఁ ద
పంబు సిద్ధి తేజము సంధిపట్ల సిద్ధు | లునికి గల దటె; గోవు నేమనఁగవచ్చు!
060
వ. మఱియు నొక్కటి యక్కజం బగునది గో మహానుభావ ప్రకటంబయిన యితిహాసంబు సెప్పెద వినుము. 061
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )