పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - తృతీయాశ్వాసము
సుమిత్రుఁ డను మునిచేఁ బోషింపఁబడిన గోవుల ప్రభావము (సం. 13-120-1(కుంభ))
తే. త్రిశిఖరం బనుపేరి ధాత్రీధరము ను | పాంతమున రుద్ర కల్పితంబైన కూల
హాభిధాన కల్లోలిని శోభితోప | కంఠయై యొప్పుఁ దత్తీర కాననమున.
062
వ. భృగు వంశ సంభవులగు సంయమీశ్వరులు గొంద ఱాశ్రమంబులు గావించుకొని తపఃపరులై యుండుదు; రందు సుమిత్త్రుం డను పేరం బరఁగి పరమాచారభవ్యుం డగు నొక్క భార్గవునకు నంగిరసుం డను నొక్క మహాద్విజుండు సఖ్యంబునను సౌజన్యంబునను గో శర్కర యొసంగిన నమ్ముని తన గోవు నయ్యోషధి మేపి పోషించిన నది సుపుష్టయు సుస్వరయు సురూపయునై యొక్క వృషభంబు పొందు వడసి గర్భిణియై మిథునంబు నీనిన. 063
క. అమ్మిథునము బహుసంతా | నమ్మయ్యెం బెరిఁగి క్రమమునను గో నిచయం
బిమ్మెయిఁ బెక్కు సహస్రము | లమ్మునికిం గల్గె గోవు లతఁడును వానిన్‌.
064
తే. వేడ్కఁ జూచుచు నెప్పుడు వెనుకఁ దిరిగి | మేపు నీరును గలచోటి కోపి వెలిచి
పాలు గ్రేపులు గుడువ సప్రమదుఁ డగుచుఁ దాను గోస్తన ఫేనంబు ద్రావియుండు.
065
క. దానన చేసి యతనికిన్‌ | ఫేనపుఁ డను నామ మొసఁగెఁ బ్రియమున ముని స
మ్మానితుఁ డగు గౌతముఁ డి | ట్లా నిర్మలబుద్ధి గోసమారాధకుఁడై.
066
వ. వర్తిల్లుచుండ నొక్కనాఁడు కామరూపిణు లగు గోవులు కొన్ని కాంతాకారంబులు గైకొని కమనీయంబగు కొలన జలక్రీడలు సలుపుచుండఁ దోడిధేనువు లచ్చట మెలంగి కనుంగొని ‘మీ రెవ్వ?’ రని మానుష భాషణంబుల నడిగిన నయ్యంగనా జనంబులు. 067
తే. ‘ఏము గోవుల’ మనవుడు ‘నిట్టి యద్భు | తానుభావంబు మీ కెట్టు లావహిల్లె?’
ననిన విని వానితోడ నయ్యతివ లిట్టు | లనిరి ‘మా తెఱఁ గేర్పడ వినుఁడు మీరు.
068
వ. హవ్య కవ్యంబులకు నతిథిపూజనంబులకు నిజాహారంబులకు సద్ద్విజావలి సంతోషింప నింపారు పాలు వారికిం గురియుదుము, కృషిక్రియా సర్వ నిర్వర్తనంబులకు మా పుత్రులం బనుతు; మా సుకృతంబుల నివ్విశేషంబు కలిగె; మాకును గోలోకంబును సులభంబు; మీ రా సుకర్మంబులు సూచి యసూయ సేయుదురు గావున. 069
క. క్రేపులు తో రా దుర్గతిఁ | బ్రాపింపఁ గలార యిట్టి భావిచరిత ము
ద్దీపిత బోధమునం గని | మీపై కృపఁ జెప్పవలసె మీకుం దెలియన్‌.
070
వ. అనుటయు నగ్గోవులు దీనాననలై. 071
క. ‘గోవులకును గోవులు గతి | గావున మీ రరసి సుగతి గలుగు తెరువు మా
కే విధి నైనను జెప్పం | గా వలదే’ యనిన నట్ల కా’ కని వారల్‌.
072
తే. రంతిదేవుండు వేవత్సరములు సేయు | నధ్వరమునకుఁ బశువులై యరుగుఁ; డతఁడు
విశసనము సేయ గోలోక విభవ మొందఁ | గాంతు’ రని నెమ్మిఁ బల్కిన సంతసిల్లి.
073
సీ. అగ్గోవు లవ్విభు నధ్వరంబునకుఁ బో | నుత్సహించుటయు నం దొక్క గోవు
‘మనము సుమిత్రుని ధన | మాతఁ డనుమతి | సేయక యెట్లు వోఁ జెల్లు?’ ననిన
‘నాతనిఁ జంపుద మతఁడును గోలోక | మున కేఁగుదెంచుఁగా!’ కని కడంగి
చని మునిఁ దేఱి చూడను జాల కంతంత | నతిభీతిఁ గ్రమ్మఱి యరుగుటయును
 
తే. గొన్ని కపిలధేనువు లతి క్రూరచిత్త | ‘లేము వధియించెదము మాకు నేమి మేలు
సేయు వారలు దగ మీరు సెప్పుఁ’ డనిన | నన్ని మొదవులు నేకవాక్యత్వ మొంది.
074
ఆ. ‘సకల వర్ణ ధేను సమితికి నెల్లను | గపిల గోవు శ్రేష్ఠ గాఁగఁ గపిల
నీగి గో శతంబు నిచ్చిన యట్లుగా | వరము మీకు నిచ్చు వార’ మనియె.
075
వ. అనిన విని కరంబుప్రియంబునం గామరూపిణులైన యగ్గోవులు రూపాంతరంబులు గైకొని యా భృగువంశ వర్యు పాలికిం బోయి ‘యేము గోమాతలము; నీదగు గో సమారాధనంబునకు మెచ్చి వరంబిచ్చువారమై వచ్చితి; మిష్టం బెయ్యది యడుగు’ మనుటయు నమ్ముని ‘యిప్పటి యట్ల యెల్లప్పుడును గోవులవలన భక్తిస్నేహంబులు గలుగ నిం’ డనియె నమ్మాటకు నవి ‘యట్ల యయ్యెడుఁగాక!’ యని పలికి వెండియు నిట్లనియె. 076
క. ‘ ఈ లోకం బేటికి? మన | గోలోకంబునకు రమ్ము కులవర!’ యనుడుం
‘జాలుదునే మద్గో ర | త్నాలి విడిచి యందు రాక’ కని ముని పల్కెన్‌.
077
క. విని యా ధేనువు లాతని | తను వాకసమునకు నెత్తి తమ యోగబలం
బునఁ జైతన్యముఁ బాపి య | వని మీఁదఁ గళేబరంబు వైచి రయమునన్‌.
078
క. కొమ్ములఁ గాళ్ళం బిండిగఁ | గ్రుమ్మి మగిడిపోయి పూసగ్రుచ్చిన గతి మున్‌
తమ్ముం బనిచిన గోవుల | కమ్ముని తెఱఁ గెల్లఁ జెప్పి హర్ష మొనర్చెన్‌.
079
వ. గోలోకంబునకు ముఖ్యలగు గోమాత లంతయు నెఱింగి తమ కడకుం జనుదెంచిన సుమిత్రు నాదరించి సుదతులై విహరించిన గోవులు మొదలుగా సకల గోవుల తెఱంగు నతని కెఱింగించి ‘నీకు నిది మేల కాక’ యని పలికి యతనిం బ్రీతునిం జేసి బ్రహ్మ ఘాతిక లయిన యన్ని గోవులకును ‘మీ వంశం బశుచి వదనం’ బయ్యెడు మని శాపం బిచ్చిన నాధేనువులు రంతిదేవు పాలికిం బోయి సుగతి వేఁడి తమ్ముం బశువులుంగా విశసింపు మని మానుష భాషణంబులం బ్రార్థించుటయు. 080
క. ‘మిమ్ముఁ దెగఁ జూచి సద్గతి | కెమ్మెయిఁ బోవంగ నేర్తు నే’ నని వినయా
ర్ధ్రమ్ముగ మ్రొక్కుచుఁ బలికిన | నమ్మానవపతికి నిట్టులను నగ్గోవుల్‌.
081
క. జ్ఞానుల యీ పనికై నినుఁ గానఁగఁ బుత్తెంచి, రట్లు గావున సుమనో
మానితగతి నీకును నగు | భానునిభా! నీయశంబుఁ బరఁగు జగములన్‌.
082
క. నావుడు మీలోపల నొక | గోవైనను మోహవశతఁ గూరుటయు మఖం
బావేళఁ బరిసమాప్తము | గావలయును వినుఁడు సమయ కల్పన దెలియన్‌.’
083
క. అని యవ్విభుండు వలికిన | విని గోవులు సమ్మతింప విశసించుచు వే
ల్చె నతఁడు యజ్ఞానలమున | ననేక గోచయములం గ్రమాకలనమునన్‌.
084
క. ఒకనాఁడు గో వొకటి లేఁ | గకుఁ జన్నిచ్చుచును దానిఁ గనుఁగొని నీ విం
కకటా! యెక్కడఁ జేరెద | వకృపులు వచ్చెదరు చంప’ నని పల్కుటయున్‌.
085
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )