| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | మహానుభావుండు గావున నప్పలుకులు విని రంతిదేవుం డయ్యాగంబు సుప్రయోగంబుగా సమాప్తంబు గావించెఁ; గొన్ని గోవులు కడమవడి పుడమిన నిలిచె; నధ్వరోపయోగంబు వడసిన గోగణంబులు గోలోకంబునకుం బ్రమోదంబునం బోయెఁ; దదీయ చర్మాస్థి శ్రేణులు తటంబులై తనరం బ్రభూత రక్తమేదః క్లేదంబు లేఱై పాఱి చర్మణ్వతి యను పేరం బరఁగె; నా రంతిదేవ భూపతియును యజ్ఞ సమృద్ధుండై వృద్ధశ్రవుని తోడి సఖ్యంబునం బొలిచి యక్షయ నాకంబున సుశ్లోకుండై యుండె; ఫేనపాఖ్యుండును గోలోకంబున శాశ్వతుండై వసించె’ నని చెప్పి భీష్ముండు వెండియు. | 086 |
| సీ. |
‘మానవనాథ! యీ ఫేనపాఖ్యానంబు | బదరికాశ్రమమున బాదరాయ ణుఁడు ప్రీతి నారాయణునకుఁ జెప్పిన నమ్మ | హాత్ముండు గో యజనార్థి యగుచు నిది గొనియాడంగ విదితమై జగమునఁ | బరఁగెఁ; బుణ్యతమంబు పావనంబు దీనిఁ బఠించిన వీనుల నించిన | దురిత వర్గంబులఁ బొరయ వలదు; |
|
| తే. |
పూరు నృపకుల భూషణ! పూత చరిత! నీవు నతిభక్తి గలుగుము గోవులందుఁ బరమనియతి నీ తంత్రంబు పఠన విధియు | నేత దాకర్ణనంబును నెపుడుఁ జలుపు.’ |
087 |
| క. |
అనిన విని ‘యట్ల చేసెద | ననఘా! గోమహిమ యిట్టు లాకర్ణింపం గనియును దనివి సనదు నా | మన; మింకను జెప్పు నీ విమల వాక్యములన్.’ |
088 |
| క. |
అని ధర్మతనయుఁ డడిగిన | ననయంబుఁ బ్రియంబుఁ బొంది యమరనదీనం దనుఁ డిట్లను ‘సత్యవతీ | తనయుని వాక్యములు సెప్పెదను వినుము నృపా! |
089 |
| ఆ. |
గోవిశేష మర్థి నీవు నన్నడిగిన | యట్ల శుకుఁడు దండ్రి నడిగె; దాని కాత్మఁ బ్రియముఁ బొంది యా మహాసంయమి | యా సుబుద్ధి కిట్టు లనియె నధిప! |
090 |
| సీ. |
స్థావర జంగమాత్మకమైన భూత జా | లంబు సుస్థితి గోగణంబు నాశ్ర యమునన తత్సంభవమును గోవులయంద; | యవి మూల సంతాన మజున; కట్లుఁ గాక సిద్ధుల సాధ్యగణముల మాత లి | ట్లగుట యెఱింగిన యతఁడు బ్రహ్మ లోక గోలోకాది లోకాంతరములకుఁ | దనయింటి కరుగు చందమున నరుగుఁ |
|
| తే. |
బరమగతిఁ గోరువారలు పాదముష్టి | యష్టి వాక్చిత్తముల గోవు నభిభవింప కుండ వలయు నివ్విద్యఁ బద్మోద్భవుండు | సెప్పె నది యాత్మపావన శిష్ట సేవ్య. |
091 |
| క. |
పావనమని శ్రుతి సెప్పిన | యే వస్తువు నాశ్రయించి యెక్కుడయిరి భూ తావలులకు సుర లట్టిది | గోవు; తదీయ మగు మహిమకున్ గుఱిగలదే? |
092 |
| క. |
వీణా కాహళ వేణు | క్వాణ ప్రతిమములు ధేనువర్గధ్వను ల క్షీణ సుకృతంబు నిర్మల | వాణి తదాకర్ణనంబు వర్ణన విధమున్. |
093 |
| క. |
క్షీరము దధియును ఘృతము సు | ధా రూపము లగుట దేవతా ప్రీణన య జ్ఞారంభంబులు విమలా | చారా! గో దోహ నైక సాధ్యము లయ్యెన్. |
094 |
| ఆ. |
శ్రుతులు నౌపనిషద సూక్తులు గో స్వరూ | పంబు లని సరోజభవుఁడు సెప్పె ధర్మపరత పరమతపము మహాధ్వర | మనఁగఁ బరఁగు గో సమర్చనంబు. |
095 |
| క. |
ఈ వాక్యంబులు భూదే | వావలి సన్నిధిఁ బఠించు నాతఁడు పుణ్యుం డై వెలయు; విన్నవారలు | పావనగుణ! తత్‌క్షణంబ పాతు రఘములన్. |
096 |
| తే. |
గో ఘృతంబు ప్రాశించియు గోకరీష | సువిహిత స్నానుఁ డయ్యు భూదివిజుఁ డధిక భక్తి నిత్యంబు గోమతీపఠన మాచ | రించియును గల్మషముల నిర్జించు ననఘ! |
097 |
| చ. |
అనిమిషులున్ మహామునులు నయ్యయి పెంపులు గోమతిం బఠిం చిన సుకృతంబునం గనిరి శ్రీయును శత్రుజయంబుఁ బేర్మియుం దనయ సమృద్ధియుం గలుగుఁ దత్పఠనంబున బంధుకోటి బం ధనమునఁ బాయు; మార్గమునఁ దప్పు మృగార్తియుఁ జోరబాధయున్.’ |
098 |
| వ. | అనిన విని యమ్మునిపతికి శుకుం డిట్లనియె. | 099 |