పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - తృతీయాశ్వాసము
వేదవ్యాసముని శుకునకుఁ జెప్పిన కపిల గో మహానుభావము (సం. 13-126-2 (కుంభ))
క. తమజాతికిఁ దగుకర్మ | క్షమతలు లేకున్న యట్టి జనములు కపిలా
సమధిక పూజన తద్దా | నము లొనరింతు; రవి వాచు నా దురితంబుల్‌.
100
సీ. అనుటయు ‘సందియం బది యేల?’ కపిలఁ బూ | జించినఁ, బ్రీతి నిచ్చినను జెడని
యఘములు గల్గునే?’ యనియెఁ బరాశర | తనయుఁ డవ్వాక్యంబు విని తదీయ
తనయుండు గపిల కంతటి పెంపురాఁ గతం | బేమి?’ నావుడు నమ్మునీశ్వరుండు
విను మని యిట్లను ‘ననిమిష సంఘంబు | నొక కారణమునఁ బావకుఁడు మొఱఁగి
 
తే. యరిగి తనదుగుప్తి యర్థించి గోవుల | నాశ్రయించె నవియు నగ్ని గోప
నంబు సేసె నవ్విధంబున శిఖియున్కి | సుర లెఱింగి రెల్లచోటు నరసి.
101
వ. ఎఱింగి కూడుకొని గోవులకడకు వచ్చి వానితో ‘నగ్ని దాఁచుట యఖిలజగజ్జనంబులకు నహితంబు సేయుట గాదె! చూపకుండుట దగ’ దని పలుకుటయుఁ, బుయిలోడి గోవు లప్పావకుం జూపిన, నాసుపర్వులు సంతోషించి వానికి వరం బీవలయునని యవ్వాయు సఖుం బ్రార్థించిన నతండు నగ్గోవుల యందు డాఁగి యుండ నవి కపిలచ్ఛాయం బ్రాపించి యునికిం గనుంగొని గోవుల కెల్లను కపిల యెక్కుడగుటయుం, దదీయారాధనంబునుం దద్దానంబునుం బుణ్యతమంబులై దురితంబుల దమియించి యుత్తమలోకంబుల నిచ్చుటయు వరంబులుగా నిచ్చెనని చెప్పి వెండియు. 102
తే. కపిల యిచ్చిన వానిన కాదు నిజమ | కొన్నవానిని బుణ్యాత్మకుఁడుగఁ జేయు;
నీవుఁ గపిలా సమర్చనా నిరత మాన | సుండ వగు టెంతయును మేలు సువ్రతాత్మ!’
103
వ. అని చెప్పుటయు నప్పరమమునీశ్వరుతో నమ్ముని కుమార వరుండు ‘కపిలా లక్షణం బెఱింగింపవే’ యనిన నతం డతని కిట్లనియె. 104
తే. కర్ణ శృంగాక్షి ఖుర నాసికా పుటములు | గపిలములు, గుత్తుకయును ముష్కములు గవిల
పట్టు లొందు నెందే నొకపట్టు కపిల | మైనఁ గపిలాత్వ గుణమున కదియ చాలు.
105
క. మేనెల్లఁ గపిల మైనను | దానిం జెప్పంగ నేల? తగదు కపిలలన్‌
మానితగుణ! పిదికి కుడువఁ | గా నే బలికైనఁ గాక కట్టఁ బెఱికకున్‌.
106
ఆ. కాలఁ గేలఁ గోలఁ గపిల దండించిన | నరకవాసమునకు నరుగవలయుఁ,
బూరి నీరు లెస్స యారసి యగ్గోవు | సత్కరింప సుగతి సంభవించు.
107
క. అనఘ! కపిలా ప్రదానం | బునకు ఫలం బిట్టి దనఁగబోలునె! కమలా
సనుఁడు మహానంద ప్రదమని వెఱచుచుఁ జెప్పె, దాని నట యే మందున్‌?’
108
వ. అని వెండియు. 109
క. ‘వసుధామర గాయత్త్రీ | వసంతములు సత్య గోసువర్ణంబులు నే
కసముద్భవంబు లని తా | పస వర్యులచేత విందుఁ బావనచరితా!
110
క. కావున భూమియుఁ గనకము | గోవును దానార్హవస్తు కోటికి నెల్లన్‌
ధీవినుతా! యెక్కు డగుట | నీ విమలోదాత్త బుద్ధి నెలవు కొలుపుమీ!’
111
క. అని మునిపతి సెప్పినఁ ద | త్తనయుఁడు ప్రియమందె’ ననుడు ధర్మసుతుం డే
వినియుండుదు సిరి గోమయ | మున నుండుట; దాని కెద్ది మూల మగునొకో?
112
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )