పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - చతుర్థాశ్వాసము
ఆశ్వాసాంతము
మ. స్ఫుటతత్త్వోదయ సంభృతైకమధురా! భూతైకరక్షాధురా!
తటినీ పింఛమనోజ్ఞమౌళిలలితా! దాంతాత్మసంకీలతా!
త్రుటితాపత్వ సమున్నతాశ్రితజనా! దూరాంజనా! సువ్రతో
త్కటశీలావనలోల! దివ్యహృదయా! ధర్మప్రసన్నోదయా!
449
క. దేహాభిమాన సంభృత | మోహతమోనిరసనాభిముఖ! భూరివివే
కాహీన మహాసత్త్వ స | మాహిత చిన్మాత్రరూప! మధురిమ సుభగా!
450
మాలిని త్వరిత విహిత గాఢధ్యాయి సంమోదవాదా!
స్ఫురదరి దృఢశూల స్ఫూర్తి సంశస్తహస్తా!
తరణి శశిమయత్వోదారతా చిత్రనేత్రా!
పరమ నియతనిష్ఠాభవ్యహృత్పద్మసద్మా!
451
గద్యము ఇది శ్రీమదుభయ కవిమిత్త్ర కొమ్మనామాత్య పుత్త్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన శ్రీ మహాభారతంబున నానుశాసనిక పర్వంబునందుఁ జతుర్థాశ్వాసము. 452
ఆనుశాసనికపర్వంలో చతుర్థాశ్వాసం సమాప్తం.
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )