పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - చతుర్థాశ్వాసము
శివుఁడు పార్వతికిఁ దనశ్మశానవాసతకుఁ గారణంబు చెప్పుట (సం. 13-207-1(కుంభ))
ఉ. ‘క్రూరపు భూతముల్‌ జనుల ఘోరవిధంబుల ముట్టి యెప్పుడున్‌
మారణ మాచరింపఁగ సమస్తజనంబులు నాశ మొందఁగా
వారిజసంభవుం డెఱిఁగి వచ్చి ననుం దగఁ గాంచి తత్ప్రతీ
కారము సేఁతకై వినయగౌరవ మొప్పఁగ వేఁడె; వేఁడినన్‌.
435
వ. నిశ్చితంబుగా నొక్కెడనుండి లోకంబులు రక్షింపవలయు నని తలంచితి నట్టియెడ. 436
తే. మోక్షపరులు శుచిస్థానముగఁ బ్రశంస | సేయుదురు విజనత్వవిశేష మెఱిఁగి
కాన యింపై శ్మశానంబు మానసమున | నొలసెఁ గావున నయ్యెడ నునికి గలిగె.
437
చ. అచటన యుండి లోకముల నన్నిటి నాత్మఁ దలంచి రక్ష సే
యుచు విహరింతు, భూతచయ మొక్కటఁ గూడి చరించుచున్కికిం
బ్రచురకుతూహలుండ నయి రాగముఁ బొందుదు నట్లుగాన నా
కచటు నివాసమయ్యె విను మన్యతలంబులు దానిఁ బోలునే?’
438
తే. అనిన భసితాంగరాగంబు నస్థి ఫణధ | రాభరణములుఁ బరశుశూలాయుధములు
నై మహోగ్రతభీకరమైన రూప | మఙభవ! యేల కైకొంటి వీ?’ వనియె గిరిజ.
439
వ. అనుటయు నమ్మహేశ్వరుం డాపరమేశ్వరితోడ. 440
సీ. ‘లోకస్వరూపంబు లోలాక్షి! రెండు వి | ధమ్ములు శీత ముష్ణమ్ము నాఁగఁ
జనునివి రెంటను సకలంబు గ్రథితమై | యుండు సౌమ్యాగ్నేయయోగకలిత
మఖిలజగంబు సౌమ్యము విష్ణుఁ డాగ్నేయ | మేను వహింతు మయ్యిరుదెఱంగు
లెనయుటఁ గొని భరియింతు నీ విశ్వంబుఁ | గావున నాగ్నేయ భావరూఢ
 
తే. యైన యాకృతి లోకహితార్థముగ వ | హించినాఁడ నింకెయ్యది యీవు నన్ను
నడిగె దడుగుము’ నావుడు నార్య ‘సోముఁ | దలఁ బ్రియంబున నేటికిఁ దాల్చి? తనియె.
441
చ. అనవుడు దక్షుయజ్ఞమున కల్గిననాఁడు సురాలి కేను బీ
డన మొనరించుచోట వికటంబుగ సోముని మేను ద్రొక్కఁగా
నను శరణంబు వేఁడిన మనంబున నక్కటికంబు పుట్టి చే
సిన దురితంబు సోమునిట సేయకపోదని మౌళిఁ దాల్చితిన్‌.’
442
చ. అన విని కొల్చి యున్న మునులందఱు నీశుదయావిశేషము
న్మనముల మెచ్చి పొంగి యభినందనపూర్వము గాఁగ భక్తియున్‌
వినయము నుల్లసిల్లఁ బదివేల విధంబులఁ బ్రస్తుతించి ర
య్యనుపమధాము గౌరి సమయం బిది నా కని మోడ్పుఁ గేలితోన్‌.
443
తే. లోలలోచన దీప్తులు బాలచంద్ర | భూషణుని వదనంబునఁ బొలయ మునుల
మానసంబులు సంప్రీతి నూన సాంత్వ | నస్వరంబుగ నిట్లను నలిననాభ!
444
క. ‘వర్ణాశ్రమ ధర్మము లభి | వర్ణింపుము వేదనిరతవత్సల! యవి నా
కర్ణములతో నఖిలజన | కర్ణంబులఁ బొంది పుణ్యకర్తృత యొసఁగున్‌.’
445
వ. అనియెననియిట్లు గౌరి లోక హితార్థంబుగా వర్ణాశ్రమధర్మంబులు పరమేశ్వరు నడుగుటయు నారదముని కృష్ణునకుం జెప్పిన తెఱంగు భీష్ముండు ధర్మజునకుం జెప్పుట యుపన్యసించిన నాకర్ణించి. 446
క. మునివర! నాదగు చిత్తం | బునఁ గౌతూహలము చాల మొలతెంచి తలి
ర్పున నెలరారెడు నేర్పడ | వినిపింపుము మీది కథ సవిస్తారముగన్‌.
447
వ. అని యడుగుటయు. 448
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )