పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - చతుర్థాశ్వాసము
ఉమామహేశ్వర సంవాదంబను నితిహాసంబు (సం. 13-205-1 (కుంభ))
క. నారాయణ సౌహార్దో | దారత్వవిభూతి మున్న తనకుఁ గలిమి న
న్నారాయణుని మనోరథ | మారం బూరించె శంకరాంబికల కథన్‌.
414
వ. అత్తెఱంగు వివరించెద నట్లు సమస్త సంయమిసంఘంబును బ్రస్తుతి పూర్వకంబుగా నియోగింపం బ్రియంబునం బురాతన కథాకథనంబునకుం బూని యద్దేవముని యద్దేవకీనందనునకు వందనం బాచరించి తదభివందనంబు వడసి యవ్విభున కిట్లనియె. 415
తే. తీర్థభజనంబునకు నెందుఁ దిరుగుచుండి | యిత్తుషారనగంబున కేను వచ్చి
కంటి రమణీయ మగు కేలికావనంబు | సకలతరువల్లరీగుల్మచారుతలము.
416
క. కోకిలకుల గంధర్వా | నీకధ్వను లెనసి బెరసి నిగుడఁగ నమరీ
లోకభ్రమరీమండలి | కా కలకలనాదములును గలిసి చెలంగన్‌.
417
వ. ఒప్పు నవ్వనంబునం గనక స్థలంబున శార్దూల చర్మవసన భుజగాభరణ భసితాంగరాగ విరచితాలంకార చారు దివ్యదేహుం డగు మహాదేవుండు సుర సిద్ధసాధ్య విద్యాధర మునిపుంగవ భూతగణ పరివృతుం డయి యున్న నప్పేరోలగంబున నేనును సముచితప్రకారంబున నయ్యనిరూపణీయప్రకారుం గొల్చి యుండితి నట్టి సమయంబున. 418
సీ. పుణ్యాంగనాకారములు దాల్చి పుణ్య న | దీ నివహంబులు దిశలు గొల్చి
చనుదేర శంకరసదృశ పరిష్కార | కల్యాణతను వైన గౌరి వచ్చి
వెనుక దిక్కున మెలుపునఁ జేరి మోమున | కలఁతిన వ్వినుమడి చెలువు నొసఁగఁ
దమ్మిఱేకుల నుల్లసమ్మాడు తన మృదు | కర యుగ్మమునను శంకరుని నేత్ర
 
తే. యుగ్మ మల్ల మూసి యున్నంత లోక మ | నర్క చంద్రతారకాగ్నియై మ
హాంధకారమగ్న మగుటయు సంక్షోభ | మందె భూతసముదయంబు లెల్ల.
419
ఉ. అప్పుడు ఫాలలోచనము నప్పరమేశుఁడు విచ్చె విచ్చినం
గప్పెఁ దదగ్నిజిహ్వలు నగం బఖిలంబును గౌరిదేవి య
ట్లొప్పమి తండ్రి కైనఁ గని యుల్లము బెగ్గిల నీశునంఘ్రులం
గప్పఁగ మౌళిభూషణము కాంతి ప్రణామముఁ జేసెఁ జేసినన్‌.
420
ఆ. హరుఁడు కరుణఁ జూడ నా హిమవన్నగ | దాహ ముడిగి శోభితత్వ మొలసె
నార్య పరమవిస్మయముఁ బొంది యాసర్వ | భువనకర్తతోడ సవినయముగ.
421
సీ. నిటలంబుకను దెఱచుటకుఁ గారణమేమి | సర్వేశ! యిది రహస్యంబు గాక
యున్నేనిఁ జెప్పవే!’ యన్న నద్దేవుండు | ‘కాంత! నీ కెఱిఁగింపఁగాని యట్టి
పని యెందుఁ గల్గునే? వినుము లోకాత్మక | త్వము నాకుఁ గల్గుట వలనఁ జేసి
నన్నేది వొందిన నన్నిలోకంబుల | నది వొందుఁ గాన నాయంబకములు
 
తే. నీవు మూయంగఁ దిమిరంబు నిఖిలలోక | చయముఁ గప్పిన భూతముల్‌ భయముఁ బొందె
నీ కరంబులు ద్రోవక చీఁకటియును | జెఱుచుటకు ఫాలనేత్రంబు దెఱవవలసె.’
422
వ. అనిన విని యంబిక తనకు నడుగవలయునట్టివి యడుగుటకు నది యవసరంబుగాఁ గనికొని యక్కపర్ది కిట్లనియె. 423
క. ‘నాలుగు ముఖములు నీకు | న్ఫాలనయన! కలుగఁ గారణం బేమి? మధు
శ్రీలాలిత్యాస్పద వా | క్యాలీకలనమున నాకు నానతి యీవే!’
424
వ. అనిన విని యమ్మహాదేవికి నద్దేవుం డిట్లను ‘దైత్యులు సుందోపసుందులన నిర్వురు గలరు. వార లవార్య భుజవీర్య శౌర్యసంపన్నులు నస్త్రశస్త్రావధ్యులునై యుండుదురు. వారల వినాశంబునకై మయుండు లోకంబులం గల ఒప్పులం దెల్ల నుత్తమసారంబులు దిలప్రమాణంబు లాహరించి యొక్క కామినిం గావించి తిలోత్తమ యను పేరిడి నాకడకుం దెచ్చిన నచ్చెలువ నాకుం బ్రదక్షిణంబుగా వచ్చునెడ నేనిది దేవకార్యంబు సేయ నోపుఁ బొమ్మను తలంపుతో నత్తరుణి తిరిగిన దిక్కుదిక్కున కొక్కొక్క మొగంబు దాల్చి దానిం బరీక్షించితి; నాటంగోలెఁ జతుర్ముఖుండనై యుండుదు.’ 425
చ. అన విని గౌరి ‘నీకు భువనాధిప! కంఠమునందుఁ గప్పు గ
ల్గిన కత మేమి? నాకు నెఱిఁ గింపుము’ నావుడు దేవదైత్యు లం
బునిధి సుధార్థమై తరువఁ బుట్టి విషంబు త్రిలోకభీకరం
బనితరసాధ్యమై యొదవె; నత్తఱిఁ దాల్చితి దానిఁ గుత్తుకన్‌.
426
తే. అట్లు కంఠంబునందు మహావిషంబు | దాల్చి నీలత గల్గిన దానఁ జేసి
కమలజాది సురులు నీలకంఠుఁ డంచు | నన్నుఁ గొనియాడి రప్పుడు నలినవదన!’
427
వ. అని చెప్పి శంకరుం ‘డింక నేమి యడుగవల?’ తడుగు మనుటయుఁ ‘బినాకం బెల్ల యాయుధంబులకంటె మెచ్చి పట్టుదు దీనికిం గతంబెయ్యది?’ యని యడిగిన నా మృడుం డామృడాని కిట్లనియె. 428
సీ. ఆదియుగంబున నబల! కణ్వుం డను | సంయమి తపము నిష్ఠానిరూఢి
మెయిఁ జేయఁ బెరిఁ గె వల్మీకంబు దనువు ము | నుంగ నప్పుట్ట వేణువును బుట్టె
విను లోకసామాన్యఘనత గాకుండ మ | హాద్భుతాయామంబు నధికమైన
పరిణాహమును గల్గె బ్రహ్మ యమ్మునికిఁ బ్ర | త్యక్షమై వరమిచ్చె నతనిమీఁదఁ
 
ఆ. బెరిఁగియున్న వెదురు గరమర్థిఁ దాఁ బుచ్చి | కొని జగద్ధితంబు గోరి చేసె
నాకు విష్ణునకుఁ బినాకశార్‌ఙ్గము లగ్ర | ఖండమున నొనర్చె గాండివంబు.
429
వ. ఇవ్విధంబున విండ్లు మూఁడు గావించి లోకహితం బాచరించి యవ్విరించి యమ్మూఁడవ విల్లు దాఁ గైకొని తనలోకంబునకుం జనియె నిది పినాకంబు సంభావనీయంబైన తెఱం’ గని చెప్పిన. 430
క. విని గిరితనూజ ‘పెఱ వా | హనముల నొల్లక వృషంబు నఖిలేశ్వర! నె
మ్మనమునఁ గైకొని యెక్కుదు | వినఁగా నే వలతుఁ జెప్పవే కారణమున్‌?’
431
వ. అనిన నద్దేవుఁ డమ్మహాదేవి కిట్లనియె. 432
సీ. హిమవన్నగంబునం దేను లోకహితార్థ | మైన మహాతప మాచరింప
గోవులు చుట్టుఁ దేఁకువ సెడి తిరిగి నన్‌ | సంకట పెట్టినఁ బంకజాక్షి!
కోపించిచూడ సంతాపాకులత్వంబుఁ | బొందె గోకుల మరవిందభవుఁడు
నమరులుఁ జనుదెంచి ప్రార్థించి వృషముఁ గా | నిక యిచ్చి కరుణ జనింపఁ బలికి
 
తే. నాకు గోపతి యనియెడు నామ మిచ్చి | రపుడు గోబాధ మాన్చి రయ్యమలవృషము
వాహనముఁ గేతువునుగా శివప్రచార | మాచరింతు నెల్లెడ నది యాది గాఁగ.’
433
వ. అనుటయు నంబిక యప్పరమేశుతో ‘నీవు పరమ శుచులును రమణీయంబులు నగు నివాసంబుల వసియింపక యశుచియుఁ గేశాస్థికపాల దుర్గంధదుర్దర్శంబునైన శ్మశానంబున నునికికిఁ గతంబేమి?’ యనిన నతం డిట్లనియె. 434
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )