పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - చతుర్థాశ్వాసము
భీష్ముఁడు ధర్మజునకు శ్రీకృష్ణుని చరిత్రంబు చెప్పుట (సం. 13-203-1 (కుంభ))
క. తనయునిఁ బడయుటకై తప | మొనరింపఁగ రుక్మిణియు సముత్సుకవృత్తిం
దనతో రాఁ దుహినాద్రికిఁ | జనియెం గృష్ణుండు మునులు సంతస మందన్‌.
396
వ. ఇట్లు చని, ద్వాదశవార్షిక వ్రతక్లిష్టుండై యున్న కృష్ణుం గాన మునీంద్రులు నారదపర్వత వ్యాసవాల్మీకి దేవల కాశ్యప ప్రభృతులు శిష్యవర్గంబుతో వచ్చినవారలం బాద్యాసనాది సముచితార్చనంబుల సంభావించిన వార లద్దేవునిం బరివేష్టించి పుణ్యగోష్ఠి నడపుచున్న సమయంబున. 397
తే. అతని ముఖమున వెడలి మహాగ్ని యమ్మ | హీధరము విపినంబుల నేర్చెఁ బక్షి
మృగయుతంబుగ సిద్ధసాధ్యగణములు స | మాకులత్వంబుఁ బొందఁ బెల్లడరి యధిప!
398
క. ఆ కృష్ణుఁడు నిజసౌమ్యా| లోకనమున నాశిఖిని మలుఁగఁ జేసెం బూ
ర్వాకారత నవ్వనము ని | రాకులతం బొల్చె నది మహాద్భుత మయ్యెన్‌.
399
తే. దాని కమ్మును లెల్లఁ జిత్తమున భయము | విస్మయంబును బెనఁగొన వెఱఁగుపాటు
గదిరి చిత్రరూపంబుల కరణి నుండ | వారిఁ గన్గొని రుక్మిణీవల్లభుండు.
400
వ. ‘మీరీ యనలంబు తెఱం గేమిగా నెఱింగితి? రున్న రూపెఱింగింపవలయు’ ననుటయు వారలు సభక్తికంబులగు చిత్తంబులతోడ. 401
క. ‘దేవా! విశ్వము గలుగుట | నీవలనన; యడఁగుటయును నీయందు భవ
ద్భావాధీనమ సకల | స్థావరజంగమ సమాహితత్వం బెల్లన్‌.
402
తే. నీవు మమ్ము బోధింపఁగా నేర్తుగాక | యిమ్మహానలస్ఫురణంబు నిట్టి దనఁగ
నేము నేర్తుమె? యేమియో యెఱుఁగ కునికిఁ | గాదె నివ్వెఱ పడితిమి? కమలనాభ!’
403
వ. అనుటయు భవదీయ చేతఃప్రసన్నతగాదె జగంబుల వర్తనంబునకు నాధారంబు. 404
క. కావున మీకుం బ్రియముగ | నీ వహ్ని తెఱంగు దెలియ నెఱిఁగించెదఁ జి
త్తావిలత విడువుఁ డని కమ | లావరుఁ డిట్లనియె వారలకుఁ గురువర్యా!
405
వ. ఒక దానవుఁడు జగన్నా | శకుఁ డిత్తఱిఁ గలఁడు వానిఁ జంపుట కేఁ బూ
నక యునికి గలిగె వాఁ డ | స్త్రకళావిదుఁ డగుట నా కతంబున నగుటన్‌.
406
క. కడుఁ గ్రొవ్వి వాఁడు లోకము | నుడుకులఁ బెట్టంగ విసివి యుగ్రతపమునం
గొడుకుఁ బడసి యద్దనుజునిఁ | బొడవడఁగింపం దలంచి భూరివ్రతమున్‌.
407
చ. నడప మదాత్మ యగ్నియయి నా వదనంబున నిర్గమించె యె
క్కుడుపడి పద్మగర్భుకడకుం జనె నమ్మహితుండు మన్మథుం
గొడుకుగఁ బంచి వే తను మగుడ్పగ వచ్చెఁ గడంగి పోవున
ప్పుడు వనమేర్చె నేను గృపఁ బూర్వవిధం బొడఁగూడఁ జూచితిన్‌.
408
వ. ఇది యద్దహనంబు తెఱం’ గని చెప్పి యప్పరమపురుషుం డమ్మునివరులతో మఱియును. 409
సీ. ‘లోకత్రయంబున మీకు నవిదితంబు | లేదు త్రికాల సంవేదులార!
యుత్తమం బగు పురావృత్తంబు చెప్పి కృ | తార్థుఁ జేయుండు న న్ననిన వారు
సవినయంబుగఁ గృతాంజలు లయి ‘మమ్మింత | పెద్ద సేయుదె? నీవు పెద్దలకును
బెద్ద వయత్నసంభృతజగత్త్రయుఁడవు | విశ్వప్రకారసంవిదుఁడ వేము
 
తే. నీ యెఱుంగని యితిహాస మేయుగమున | నెఱిఁగి చెప్పుదు? మనవుడుఁ జిఱుతనగవు
మోమునకుఁ జెన్ను సేయ నమ్మురహరుండు | వారలకు నిట్టులనుఁ గురువంశ వర్య!
410
క. ‘మానుషయోని జనించితిఁ | గాన మదీయ మగు బుద్ధిగౌరవము దదీ
యానుగుణత్వోపహితము | గా నెఱుఁగుఁడు మీరు సెప్పు కత విను టసదే?’
411
చ. అనుటయు వారలందఱుఁ బ్రియంబున దానికి నియ్యకొన్న నె
మ్మనములతోడ ‘నీ పనికి మాన్యచరిత్రుఁడు నారదుండ త
క్కిన పెఱవారు చాలరు ప్రకీర్త్యవివేకుఁడు కృష్ణు డర్థితో
వినఁగఁ బురాతనంబయిన వృత్తము నమ్ముని చెప్పు టొప్పగున్‌.
412
చ. అని తగ నేక వాక్యతఁ బ్రియంబున నాతనితోడ నీవు మున్‌
కనినది విన్నయట్టిది ప్రకామకుతూహల చిత్తుఁ డైన కృ
ష్ణుని వినిపింపు నావుడు మనోజ్ఞ కథాకథనంబునందు వే
డ్క నిగుడ నమ్మునీంద్రుఁడు వికాసమునన్‌ మొగ ముల్లసిల్లఁగన్‌.
413
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )