పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము
శివుఁడు పార్వతికి వర్ణాశ్రమాచారంబుల తెఱఁ గెఱిఁగించుట (సం. 13-128-28 (అను-1-15))
వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె. 002
తే. అట్లు గంగాత్మజుండు ధర్మాత్మజునకు ఁ | జెప్పి యిట్లనుఁ ‘గౌరవశ్రేష్ఠ! పద్మ
నాభుతో నవ్విధంబున నారదుండు | పార్వతీదేవి ప్రశ్న ముపన్యసించి.
003
వ. ఇట్లనియె నప్పర్వతరాజపుత్రి ప్రార్థించిన నప్పరమేశ్వరుండు పరమాదర భరితుండై. 004
సీ. అజుఁడు మున్‌ లోకహితార్థంబుగా బ్రాహ్మ | ణులను సృజించి రాజులను వైశ్యు
లను శూద్రులను గ్రమం బొనరంగఁ గల్పించె; | నాజాతులకు నోలి నతని ముఖము
బాహులు నూరులుఁ బదములు సంభవ | స్థానంబు లగుటయుఁ, దారతమ్య
భాగిను లగునని పార్వతి కాతండు | తత్తదాచరణీయ ధర్మములును
 
ఆ. వినుము విస్తరించె; విప్రులు లోకధా | రకులు; వారియెడఁ బరాభవంబు
సేఁత యెల్ల చేటుఁ జేయు; సమ్మాన దా | నములు సకల శోభనము నొనర్చు.
005
చ. ప్రియ మఱి యజ్ఞునేనియు దరిద్రుని నేనియు విప్రుఁ గందఁ జే
త యుభయలోక సౌఖ్యములు దవ్వుగఁ జేయుఁ; దదీయమైన నిం
దయు నను బెట్టు దిట్టుట, యధర్మత నాతని సొమ్ము పుచ్చి కొం
టయును మదర్థముంగొనుట; డాఁపక చెప్పితి; నిక్క మింతయున్‌.’
006
వ. అని పలికి యిట్లనియె. 007
సీ. ‘అధ్యయనంబును యజనంబు దానంబు | నధ్యాపనంబును యాజనముఁ బ్ర
తిగ్రహంబును బ్రశాంతియుఁ దపస్సత్యశౌ | చంబులు విప్రధర్మంబు లాప
దలఁ దక్క నతనికి వలవదు వాణిజ్య; | మగ్నికార్యంబు, శూద్రాన్నవర్జ
నము, నిజదార సంగమ నియమంబును, | నిరుప్రొద్దు గుడుపును, హింస లేమి
 
ఆ. యును, నివాస శుద్ధియును, నతిథిప్రియ | త్వంబు బ్రాహ్మణులకు వలయుఁ; దపము
పేర్మి సాధనముగ ధర్మమూలముగ వా | రల సృజించెఁగాదె నలినభవుఁడు.
008
ఆ. క్షత్రియులకు విప్రసంరక్ష ముఖ్యధ | ర్మంబు; ధరణి వారి రక్షణమునఁ
గాని బ్రదుక; దమ్మహానుభావుల పాల | నంబు సేయ శోభనంబు నొందు.
009
క. రమణీ! యధ్యయనము యజ | నము దానము సాధుపోషణము దుర్జనులన్‌
దమియించుటయు సముత్సా | హము కల్మియు ధృతియు నృపుల కగు ధర్మంబుల్‌.
010
తే. శ్రస్త జీవికయును నరిషష్ఠ భాగ | మా హరించుటయును భృత్యు నరయుటయును
బ్రజ వివాదంబు వినుచోటఁ బక్షపాతి | గామియును రాజులకుఁ గృత్యకర్మకోటి.
011
సీ. వణిజులు లోక ప్రవర్తనంబుల కెల్ల | నుపకారకులు; గృషియును ననేక
భంగి బేహారంబుఁ బసులఁ బెంచుటయుఁ గృ | త్యంబులు; వారల కధ్యయనము
యజనంబు దానంబు నర్హ కర్మంబులు; | ద్రైవర్ణిక ద్విజత్వమ్ము కతన
నాతిథ్యములు విధేయములు; వారికిఁ దిల | గంధరసముల విక్రయము దగదు;
 
తే. మూఁడు జాతుల శుశ్రూషమూల కార్య | గతి తదుపయుక్తి శూద్రుల కలిమి నడచు;
వారు శుశ్రూషకులు; విప్రవందనంబు | వినయ మక్రూరు లగుట తద్విహిత కృతులు.
012
క. తన తన వర్ణంబునకుఁ ద | గిన యాచారంబు నడపి కిల్బిష రహితుం
డనఁ బరఁగు నెల్లవారికి | విను మున్మును జన్మ సౌఖ్య విభవము గల్గున్‌.
013
వ. ఇవి వర్ణ ధర్మ ప్రకారంబు; లింక నాశ్రమ ధర్మంబులు వివరించెద నాకర్ణింపు’ మని పలికి పార్వతికి పరమేశ్వరుం డిట్లనియె. 014
సీ. బ్రహ్మ చర్య వ్రత పరమ నిష్ఠయు, గురు | నాశ్రయించుటయు, నధ్యయన కృతియు,
నగ్ని కార్యంబు, గుర్వర్థ సంచారంబు, | భైక్షచర్యయుఁ గమలాక్షి! బ్రహ్మ
చారి ధర్మంబు; లాశ్రమములకెల్ల నా | శ్రయణీయమై గృహస్థత్వ మొప్పు;
శౌచంబు, నిజదార సంతుష్టియును, బంచ | యజ్ఞంబులును, నిగమాభిరతియు,
 
తే. దాన హోమ దయాతిథి మాననములు | వలయు గృహమేథికిని; వనవాస వన్య
భోజన బ్రహ్మచర్య జటాజిన ప్ర | ధారణములు వానప్రస్థ ధర్మకోటి.
015
చ. కినియమి, సంగవర్జన, మకించన భావము, తాల్మి, విప్రవా
సనము, ప్రశాంతి, యార్జవము, శౌచము, సద్వ్రతనిష్ఠ, భైక్షభో
జన, మిల నిద్రసేఁత, కృప, సంతత తత్త్వ విచింతనంబు మా
నిని! యతి ధర్మముల్‌ శ్రుతి గణించిన భంగిన యేను జెప్పితిన్‌.
016
వ. అని యిట్లాశ్రమ ధర్మంబులు సెప్పిన విని యప్పరమేశ్వరుతోఁ బార్వతి ‘తపంబు తపంబనుచు మునిజనంబు లాచరింతురు; దాని తెఱం గెఱింగింపవే’ యనిన నద్దేవుం డిట్లనియె. 017
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )