| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము |
| సీ. |
భోగార్థులై తపంబునకుఁ జొత్తురు; తపం | బనఁగ వానప్రస్థు లాచరించు ధర్మంబు; లింద్రియ కర్మ నిగ్రహముతో | నుభయకాలములను యోగసేవ ఫలకాంక్షఁ జేఁత తపస్స్వరూపంబుగా | నడపి కాలం బైన నాకమునకు నరిగి తద్భోగంబు లనుభవింతురు; పుణ్య | మవసిత మగుడు మర్త్యత్వ మొంద |
|
| తే. |
వత్తు; రధికనియతి నుపవాసములను | జపముఁ బంచాగ్ని మధ్య వాసంబు గలుగు తపముఁ గల దప్సరః ప్రియత్వం బొనర్చుఁ | గర్త కది; వాఁడుఁ దుది వచ్చుఁగాని మరలి.’ |
018 |
| వ. | అని చెప్పి మఱియు, | 019 |
| ఉ. |
‘దారయుతంబుగా నడచు తాపసముఖ్యు లహింస పేర్మికై కారుణికత్వ మగ్గలము గల్గి తలంతురు సర్వజీవులుం దారును నొక్కరూపుగఁ బదంపడి పుత్ర కళత్రయుక్తిఁ బెం పారుదు రూర్ధ్వలోకమున నజ్జనమున్ మఱివచ్చుఁ గ్రమ్మఱన్.’ |
020 |
| వ. | అనిన భవాని ‘వనవాసవ్రతవిశేషంబులుం, దదీయఫల ప్రకారంబులు నేర్పడ నానతీయవే’ యనుటయు నభవుండు భరితాదరుండై. | 021 |
| సీ. |
‘ఉపవాసములు మౌన ముర్వీశయత్వ మా | సన మూర్ధ్వ బాహుక స్థాపనంబు నియమితా హారత్వ నిష్ఠ క్రమంబున | శశి మరుద్యక్ష వాసముల నిలుపు గంధర్వ దేవ నాగస్థానముల నున్కి | యును బహుసౌఖ్య సంయుతము గాఁగ నానా సహస్రాబ్ద మాననీయంబుగఁ | గావించు సంక్షేపగణనఁ గొన్ని |
|
| తే. |
మహితనియతులు సెప్పితి; మఱియు నేమి | వ్రతము సల్పినఁ బాప నిరఙ్హరణ మగుటఁ బుణ్యగతికల్మి దప్ప దరణ్యవాసి; కడుగు మింకను వలసిన యట్టి’ వనుడు. |
022 |
| క. |
‘యాయావరుల నమరవం | ద్యా! యేర్పడఁ జెప్పు మనియె నంబిక; దేవుం డాయమ కిట్లనుఁ’ దీర్థప | రాయణు లుపవాసవిధి సమధికులు వారల్. |
023 |
| వ. | అది యెట్లంటేని. | 024 |
| క. |
నానాతీర్థ సతత సు | స్నానంబులఁ బల్లలైన జడలును భిక్షా నూనోపవాస కృశమగు | మేనులునై వారితపము మిక్కిలి మెఱయున్. |
025 |
| క. |
మాసోపవాస విధులం | జేసి తృణజ ధాన్యభుక్తి సెల్లింతురు వా రేసురలకు లేని సుఖా | వాసమ్ములఁ జరితములను వఱలుదురు తుదిన్.’ |
026 |
| వ. | అనిన విని యవ్వనితారత్నంబు ‘వైఖానసుల విధంబు వివరింపు’ మనుటయు న వ్విరూపాక్షుండు. | 027 |
| సీ. |
‘వైఖానసులు ఖరవ్రతు; లెట్టులంటేని | శిలఁ దృణధాన్యముల్ చిదుక నడచి కొందఱు పండులఁ గొఱికి కొందఱు గన్న | గుఱుముల గువ్వల తెఱఁగు దోఁప నప్పటి కప్పటి కాననంబున వైచి | కొని కొంద ఱాకు లెండినవి యేఱి కొని కొంద ఱంబువుల్ గొని కొంద ఱనిలంబు | గొంద ఱాహారంబు గొందు; రట్లుఁ |
|
| తే. |
గాక యాహారపరులును గలరు; వార | లింద్రునకుఁ బూజనీయులై యెక్కుడైన పదవిఁ జిరకాల బహుసౌఖ్యభాగు లగుదు’ | రని మహేశ్వరుఁ డుమకు నిట్లనియె మఱియు. |
028 |
| వ. | ‘ఇవి యెల్లను వానప్రస్థ నియమ నిష్ఠా భేదంబులు; తపంబు తపంబని మును లాచరింతురు దాని తెఱం గెఱింగింపు మని నీవు తొల్త నడిగిన విధంబునం దొడంగి నా చెప్పిన విధంబు లన్నియుం దపంబను శబ్దంబున కర్థంబులైయుండు’నని చెప్పి ‘యంగుష్ఠ ప్రమాణదేహులు మృగాజిన వసనులు నిర్ద్వంద్వులు నై వాలఖిల్యు లను పేరం బ్రసిద్ధులగు మునులు దినకర దీప్తులతోడం గూడి వర్తించుచుండుదురు; వారల తపో వైభవంబునం గాదె జగంబులు సుస్థిరంబులై యున్నయవి; యొండుమెయి దుర్లభంబు లైనట్టివి తపంబున సులభంబులగుం; దపంబు గడచిన ధర్మంబుగలదే?’యని పలికి యాదరాతిశయంబున శివుండు శైలేంద్రతనయతో ‘ధర్మంబులు మఱియు నెఱింగించెద; నవహితవై యాకర్ణింపు’మని యిట్లనియె. | 029 |
| ఉ. |
అంబుజసూతి యేర్పడ గృహస్థ సమర్హముగాఁ బ్రవృత్తి ధ ర్మంబు నొనర్చె; నార్యజన మాన్యము దాని తెఱంగు చాల సూ క్ష్మం; బతి కాంక్షలేక తగుకాలమునన్ సమచిత్తవృత్తి ని త్యంబును ధర్మముఖ్యముగ నర్థముఁ గామముఁ జల్పు టొప్పగున్. |
030 |
| చ. |
అతఁడు నివృత్తి ధర్మము ప్రయత్నమునన్ వివరించె మోక్షణో ద్యత మది తత్ప్రకారములు దాంతియు భూతచయంబుపై దయా రతియును సత్యదృష్టియు విరాగత యింద్రియకోటికిన్ దృఢ స్థితముగఁ జేసి యోగనిరతిం బరిశాంతి యొనర్చికొంటయున్. |
031 |
| వ. | అని మఱియును. | 032 |
| తే. |
‘క్షుత్పిపాసలచేఁ గడుఁ గుందినట్టి | యతిథి వచ్చినఁ బ్రియమున నతని దప్పి వోవునట్లుగ సముచితభోజనంబు | వెట్టు టెల్ల పుణ్యములకుఁ బెద్ద తలఁప. |
033 |
| క. |
దీనికి నఖిలాశ్రమ సువి | ధానంబులకును గృహస్థతయ నెల వగుటన్ దాని పదాఱవ పాలి స | మానముగా దరయ నాశ్రమం బెయ్యదియున్.’ |
034 |
| క. |
అన విని ‘గృహస్థునకు నే | పనిముఖ్యం?’ బనియె గిరిజ; పశుపతి ‘జననీ జనకారాధన మతనికి | ననుపమ మగునట్టి ధర్మ’ మని రూపించెన్. |
035 |
| వ. | అ ద్దేవుండు వెండియు. | 036 |
| క. |
‘పతి భక్తి ముఖ్య ధర్మము | సతి’ కనవుడు, దేవి ‘నరుఁడు జననీ జనకుల్ మృతు లైనను, నాతి విగత | పతిత్వ మొందినను జేయు పను లెయ్యవియో?’ |
037 |
| వ. | అనుటయు నభవుండు ‘వారి వర్తనంబు లెఱింగించెద విను’ మని యిట్లనియె. | 038 |
| క. |
‘దేవాతిథి పితృ పూజలు | గావించుట భావశుద్ధి కలిమి నరునకున్ దేవీ! వలయును వారికి | నే విధమున బ్రహ్మచర్య మేమఱమి తగున్.’ |
039 |
| వ. | అని నిర్దేశించి మఱియును. | 040 |
| ఆ. |
‘పంచపర్వ సురత పరిహృతితో నిజ | దార తృప్తుఁ డగుచు ధాన్యకోటి పక్షి యెలుక దినిన బ్రతుకుఁగాఁ గను గృహ | పతికి నశ్వమేధ ఫలము గలుగు.’ |
041 |
| వ. | అని చెప్పి. | 042 |
| ఆ. |
‘ఎచట మెలఁగె నేమి యెట్లుండె నేమి దా | నేమి సేసె నేమి యెల్ల సంగ ములును విడిచి కుడుపు వలన నియతి గల్గు | యతికి మోక్షవీథి యాటపట్టు’. |
043 |
| వ. | అనిన విని సంప్రీతయై శైలరాజపుత్రి పురహరునితో ‘రాజనువానికి భూజనంబుల యట్ల శరీరంబును భోజనాదులును నట్లయుండియు నతం డెల్లవారలచే మ్రొక్కు గొనుటకు, నిగ్రహానుగ్రహం బులకుం జాలి సర్వాధికత్వంబున శోభిల్లు దానికిం గారణం బేమి ? యెఱింగింపవే’ యనుటయు నీశానుం డిట్లనియె. | 044 |