పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము
ధృతరాష్ట్రునకు వ్యాసుఁ డింద్రసురభి సంవాదంబు సెప్పుట (సం. 3-10-6)
ఆ. ‘ఎల్ల నెయ్యములకుఁ దల్లిదండ్రులయందు | సుతులవలని నెయ్య మతిశయంబు;
ధనము లెంత గలిగినను సుతరహితుల | కెమ్మెయిని మనఃప్రియమ్ము లేదు.
81
వ. తొల్లి సకలగోమాత యయిన సురభి సురరాజుకడకుం బోయి కరుణంబుగా నేడ్చిన దానింజూచి సురపతి విస్మితుండై’ యిట్లేల రోదనాకులితలోచనవయి యున్న దాన; వెల్ల వారికి లగ్గ కదా’ యనిన నింద్రునకు సురభి యిట్లనియె. 82
క. ‘నీ వజ్రము రక్షింపఁగ | నా వారికిఁ దక్కఁ ద్రిభువనంబులఁ గల జీ
వావలి కెల్లను గుశలమ | దేవేంద్ర! జగత్త్రయప్రదీప! మహాత్మా!
83
వ. దీనిం జిత్తగింపుము; బలంబు గల బలీవర్దంబులతో బలహీనంబులయిన వానిం బూన్చిన నవి దుర్వహ భారవహన మహాలాంగలాకర్షణంబులయం దసమర్థంబు లైన నడిచియుం బొడిచియు ములుకోలలం గుట్టియు దుర్బలబలీవర్దంబుల జనులు బాధింపం జూచి యేను దానికి దుఃఖించెద’ ననిన సురభికి సురపతి యిట్లనియె. 84
క. ‘నీకు నపత్యశతంబు ల | నేకంబులు గలవు వాని కేకాకృతి దుః
ఖాకులత సంభవింపదు | శోకింపకు’ మనిన సురభి సురపతి కనియెన్‌.
85
వ. ‘దేవా! దీనాననంబులయి దుర్బలంబు లయిన యపత్యంబుల దుఃఖం బే నెట్లు సూడనోపుదు?’ ననిన నగి యింద్రుండు దానికిం గరుణించి వర్షంబునఁ దృణవర్ధనంబు సేసి దుర్బల బలీవర్దంబులకు బలంబు గావించె నని యింద్ర సురభి సంవాదంబు వేదంబులయందు వినంబడుఁ గావున నీకుం బుత్త్రస్నేహంబు సామాన్యంబు గా; దైనను దీనులై వనంబున నవయుచున్న యప్పాండవులకు దయాళుండ వగుము. 86
తే. నీవుఁ బాండుండు విదురుండు నెమ్మి నాకు | నొక్క రూపైన యట్లు నీ కుదితయశులు
నీ సుతులు నూర్వురును బాండునృపతనూజు | లేవురును నొక్కరూప కా నెఱుఁగవలయు.
87
క. సుజనుల సహవాసంబునఁ | గుజనులు సద్ధర్మమతు లగుట నిక్కము; ధ
ర్మజునొద్ద నుండి నీ యా | త్మజుఁడు ప్రశాంతుండు ధర్మమార్గుండు నగున్‌.
88
వ. రాజర్షి యైన ధర్మరాజుతోడి సహవాసంబు సర్వజనహితంబు గావున నాతని నుపాసించి దుర్యోధనుండు గొండొకకాలం బుండు నట్లుగాఁ బనుపు; మట్లయిన నుభయపక్షంబులకు లగ్గగు’ ననిన ధృతరాష్ట్రుండు గృతాంజలి యయి ‘మునీంద్రా! దుర్యోధనుండు నా పలుకులు వినండు; కురుకులంబు రక్షించు నట్టి బుద్ధి గలదేని వాని మీర శిక్షింపుం’ డని మ్రొక్కిన 89
క. ‘అనఘుఁడు మైత్రేయుం డను | మునినాథుఁడు వచ్చి ధర్మమున నాతనిఁ దా
ననుశాసించుఁ దిరంబుగ’ | నని చెప్పుచు నప్పరాశరాత్మజుఁ డరిగెన్‌.
90
వ. అంత. 91
ఉ. న్యాయవిదుండు గామ్యకవనంబున ధర్మజునొద్దనుండి మై
త్రేయుఁడు ధీయుతుం డరుగుదెంచిన నప్పుడ యమ్మునీంద్రు నిం
ద్రాయితుఁ డాంబికేయుఁ డుచితస్థితిఁ బూజితుఁజేసి నాత్మ ని
శ్శ్రేయసలాలసుండయి విశేషసపర్యలఁ జేసె భక్తితోన్‌.
92
వ. ఇట్లుదనచేతంబూజితుండై సుఖవిశ్రాంతుండైన మునివరునకు ధృతరాష్ట్రుండు ముకుళితహస్తుండై ‘భట్టారకా! యెందుండి వచ్చితి?’ రని యడిగిన మైత్రేయుం డిట్లనియె. 93
చ. ‘అలఘుతపోభరంబున జటాజినముల్‌ ధరియించి రూక్ష వ
ల్కలములు గట్టి కూరలును గాయలుఁ బండులు భోజనంబుగా
నలయక కామ్యకం బను మహావిపినంబున నున్న పాండవే
యులకడనుండి వచ్చితిఁ గురూత్తమ! నీసుతు నిన్నుఁ జూడఁగన్‌.
94
వ. ఏ నఖిలతీర్థదర్శనార్థంబు పరిభ్రమించుచుఁ గురుజాంగలంబున కరిగి యందుఁ గురుకులోత్తము లైన పాండుపుత్త్రులం జూచితి.’ 95
ఆ. అనిన నవనతాస్యుఁ డయి ధృతరాష్ట్రుఁ డి | ట్లనియె ‘నెట్లు సెప్పుఁ డయ్య! యందుఁ
బాండవులకు సత్యభాషణులకుఁ గుశ | లంబె? వార లిట దలంతు రొక్కొ!’
96
క. ‘అమితభుజశక్తి నంతక | సము లప్పాండుసుతు లిందు సౌభ్రాత్ర స్నే
హమునకు విచ్ఛేదముగా | సమయాతిక్రమము సేయ సమకట్టరుగా.’
97
వ. అనిన మైత్రేయుం డిట్లనియె. 98
క. ‘చనుదెంచి మహామునివరు | లనవరతము వారలకుఁ బ్రియం బొనరఁగ దీ
వన లీగిఁ జేసి కుశలమ | మనుజేశ్వర! వారు ధర్మమతియుతు లగుటన్‌.
99
క. వారలు సమయము దప్పిన | వారిజరిపుహితుల గతు లవశ్యముఁ దప్పున్‌;
వారికి నకారణంబ ని | కారము నీ కొడుకు సేసెఁ గడు నహితుండై.’
100
వ. అని దుర్యోధనుం జూచి ‘యయ్యా! నీవు బుద్ధిగలవేనిఁ బాండవులతో విరోధం బుడుగు; మట్లయిన నీకును వారికిం గురుకులంబునకు లగ్గగు; నా పలుకుఁ జేకొనుము. 101
సీ. వజ్రసంహనను లవార్యపరాక్రముల్‌ | పాండుకుమారు లాఖండలాభు
లందఱు నాగశతాయుతత్రాణు లు | గ్రాహవకాంక్షు లుత్సాహపరులు;
వారలలో బలవంతుండు బక హిడిం | బాసురు లనువారి నాసురమునఁ
జంపె, నాగాయుతసత్త్వు జరాసంధు | నెక్కటి యోర్చిన యక్కజుండు
 
తే. ఘోరవనమున వీరుఁ గిమ్మీరుఁ డను సు | రారి నిశ్చల ఘన భీకరాంగుఁ బట్టి
పోర వధియించినట్టి సమీరజునకు | భూరిభుజునకు మార్కొనువారుఁ గలరె?
102
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )