| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | వారికి వాసుదేవ ధృష్టద్యుమ్నులు సంబంధ సహాయులు; జరామరణవంతులైన మనుజులు వారింజెనకి యెట్లు జీవింతురు? నీవు వారితో నొడంబడియుండు; మిది కార్యం’ బనిన మైత్రేయుపలుకు లాదరింపక పాదాంగుష్ఠంబున నేల వ్రాయుచు బాహు వెత్తి తొడలు సఱచి నగుచున్న యా దుర్యోధనుం జూచి, మైత్రేయుం డలిగి ‘యీ యపరాధంబున నాహవంబగు నందు భీముగదాఘాతంబున నీ యూరుయుగళంబు భగ్నం బయ్యెడు’ మని శాపం బిచ్చిన వెఱచి ధృతరాష్ట్రుండు ‘మునీంద్రా! యట్లు గాకుండం బ్రసాదింపు’ మనిన నమ్మునివరుం డిట్లనియె. | 103 |
| తే. |
‘కడఁగి సమబుద్ధి వీనికిఁ గలిగె నేనిఁ | గాదు శాప ఫలం; బట్లు గాక బుద్ధి హీనుఁడై గర్వితుం డగు నేని శాప | హవ్యవాహఫలంబు వీఁ డనుభవించు.’ |
104 |
| వ. | అని ప్రసన్నుండైన మైత్రేయునకు నాంబికేయుం డిట్లనియె. | 105 |
| క. |
‘కిమ్మీరుం డను రక్కసు | డ మ్మారుతతనయుచేత నత్యుగ్ర వనాం తమ్మున నిహతుండయిన వి | ధ మ్మెట్టులు సెప్పు మద్భుతం బిది’ యనినన్. |
106 |
| వ. | ‘నా పలుకులు నీకొడుకు వినండయ్యె; నే నేల చెప్పెద? దీనిం బాండవసహాయులైన విప్రులచేత విదురుం డిమ్ముగా నెఱిఁగినవాఁ; డతనివలన విను’ మని చెప్పి మైత్రేయుం డరిగినం, గిమ్మీరవధ కథాశ్రవణపరుండై తన్నడిగిన ధృతరాష్ట్రునకు విదురుం డిట్లనియె; నిందుండి చని పాండవులు మూఁడహోరాత్రంబులు నిరంతర ప్రయాణంబు సేసి, కామ్యకవనంబుఁ జొచ్చు వా రొక్కనాఁటి యర్ధరాత్రంబున రాక్షసప్రచారవేళయందుఁ బరిభ్రమించుచు రాక్షసమాయఁ గావించుచున్నవాని, నతినిశితదంష్ట్రాకరాళంబైన తన వదన గహ్వరంబుఁ దెఱచి గ్రుడ్లు మెఱవ(య) బభ్రుకేశంబులు దూల బాలార్క రశ్మియుతంబయిన బలాహకంబునుంబోలె సకల ప్రాణిభయజననంబుగా గర్జిల్లుచున్నవాని, నిజపాద ఘట్టిత మహీతల ప్రచలన వేగ వేల్లిత వల్లీ పల్లవ బాహు పరిరంభణసుఖంబుఁ బాదపంబుల కాపాదించుచున్నవాని నెదుర నొక్కరక్కసుం గని; రంత వాఁడును బ్రాహ్మణ సంఘంబు ముందటఁ గృష్ణాజినావృతులై వచ్చు పాండవుల దవ్వులం గని మార్గ నిరోధియై మహాపర్వతంబునుంబోలె నున్న, నదృష్ట పూర్వ ప్రమాణంబైన వాని దేహంబుఁజూచి నిమీలితనయన యయి దుశ్శాసన కరాకృష్ట వికీర్ణవేణీభరంబు వెనువెంట నొలయం బాంచాలి పంచపర్వతంబుల నడిమి నదియుంబోలెఁబతుల నడుమ భయవ్యాకుల చిత్తయైన నింద్రియంబులు విషయరతిం బరిగ్రహించు నట్టు లేవురు నక్కోమలిం బట్టుకొని భయపడకుండ నాశ్వాసించుచున్నంత. | 107 |
| క. |
రక్షోఘ్నమంత్రముల నా | రాక్షస మాయాపరిస్ఫురణఁ జెఱిచెఁ గ్రియా దక్షుఁడు ధౌమ్యుఁడు పాండవు | లీక్షించుచు నుండఁగా నహీనప్రతిభన్. |
108 |
| వ. | అంత. | 109 |
| క. |
ప్రతివిహితమాయు నత్యా | యతభుజయుతుఁ గోపఘూర్ణితారుణ విస్ఫా రితనేత్రు నసురఁ జూచి భ | రతకులవర్ధనుఁడు ధర్మరా జిట్లనియెన్. |
110 |
| వ. | ‘నీ వెవ్వరి వాఁడ? వెవ్వండ? వివ్వనంబున నేల యున్న వాఁడ? వనిన వాఁ డి ట్లనియె. | 111 |
| క. |
‘ఏను బకాసురు ననుజుఁడఁ, | గీనాశుఁడ మానవులకుఁ, గిమ్మీరుఁ డనం గా నెగడుదు నీ కామ్యక | కాననమున సర్వసత్త్వఖాదనబుద్ధిన్. |
112 |
| క. |
పాయక యుండుదు, రాక్షస | మాయల సమరంబు సేసి మనుజుల విగతో పాయులఁ జంపుచు భక్షణ | సేయుదు, నమరాదులకు నజేయుఁడఁ బోరన్. |
113 |
| వ. | నాకు వెఱచి యెల్లవారును దూరంబున దీనిం బరిహరింతురు; మీ రెవ్వ? రిందుల కేల వచ్చితిరి? మిమ్ము వధియించి యిపుడు భక్షించెద’ ననిన వానికి యుధిష్ఠిరుం డిట్లనియె. | 114 |
| ఆ. |
‘ఏను ధర్మసుతుఁడ, నీతఁడు భీముండు, | వాఁడు విజయుఁ, డల్లవారు గవలు; పాండవులము సమయపడి వనవాసంబు | సేయ వచ్చితిమి విశేషయుక్తి.’ |
115 |
| సీ. |
అనవుడు రాక్షసుం డట్టహాసంబుతో | ‘నెట్టెట్టు! భీముండె యీతఁ? డేమి పుణ్యమో వీని నెప్పుడు సంపఁగాంతునో | యని యున్నచోఁ దాన యరుగు దెంచె; నధికు మా యన్న బకాసురు, నా యిష్ట | సఖు హిడింబాసురుఁ జంపి యున్న ఖలు మ్రింగి జీర్ణంబు గావింతు వాతాపిఁ | దడయక మ్రింగిన తపసి యట్ల’ |
|
| ఆ. |
యనిన రక్కసునకు నలిగిన యగ్రజు | నలుక యెఱిఁగి వీరుఁ డర్జునుండు మొనసి గాండివంబు మోపెట్టె; సునిశిత | ఖడ్గపాణులైరి కవలు నంత. |
116 |