పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము
దేవతలు వైకుంఠమునకుఁ బోయి విష్ణుని స్తుతియించుట (సం. 3-99-11)
క. యాగాది పుణ్యకర్మ | త్యాగము మర్త్యమున నైనఁ దా రధికభయో
ద్వేగంబునఁ బురుహూతపు | రోగములై యగ్నియమవరుణధనదాదుల్‌.
11
క. చని వైకుంఠంబునఁ ద్రిభు | వనపతి వైకుంఠు గరుడవాహను విష్ణున్‌
దనుజవిభంజనుఁ గని యి | ట్లని రెంతయు భక్తితోఁ గృతాంజలు లగుచున్‌.
12
వ. ‘దేవా! నీవు వరాహరూపధరుండవై మహీతలం బెత్తి, నరసింహరూపంబు దాల్చి యాదిదైత్యు హిరణ్యకశిపు వధించి, వామనుండవై బలిం గట్టి, యజ్ఞమూర్తి వై యజ్ఞవిఘ్నకరుండైన జంభుండను దానవుం జంపి, యండజ జరాయుజస్వేదజోద్భిజ్జంబు లనం బరఁగిన చతుర్విధ ప్రజల రక్షించుచున్న జగద్రక్షకుండవు గావున నీకు విన్నపంబు సేసెద; మిప్పుడు జగంబులకైన యుపద్రవంబు చిత్తగింపుము. 13
సీ. కాలకేయులు మహాకాయులు పగలెల్ల | జలదుర్గ బలమున జలధినుండి
రే లెల్లఁ జని నలి రేఁగి మునీశ్వరా | శ్రమముల సద్ధర్మచారు లైన
బ్రాహ్మణప్రవరులఁ బాయక వధియింతు | రెట్టి పాపాత్ములు నెయ్యుగముల
బ్రాహ్మణహింస యాపాదింతురే యది | వీరలవలనన వినఁగఁబడియెఁ;
 
ఆ. బరమసాధు లైన బ్రాహ్మణులకు బాధ | యగుడు మహికి బాధ యగు; ధరిత్రి
కైనబాధఁ జేసి యఖిలలోకంబులుఁ | గరము బాధ నొందుఁ గమలనాభ!
14
వ. ఎట్లనిన వేదంబులు ధరియించి విప్రులు వేదచోదితంబులైన పుణ్యకర్మంబులు విధియించుటం జేసి హవ్య కవ్యంబుల దేవతలుం బితరులుఁ దృప్తులైన వారివలన నెల్లలోకంబులకు సుఖం బగుం గావున బ్రాహ్మణోపద్రవంబు పరిహరించి లోకంబులు రక్షింపు’ మనిన దేవతలకు విష్ణుదేవుం డిట్లనియె. 15
మత్తకోకిల ‘కాలకల్పుల నుగ్రతేజులఁ గాలకేయుల భూరిర
త్నాలయస్థుల వీర్యవంతుల నర్ణవంబు సమస్తస
త్త్వాలి దోఁపఁగ వట్టినన్‌ విషయం బగున్‌ వధియింపఁగాఁ
బోల దొండువిధంబునం బరిపూర్ణవార్ధిజలోన్నతిన్‌.
16
క. వరుణజలంబుల మిత్రా | వరుణ తనూజుండు వీర్యవంతుండై చె
చ్చెరఁ ద్రావ నోపు; నిందఱు | నరుగుఁడు; ప్రార్థింపుఁ డమ్మహాత్ము నగస్త్యున్‌.’
17
వ. అనిన నమరు లెల్ల నగస్త్యుపాలికిం జని యమ్మునివరు స్తుతియించి యిట్లనిరి. 18
క. ‘అమరహితంబుగ జగదహి | తము దలఁగుము పేర్మితో బుధస్తుతగుణ! విం
ధ్యము దొల్లి పెరిఁగి జగదహి | తము సేసిన నీవ కావె తలఁగితి దానిన్‌.’
19
వ. అని దేవత లెల్ల నగస్త్యుఁ గీర్తించి’ రనిన విని ధర్మంజుం’ డిది యెట్లు? వింధ్యం బేల పెరిగె? దానిం బెరుఁగకుండ నగస్త్యుం డెవ్విధంబున వారించె?’ నని యడిగిన, నాతనికి రోమశుం డిట్లనియె. 20
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )