పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము
అగస్త్యుఁడు వింధ్యంబు పెరుఁగకుండ వారించుట (సం. 3-101-2)
ఉ. ‘నెమ్మి నినుండు మేరుధరణీధరనాథుఁ బ్రదక్షిణంబుగాఁ
ద్రిమ్మరుచున్నఁ జూచి పటుదీధితికిం గర మల్గి వింధ్యశై
ల మ్మనియెన్‌ ‘దినేంద్ర! యచలప్రభు నన్నుఁ బ్రదక్షిణంబు ని
త్యమ్మును జేయ కేల మతి దప్పితి? మేరువుఁ గొల్వ నేటికిన్‌?’
21
వ. అని గర్వించి పలికిన నప్పర్వతంబునకు భానుం డిట్లనియె. 22
క. ‘అనవరతము విధియోగం | బున నేఁ ద్రిమ్మరుదు నమరభూధరముఁ బ్రియం
బున నాత్మేచ్ఛ యొనర్పఁగఁ | జన’ దనవుడు నలిగి వింధ్యశైలం బంతన్‌.
23
క. ఇన శశి తారాదులకుం | జన రాకుండంగఁ బెరిఁగి జలధరపథ మె
ల్లను గప్పియుండె వింధ్యం | బనుపమ ముత్తుంగమై సురాద్రిస్పర్ధన్‌.
24
క. రవిశశిగతు లుడుగుడు నిది | దివ మిది రాత్రి యని వసుమతీజనులకు న
ద్దివిజమునివరుల కెఱుఁగఁగ | నవగాఢం బయ్యె; నంధ మయ్యె జగంబుల్‌.
25
వ. ఇట్లు పెరిఁగిన వింధ్యంబునొద్దకు వచ్చి వేల్పు లెల్ల దాని వర్ధనంబు వారింపనోపక యగస్త్యుపాలికిం జని వింధ్యంబుపెక్కువ యెఱింగించి యి ట్లనిరి. 26
క. ‘భువనవ్యవహారమునకు | వ్యవధానం బయ్యె వింధ్యవర్ధనమున; న
ద్దివసకర రజనికర గతు | లవిహిత మగునట్లు సేయు మమరమునీంద్రా!’
27
వ. అని దేవతలు ప్రార్థించిన నగస్త్యుండు లోపాముద్రా సహితుండై వింధ్యంబు సమీపంబునకు వచ్చి, దానిచేతం బూజితుం డై యి ట్లనియె. 28
క. ‘చనియెద దక్షిణదిశ కే; | నొనరఁగఁ దెరు విమ్ము నాకు నుర్వీధర! నీ’
వనవుడు ‘నట్టుల చేయుదు’ | నని పెరుఁగుట యుడిగి వింధ్య మతివినయముతోన్‌.
29
వ. ‘భట్టారా! విజయం చేయుం’ డని భూమి సమానమై యున్న దాని కగస్త్యుం డిట్లనియె. 30
క. ‘నా మగుడి వచ్చునంతకు | భూమీధర! యీప్రకారమున నుండుము; నా
తో మైత్రిఁ జేయు’ మని లో | పాముద్రాధీశ్వరుండు వలికి ముదమునన్‌.
31
వ. దాని నొడంబఱిచి దక్షిణదిశకుం జని లోకంబులకు హితంబుగా నంద యుండె; వింధ్యంబు నగస్త్యుండు మగుడి వచ్చునంతకుఁ బెరుఁగ నోడి యున్న’ దని యగస్త్యు మాహాత్మ్యంబు ధర్మజునకుం జెప్పి, వెండియు రోమశుం డిట్లనియె. 32
ఆ. అమరు లెల్లఁ దన్ను నట్లు కీర్తించుచు | నున్నఁ జూచి మునిగణోత్తముండు
వారి నడిగె ‘నేమి వచ్చితి? రెఱిఁగింపుఁ’ | డని దయాళుఁడై ప్రియంబుతోడ.
33
వ. అనిన. 34
చ. అమరులు గాలకేయకృత మైన జగద్భయ మెల్లఁ జెప్పి ‘యు
త్తమమునినాథ! తత్ప్రతివిధానము సేసి జగంబుఁ గావఁ జి
త్తము గలదేని విభ్రమమదభ్రతరంగ మహార్ణవంబుఁ బా
నము దగఁ జేసి చేయుము ఘనంబుగ మాకు మనఃప్రమోదమున్‌.
35
క. ఆ తోయధి నీచేతం | బీతం బగుడుం, గడంగి భీమాసుర సం
ఘాతంబుఁ దత్‌క్షణంబ ని | పాతింతుము దివ్యశస్త్రపటుఘాతములన్‌.’
36
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )