| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
‘ఇది యమున యను మహానది | త్రిదశనదీనిభము; దీని తీరమున జగ ద్విదితుఁడు మాంధాతృఁడు సం | పదఁ గ్రతువులఁ జేసెఁ దొల్లి బహువత్సరముల్.’ |
198 |
| వ. | అనిన ‘మాంధాతృ జన్మంబును వాని చరితంబును వినవలతుం జెప్పు ‘మని యడిగిన ధర్మరాజునకు రోమశుం డిట్లనియె. | 199 |
| ఉ. |
‘వీకున నశ్వమేధములు వే యొనరించిన ధర్మశీలుఁ, డి క్ష్వాకుకులోద్భవుండు, బలవంతుఁ, డనంతయశుం, డవార్యవీ ర్యాకరుఁ, డుత్తముండు యువనాశ్వుఁ డపత్యము లేమిఁ జేసి దుః ఖాకులుఁడై ప్రధానవరులందు సమర్పిత రాజ్యభారుఁడై. |
200 |
| వ. | భృగునాశ్రమంబునకుం జని పుత్త్రకాముండై పెద్దకాలం బమ్ముని నుపాసించిన నయ్యువనాశ్వునకుం గరుణించి భృగుండు పుత్త్రకామేష్టిఁ జేసి యందు మంత్రపూతజలపూరితంబై పుత్త్రోదయకారణంబైన కలశంబు వడసి దాని రక్షించియుండ ఋత్విజులం బంచిన. | 201 |
| ఆ. |
రాత్రి జాగరణభరశ్రాంతులై వారు | నిద్రఁ బొంది; రంత నీరు వట్టి ధారుణీశ్వరుండు తన్మంత్రకలశోద | కంబు లెల్లఁ ద్రావెఁ గడుపునిండ. |
202 |
| వ. | దాని నెఱింగి భృగుండు యువనాశ్వుం జూచి ‘నీకుఁ బుత్త్రార్థంబుగా మదీయ తపోవీర్యలబ్ధంబైన యిమ్మంత్ర జలంబు నీ భార్య కీనున్నచో నీవధిక పిపాసాపరుండవయి యుపయోగించి యకర్తవ్యంబుఁజేసితి; దైవకృతం బెవ్వరికిఁ దప్పింప నశక్యంబు; దీనంజేసి నీకు గర్భంబై యింద్రసదృశుండైన పుత్త్రుం డుద్భవించు’ ననిన విని యువనాశ్వుండు దనపురంబునకుం జని యున్నంత నూఱేండ్లకు యువనాశ్వువామభాగంబు భేదించుకొని బాలార్క తేజుండైన బాలకుండు వెలువడిన, నక్కొడుకుం జూడ నింద్రుండు వచ్చి, వాని వదనంబున నిజప్రదేశినిఁ బెట్టి ‘యమృతమయంబగు దీనిం ద్రావు’ మనిన, నింద్రు వచనంబున నమరులెల్ల నక్కుమారునకు మాంధాతృం డను నామంబుఁ జేసి; రట్లు సురేంద్ర సంవర్ధితుండై. | 203 |
| తే. |
ధ్యానమాత్రన చేసి వేదములు సర్వ | శాస్త్రములు ధనుర్వేదము సకల దివ్య సాయక ప్రయోగంబులుఁ జట్ట వచ్చి | పొందె మాంధాతృఁ ద్రిభువనపూజ్యు నొప్ప. |
204 |
| వ. | మఱియు నమ్మాంధాతృండు మహేంద్రుచేత మహామహీరాజ్యంబున కభిషిక్తుండై చక్రవర్తియై శక్రు నర్ధాసనం బెక్కి యాజగవం బను ధనువును దివ్యాస్త్రంబులు నభేద్యకవచంబును ధరియించి నిఖిల లోక జైత్రుండై సంపూర్ణదక్షిణక్రతువు లనేకంబులు చేసి పద్మసంఖ్యలు గోదానంబుల బ్రాహ్మణులం దనిపి నిజశాసనంబునం బ్రజల నెల్ల నిలిపి. | 205 |
| మధ్యాక్కర |
భూమి కనావృష్టి యైనఁ గడు నల్గి పురుహూతుతోడ భీమసంగ్రామంబుఁ జేసెఁ, దన దివ్యపృథు సాయకముల సామజావలి నేయునట్లు మేఘసంచయముల నేసి భూమికిఁ గురియించె వర్షములు సస్యముల్ వృద్ధిఁ బొంద. |
206 |
| వ. | ఇది యమ్మాంధాతృ దేవయజనస్థానంబు; మఱి యిక్కురుక్షేత్రంబునందు సరస్వతీతీరంబున సోమకుండను వాఁడు యజ్ఞంబు సేసి పుత్త్రశతంబుఁ బడసె’ ననిన ‘నది యె’ట్లని ధర్మజుం డడిగిన రోమశుం డిట్లనియె. | 207 |