| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
‘సోమకుఁడను రాజర్షి మ | హా మఖ మొనరించి జంతుఁ డను నొక్క సుతున్ భూమీశ! పడసె; నాతని | భామలు నూర్వురును గొడుకుఁ బరమప్రీతిన్. |
208 |
| క. |
తమ తమ పుత్త్రుఁడ కాఁ జి | త్తములం జేకొని దయం బృథగ్భావము లే క ముదంబునఁ బెంచిరి లో | కమున జనుల్ చోద్యమందఁగాఁ గడువేడ్కన్. |
209 |
| వ. | ఒక్కనాఁ డబ్బాలకు కుఱువు చీమ గుట్టినఁ దద్వేదన సహింప నోపక యేడ్చుచున్నవాని కడకుఁ దల్లులందఱుఁ బఱతెంచి యేడ్చిన నయ్యాక్రందన ధ్వని విని సంభ్రమించి సోమకుం డంతఃపురంబునకుం జని కొడుకు నూరార్చి సభాస్థితుండై మంత్రులకు ఋత్విజులకు నిట్లనియె. | 210 |
| ఆ. |
‘కోరి యొక్క కొడుకుఁ గొడుకుగా నే నెట్లు | నమ్మియుండనేర్తు? నాకు సతులు శతము గలిగియుండ సంతాన మల్పమై | యునికి మీకుఁ జూడ నుచిత మగునె?’ |
211 |
| వ. | అనిన వానికి ఋత్విజు లిట్లనిరి. | 212 |
| తే. |
‘ధరణినాథ! నీ భార్యాశతంబునందుఁ | బరఁగ నూర్వురుపుత్త్రులఁ బడయ నీకు నభిమతం బేనిఁ దగుఁ దగదనక నీవు | కడఁగి మా చేయఁబంచిన క్రతువు సేయు. |
213 |
| వ. | ఈ జంతుం బశువుగా వధించి తద్వపాహవ్యంబుల హవ్యవహుం దనిపిన, దాన నీ నూర్వురు భార్యలకు నూర్వురు కొడుకులు పుట్టుదు; రందగ్రజుండైన జంతుండు సౌవర్ణ లక్షణ లక్షిత సవ్యపార్శ్వుండై యుదయించు’ నని చెప్పి ఋత్విజులచేత సోమకుండు ననుజ్ఞాతుండై. | 214 |
| క. |
తనయుఁ బశువఱిచి తద్వపఁ | గొని వేల్చినఁ జూచి యార్తకురరీనాదం బున నేడ్చిరి కడు నడలుగఁ | దనుమధ్యలు నూర్వురును సుతస్నేహమునన్. |
215 |
| క. |
ఇమ్ముగఁ దద్ధూమాఘ్రా | ణమ్మున గర్భములు దాల్చి నాతులు నవమా సమ్ములు నిండుడుఁ గనిరి ము | దమ్మున జంతుప్రముఖసుతప్రకరమ్మున్. |
216 |
| వ. | అందు జంతునకు నందఱు నెప్పటియట్ల తల్లులు సమస్నేహలై యుండం బుత్త్రులు నూర్వురుం బెరిఁగి సమర్థులైయున్నఁ బెద్ద కాలంబునకు ఋత్విజుండు పరలోకగతుండై ఘోరనరకానలంబున నెరియుచు నుండె; నంత సోమకుండును దేహత్యాగంబు సేసి, యమరలోకంబున కరుగువాఁడు ముందట నరకానల పచ్యమానుండయ్యెడు ఋత్విజుం జూచి’ యి ట్లేల త్రీవ దుఃఖోపహతుండవైతి?’ వని యడిగిన వాఁ డిట్లనియె. | 217 |
| ఆ. |
‘అవనినాథ! నీకు నార్త్విజ్య మొనరించి | చూవె యిట్టి నరకపావకమునఁ బడినవాఁడ; నీకు బహుపుణ్య లోకముల్ | గలవు; నన్నుఁ గావవలయుఁ గరుణ.’ |
218 |
| వ. | అనిన సోమకుండు ధర్మరాజు పాలికిం జని తచ్ఛాసనంబునం బుణ్యలోకంబులకుం బోవుచుండి యిట్లనియె. | 219 |
| క. |
‘నా కారణమున ఋత్విజుఁ | డేకాంతమ నరకగతికి నేఁగెను వానిం దోకొని పోయెద’ నని శుభ | లోకంబున కరిగెఁ ద్రిదశలోకస్తుతుఁడై. |
220 |
| వ. | ఇట్లు యజ్ఞపుత్త్రుం డైన సోమకుండు తన తపోయజ్ఞఫలంబున ఋత్విజు నరకవిముక్తుంజేసి పుణ్యలోక గతుండయ్యె ; నిందుఁ దొల్లి ప్రజాపతి సహస్ర వార్షికంబైన యిష్టాకృతంబను సత్త్రయాగంబుఁ జేసె; నాభాగుండైన యంబరీషుం డిందు యజ్ఞంబులం జేసి పరమసిద్ధికిం జనియె; నిది నహుషు యజ్ఞదేశం; బిందు దశపద్మ సంఖ్య ధనంబుల నాతండు సదస్యులం బూజించె; నిది సార్వభౌమ యజ్ఞస్థానం; బిది యయాతి యజ్ఞాయతనంబు; వాని సవనంబున కింద్రుండు వచ్చె; నిది రామహ్రదం, బిది నరనారాయణాశ్రమం, బిది ప్లక్షావతరణంబను యమునాతీర్థం; బిందు దేవతలును ఋషులును సారస్వత యాగంబుఁ జేసి; రిది దేవర్షియైన సంవర్తుచేత రక్షితం; బిందు భరతుం డనేక యాగంబులు సేసి సర్వలోకంబులుం జూచె; నీవు నిందుఁ గృతస్నానుండవై సర్వలోకంబులుం జూడు’ మనిన ననుజసహితుండై ధర్మతనయుం డత్తీర్థంబున స్నానంబుఁ జేసి రోమశున కిట్లనియె. | 221 |
| శా. |
‘దేవర్షిద్యుచరాహిలోకములు నాదిత్యాశ్వినీలోకముల్ దేవాధీశ్వరుఁ జూచితిన్; మఱియు నద్దేవేంద్రునొద్దన్ సగాం డీవోద్దామమహాభుజార్గళుఁ గిరీటిన్ సవ్యసాచిన్ జయ శ్రీవిభ్రాజితుఁ బార్థుఁ జూచితి జగత్సేవ్యా! మునీంద్రోత్తమా!’ |
222 |
| వ. | అనిన రోమశుండు వెండియు ధర్మరాజున కిట్లనియె. | 223 |
| క. |
‘ఇది దక్షుమఖస్థానం; | బిదియు సరస్వతి యనంగ నిలఁ బరఁగు మహా నది; యిందుఁ ద్రిదశతతితోఁ | ద్రిదశజ్యేష్ఠుండు సేసెఁ దివిరి మఖంబుల్. |
224 |
| వ. | ఇది పంచయోజన ప్రమాణంబైన ప్రజాపతియజ్ఞవేది; ఇందు దేహత్యాగంబు సేసి మర్త్యు లమర్త్యత్వంబుం బొందుదురు; తొల్లి సరస్వతి నిషధదేశంబున భూమి సొచ్చి యిచ్చమసోద్భేదంబునందుఁ గానంబడియె; నిది సింధుతీర్థం; బిందు లోపాముద్ర నగస్త్యుండు ప్రతిగ్రహించె. | 225 |
| తే. |
ఇదియు విష్ణుపదంబు; దా నిది విపాశ; | యిదియుఁ గాశ్మీరమండలం; బిది వితస్త; మిదియు మానసద్వార; మిం దిందువంశ! | పరశురాముండు మును హంసపథముఁ జేసె. |
226 |