| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము |
| తే. |
‘తమ్ముచేసిన దురితముల్ తలఁగఁ బూని | ధర్మబుద్ధివై వ్రతములు పేర్మిఁ జలిపి తనఘ! నీకు నభీష్టంబు లైన వరము | లడుగు మిచ్చెద; మీ మెచ్చు గడవ నగునె!’ |
279 |
| వ. | అనినఁ దన తండ్రియు భరద్వాజుండును యవక్రీతుండు నెప్పటియట్ల జీవించియుండను, నిజజనకుండు పరావసుచేత నిహతుం డగుట నిస్తరింపను వలయు నని ప్రార్థించి, దేవతల వరంబున నర్థావసుండు రైభ్య భరద్వాజ యవక్రీతుల సంజీవితులం జేసిన నద్దేవతలకు యవక్రీతుం డిట్లనియె. | 280 |
| తే. |
‘ఏను బహువేదశాస్త్రమ్ము లెఱిఁగి, వ్రతము | లెల్లఁ జేయుచు రైభ్యుచే నిట్లు హతుఁడ నైతి; నాకంటె రైభ్యున కధికశక్తి | యైన తెఱఁ గెట్టు?’ లనిన నిట్లనిరి సురలు. |
281 |
| క. |
‘గురుశుశ్రూష యొనర్చుచుఁ | బరమక్లేశమునఁ జేసి పడసిన విద్యల్ స్ఫురియించుఁగాక; గురుముఖ | విరహితముగఁ బడసినవియు వెలయునె యెందున్? |
282 |
| వ. | నీవు గురుముఖంబునం బడయక యొండు విధంబునం బడయుటం జేసి నీయధ్యయనశ్రుతంబులు నిర్వీర్యంబు లయ్యె; గురుసంతోషకరుండై రైభ్యుండు బ్రహ్మజ్ఞానం బుపార్జించెం గావున నాతం డిట్టి శక్తివడసె నని దేవతలు దివంబున కరిగి; రిది యవక్రీతు నివాసం; బిందు వసియించినవారు దురిత విముక్తులగుదు; రిది కాలశైలం; బిది సప్తవిధం బైన గంగ; యిది మనుష్యుల కగోచరం; బింద యుండి సమాధి శౌచపరులై చూడుం; డిది మందరనగం; బిందు నానాప్రహరణపాణులై యష్టాశీతిసహస్రగంధర్వులు కిన్నరకింపురుష సుపర్వులు సురేంద్రుం గొలిచి పోయెద; రిందుల కాఱునూఱుయోజనంబులు గలదు కైలాసపర్వతం; బందు గుబేరుం డుండు’ నని రోమశుండు సెప్పినం బాండవులు కృతసమాధిశీలురై వాని నెల్లం జూచి; రంత నంతక సుతుండు భీమున కిట్లనియె. | 283 |
| సీ. |
‘దుర్గమం బైన యీ దుర్గమార్గంబున | నడవంగ నేర; మున్నతరథముల నింద్రసేనాదుల నీ ధౌమ్యవిప్రుల | ద్రుపదతనూజను దోడికొనుచు సహదేవుఁడును నీవు చట్టనఁ గ్రమ్మఱుఁ; | డేనును నకులుండు నేఁగి రోమ శాదేశమునఁ జేసి యఖిలతీర్థంబులు | నాడి వచ్చెదము; మా యరుగుదెంచు |
|
| ఆ. |
నంత కెంతయును బ్రయత్నంబుతోఁ గృష్ణఁ | గాచి యుండుఁ’ డనిన ఘనుఁడు భీముఁ డనియె ‘నిట్టి రాక్షసాకీర్ణవనములో | నిన్నుఁ బాయనగునె నిమిషమేని. |
284 |
| చ. |
అనఘచరిత్రు నర్జును మహాభుజు నొక్కనిఁ బాసి వంతఁ బొం దిన యెడ నిట్టిచోట సహదేవుఁడు నేనును గృష్ణయున్ జగ జ్జననుత! నిన్నుఁ బాసిన నసహ్యతరం బగు తీవ్రతాపవే దన యగు; నీకు మాకు నుచితంబె పరస్పరభేద మెన్నఁడున్. |
285 |
| క. |
కడు డస్సి నడవనోపని | యెడ నీ కమలాయతాక్షి నీ కవలను నేఁ దడయక నఱకట నిడికొని | కడఁకం గొనివత్తు విషమగహనాంతములన్. |
286 |
| వ. | ఈ రథంబులతోఁ బోవ నిమ్ము గాదేని వీని నింద్రసేనాదుల నెందేనిం బెట్టి పోద’ మనిన రోమశుం డిట్లనియె. | 287 |
| క. |
‘అతులతపోవీర్యబలో | న్నతిఁ బోదము గంధమాదనంబునకు; సమా గతు నందుఁ గాంతు మర్జును | నతివీరు నుదారు సురగణార్చితుఁ బార్థున్.’ |
288 |
| వ. | అనిన నందఱు సంతసిల్లి యరుగువారు ముందర ననేకప హయరథసనాథంబై యపారకిరాతబల సంకులంబైన దానిఁ బుళిందాధిపతి యైన సుబాహుపురంబుఁ గని, యందు వానిచేతం బూజితులై తమ రథసూతహయనివహంబుల నింద్రసేనాదిభృత్యులను సుబాహునొద్దం బెట్టి, పాదచారులై పాంచాలిని బ్రాహ్మణులను రక్షించికొని గంధమాదనంబున కభిముఖులై యరిగి; రంత ధర్మతనయుండు భీమున కిట్లనియె. | 289 |
| సీ. |
‘అలిగి వజ్రాయుధునైనను బోరిలో | నోర్వంగ నోపు నత్యుగ్రవీరు. జవమునఁ బవనుఁ దేజంబున నాదిత్యుఁ | బోలినవాని, నంభోజనేత్రు, నాయతబాహుఁ, గృతా స్త్రు, సింహస్కంధు | సర్వధనుర్ధరాచార్యు, విజయు, నిత్యక్షమాన్వితు, నీ తమ్ము నర్జును | శుభగుణసుందరుఁ జూచునంత |
|
| ఆ. |
కధికతాపతప్త మైనది నా చిత్త; | మొనర నతనితోడ నొక్కటునికి యెన్నఁ డొక్కొ మనకు! నిందఱ కగునాతఁ | డేల మసలెనొక్కొ యిన్ని యేండ్లు!’ |
290 |
| మ. |
అనుచుం బార్థవిలోకనంబు మదిలో నర్థింపఁగా ధర్మజుం డనవద్యుల్ గడువేడ్కతో నరిగి తా రప్పాండవుల్ గంధమా దనశైలేంద్రముఁ గాంచి రున్నతబృహద్ధాతుస్థలీసంహతిన్ ఘనసంధ్యాగమశంక సన్మునులకుం గావించు దానిన్ మహిన్. |
291 |
| క. |
నానావర్ణ శిలావిహ | గానేక మృగాభిరామమై భూనారీ నానాభరణవిభూషిత | పీనోన్నతకుచముఁ బోలె వెలిఁగెడు దానిన్. |
292 |