| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
లలితాచ్ఛ స్ఫటిక శిలా | తలములపైఁ బాఱు విమలతర నిర్ఝరిణీ జలపూరములను తారో | ల్లల దురుహారాలి నుజ్జ్వలం బగు దానిన్. |
293 |
| ఉ. |
వారలు గంధమాదన మవార్యబలాఢ్యులు సొచ్చుచో మహా మారుత మప్డు వీచె నహిమద్యుతిమార్గము దిఙ్ముఖంబులన్ భూరుహపత్రమిశ్ర మయి భూరిపరాగము గప్పఁగా ధరి త్రీరుహశాఖలున్ విఱిగి త్రెళ్ళఁగ గుల్మలతాలి సాల్పడన్. |
294 |
| చ. |
కడువడిగాడ్పుచే విఱుగఁగాఁ బడి త్రెళ్ళు మహీరుహాళి చ ప్పుడు విని యందఱుం జెదరి భూమిపయిన్ గగనం బుదగ్రతం బడియెనొ శైలశృంగములు భగ్నము లయ్యెనొ యంచు ధూళి నె క్కడఁ జననేర కొండొరులఁ గానక యుండిరి సంచలాత్ములై. |
295 |
| వ. | ఇట్లు మహారేణుపటలం బంధకారంబునుంబోలె నీరంధ్రంబై కప్పినఁ బతిత తరు విటప లతా గుల్మంబులు కరతలంబులం బాయం ద్రోచుచు విశాలదృఢతరుమూలంబు లాశ్రయించి యగ్నిహోత్రంబులతో ధౌమ్య ధర్మజ సహదేవు లొక్కచోట, నుద్యద్గదా కార్ముకుండైన భీమసేనుండును ద్రౌపదియు నొక్కచోట, రోమశుండును నకులుండును బ్రాహ్మణులు నొక్కచోటనుగా నందఱు వేఱు వేఱ యుండి రంత. | 296 |
| చ. |
కురిసెఁ బ్రచండవృష్టి ఘనఘోషము లెల్ల కెలంకులన్ భయం కరములుగాఁ గరాళకరకాతతు లొప్పఁ దటిల్లతాళి వి స్ఫురితముగాఁ బ్రపూర్ణ జలపూరముల న్గిరికుంజభూరిని ర్ఝరతటినీతటీనికట సాలచయంబు విమూలితంబుగన్. |
297 |
| వ. | అట్లు గాడ్పుతోడి వాన పెద్దయుంబ్రొద్దు కురిసి యుడిగిన నందఱు నొక్కచోటికి వచ్చి యెప్పటియట్ల యరుగు నెడ, నతివిషమ శిలాసంకటపథంబున నడవనేరక ద్రౌపది తొడరిపడి మూర్ఛిత యైనం బవనతనయుం డక్కోమలి నెత్తికొని యజనాస్తరణంబుపయిం బెట్టి కదళీదళంబుల వీచుచున్నం గవలు దాని పల్లవతామ్ర పాదతలంబు లాయుధాభ్యాసవశంబునం గిణీభూతంబులయిన తమ కరతలంబులంజేసి మెత్తన యొత్తుచుండి; రట్టి యవసరంబున ద్రౌపదిం జూచి దుఃఖితుం డయి ధర్మతయుం డిట్లనియె. | 298 |
| అక్కర |
‘అరుణ సరోరుహ రమ్య మృదులంబులైన యీ తన్వి చరణతలంబులు గొడిగరాలపైఁ జనుచున్కిఁ జేసి పరుసంబులై కడు నెఱ్ఱనైనవి పద్మాయతాక్షి పరఁగ నా కారణంబునను నీ దుఃఖభారంబు దాల్చె. |
299 |
| సీ. |
సముచితంబగు మృదుశయన తలంబున | శయనించు నిత్తన్వి సదమలాంగి పరుసంపు ఱాలపైఁ బడి తీవ్రవేదనఁ | బొందినయది; మహాపురుషు లైన పాండవులకుఁ బ్రియభార్యయై నాపుత్త్రి | సుఖ ముండు నని మది సోమకుండు పాయక సంతోషపడి యుండుఁ గాకున్నె’ | యని విలాపించు నయ్యమతనూజు |
|
| ఆ. |
నుచితవచనరచన నూరార్చి రప్పుడు | ధౌమ్యుఁదొట్టి సకలధరణిసురులు; మూర్ఛ దేఱె నంత ముదిత ద్రౌపది శీత | మందపవనసేవ్యమాన యగుచు. |
300 |
| వ. | దాని నాశ్వాసించి ధర్మరాజు భీమున కిట్లనియె. | 301 |
| క. |
‘ఈ రాజపుత్త్రిఁ దోడ్కొని | దారుణ పాషాణ దుష్పథంబులఁ జనఁగా నేర; మిది నడువ నోపదు | భూరిభుజా!’ యనిన ననిలపుత్త్రుం డంతన్. |
302 |
| క. |
అగ్రజుననుమతమున న | త్యుగ్రనిశాచరసమేతు నుడుమార్గగు వీ రాగ్రణి ఘటోత్కచుం దన | యగ్రసుతుం దలఁచె ధీరు హైడింబు వెసన్. |
303 |
| క. |
అతఁడును రాక్షససైన్యా | న్వితుఁడై తత్‌క్షణమ వచ్చి నిర్జరవరస మ్మితులకుఁ బ్రణమిల్లెం దన | పితృవరులకు బ్రాహ్మణులకుఁ బెద్దయు భక్తిన్. |
304 |
| వ. | ఇట్లు మ్రొక్కి పని యే మని ముకుళితహస్తుం డయి తన ముందర నున్న కొడుకుం గౌఁగిలించుకొని భీముండు వాని కిట్లనియె. | 305 |
| తే. |
‘అబల యిది, భవన్మాత, నిత్యాధ్వగమన | ఖిన్న యైనది గజరాజఖేలగమన; దీని నీ వెత్తికొని చనుదెమ్ము మాస | మీపమున’ నని సుతు నియమించె నపుడు. |
306 |
| వ. | వాఁడును బితృవచన చోదితుండై ‘యిమ్మార్గం బతిపరుష శిలావిషమంబు; పాదచారుల కగమ్యంబు గావున మిమ్మందఱ నెత్తికొని యశ్రమంబున నరిగెద’ నని ధౌమ్య పాండవ ద్రౌపదులం దా నెత్తుకొని, బ్రాహ్మణుల నెత్తికొనం దన రాక్షసబలంబులం బంచె; రోమశుండు సిద్ధగతి నరిగె; నిట్లందఱు గగనమార్గంబునం జని గంగాతీరంబున నరనారాయణాశ్రమంబైన బదరీవనంబుఁ గని, రాక్షసస్కంధావతీర్ణులై యందు. | 307 |
| క. |
లలితమధుస్రవఫలములు | విలసిత మృదుపత్రతతులు వృత్తస్కంధం బులు నవిచలితచ్ఛాయలు | గల బదరీతరులఁ జూచి కడు విస్మితులై. |
308 |
| వ. | సురసిద్ధముని సేవితంబైన భాగీరథిం జూచి, యందుఁ గృతస్నాను లయి నియమవ్రతంబులు సలుపుచు సమాధియోగంబున మైనాకశైలంబును హిరణ్యశృంగంబును బిందుసరంబునుం జూచి, బదరీవనంబునం దాఱుదివసంబులు నివాసంబు సేసి యుండునంత; నొక్కనాఁడు. | 309 |
| చ. |
అలఘులు గంధమాదన మహాధరణీధరసానురత్నవే దులఁ బవమాననందనుఁడు ద్రోవదియున్ విహరించుచున్నచో లలితసహస్రపత్రకమలంబు సమీరవిధూతమై మహీ తలముపయిన్ వడిం బడియెఁ దద్దయుఁ బొల్పుగ వారిముందటన్. |
310 |
| వ. | ఆ సౌగంధిక కమలంబుఁ జూచి దాని యపూర్వరమణీయత్వంబునకు ననన్యకుసుమసాధారణంబయిన సౌరభ్యంబునకు నోటువడి ద్రుపదరాజపుత్త్రి ముదితచిత్తయై ‘యక్కటా! యిది యొక్క పువ్వ యయ్యు నపూర్వంబై మనోనయనానందకరం బైనది; యిట్టి కుసుమంబులు కడుం బెక్కులు గావలవదె!’ యని ‘కురంగటం గలవేని తెచ్చి యిచ్చి నాకు మనఃప్రియంబుఁ జేయు’ మని యప్పుడ యప్పువ్వు ధర్మరాజుకడకుం గొనిపోయె; నిట భీముండు దాని యభిమతంబుఁజేయం గడంగి, రుక్మపృష్ఠంబైన ధనుశ్శ్రేష్ఠంబును నాశీవిషోపమానంబులైన బాణంబులు ధరియించి, యక్కమలంబు దెచ్చిన గాడ్పున కభిముఖుండై గంధమాదనంబున వివిధరత్న బంధుర కందర కదళీ షండ దర్శనంబులను, మందార మందిర సుగంధ గంధవహస్పర్శనంబులను, నలికుల కోకిలాలాప శ్రవణంబులను, సర్వర్తు కుసుమ సురుచిర గంధాఘ్రాణంబులను, నతిమధుర ఫలాస్వాదనంబులను, బద్ధప్రమోదహృదయుం డగుచుఁ దన కెదిరి వచ్చు మృగంబులం దాఁకి గజంబు నెత్తి గజంబుపై వైచుచు సింహంబు నెత్తి సింహంబుపై వైచుచు నల్పమృగంబులం గరతలప్రహారంబులం బ్రహరించుచు. | 311 |