పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము
భీముఁడు సౌగంధికహరణార్థంబు పోవుట (సం. 3-146-292)
సీ. గమనవేగంబున ద్రుమలతాజాల సం | చాలన సేయుచు శైలగుహల
నడఁగి యదృశ్యలై కడువేడ్కతోఁ దన్నుఁ | జూచు ఖేచర సిద్ధ సుర భుజంగ
గరుడ గంధర్వ కిన్నర కామినులచేత | మానుగా నభివీక్ష్యమాణుఁ డగుచు
మ్రాఁకులు విఱుచుచు వీఁకతోఁ దీఁగలు | పెఱుకుచుఁ బదహతిఁ బృథునగేంద్ర
 
ఆ. మద్రువ నున్నతంబు లయి నెడ లెక్కుచు | మదగజంబువోలె మధ్యముండు
పవన వైనతేయ పటుజవయుక్తుఁడై | యరిగె గంధమాదనాంతరమున.
312
వ. ఇట్లరుగువాఁడు నిజసింహనాదశ్రవణపరిత్రస్తంబులై యెగసి పఱచు పక్షుల యార్ధ్రపక్షంబులు చూచి ముందట నాసన్నంబునం గొలను కలుగవలయు నని యుపలక్షించి యతిత్వరితగతిం జని, పవనవశ సంచలిత తట మహావన తమాలతాల హింతాల విశాల కదళీదళ వీజ్యమానశీతలజలపరిపూర్ణంబైన యొక్కసరోవరంబుఁ గని, యందుఁ గృతావగాహుండై నవనళినదళమృణాలవలయాలంకృతుండగుచు దాని వెలువడి యనేకయోజనవిస్తారాయామ రమణీయంబైన కదళీషండంబుఁ జొచ్చి, యందు శంఖధ్వానంబుఁ జేసిన. 313
క. ఆ శంఖరవంబు మహేం | ద్రాశనినిర్ఘోషభీమమై దిక్కులు నా
కాశంబు నిండె; నంత గు | హాశయుఁడై యున్న హనుమ యను కపి పెలుచన్‌.
314
క. దాని విని బెదరి లేన్‌చి ‘మ | హానాదం బిది మనఃప్రియం బయ్యె; మదీ
యానుజు శంఖధ్వానము | దా నగు’ నని యెఱిఁగి హృష్టతనురుహుఁ డగుచున్‌.
315
వ. భీమునకు మార్గనిరోధంబుగా మహావృక్షంబు లురలం ద్రోచి యేకాయనపథంబున కడ్డంబుగా శయనించి లాంగూలలీలాచాలనంబుఁ జేసిన. 316
క. గోలాంగూలోత్తము లాం | గూల స్ఫోటనరవంబు ఘోరంబై వా
చాలతఁ జేసి నశేషమృ | గాలి భయం బంద గిరిగుహాంతర మురలన్‌.
317
వ. అయ్యపూర్వధ్వని విని భీముండు విస్మితుండై చని కదళీషండమధ్యంబున నొక్క విశాలశిలాతలంబుపయి శయనించినవాని. 318
సీ. హ్రస్వపీనగ్రీవు, నచలితాయతహను, | నతిచపలస్వభావాభిరాముఁ,
దనుమధ్య కటిచక్రు, దహనకణాకార | తామ్రోష్ఠు, నతికృశదశనకరజుఁ,
బృథులవిద్యుత్పుంజపింగాక్షు, నుత్తుంగ | దృఢవక్షు, నాజానుదీర్ఘబాహు,
నూర్ధ్వలాంగూల మత్యున్నతధ్వజలీలఁ | గ్రాలుచు నుండ నేకాంతయోగ
 
ఆ. నిద్ర నున్న ధర్మనిర్మలు హనుమంతుఁ | జూచి పాండురాజసుతుఁడు వాని
నిద్రఁ జెఱుపఁ గడఁగి నిజసత్త్వ మేర్పడ | సింహనాద మొప్పఁ జేసె డాసి.
319
వ. హనుమంతుఁడును మెల్లమెల్లన మేల్కని జృంభ సంభృత జలార్ధ్రసంచల విలోచనుం డగుచు ననాదరంబున నాతనిం జూచి యిట్లనియె. 320
తే. ‘అతిజరారోగభరమున నలసి యొలసి | యొదిఁగి సుఖనిద్రమై నిట్టులున్న వానిఁ
గడుమదంబున నేమియుఁ గరుణ లేక | యేల బోధించి తయ్య! నీ వెఱిఁగి యెఱిఁగి.
321
వ. తిర్యగ్జాతులు ధర్ము వెఱుంగవు గాక; సర్వభూతదయాస్వరూపంబైన ధర్ము వెఱింగెడువారు మనుష్యుల కారె! యిట్టి మనుష్యజన్మంబు వడసి వృద్ధోపసేవ సేయవు గాకేమి ధర్ము వెఱుంగక నిర్దయుండవై మాబోఁటి పేద మృగంబులకు భయంబుగ గర్జిలితి; వీ వెవ్వండవు? మనుష్య గోచరంబు గాని యివ్వనంబున కేల వచ్చితి? సిద్ధగతి లేనివారి కిట వోవ నశక్యం; బమృతకల్పంబులైన యీ ఫలమూలంబు లుపయోగించి క్రమ్మఱుము; నీయందు బద్ధస్నేహుండఁ గాన బుద్ధి సెప్పితి; నా పలుకులు చేకొను’ మనిన భీముం డిట్లనియె. 322
తే. ‘క్షత్త్రియప్రవరుండ విఖ్యాతబలుఁడఁ | బాండుతనయుండ గొంతిగర్భంబునందు
వాయువరమునఁ బుట్టినవాఁడ; నన్ను | భీముఁ డండ్రు భూజనులు కపిప్రభుండ!
323
వ. ఏ నిక్కడఁ గార్యార్థినై పోయెద; నాకుఁ దెరు వి; మ్మీనినాఁడు దొల్లి శతయోజన విస్తారంబయిన సముద్రంబు లంఘించి లంకకుం బోయిన హనుమంతు నట్ల నిన్ను నీ పర్వతంబు లంఘించి పోదు’ ననిన హనుమంతుం ‘డతం డేమి కారణంబున సముద్రలంఘనంబుఁ జేసె? నెఱుంగు దేనిం జెప్పు’ మనిన వానికి భీముం డిట్లనియె. 324
క. ‘అలఘుం డిక్ష్వాకుమహా | కుల వీరుఁడు రాఘవుండు గురువచనంబున్‌
సలుప వనవాసియై తన | లలనం గోల్పడియె నట్టె లంకేశ్వరుచేన్‌.
325
క. సీతాన్వేషణపరులై | నీతిఁ గపిప్రవరు లరిగి నిరతంబుగ సం
పాతి యను పక్షిచేత మ | హీతనయ సువార్త లెల్ల నెఱిఁగి కడంకన్‌.
326
క. వారలు వారిధి గడవఁగ | నేరక తా రున్న యెడ ననిలసత్త్వమునన్‌
వారిధి లంఘించె మహా | వీరుఁడు హనుమంతుఁ డనఁగ విందుఁ గపీంద్రా!
327
వ. ఏను హనుమంతునంతియ బలపరాక్రమంబులు గలవాఁడ; నా పౌరుషంబుఁ జూపుదునే?’ యనిన నవ్యక్త హాసముఖుం డగుచు ‘నన్నా! యేను ముదిసినవాఁడ లేవ నోపం; బోయెదవేని నాతోకం బాయంద్రోచి పొ’ మ్మనిన మెచ్చక తన వామకరంబున నెత్తం బోయి వశంబుగాక. 328
ఉ. ఏపున రెండుచేతులను నిమ్ముగఁ బట్టి యమర్చి యెత్తఁగా
నోపక మొగ్గతిల్లఁబడి యుద్గతఘర్మజలార్ద్రదేహుఁ డై
కాపురుషుండుఁ బోలె నిజగర్వము దక్కి యడంగి యుండెఁ జిం
తాపరుఁడై వృకోదరుఁడు దద్దయు లజ్జ నధోముఖంబుతోన్‌.
329
వ. ఇట్ల క్కపివరు లాంగూలంబుఁ గదల్ప నోపక భీముండు కృతప్రణాముం డయి ‘ని న్నెఱుంగక నా పలికిన దురుక్తంబులు సహింపవలయు; నీవు కపిరూప ధరుండవైన సిద్ధుండవో, గంధర్వుండవో; దేవవరుండవో నా కెఱింగింపు’ మనిన హనుమంతుండు భీముం జూచి నగుచు ‘నేను గేసరిక్షేత్రంబున వాయుభట్టారకునకుం బుట్టిన వాఁడ; నీ చెప్పిన హనుమంతుండ; నీవు నా యనుజుండవు; దొల్లి రఘుకులేశ్వరుం డయిన రామ దేవుండు రావణుం డను రాక్షసుచేత నపహృతభార్యుండై సుగ్రీవాది వానరుల నసంఖ్యాతసంఖ్యలవారిం దనకు సహాయులం జేసికొని సేతుబంధనంబున సముద్రంబు లంఘించి సమరంబున రావణు వధియించి యందు నా కెలసంబునకు మెచ్చి. 330
మధ్యాక్కర ‘నరసురస్తుత్యమై యెంతకాలంబు నా కీర్తి నిలుచు
నిరతంబుగా నంత కాలమున్‌ నీవు నిత్యుండ వగుచుఁ
బరఁగు’ మని వరముఁ దగ దయంజేసి ప్రభుఁ డుర్వి యెల్ల
సరిఁ బదునొక్కండు వేలయేం డ్లేలి చనియెఁ దా దివికి.’
331
వ. అనిన విని భీముండు వాని నప్పుడు హనుమంతుం గానెఱింగి సంతసిల్లి వెండియు నమస్కరించి ‘భవద్దర్శనంబునం గృతార్థుండ నయితి’ నని యిట్లనియె. 332
ఆ. ‘బలిముఖుండ! దయయుఁ గలవేని దొల్లి య | ర్ణవము గడచి చనిననాఁటి నీదు
రూపుఁ జూడ వలతుఁ, జూపు నా’ కనవుడు | వాని కిట్టు లనియె వానరుండు.
333
క. ‘అక్కాలంబున రూపం | బిక్కాలమునందుఁ జూప నెట్లగుఁ? గాలం
బొక్క విధంబున నుండక | పెక్కు ప్రకారముల నుండు భిన్నావస్థన్‌.
334
వ. దానం జేసి కృత త్రేతా ద్వాపర కలియుగంబుల సంఖ్యలు వేఱు వేఱయై, యందుల చరాచర భూతంబులు భిన్నప్రకారంబులై వర్తిల్లు’ ననిన ‘నయ్యై యుగంబుల యాచార ప్రవర్తనంబులు నా కేర్పడం జెప్పు’ మనిన భీమునకు హనుమంతుం డిట్లనియె. 335
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )