పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము
ధర్మవ్యాధుఁడు కౌశికునకు సత్త్వరజస్తమోగుణంబుల తెఱం గెఱింగించుట (సం. 3-203-3)
క. అతినిందితము తమోగుణ | మతిబోధమయంబు సత్త్వ మనయంబుఁ బ్రకా
శత నొప్పు; నుభయగుణమి | శ్రతఁ బరఁగు రజోగుణంబు సన్నుతచరితా!
96
మ. అసుఖాకారత నిద్ర దైన్యము విమోహం బక్షమత్వంబుఁ దా
మసభావంబులు; రాగలోభజడతామానంబు లూహింప రా
జసవృత్తంబులు; ధైర్యశాంతికరుణాసంతోషవిద్యాదు లిం
పెసఁగన్‌ సాత్త్విక చేష్టితంబులు; నిజం బి ట్లాత్మఁ గ న్మిన్నియున్‌.
97
చ. అనఘుఁడు సాత్త్వికుం డగు మహాత్ముఁడు బోధనిరూఢి సర్వముం
గనికొని లోకవృత్తములు గావని రోసి సమస్తసంగభం
గనిరతుఁ డై తొరంగు మమకారవికార మహంక్రియాచ్యుతిం
బనుపడి సంయమప్రకట భావన నుత్తమశాంతిఁగైకొనున్‌.
98
వ. సత్త్వగుణనిబద్ధుం డగునేని శూద్రుం డైనను జన్మాంతరంబున వైశ్యత్వంబు నొంది క్రమంబున రాజభూసురభావంబులు భజించి భవవిముక్తుం డగు’ నని చెప్పిన నమ్మహీదేవుం డమ్మహానుభావు నభినందించి. 99
తే. ‘దేహమున ధాతు సంశ్రయదీప్తుఁ డగుచు | వహ్ని యెట్లుండు? శారీరవాయువులకు
నెలవు లెయ్యవి? యవి నాకు నిశ్చయముగఁ | జెప్పు’ మనుటయు నిట్లని చెప్పె నతఁడు.
100
సీ. మూర్ధదేశమునకు వర్ధితం బై పర్వు | నాత్మాగ్ని; నాభి దదాశ్రయంబు;
శిరమునఁ బావకాంతరమునఁ జరియించుఁ | బ్రాణుండు భూతాత్మభావుఁ డతఁడు;
వరుసఁ బ్రాణాపాను లిరువురు నయ్యగ్ని | వెలిగింతు రనపేతవృత్తు లగుచు;
గుదవస్తితలము లాస్పదములుగా వహ్ని | పరిగతుం డగుచు నపానుఁ డుండు;
 
తే. గడఁగి విణ్మూత్రనిర్గమకారి యతఁడు; | కర్మబలయత్నకారి యై కంఠతలము
నం దుదానుండు వర్తించు; నఖిలదేహ | సంధులందును వ్యానుండు సంచరించు.
101
క. విను, ప్రాణాపానులు న | య్యనలుఁడుఁ బ్రాపుగ సమానుఁ డన్నరసవిపా
చనుఁ డగుచు నాభిదేశం | బున నుండును సకలధాతుపోషకవృత్తిన్‌.
102
క. ఇది పరమయోగదర్శన | విదితం; బిప్పాటఁ బవనవిదు లైన మునుల్‌
వదలక యభ్యాసవిధిన్‌ | ముదమున ధరియింతు రాత్మమూర్ధతలమునన్‌.
103
వ. ప్రాణాపానసమాహితుండై సకలదేహంబులందును జరియించుచున్న పావకుండు జీవాత్ముండుగా నెఱుంగు; మతండు జలంబుల నున్న కమలపత్త్రంబునుంబోలె దేహంబునం దుండియు నిర్లేపస్వరూప దీపితుం డయి వెలుంగుచుండు; నిట్టి జీవాత్ముండ కదా పరమాత్ముండు. 104
క. చేతన రహితక్షేత్రముఁ | జేతనముం బొరయఁ జేయు జీవాత్మ దశో
పేతుఁడు పరమాత్ముఁడు వి | ఖ్యాతుఁడు త్రైలోక్యసంప్రకల్పనుఁ డనఘా!
105
క. భూతములయందు వెలిఁగెడు | భూతాత్ముని నెఱుఁగుదురు ప్రబుద్ధులు నిత్య
జ్యోతిర్మయు నవ్యయు న | ద్వైతం బగు బుద్ధి సూక్ష్మధర్మమువలనన్‌.
106
వ. అని మఱియుఁ గౌశికునకు ధర్మవ్యాధుండు బ్రహ్మవిద్యా ప్రభావంబు తెఱంగు సంప్రయోగరహస్యంబు తెలియ ని ట్లనియె. 107
సీ. ‘తెలివి నొందిన బుద్ధిగల మహాత్ముండు శు | భాశుభ కర్మములందుఁ జొరఁడు;
క్రమమున సౌఖ్యదుఃఖము లాదిగా నశే | షద్వంద్వములయందు సమత నుండు;
విను, మట్టిపుణ్యున కొనరింపవలయు కా | ర్యం బెఱింగించెద ననుదినంబు
నియతాశియును జితేంద్రియుఁడు నై పూర్వరా | త్రమ్మున నపరరాత్రమ్మునందు
 
తే. యోగధారణనిరతుఁడై యుండవలయు; | నపుడు బోధదీపంబున నాత్ము నాత్మ
యందుఁ గనుచు నివాతదీపానుకారి | యై వెలుంగుచు నమృతమయత్వ మొందు.
108
క. కామంబును గ్రోధంబును | నేమఱక జయింపవలయు నెల్ల విధములన్‌
ధీమహిత! యిదియ సతత | క్షేమంకర మైన పథము గృతబుద్ధులకున్‌.
109
క. నిత్యముఁ గర్మియుఁ గర్మఫ | లత్యాగియు నగుట లెస్స లౌల్యవియోగం
బత్యుత్తమ యోగము ద | త్ప్రత్యయలక్ష్యుండు సూవె బ్రాహ్మణుఁడు మహిన్‌.
110
చ. అరయఁగ జీవితంబు గడునస్థిర; మింత యెఱింగి యాత్మ నె
వ్వరిదెసఁ గీడురోయక ధ్రువం బగు మైత్రి భజించి సత్కృపా
నిరతుఁడు నిష్పరిగ్రహుఁడు నిత్యతపస్వియు నిత్యతృప్తుఁడుం
బరమశమాన్వితుండు నగు బ్రాహ్మణుఁ డొందు సనాతన స్థితిన్‌.
111
వ. నీవడిగిన యఖిలధర్మంబులు సంక్షేపరూపంబున నెఱింగించితి; నింక నెయ్యది వినవల’ తనినం గౌశికుండు‘ ‘మహాత్మా! వినవలయునవి యెల్లను విశదంబుగా వింటిం; బ్రబుద్ధుండ నైతి; నీవు సర్వజ్ఞుండ వగుట దెల్లం బయ్యె’ ననిన ధర్మవ్యాధుం డతని కి ట్లనియె. 112
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )