| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము |
| క. |
‘ఏ నిమ్మెయి నుత్తమ వి | జ్ఞానోన్నతి వడయుటకు నిజం బగు మూలం బైనది గల దొక ధర్మము | భూనుత! యది నీకు దృష్టముగ నెఱిఁగింతున్. |
113 |
| వ. | అభ్యంతరగృహంబునకుర’ మ్మని యతనిం దోడ్కొని చని మనోహరంబై చతుశ్శాలంబై వివిధసౌరభసంవాసితం బైన హర్మ్యంబునందు మహితాసనాసీను లైన వారిం దన జననీ జనకుల నభిమతాహారపరితోషితులఁ బరమాంబరాభరణ గంధమాల్యాలంకృతమూర్తుల నతనికిం జూపి, తానును దత్పాదప్రణామంబు సేసి, వారలఁ గుశలం బడిగిన, నయ్యిరువురుం బుత్త్రున కి ట్లనిరి. | 114 |
| సీ. |
‘అన్న! కుమార! నీయట్టి సత్పుత్త్రుండు | గలుగ మా కేమిటఁ గడమ సెపుమ! నీ చేయు ధర్మంబ నీకుఁ దోడయ్యెడుఁ | బరమాయు రర్ధసంపదలుఁ గనుము; నీ చరిత్రంబున నిఖిలవంశముఁ బవి | త్రిత మయ్యె మానుషదేహ మేల ధరియించితో కాని తత్త్వమారయఁ బర | దేవత వీవు; సందియము వలదు; |
|
| తే. |
వాఙ్మనఃకర్మములఁ బితృవత్సలత్వ | మొక్కరూపుగఁ జలుపుచు నున్నయట్టి సద్గుణాకరు నిన్నెన్ని జామదగ్న్యు | నొకని నెన్నంగఁ దగుఁ గాక యొరులు గలరె!’ |
115 |
| వ. | అని పలికి; రప్పుడు ధర్మవ్యాధుండు వారికిం గౌశికుం జూపి, ‘యిమ్మహాత్ముండు మనలఁ జూచువేడ్కనిటవచ్చె’ నని చెప్పిన నావృద్ధు లతనికి నర్హసత్కారంబులు గావించినం, గైకొని, యతండు వారలఁగుశలం బడిగె; నంత నవ్విప్రునకు లుబ్ధకుం డి ట్లనియె. | 116 |
| సీ. |
‘జననుత! వీరు నా జననియు జనకుండుఁ | జూవె! వీరలకు శుశ్రూష సేసి, యిట్టి పరిజ్ఞాన మేనుఁ బ్రాపించితి | నమరులఁ బూజింతు రర్థి నెల్ల వారును; నొండు దైవంబుల నెఱుఁగ; నీ | వృద్ధుల నాపాలి వేల్పు లనఘ! కమనీయ ఫలపుష్పగంధభూషణవస్త్ర | ములు మనోహరభక్ష్యభోజ్యములును |
|
| తే. |
వీరి కెపుడు నివేదింతు, వేడ్కఁ బుత్త్ర | దారసహితుండ నై నియతముగ సేవ యాచరింతును; వేదముల్ యజ్ఞములు వ్ర | తంబులును వీర నా కను తలఁపు దృఢము. |
117 |
| తే. |
జనని జనకుఁడు సద్గురుఁ డనలుఁ డాత్ముఁ | డనఁగ నియ్యేవురును నే గృహస్థుచేత సుగతివాంఛఁ బ్రసాదితు లగుదు రట్టి | వాఁడ సూవె ధర్మాత్ముండు వసుధమీఁద’. |
118 |
| వ. | అని చెప్పి యిట్లనియెఁ; ‘బతివ్రత పనుపునం జేసి నీవు ధర్మజ్ఞానార్థంబు నాయున్నయెడకుం జనుదెంచిన నప్పతివ్రతవలని యనుగ్రహంబున నీకు నెల్లవియు నెఱింగించితిఁ గాని, నీదెస నాదు చిత్తంబు ప్రియంపడియుండదు; నీచేసిన యకార్యం బొక్కటి గల దది యెయ్యది యనిన; | 119 |
| ఉ. |
ఎంతయు వృద్ధు లై తమకు నీ వొకరుండవ తెప్ప గాఁగ న త్యంతముదంబునన్ బ్రదుకు తల్లిని దండ్రిని నుజ్జగించి ని శ్చింతుఁడ వై సదాధ్యయనశీలత వారియనుజ్ఞ లేక యే కాంతమ యెమ్మెయిన్ వెడలి తక్కట! నీవు గరంబు క్రూరతన్. |
120 |
| ఆ. |
నీక వగచి వగచి నిర్భిన్నహృదయు లై | విగతచక్షు లైరి వినవె? వార; లరిగి యింక నైన నమ్ముదుసళ్ల యు | దగ్రశోకవహ్ని నార్పవయ్య! |
121 |
| క. |
నీయధ్యయనమ్మును సుకృ | తాయాసము నిష్ఫలంబు లై చను గురుసే వాయుక్తి లేక తక్కినఁ | జేయుము నాపలుకు; మేలు సేకుఱు నీకున్.’ |
122 |
| వ. | అనినఁ గౌశికుం డతని కిట్లనియె. | 123 |
| క. |
‘ఇది యట్టిద నీ చెప్పిన | సదమలహితవాక్యభంగి సకలము వింటిన్; వదలక యిమ్మెయిన చరిం | చెద గురుజనములకుఁ బ్రీతిఁ జేసెద ననఘా! |
124 |
| క. |
నాదైన భాగ్యవశమునఁ |గాదే నీతోడి చెలిమి గలిగెం, బరమా హ్లాదమనస్కుఁడ నైతి, శు | భోదయముల కెల్ల నింక యుక్తుఁడ నైతిన్. |
125 |
| క. |
పాపకృతం బగు దుర్గతి | మోపుఁ గనకయుండ ననుఁ బ్రబోధాత్మక లీ లాపరిణతుఁ గావించితి; | నాపాలిటి వేల్ప వీవ నరనుతచరితా! |
126 |
| చ. |
అనుపమ మెట్టివారలకు నందదు ధర్మపథంబు ధాత్రిలో; విను, పదివేవురం దొకఁడు విశ్రుతధర్మపరాయణుండు గ ల్గునొ కలుగండొ సందియము; గోరి సనాతనధర్మ మూఁది యె వ్వనికిని నీకుఁ బోలె బుధవత్సల! యిట్లు చరింపవచ్చునే. |
127 |
| చ. |
నిను నొక శూద్రుఁగాఁ దలఁపనేర గుణాకర; నీ చరిత్రముం గన మది నద్భుతం బొలసెఁ; గావున నెయ్యది కారణంబుగా నొనరఁగ నిట్టి జన్మమును నొందితి చెప్పుము; భూత భావివ ర్తనములయందు నీకు విదితంబులు గానివి గల్గ వెమ్మెయిన్’. |
128 |
| వ. | అనిన నతనికి ధర్మవ్యాధుం డిట్లనియె. | 129 |